అమెరికాలోనూ మతాల రాజకీయమే!
posted on Feb 2, 2016 @ 12:13PM
అమెరికా అధ్యక్షుడు ఒబామా ఈ వారం ఒక మసీదుని సందర్శించనున్నారు. అధ్యక్షుని హోదాలో ఆయన తన దేశంలో ఒక మసీదులోకి అడుగుపెట్టడం ఇది తొలిసారి. అమెరికాలో నివసిస్తున్న ముస్లిం పౌరులలో సద్భావాన్ని నింపేందుకు ఈ చర్య తీసుకున్నానని చెబుతున్నారు ఒబామా. కానీ ఈ చర్యని తరచి చూస్తే భారతీయ తరహా రాజకీయ సూత్రాలు కొన్ని బయటపడక మానవు. ఈ సంవత్సరం జరగనున్న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఒబామా సొంత పార్టీ అయిన డెమాక్రెటిక్ పార్టీకీ రిపబ్లికన్ పక్షానికి మధ్య తీవ్రమైన పోరు జరుగుతోంది. రిపబ్లికన్ తరఫున అభ్యర్థిగా నిలిచే అవకాశం ఉన్న డొనాల్డ్ ట్రంప్ చీటికీమాటికీ ముస్లిం ప్రజల మీద విద్వేషాన్ని చిమ్ముతున్నారు. మసీదులని మూసివేయాలనీ, ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టాలనీ… రకరకాల ప్రకటనలు చేస్తున్నారు ట్రంప్. ట్రంప్ మాటలకు ప్రపంచం నలుమూలల నుంచీ నిరసన వినిపిస్తోంది. బ్రిటన్ పార్లమెంట్ సభ్యులైతే ఏకంగా ట్రంప్‌ను తమ దేశంలోకి అడుగుపెట్టనీయకూడదని అంటున్నారు. ఆశ్చర్యకరంగా అమెరికాలో మాత్రం ట్రంప్‌కు ప్రజల మద్దతు పెరిగిపోతోంది. ట్రంప్‌ను నిలువరించేందుకు ఇప్పుడు ఒబామా మసీదులోకి అడుగుపెడుతున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. పైగా సందర్శన కోసం ఒబామా ఎంచుకున్న ‘బాల్టిమోర్’ మసీదుకి తీవ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ISIS ఉగ్రవాదంతో ముస్లింలకీ ఇతర మతస్తులకీ మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకే ఒబామా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఎవరేమన్నా ఒబామా నిజంగా దేశ సమైక్యత కోసమే ఈ పని చేస్తుంటే అంతకంటే కావల్సింది ఏముంది!