A-1 నిందితుడుగా ముద్రగడ పద్మనాభం
posted on Feb 3, 2016 9:11AM
గత నెల 31న తుని వద్ద జరిగిన హింసాకాండకి సంబంధించి పోలీసులు పలు కేసులను నమోదు చేశారు. రైల్వే ఆస్తులను తగలబెట్టడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం, విధులలో ఉన్న పోలీసుల మీద దాడి చేయడం… ఇలా దాదాపు 50కి పైగా కేసులను మోపారు. వీటిలో కొన్ని కేసులలో ముద్రగడ పద్మనాభంని A-1 నిందితునిగా చేర్చడం జరిగింది. ఆందోళనకారులు చాలా కెమెరాలను, సెల్‌ఫోన్లనూ ధ్వంసం చేసినప్పటికీ విధ్వంసానికి తగిన సాక్ష్యాలని పోలీసులు సేకరించగలిగారు. వీటన్నింటి ఆధారంగా దాదాపు 300 మంది నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది. తునిలో జరిగిన సభ హింసాత్మకంగా మారడం అప్పటికప్పుడు జరిగిన పరిమాణం కాదనీ, దీని వెనుక ఒక వ్యూహం ఉందనీ పోలీసులు అనుమానిస్తున్నారు. రైలు పట్టాలకి దగ్గరగా సభాస్థలిని ఎంచుకోవడం, రత్నాచల్ వచ్చే సమయానికి రైల్‌రోకోను తీవ్రతరం చేయడం అనేవి ఒక ప్రణాళిక ప్రకారమే జరిగాయని అంటున్నారు పోలీసులు. ఇందులో భాగంగానే ముద్రగడ పద్మనాభంతో పాటు సభ జరిగేందుకు స్థలాన్ని అందించిన కొబ్బరితోట యజమాని మీద కూడా కేసు మోపినట్లు చెబుతున్నారు.