గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ రేపే..

గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎప్పుడు నిర్వహించాలా అని.. ఎన్నికల సంఘం తర్జన భర్జన చేసి ఆఖరికి ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లెక్క ప్రకారం అయితే రేపు ఎన్నికల కౌటింగ్ నిర్వహించాలి. అయితే ఎన్నికలు జరిగిన రోజుల పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి మధ్య వివాదం జరగడంతో ఆ డివిజన్లో మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎన్నికలు కౌంటింగ్ రేపు సాయంత్రం నుండి నిర్వహించాలనుకున్నారు..కానీ పోలింగ్.. కౌంటింగ్ రెండూ ఒకేసారి అయితే మళ్లీ సమస్యలు వస్తాయని చెప్పి.. శుక్రవారం రోజునే కౌంటింగ్ ప్రారంభించాలని నిర్ణయించారు.

మళ్లీ భారత్ కు బెదిరింపు..

పఠాన్ కోట్ విమాన స్థావరంపై జరిగిన ఉగ్రదాడికి సూత్రధారి అయిన జైషే మొహమ్మద్ నేత హఫీజ్ సయూద్ మరోసారి భారత్ కు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఓ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన పఠాన్ కోట్ లో జరిగిన ఉగ్రదాడుల మాదిరి మరిన్ని దాడులు జరుగుతాయని బహిరంగంగానే భారత్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ హెచ్చరికలతో భారత్ మరోసారి పాకిస్థాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే పఠాన్ కోట్ ఉగ్రదాడులకు సయూద్ సూత్రధారి అని తెలుసు.. దీనికి సంబంధించి తమ దగ్గర ఉన్న ఆధారాలను కూడా భారత్ పాకిస్థాన్ కు ఇచ్చింది. కానీ పాక్ మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ.. ఇంత వరకూ అతనిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మాత్రం చేయడంలేదు. గతంలో మాత్రం పట్టుకున్నామని చెప్పినా అది అబద్దమని తేల్చేసింది భారత్ నిఘా. ఇక ఇప్పుడు తాజా హెచ్చరికతో భారత్, పాక్ మధ్య జరగాల్సిన చర్చలు మరింత ఇబ్బందుల్లో పడ్డాయి. మరి పాక్ ఇప్పటికైనా సయూద్ పై చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.

దోమలని చంపేందుకు 2,20,000 సైనికులు!

జికా వైరస్ వ్యాప్తిని ఎలాగైనా ఆపేందుకు చాలా ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. అందులో భాగంగానే బ్రెజల్‌ దేశం రెండు లక్షలమందికి పైగా సైనికులను జికా వైరస్‌ మీద పోరాటం కోసం వినియోగించనుంది. ఈడిస్‌ అనే దోమ ద్వారా వ్యాపించే ఈ వైరస్ వల్ల ఎక్కువగా నష్టపోయింది బ్రెజిల్‌ ప్రభుత్వమే. బ్రెజల్ దేశంలో రోజురోజుకీ వందల మంది జికా వైరస్ బాధితులు బయటపడుతున్నారు. ఈ పరిస్థితిని ఇలాగే వదిలేస్తే బాధితుల సంఖ్య లక్షల్లోకి చేరుకునే ప్రమాదం ఉందని ఆరోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు. దాంతో ఈడిస్‌ దోమలని చంపేందుకు ఉన్న అవకాశాలు అన్నింటినీ కూడా బ్రెజిల్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈడిస్‌ దోమని చంపేందుకు వాడవాడలా దోమల మందుని చల్లడం, జికా వైరస్‌ గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడం… వంటి చర్యలని చేపట్టేందుకు ఇప్పడు బ్రెజిల్‌ తన సైనికులను ఉపయోగించనుంది. అయితే వీటి వల్ల పెద్దగా ఉపయోగం లేదని పెదవి విరుస్తున్నారు కొందరు. ఈ  దోమల మందు ఈడిస్ పెట్టిన గుడ్ల మీద పెద్దగా ప్రభావం చూపదనీ, పైగా ఈడిస్‌ దోమ పగటి పూటే ఎక్కువగా కుడుతుంది కాబట్టి, దాని నుంచి తప్పించుకోవడం తేలిక కాదనీ అంటున్నారు. మరి పెద్ద పెద్ద శత్రువులతోనే యుద్ధం చేసే సైనికులు ఈ చిన్న దోమల మీద ఏమాత్రం విజయం సాధిస్తారో చూడాలి!

కాపులపై 9 నెలల్లో నివేదిక..

కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై  ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై జస్టిస్ మంజునాథ్ కమిషన్ 9 నెలల్లో నివేదిక ఇస్తుందని.. ప్రస్తుతం కాపు కమిషన్లో జస్టిస్ మంజునాథ్ ఒక్కడే ఉన్నాడని.. ఇంకా ముగ్గురు, నలుగురు సభ్యులను నియామించాల్సిన అవసరం ఉందని.. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలో రూపొందిస్తామని..స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీ బీసీ రిజర్వేషన్ 4 కేటగిరీలలో మొత్తం 144  కులాల వారున్నారని.. కాపులను ఏ కేటగిరిలో చేర్చాలనేది కమిషన్ నిర్ణయిస్తుందని  తెలిపారు. కాగా కాపు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ్ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ కానున్నారు.  

జర్నలిస్టుని అపహరించిన చైనా ప్రభుత్వం..

కొన్ని దేశాలలో ఎవరైనా అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, వారి మీద కఠినమైన కేసులను మోపుతారు. కానీ చైనాలో అలా కాదు! చైనా గురించి అక్కడి పౌరులలో ఎవరన్నా మాట్లాడితే వారు కనిపించకుండా పోతారంటున్నారు విమర్శకులు. ఒకవేళ ఎవరన్నా చైనా ప్రభుత్వానికి భయపడి వేరే దేశానికి పారిపోయినా కూడా అక్కడికక్కడే మాయమైపోతుంటారు. అలాంటి మరో సంఘటన ఇప్పడు ప్రపంచ వార్తలలో నిలుస్తోంది. ‘లీ జిన్’ అనే ఒక వార్తా సంపాదకుడు చైనా ప్రభుత్వానికి భయపడి థాయ్‌లాండ్‌కు పారిపోయాడు. కానీ అక్కడికి చేరుకున్న కొద్ది రోజులలోనే మాయమైపోయాడు. తాను ప్రస్తుతం చైనాలో ఉన్నట్లు లీ జిన్ నుంచి అతని భార్యకు చివరి ఫోన్‌ వచ్చింది! లీ జిన్ గతంలో ఒక వార్తా పత్రికను నిర్వహించేవాడు. అతని విలేకరుల ద్వారా తమకు కావల్సిన రహస్యాలను అందించాలని చైనా ప్రభుత్వం లీ జిన్‌ మీద తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చిందట. ఈ పోరు భరించలేకే తాను దేశాన్ని విడిచిపెట్టి పోతున్నట్లు లీ జిన్‌ తన మిత్రులకు చెప్పాడు. ఆ తరువాత మాయమైపోయాడు! ఎప్పటిలాగానే చైనా ప్రభుత్వం దీని గురించి నోరు విప్పడం లేదు. లీ జిన్‌ వ్యవహారం తనది కదంటే తనది కాదనీ ప్రభుత్వ శాఖలన్నీ తప్పించుకుంటున్నాయి. మరి ఇంతకీ లీ జిన్ ఏమైనట్లో!!!

అమీర్, షారుక్ లు భయపడుతున్నారంట..!

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోనమ్ కపూర్ ప్రస్తుతం "నీరజ" అనే చిత్రంలో నటిస్తుంది. దీనికి సంబంధించిన ఓపాటను నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షారూక్‌, ఆమీర్‌ లాంటి నటులు ఏదైనా మాట్లాడాలంటే భయపడుతున్నారని.. సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలు చెబుతుంటే వాటికి వ్యతిరేక విమర్శలు చేస్తున్నారని.. దేశంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని.. అది మంచైనా చెడైనా వారి అభిప్రాయాలను వినాలని సూచించారు. కాగా దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ అమీర్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు షారుక్ ఖాన్ మద్దతు తెలుపగా.. వారిద్దరిపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తిన సంగతి విదితమే.

ఇక మీదట అక్కడ కనిపిస్తే కాల్చివేత…

పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్ మీద తీవ్రవాదుల దాడితో చావుతప్పి కన్నులొట్టపోయినట్లయింది మన రక్షణ దళాల పరిస్థితి. తీవ్రవాదులు అంత సులువుగా పఠాన్‌కోట్‌లాంటి స్థావరంలోకి ప్రవేశించడానికి కారణం మన రక్షణ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లే అని తేల్చేశారు రక్షణరంగ నిపుణులు. సమయానికి దేశ సైనికులు అప్రమత్తతో వ్యవహరించి ప్రాణాలకు తెగించి పోరాడబట్టి దేశం పరువు నిలిచింది. లేకపోతే పఠాన్‌కోటలో వేల కోట్ల విలువైన విమానాలను తీవ్రవాదులు ధ్వంసం చేసి ఉండేవారే. అందుకే ఇప్పడు పశ్చిమ వాయుదళానికి చెందిన 20 విమానస్థావరాల వద్ద ఇప్పుడు కనిపిస్తే కాల్చివేతని అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఆగంతకులు ఎవరన్నా ఈ స్థావరాల లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే హెచ్చరించాల్సిన అవసరం కూడా లేకుండా వారిని కాల్చివేయవచ్చు. ఇంతేకాకుండా దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను వెచ్చించి దేశంలో ఉన్న మొత్తం 54 విమాన స్థావరాల వద్దా భద్రతని పెంచాలని నిర్ణయించింది. కాబట్టి ఇక మీదట తీవ్రవాదులు వైమానికి స్థావరాల మీద దాడి చేసే ప్రమాదాలు లేనట్లే!

బెంగళూరు సంఘటన సిగ్గుచేటు- సుష్మాస్వరాజ్‌!

  ఇటీవల బెంగళూరులో టాంజానియా విద్యార్థుల మీద జరిగిన దాడిని సిగ్గుచేటుగా పేర్కొన్నారు విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌. జనవరి 31 ఆదివారం రాత్రి బెంగళూరులోని హెసర్‌గట్టలో జరిగిన ఈ ఘటనలో టాంజానియాకి చెందిన ముగ్గురు విద్యార్థుల మీద స్థానికులు దాడి చేయడమే కాకుండా మరో టాంజానియా యువతిని వివస్త్రను చేశారు. అంతకు ముందు ఆ రోడ్డు పక్కన నిద్రిస్తున్న మహిళ మీద నుంచి ఓ సూడాన్‌ పౌరుడు తన కారుని నడపడంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహం చెందిన స్థానికులు అదే దారిన వస్తున్న కొందరు ఆఫ్రికన్‌ జాతీయుల మీద తమ ఆవేశాన్ని ప్రదర్శించారు. వారి కారుని తగలబెట్టడమే కాకుండా, లోపల ఉన్న నలుగురు వ్యక్తుల మీదా పిడిగుద్దులు కురిపించారు. అకస్మాత్తుగా ఈ దాడి ఎందుకు జరుగుతోందో తెలియని వారు పరుగులు తీయగా, వెంటపడి మరీ దాడి చేశారు. వారిలోని ఒక యువతి మీద తమ ప్రతాపాన్ని చూపుతూ ఆమెను వివస్త్రను చేశారు.   ఈ దాడికి పాల్పిడిన వ్యక్తులందరినీ గుర్తించి వారి మీద కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోటీసులు చెబుతున్నారు. అయితే బెంగళూరులో ఆఫ్రికా పౌరుల మీద దాడి కొత్తేమీ కాదు. బహుశా ఇది చివరిది కూడా కాకపోవచ్చు. వేరే దేశాలలో భారతీయుల మీద దాడి జరుగుతోందని ఆవేదన చెందే నేతలు ఇలాంటి సంఘటనలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. అందుకే ఈసారి స్వయంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ సంఘటనలో నిందితులైనవారి మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడమంటూ ఆమె స్వయంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని సుష్మాస్వరాజ్ కోరారు.

గ్రేటర్ ఎన్నికల లెక్కింపు వాయిదా..!

గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడినట్టు తెలుస్తోంది. పాతబస్తీలోని పురానాపూల్‌ డివిజన్‌లో రీపోలింగ్ నిర్వహించడం వల్ల ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రానికి వాయిదా పడింది. ఎన్నికలు జరిగిన రోజు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ నేతల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అక్కడ మళ్లీ రీపోలింగ్ నిర్విహించాలని ఈసీ ఆదేశాలు జారీచేసింది. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నారు.  ఈ సందర్భంగా గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తామని.. 5 గంటలకల్లా తొలి ఫలితం వస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.

అనుపమ్‌గారూ పాకిస్తాన్‌కి రండి- 'నేను రానులేండి'

  ప్రసిద్ధ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ వీసా సీరియల్‌ ఇంకా సా…గుతోంది. ఈ నెల కరాచీలో జరగనున్న ఒక సమావేశానికి అనుపమ్‌ ఖేర్‌ వెళ్లేందుకు సిద్ధపడగా ఆ దేశం వీసా ఇవ్వకుండా తాత్సారం చేసిన సంగతి తెలిసింది. పాకిస్తాన్‌ కావాలనే తన వీసా గురించి జాప్యం చేస్తోంది అనుపమ్‌ ఖేర్‌ ఆరోపిస్తుండగా, తమకి అసలు ఆయన వీసా దరఖాస్తే అందలేదని పాకిస్తాన్ అంటోంది. ఈ విషయాన్ని అనుపమ్‌ ఖేర్‌ ఒక వివాదం కిందకి మార్చేయడంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.   భారతదేశంలోని పాకిస్తాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ అనుపమ్‌కి ఫోన్‌ చేసి తమ దేశానికి రమ్మని స్వయంగా ఆహ్వానించారు. అయితే అదను చూసుకున్న అనుపమ్‌ తనకు ఇప్పడు తీరిక లేదు ‘నో థాంక్స్‌’ అనేశారు. పైగా తనకు పాకిస్తాన్ వీసాను నిరాకరించడం ఇది మొదటిసారి కాదనీ… కశ్మీరీ పండిట్ల పక్షానా, ప్రధానమంత్రి మోదీ పక్షాన మాట్లాడుతున్నందుకే ఆ దేశం తన పట్ల వివక్ష చూపుతోందని మళ్లీ విరుచుకుపడ్డారు అనుపమ్‌! తమ దేశానికి రమ్మని పిలిచినా రాకపోగా పదేపదే తమని దుమ్మెత్తి పోస్తున్న అనుపమ్‌ని చూసి పాకిస్తాన్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మోదీ మీదకి పూలకుండీ….

  ఎప్పుడూ పూలు, పుష్పగుచ్ఛాలూ అందుకునే ప్రధానమంత్రి ఇవాళ పూల కుండీని ఎదుర్కోవలసి వచ్చింది. నరేంద్ర మోదీ కాన్వాయ్‌ దిల్లీలోని విజయ్‌చౌక్‌లో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రధానమంత్రితో మాట్లాడేందుకు ఆయన కార్యాలయం తనకి అనుమతి ఇవ్వలేదన్న కక్షతో, ఒక మహిళ ఆయన కాన్వాయ్‌ మీదకు పూలకుండీని విసిరిరారు. ప్రధానమంత్రి రక్షణ సిబ్బంది అప్రమత్తమై ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకో, తమ కోపాన్ని వెల్లడించేందుకో దిల్లీలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల కేజ్రీవాల్‌ మీద ఒక మహిళ ఇంకు పోయడంతో, ఆయన దీనికి కారణం బీజేపీనే అని ఆయన ఆరోపించారు. ఇప్పడు బీజేపీ ఏమంటుందో చూడాలి మరి!

ప్రియాంక గాంధి కూతురు ఓ ఆట ఆడుకుంటోంది

  ప్రియాంక గాంధి అంటే దేశంలో తెలియనివారుడరు. రాహుల్‌ గాంధీని తప్పించి పార్టీ పగ్గాలను ప్రియాంకకు అప్పగించమని అడుగుతున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు! ప్రియాంక రాజకీయాలలో ఎంతవరకు రాణిస్తారో లేదో తెలియదు కానీ ఆమె కూతురు మాత్రం ఇప్పడు క్రీడలలో తెగ వెలిగిపోతున్నారు. పుదుచ్చేరిలో జరుగుతున్న జాతీయస్థాయి సబ్‌జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ పోటీలలో ఇప్పడు అందరి చూపు ‘మిరాయా వాద్రా’ వైపే ఉన్నాయి. ప్రియాంక, రాబర్ట వాద్రాల గారాలపట్టి అయిన మిరాయా ఈ పోటీలలో హర్యానాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో హర్యానా జట్టు తమిళనాడు జట్టు ముందు చిత్తుగా ఓడిపోయినా, రెండో లీగ్ మ్యాచ్‌లో పశ్చిమ బెంగాల్ జట్టు మీద ఆధిపత్యం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ మిరాయా వాద్రా చురుకుగా ఆడారని ప్రేక్షకుల అంటున్నారు. మిరాయా ఆట తీరుని చూడటానికి ప్రియాంక కూడా పుదుచ్చేరికి చేరుకున్నారట. గత ఏడాది జరిగిన రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలలో మిరాయా తొలిసారి మీడియా ముందుకి వచ్చారు. కేవలం ప్రియాంక కూతురుగానే ఆమెను అప్పట్లో భావించారు. ఇప్పడు క్రీడాకారిణిగా రెండోసారి కనిపిస్తున్నారు. మున్ముందు రాజకీయవేత్తగా కూడా మిరాయాను చూడాల్సి ఉంటుందేమో!  

దేవుడిని నమ్మనందుకు 800 కొరడా దెబ్బలు…

  అష్రఫ్‌ ఫయాద్‌ ఒక కవి. అతనికి దేవుడంటే అంతగా నమ్మకం లేదు. అదే విషయాన్ని ఆయన తరచూ తన కవితలలో, వ్యాసాలలో రాసేవాడు. అదే అతను చేసిన నేరం! సౌదీ అరేబియాకు చెందిన అష్రఫ్‌కు ఆ దేశం మరణశిక్షను విధించింది. అఫ్రఫ్‌ నాస్తికుడు అని నిరూపించేందుకు ఆయన రాసిన ‘Instructions within’ అనే పుస్తకాన్ని కోర్టు సాక్ష్యంగా తీసుకుంది. అఫ్రఫ్‌కు మరణదండన విధించారని తెలియగానే ఆయన తండ్రి గుండెపోటుతో చనిపోయారు. కనీసం తన తండ్రి అంత్యక్రియలకు కూడా అఫ్రప్ హాజరయ్యే అవకాశం లభించలేదు. అఫ్రఫ్‌కు విధించిన శిక్ష మీద ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో ‘జాలి’ తలచి ఆ శిక్షను ఇప్పుడు కాస్త కుదించింది. మరణశిక్షకు బదులుగా అష్రఫ్‌ ఎనిమిది ఏళ్ల కారాగార శిక్షనీ, 800 కొరడా దెబ్బలనీ భరించాల్సి ఉంటుంది. ఈ 800 కొరడా దెబ్బలనీ 16 దఫాలుగా విధిస్తారు. అఫ్రఫ్‌ తాను దైవద్రోహం చేసినట్లుగా బహిరంగంగా ఒక ప్రకటన కూడా చేయవలసి ఉంటుంది. ఇలాంటి శిక్షలు ప్రపంచానికి కొత్తేమో కానీ సౌదీ అరేబియాకు మాత్రం కాదు. చిన్నచిన్న నేరాలకి కూడా కఠినమైన శిక్షలను విధించడం అక్కడ పరిపాటే! పోయిన ఏడాది సౌదీ అరేబియా 153 మంది పౌరులకు మరణదండన విధించింది!

మజ్లిస్‌తో తెరాస బంధం ముగిసిందా!

  గ్రేటర్‌ ఎన్నికలు ప్రశాంతంగానో, ఉద్రిక్తంగానో మొత్తానికి ముగిశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కూడా ఇప్పడు తెరాసకి అనుకూలంగా రావడంతో మేయర్‌ పదవిని సొంతంగానే దక్కించుకునే స్థితికి తెరాస చేరుకుంది. ఎలా చూసుకున్నా తమకి 75కి పైగానే సీట్లు వస్తాయనీ, 90 సీట్లు దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదనీ తెరాస నాయకులు సంబరపడిపోతున్నారు. ముఖ్యమంత్రి తనయుడు స్వయంగా రంగంలోకి దిగడం అంతా తానై అన్నీ తానై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో మొదటి నుంచీ ఈ ఎన్నికలు తెరాసకి అనుకూలంగా సాగే అవకాశాలు కనిపించాయి. దానికి తోడు నిన్న జరిగిన పోలింగ్‌ సరళి ఆసాంతం తెరాసకి కలిసొచ్చేలా ఉంది. దాంతో గ్రేటర్‌ పీఠం ఇప్పడు తెరాస పేరున దాదాపు ఖాయమైపోయింది. ఇప్పటి దాకా తెరాసకీ, మజ్లిస్‌కీ మధ్య కొంత సహృద్భావ వాతావరణమే ఉండేది. మజ్లిస్‌ని మంచి చేసుకునేందుకు తెరాస, నిజాంను సైతం పొగిడిన సందర్భాలు లేకపోలేదు. కానీ నిన్న మజ్లిస్‌ కార్యకర్తలు ఏకంగా ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ నివాసం మీదే దాడి చేయడం, ఆ సందర్భంలో నాయిని కూడా మజ్లిస్‌ మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం చూస్తుంటే ఈ మిత్రత్వం ఇక ముగిసిందేమో అనిపిస్తోంది. ఒకవేళ మేయర్‌ పదవిని దక్కించుకునేందుకు తెరాసకి తగినంత బలం చేకూరితే మజ్లిస్‌తో దోస్తీ చేయాల్సిన అసలే ఉండదు. అవసరం లేకుండా రాజకీయాలలో ఎవరూ మిత్రపక్షంగా ఉండరు కదా! మరి ఈ ఎన్నికల ఫలితాలతో మజ్లిస్‌ కాస్తా తెరాసకి కూడా దూరమైనట్లేనా!

మీ పిల్లల్ని అదుపులో ఉంచండి… గుజరాత్‌ ముఖ్యమంత్రికి మోదీ హెచ్చరిక!

  గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌ను సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న పనికి ఆహారభద్రత పథకం గుజరాత్‌లో సరిగా అమలు జరగడం లేదంటూ సుప్రీం కోర్టు ఆమెకు అక్షింతలు వేసింది. మరోవైపు తన వర్గానికి తగిన రిజర్వేషన్లు కల్పించాలంటూ హార్ధిక్‌ పటేల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తాజాగా మోదీ కూడా ఆమె పిల్లల తీరు గురించి ఆనందిబెన్‌ను హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆనంది బెన్ కొడుకు సంజయ్‌, కూతురు అనార్‌లు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తున్నట్లు ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ కూడా రియల్‌ ఎస్టేట్‌ తదితర వ్యాపారాలు చేస్తూ తమ వ్యాపారానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలను రూపొందిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. దానికి తగినట్లుగానే రాష్ట్ర ఆర్ధిక శాఖ, రోడ్లు భవనాల శాఖ వంటి కీలక శాఖలన్నీ ఆనందిబెన్ చేతుల్లోనే ఉన్నాయి. అసలే ముఖ్యమంత్రి ఆపై ఆర్ధిక మంత్రి… ఇక ఆమె తల్చుకుంటే జరగంది ఏముంటుంది. ఆనందిబెన్‌ తీసుకునే కీలక నిర్ణయాలలో ఆమె పిల్లల పాత్ర ఉందన్న విషయం దిల్లీదాకా పాకడంతో మోదీ ఆమెను హెచ్చరించినట్లు సమాచారం. ఈ ఆరోపణల్లో నిజం ఉన్నా లేకున్నా విపక్షాలకు అలాంటి విమర్శలు చేసే అవకాశం ఇవ్వవద్దని ఆమెకు మోదీ సూచించారట. మరి ఆమె వారసులు మోదీని చూసైనా వెనక్కి తగ్గుతారో లేదా!