నోటా లేకపోవడంతో పోలింగ్ శాతం తగ్గిందా!
posted on Feb 3, 2016 8:48AM
అత్యంత ఆర్భాటంగా సాగిన గ్రేటర్ ఎన్నికలలో నోటా గుర్తులేకపోవడం వల్ల ఏమన్నా నష్టం జరిగిందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు పౌరులు. 2013 సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులలో ఎవ్వరూ కూడా ఓటరుకి నచ్చకపోతే అతను NONE OF THE ABOVE (NOTA) గుర్తుని ఎంచుకోవడం ద్వారా తన అయిష్టతను తెలియచేయవచ్చు. 2013 తరువాత వచ్చిన అన్ని ఎన్నికలలోనూ నోటాని అమలుచేశారు. పైగా కొన్ని స్థానిక ఎన్నికలలో సైతం నోటాని బ్యాలెట్‌లోకి చేరుస్తున్నారు. కానీ ఓటర్లందినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ గ్రేటర్ ఎన్నికలలో నోటా సదుపాయం లేకుండా పోయింది.
చాలామంది విద్యావంతులు తమకి ఏ అభ్యర్థీ ఇష్టం లేకపోయినప్పటికీ, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నోటాని ఒక అస్త్రంగా భావిస్తారు. కానీ ఆ సౌకర్యం ఈసారి ఎన్నికలలో లేకపోవడంతో వారు పోలింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలిసింది. దీనివల్ల కనీసం రెండు శాతం ఓట్లు తగ్గినట్లు అంచనా! ఎన్నికల కమీషన్ మాత్రం స్థానిక ఎన్నికలలో నోటాకి సంబంధించిన స్పష్టత లేకపోవడం వల్లే తాము దానిని అమలుచేయలేదని చేతులు దులిపేసుకుంది.