పోలింగ్ అద్భుతంగా జరిగింది- ఎన్నికల అధికారి!
posted on Feb 2, 2016 @ 6:33PM
ఏవో చిన్నా చితకా సంఘటనలు మినహా పోలింగ్ అద్భుతంగా జరిగిందని ఎన్నికల అధికారి జనార్ధనరెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికలలో ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పారు. 2009తో 40.9 శాతం పోలింగ్ జరగగా అది ఇప్పుడు 45 శాతానికి పెరగడం సంతోషకరమన్నారు. ఈసారి కేవలం 4 దొంగ ఓట్లు మాత్రమే పడ్డాయనీ, గతంతో పోల్చుకుంటే ఇది నామమాత్రమేనన్నారు. ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించిన సందర్భాలు కూడా చాలా తక్కువేనన్నారు జనార్ధనరెడ్డి.
7802 యంత్రాలలో కేవలం 9 యంత్రాలు మాత్రమే… అది కూడా కొద్ది నిమిషాల సేపే మొరాయించాయని చెప్పారు. ఈసారి వెబ్‌కాస్ట్ ద్వారా ఓటింగ్ జరిగే విధానాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం వల్ల చాలా సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించగలిగామని చెప్పారు. అయితే పోలింగ్ 50 శాతం కంటే తక్కువగా ఉండటం తనకు కూడా నిరాశ కలిగించే అంశమన్నారు. నగర పౌరులలో ఉన్న ఈ జడత్వం పోయేందుకు తాము చాలా కృషి చేశామనీ అయితే ఓటర్లలో అవగాహన కలిగించేందుకు ఇది సరిపోయినట్లు లేదన్నారు. వచ్చే ఎన్నికల నాటికైనా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించారు జనార్ధనరెడ్డి.