చెప్పులు వేసుకున్నారని సల్మాన్‌‌, షారుక్‌ లపై కేసు

బాలీవుడ్ నటులు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ లు హిందువుల దేవాలయంలోకి చెప్పులతో వెళ్లినందుకు గాను వారిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలసిందే. హిందూ మహాసభల మహారాష్ట్ర యూనిట్‌ అధ్యక్షుడు భరత్‌ రాజ్‌పుత్‌ అనే వ్యక్తి వీరిద్దరూ పాదరక్షలతో దేవాలయంలోకి వెళ్లడం అది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అని కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ఇప్పుడు వారిపై దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ కేసుని విచారణకు స్వీకరించిన మీరట్‌లోని అదనపు జిల్లా కోర్టున్యాయమూర్తి మార్చి 8న విచారించనున్నారు.

పనిలో చేరతారా? పని పట్టమంటారా?- దిల్లీ హైకోర్టు

దిల్లీలో పదవ రోజుకి చేరుకున్న నగరపాలక ఉద్యోగుల సమ్మె మీద దిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తి చేసింది. దిల్లీ నగరపాలక ఉద్యోగులు తమకు జీతాలు సరిగా చెల్లించడంలేదంటూ సమ్మెని చేపట్టిన సంగతి తెలిసిందే! దీని వల్ల దేశ రాజధాని కాస్తా చెత్తతో నిండిపోయింది. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త వలన దుర్గంధం మాట అటుంచితే ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఉద్యోగులు కానీ ఒక్క మెట్టు కూడా కిందకి దిగే సూచనలు కనిపించడం లేదు. ఇదంతా కూడా గత ప్రభుత్వాల వల్ల ఏర్పడిన సంక్షోభం అనీ, ఈ సమ్మె వెనుక కేంద్రంలో అధికారం సాగిస్తున్న బీజేపీ ఉందనీ కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వ చేతకానితనం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్ష బీజేపీ దుమ్మెత్తి పోస్తోంది. కానీ ఈ ఇద్దరి మధ్యా సామాన్య ప్రజలు నలిగిపోతున్నారంటూ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నగరంలో పారిశుధ్యానికి నగరపాలక ఉద్యోగులదే బాధ్యత అనీ, కాబట్టి తక్షణమే విధులలో చేరమని అల్టిమేటం జారీ చేసింది. తమ మాటని పక్కన పెట్టి ఎవరన్నా ఇంకా విధులలో చేరకుండా అలసత్వం వహిస్తే, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. మరి ఉద్యోగులు న్యాయస్థానం మాటైనా వింటారా లేకపోతే చట్టాన్ని సైతం ధిక్కరిస్తారా అన్నది వేచి చూడాల్సిందే!

ఘనంగా విశాఖలో నౌకాదళ విన్యాసాలు..

విశాఖ పట్నం సాగరతీరంలో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ఘనంగా ప్రారంభమైంది. ఈసందర్బంగా వారు చేసే విన్యాసాలను వీక్షించడానికి సందర్శకులు వేల సంఖ్యలో హాజరవుతున్నారు. యుద్ధనౌకల నమూనాలతో కూడిన శకటాలు.. సముద్రంలో విద్యుద్ధీపాలతో అలంకరించిన యుద్ధనౌకలు ప్రజలను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన, భారతీయ నౌకా దళానికి సంబంధించిన నౌకలు, జలంతర్గాములు, విమానాలు, హెలికాఫ్టర్ల విన్యాస ప్రదర్శన అలరించనున్నది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ రేపు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఇంక్రిమెంట్ కోల్పోయిన గవర్నర్ నరసింహన్..

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇంక్రిమెంట్ కోల్పోయారంట.. అది కూడా తెలుగు చదవడం.. రాయడం రాకపోవడంవల్ల. ఇంతకీ గవర్నర్ ఎంత ఇంక్రిమెంట్ కోల్పోయారా అనుకుంటున్నారా రూ. 240 రూపాయలు. ఆ వివరాలేంటో చూద్దాం.. గవర్నర్ నరసింహన్ ఈ రోజు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ల సదస్సులో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ఐపిఎస్‌, ఐఏఎస్‌ అధికారులు ఇక్కడ పని చేసే సమయంలో తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి అని గతంలో ఏపీపీఎస్సీతో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేశారు. పీఎస్సీ పెట్టే పరీక్షల్లో తెలుగు రాయడం, చదవడం వచ్చా అంటే వచ్చు అని చెప్పానని.. కానీ వారు చదవమంటే చదవలేకపోయా.. ఆ తరువాత ఎలాగో కష్టపడి ఆరు నెలల్లో తెలుగు మాట్లాడటం వచ్చింది.. కానీ ఈలోపు నెలకు 40 రూపాయల ఇంక్రిమెంట్ చొప్పున ఆరు నెలల్లో 240 రూపాయలు నష్టపోయా అని అన్నారు. దీంతో అక్కడ ఉన్నవారందరూ నవ్వారు.

ముద్రగడ వర్సెస్ కృష్ణయ్య.. ఎవరి పంతం నెగ్గుతుంది..?

ఒకవైపు కాపులను బీసీల్లో చేర్చాలని.. తమ జాతికి న్యాయం చేయాలి అంటూ ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తున్నారు. ఈరోజు నుండి ఆయన ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరిస్తామని.. దీనిపై కమిటీ ఏర్పాటు చేశాం.. త్వరలోనే నివేదిక ఇస్తామని చెపుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు బిసి సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు, టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాత్రం ఎట్టి పరిస్థితిలో అది జరగనివ్వం అని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. కాపులను బీసీల్లో చేర్చే ప్రయత్నాన్ని చంద్రబాబు విరమించుకోవాలని.. చంద్రబాబు జేజమ్మ దిగొచ్చినా కాపులను బీసీ ల్లో చేర్చనివ్వబోమని.. చిన్న చిన్న కులాలను బీసీ జాబితాలో చేరిస్తే స్వాగతిస్తామని, కానీ... అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను చంద్రబాబు కాదు కదా.. ప్రధాని దిగివచ్చినా బీసీ జాబితాలో చేర్చనివ్వబోమని చెపుతున్నారు. మరి ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకవేళ ముద్రగడ పంతం పట్టినట్టు కాపులను బీసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకుంటే కృష్ణయ్య కూడా దీక్ష చేపట్టడానికి ఏమాత్రం వెనుకాడని పరిస్థితి ఏర్పడింది. మరి కృష్ణయ్య చెప్పినట్టు ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటుందా.. లేకపోతే కృష్ణయ్య చెప్పినట్టు కాపుల్లోనే చిన్న చిన్న కులాలను మాత్రం బీసీలో కలుపుతారా.. అలా చేస్తే దానికి ముద్రగడ ఒప్పుకుంటారా ఇలా పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరి ఎవరి పంతం నెగ్గుతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

ముద్రగడ ఆమరణ దీక్ష..

తూర్పు గోదావరి జిల్లా, కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాధం, ఆయన సతీమణి తమ నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్బంగా ముద్రగడ మాట్లాడుతూ..కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నానని.. నా ప్రాణం నా జాతికి అంకితం.. నా జాతి కోసం దీక్ష చేస్తున్నానని తెలిపారు. ఎవరూ కిర్లంపూడి రావద్దు.. తమ ప్రాంతంలో ఉండే నిరసన తెలపండి... కాపు సోదరులు అందరూ భోజనం మాని కంచంపై స్పూన్లతో చప్పుడు చేయండి.. ఆ చప్పుడుకైనా సీఎం మన జాతికి న్యాయం చేస్తారని ఆశిద్దాం అని పిలపునిచ్చారు. తనకు పోలీసు రక్షణ ఏం అవసరం లేదని.. పోలీసులు వెళ్లిపోవచ్చని అన్నారు. చర్చలకు నేను వ్యతిరేకం కాదు.. చర్చలకు ప్రభుత్వం తరుపున దూతలు ఎవరొచ్చినా ఆహ్వానిస్తానని తెలిపారు.  

ఆ రిజర్వేషన్లకు మేం ఒప్పుకోం – కృష్ణయ్య!

    కాపులను బీసీలలోకి చేర్చేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కుండబద్దలు కొట్టేశారు. వారిని కనుక బీసీల జాబితాలోకి చేరిస్తే ఇప్పటివరకూ ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కృష్ణయ్య ఇచ్చిన పిలుపుతో నిన్న ఆంధ్రప్రదేశ్ లోని అన్ని కలెక్టరు కార్యాలయాల వద్దా బీసీ నాయకులు ధర్నాలను నిర్వహించారు. ప్రస్తుతం తెలుగుదేశం తరఫున ఎల్‌.బీ.నగర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణయ్య, తెదెపా కనుక ఈ రిజర్వేషన్లను కల్పిస్తే చంద్రబాబుని సైతం ఎదిరిస్తానని చెబుతున్నారు. ఒకవేళ కాదు కూడదు అంటూ కాపులకు రిజర్వేషన్లను అందిస్తే… అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను కూడా 25 నుంచి 50 శాతానికి పెంచేవరకూ ఊరుకోమని హెచ్చరించారు.

సెల్ఫీ తీసుకున్నందుకు మూడురోజుల జైలు…

సెల్ఫీ కోసం ఏమైనా చేస్తాం అంటారు కొంతమంది కుర్రాళ్లు. అదే ఊపులో ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఫరాజ్‌ అహ్మద్‌ అనే 18 ఏళ్ల కుర్రవాడు సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేటుతోనే సెల్పీ దిగాలనుకున్నాడు. ఏదో పని మీద చుట్టాలతో కలిసి ఆమె కార్యాలయానికి చేరుకున్న అహ్మద్, మంచి సెల్ఫీని దిగేందుకు ఆమె దగ్గర దగ్గరే తచ్చాడటం మొదలుపెట్టాడు. జిల్లా మెజిస్ట్రేట్‌ అయిన చంద్రకళ ఎంతగా వారించేందుకు ప్రయత్నించినా అహ్మద్‌ ఊరుకోలేదు సరికదా ఇంకో సెల్ఫీ మరో సెల్పీ అంటూ పదే పదే తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. చంద్రకళ చుట్టూ ఉన్న అధికారులు అతన్ని ఆపేందుకు, అప్పటివరకూ ఉన్న ఫొటోలను డిలీట్ చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా అహ్మద్‌ ఊరుకోలేదు. దాంతో చిర్రెత్తుకు వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్‌ అతనికి మూడు రోజుల జైలు శిక్షను విధించారు. ఒక జిల్లా మెజిస్ట్రేట్‌తో, పైగా ఒక స్త్రీతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతనికి ఈ శిక్ష విధిస్తున్నట్లు చెప్పారు చంద్రకళ.

ఏపీ రాజధానికి వృద్ధురాలు కోటి విరాళం..

కనీసం ఒక్క రూపాయి పక్కన వాళ్లకు ఇవ్వాలంటే ఆలోచించే ఈ రోజుల్లో ఏపీ నూతన రాజధానికి విరాళం ఇచ్చి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది ఓ వృద్దురాలు. ఆమె ఇచ్చింది ఏ వేలో.. లక్షలో అనుకుంటే పొరపాటే. ఏకంగా కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. తక్కెళ్ల పాడుకు చెందిన ముప్పవరపు స్వరాజ్యం అనే వృద్దురాలు ఏపీ రాజధాని నిర్మాణానికి కోటి రూపాయలు ఇచ్చింది. ఇప్పటికే ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేశానని.. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కోటి రూపాయలను అందజేస్తానని తెలిపారు. అంతేకాదు తెలుగు జాతి గర్వపడేలా రాజధాని నిర్మించడం అభినందనీయమని.. సీఎం చంద్రబాబు కృషిని అభినందిస్తున్నానని అన్నారు. మరి ప్రధాని అంతటి వ్యక్తే కనీసం ఏం విరాళం ప్రకటించకుండా ఒక మట్టికుండ.. ఒక చెంబుడు గంగాజలం తీసుకొచ్చి ఇచ్చారు. అలాంటి ప్రధాని కంటే ఈ వృద్ధురాలు చాలా బెటర్ అనిపిస్తోంది.

సచివాలయానికి బాంబు బెదిరింపు..

ఈ మధ్య ఎక్కడ చూసినా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు తాజాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా సచివాలయానికి బాంబు బెదిరింపు ఫొన్‌కాల్‌ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సచివాలయంలో బాంబు పెట్టామని ఫోన్ చేసి బెదిరించడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగి ప్రతి ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించాయి. కానీ అది ఫేక్ కాలని.. ఎలాంటి బాంబు లేదని తెలిసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆ సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అదే భవనంలోని 15వ అంతస్థులో ఉన్నట్లు తెలుస్తోంది.  

సీఎంగారు చెప్పులు కొనుక్కోండి.. 364 రూపాయలు పంపిన ఇంజనీర్

ముఖ్యమంత్రి అంతటి హోదా కలిగిన వ్యక్తికి చెప్పులు కొనుక్కోవడం పెద్ద విషయమేం కాదు. అలాంటి ముఖ్యమంత్రికి చెప్పులు కొనుక్కోమని ఓ వ్యక్తి 364 రూపాయలు పంపించాడు. అసలు సంగతి ఏంటంటే.. రిపబ్లిక్ డే సందర్బంగా రాష్ట్రపతి ఇచ్చిన విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. అయితే ఈవిందుకు ఆయన శాండల్ చెప్పులు ధరించారు. దీనికి గాను విశాఖపట్నానికి చెందిన మెకానికల్ ఇంజినీర్ సుమిత్ అనే వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక జత బూట్లు కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారా.. అంటూ 364 రూపాయల డ్రాఫ్ట్ పంపారు. అంతేకాదు ఆయనకు లేఖ రాస్తూ.. ఒక రాష్ట్రపతి ఇచ్చిన విందుకు చెప్పులు ధరించుకొని వెళ్లడం దేశాన్ని చిన్న బుచ్చమే అని.. ఒక వేళ విశాఖ పట్నంలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ ఫెస్టివల్ కు ఆహ్వానం కనుక అందితే.. తాను పంపిన డబ్బుతో బూట్లు కొనుక్కొని అవి వేసుకొని రావాలని కోరాడు.

విరాట్, సచిన్.. ఎవరెంత కొట్టారు..?

భారత్ క్రికెట్ లెజెండ్.. అభిమానులు క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ గురించి.. ఆయన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. మరి అలాంటి సచిన టెండూల్కర్ లా ఆడగల సత్తా ఎవరికి ఉందంటే.. ఇప్పుడు ఉన్న టీం ఇండియాలో వెంటనే గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లి. ఆడే విధానంలో విరాట్ కు, సచిన్ కు మద్య చాలా పోలికలు ఉన్నాయి. అయితే ప్రసుత్తం వేగంగా పరుగులు సాధిస్తూ దూసుకుపోతున్న కోహ్లి ఇప్పటివరకూ 171 వన్డేలు.. 41 టెస్ట్ లు ఆడాడు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లి పరుగులతో.. సచిన పరుగులతో పోల్చి చూస్తే దాదాపు ఇద్దరూ ఒకేలా ఆడినట్టు కనపడుతోంది. ఇంతకీ ఎవరెవరూ ఎన్ని పరుగులు తీశారో ఓ లుక్కేద్దాం.. విరాట్ కొహ్లి.. * 171 వన్డేలు -- 163 ఇన్నింగ్స్ ఆడి 51.51 సగటుతో 7212 పరుగులు చేశాడు.   సెంచరీలు - 25   హాఫ్ సెంచరీలు - 36   అత్యధిక వ్యక్తిగత స్కోరు 183.   నాటౌట్ గా 23సార్లు * 41 టెస్టుల్లో -- 72 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 44.02 సగటుతో 2994 పరుగులు చేశాడు.   సెంచరీలు - 11   హాఫ్ సెంచరీలు - 12   అత్యధిక వ్యక్తిగత స్కోరు 169   నాటౌట్ - 4 సచిన టెండూల్కర్   * సచిన్ 171 వన్డేల్లో -- 166 ఇన్నింగ్స్ ఆడి 38.85 సగటుతో 5828 పరుగులు సాధించాడు.   సెంచరీలు -- 12   హాఫ్ సెంచరీలు -- 36   అత్యధిక వ్యక్తిగత స్కోరు 137.   నాటౌట్ గా -- 16సార్లు * సచిన్ 41 టెస్టులు -- 60 ఇన్నింగ్స్ ఆడి 54.92 సగటుతో 2911 పరుగులు సాధించాడు.   సెంచరీలు -- 10   హాఫ్ సెంచరీలు -- 14   అత్యధిక వ్యక్తిగత స్కోరు 179   నాటౌట్ గా -- 7సార్లు

ప్రభుత్వానికి పన్నులు కట్టవద్దు – ముంబై హైకోర్టు

ప్రభుత్వ యంత్రాంగంలో పెరిగిపోతున్న అవినీతిని చూసి ముంబై హైకోర్టుకి కూడా ఒళ్లు మండింది. మాతంగ్‌ అనే కులస్తుల కోసం ప్రభుత్వం కేటాయించిన 385 కోట్లు గల్లంతైన కేసులో న్యాయస్థానం తీవ్రమైన ఈ విమర్శను చేసింది. ‘తాము ఎంతో కష్టపడి పన్నుల రూపంలో చెల్లిస్తున్న సొమ్ము ఎవరెవరో దోచుకుంటుంటే ప్రజలు చూస్తూ ఎందుకు ఊరుకోవాలని’ హైకోర్టు అధికారులని ప్రశ్నించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలు సహాయ నిరాకరణని చేపట్టవచ్చనీ, పన్నులు చెల్లించేందుకు తిరస్కరించవచ్చనీ సూచించింది. ఇంతకీ ఈ కుంభకోణంలో నిందితుడు రమేష్‌ కదమ్‌ అనే ఒక ప్రజాప్రతినిధే కావడం గమనార్హం. రమేష్‌ కదమ్‌ను గత ఏడాది అరెస్టు చేసి జైలుకి పంపారన్నమాటే కానీ ఆయనకు అక్కడ సకల సౌకర్యాలూ అందుతున్నాయన్నది సమాచారం. బహుశా ఆ సదుపాయాలన్నీ కూడా ప్రజలు కట్టిన పన్నులతోనే అందుతూ ఉండి ఉంటాయి!

లాలూగారి అల్లుడి కారుని… దొంగలు ఎత్తుకుపోయారు!

అందరికీ శకునం చెప్పే బల్లి తనే కుడితిలో పడిందని సామెత. బీహార్ నాయకుడు లాలూకి ఇలాంటి ప్రమాదమే ఎదురైంది. ఆయన అల్లుడు వినీత్‌ యాదవ్‌గారి కారుని నిన్న దొంగలు ఎత్తుకుపోయారు. అది కూడా దొంగచాటుగా కాదు. వినీత్ యాదవ్ అల్లంత దూరం నుంచీ చూస్తుండగానే, ఆయన డ్రైవరుని పిస్తోలుతో బెదిరించి కారుని నడుపుకుంటూ వెళ్లిపోయారు. దిల్లీకి అతి చేరువలో ఉన్న పారిశ్రామిక నగరమైన గుర్‌గావ్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ విషయం గురించి తెలుసుకున్న లాలూ వెంటనే గుర్‌గావ్‌ పోలిస్ కమీషనర్‌కు ఫోన్‌ చేశారు. కానీ ఇప్పటి వరకూ దొంగల ఆచూకీ లభించనేలేదు. ఇంతకీ ఆ కారు లాలూగారి అల్లుడిదని తెలిస్తే దొంగలు ఈ పని చేసేవారో లేదో! ఇలాంటి పెద్దల ఆస్తులకే ఈ దేశంలో రక్షణ కరువైతే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి?