మరో నిర్భయ ఘటన.. కారులోనే తిప్పుతూ అత్యాచారం..

  దేశ రాజధాని ఢిల్లీలో రోజుకో నిర్భయ లాంటి ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. సరిగ్గా వారం రోజుల క్రితం.. ఓ యువతిపై కారులోనే తిప్పుతూ ఆత్యాచారం చేసిన ఘటన బయటపడింది. ఈ ఘోరం గురించి ఇంకా మరిచిపోకముందే  తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఓ 25 ఏళ్ల యువతి తన స్నేహితురాలితో కలిసి సినిమా చూసి ఇంటికి తిరిగి వస్తుండగా.. కొందరు దుండగులు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకొని.. తిరుగుతున్న కారులోనే ఆమెపై అత్యాచారం చేసి పూర్వీమార్ వద్ద విసిరేసి వెళ్లిపోయారు. ఆమె పక్కన ఉన్న స్నేహితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి... వాహనం నెంబరు కూడా చెప్పడంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. బాధితురాలికి వైద్యపరీక్షలు చేయగా ఆమెపై అత్యాచారం జరిగిందన్న విషయం కూడా నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. మరి ఎన్ని ఘటనలు జరిగినా ప్రభుత్వాలు మాత్రం చర్యలు తీసుకుంటాం అని చెప్పడం తప్ప చేసేది ఏం లేదన్న విషయం అర్ధమవుతోంది. ఈ అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడేదెప్పుడో..

క్షీణిస్తున్న ముద్రగడ ఆరోగ్యం.. పెరిగిన కీటోన్ బాడీస్..

  కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష ఈరోజుతో తొమ్మిదో రోజుకి చేరుకుంది. వైద్యపరీక్షలకు అంతంత మాత్రం అంగీకరించిన ముద్రగడ.. దీక్షను మాత్రం విరమించేది లేదని మొండికేస్తున్నారు. అయితే ఆయన మూత్రంలో కీటోన్ బాడీస్ పెరగడంతో పరిస్థితి క్షీణిస్తోందని, గత రాత్రి ఓ సెలైన్ పెట్టేందుకు మాత్రం అంగీకరించారని ఈ ఉదయం వైద్యులు ప్రకటించారు. ఆయన్ను ప్రతి గంటకూ పరీక్షిస్తున్నామని, పల్స్ రేట్ క్రమంగా పడిపోతూ ఉన్నదని తెలిపారు. కీటోన్ బాడీస్ పెరగడం ప్రమాదకరమని ఆయన బంధువులకు వివరించామని, ఆయన్ను దీక్ష విరమించేందుకు ఒప్పించాలని వారి ద్వారా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.   కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని.. తుని కేసులో అరెస్ట్ చేసిన నిందితులను వెంటనే విడుదల చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తూ దీక్షకు పూనుకున్న సంగతి తెలిసిందే.

పరమాన్నం పెట్టి 1.33 కోట్లు టోకరా.. బురిడి బాబా అరెస్ట్..

  'లైఫ్ స్టైల్' బిల్డింగ్ యజమాని మధుసూధన్ రెడ్డిని బురిడి కొట్టించి శివానంద అనే దొంగ బాబా కోటి 30 లక్షల రూపాయలతో ఉడాయించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే అతని కారు డ్రైవర్ షాజహాన్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా.. ఇప్పుడు శివానందని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదు టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి బెంగళూరు సమీపంలో అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ ను ట్రేస్ చేసి.. ఎవరెవరితో మాట్లాడాడన్న దానిపై దృష్టి సారించి.. వారిని విచారించడంవల్ల ఆయన ఎక్కడెక్కడ దాక్కునే అవకాశం వుందో తెలుసుకున్నామని... వారు చెప్పినట్టే అతనిని బెంగళూరు శివారుల్లో పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం అతను హైదరాబాదు నుంచి డబ్బులు తీసుకుని బెంగళూరు వెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు. అతని నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

రోడ్డు ప్రమాదాల్లో తమిళనాడు టాప్..

  దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు తమిళనాడులో జరిగినట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2015 కు సంబంధించి రోడ్డుప్రమాదాలు, మరణాలకు సంబంధించి నితిన్ గడ్కరీ ఓ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014తో పోలిస్తే 2015లో 2.5శాతం రోడ్డుప్రమాదాలు, 4.6శాతం మరణాలు పెరిగాయని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.   కాగా రోడ్డుప్రమాదాల్లో ఏపీ ఏడోస్థానంలో, తెలంగాణలో పదో స్థానంలో ఉన్నాయి. నగరాల వారీగా అత్యధిక ప్రమాదాలు ముంబయిలో, అత్యధిక మరణాలు దిల్లీలో సంభవించాయి. ట్రాఫిక్‌ జంక్షన్లలోనే 49శాతం ప్రమాదాలు జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో 53.8 శాతం ప్రమాదాలు, 61శాతం మరణాలు సంభవిస్తున్నాయి. రోజుకు సగటున 1,374 రోడ్డుప్రమాదాలు జరుగుతుండగా, 400 మరణాలు సంభవించాయి. రోడ్డుప్రమాదాల మృతుల్లో 54.1 శాతం మంది 15 నుంచి 34 ఏళ్ల లోపువారే.

పోలీసుల అదుపులో బురిడి బాబా డ్రైవర్..

బంజారాహిల్స్ లో పూజలు పేరుతో రూ 1.33 కోట్లతో శివ అనే దొంగ బాబా పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ బురిడి బాబా కేసులో  పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అతని కారు డ్రైవర్ షాజ‌హాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కారు డ్రైవర్ ను ప్రశ్నిస్తున్నారు. దొంగ బాబాతో మ‌రో ముగ్గురు మాట్లాడిన‌ట్లు షాజ‌హాన్ పోలీసుల‌కి తెలిపాడు. బాబా క‌ర్ణాట‌క వైపుగా పారిపోయిన‌ట్లు అనుమానిస్తోన్న పోలీసులు బెంగ‌ళూరుకి ప్ర‌త్యేక గాలింపు బృందాలను పంపించారు.   ఇదిలా ఉండగా అలిపిరిలో రెండేళ్ల క్రితం ఇదే తరహాలో దొంగబాబా శివ మోసం చేసినట్టు తెలుస్తోంది. అప్పుడు శివను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అలిపిరి పోలీసులు నుండి  హైదరాబాద్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మహబూబ్‌నగర్ జిల్లా వట్టెం రిజర్వాయర్ కోసం భూసేకరణ జరిపేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 123 విడుదల చేసింది. ఇక్కడ 2013 భూసేకరణ చట్టాన్ని అమలు జరపకుండా జీవోతో భూసేకరణ జరపాలని భావించింది ప్రభుత్వం. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూసింది. ఎకరానికి రూ. 20 నుంచి రూ.25 లక్షల వరకు చెల్లిస్తే భూములు ఇచ్చేందుకు తాము సిద్ధమని రైతులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కారుకొండకు చెందిన రైతులు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం..తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భూసేకరణ కోసం రైతులను ఎందుకు బెదిరిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ముందు రైతుల సమస్యలను పరిశీలించాలని, అప్పటి వరకు భూసేకరణను నిలిపివేయాలని ఆదేశించింది.

మీకో నమస్కారం.. ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.. జేసీ

  అనంతలో జేసీ బ్రదర్స్ కు ప్రభాకర్ కు మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న వీరు.. ఇప్పుడు మరోసారి జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తిట్టుకున్నారు. అనంతపురం కార్పొరేషన్ సమావేశం సందర్భంగా.. ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు నేతలూ గట్టిగా కేకలు పెట్టుకున్నారు. బ్రిడ్జ్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, అయితే, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా పనులు ఆలస్యమవుతుంటే, ఎంపీ రాజకీయ లబ్దికి యత్నిస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు. అసలే జేసీ దివాకర్ రెడ్డికి కోపం ఎక్కువ.. ఆయన కూడా తిరిగి కేకలు వేశారు. అసలా సాంకేతిక సమస్యలే మీ వల్ల వచ్చాయంటూ విరుచుకుపడ్డారు. అక్కడితో ఆగకుండా.. "ప్రజల కష్టాలు తీర్చాలని అనుకున్నాను. నాదే తప్పు. ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీకో నమస్కారం" అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.

ప్రియుడికి హెచ్‌ఐవీ..హత్యకు ప్రియురాలు కుట్ర

వాళ్లిద్దరూ ప్రాణప్రదంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి, ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. అయితే ఒక నిజాన్ని ఆమె వద్ద దాయడం అతని ప్రాణాలమీదకు తెచ్చింది. అమెరికాలోని అరిజోనాలో సైకిల్‌పై వెళుతున్న ఒక వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. దాంతో అతడు కొన్ని అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. స్థానికులు పరుగుపరుగున వచ్చి ఆస్పత్రిలో చేర్చారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగినప్పుడు దగ్గరలోని సీసీ కెమెరాలో మొత్తం సంఘటన రికార్డయ్యింది. ఫుటేజ్ ఆధారంగా మిస్టీ లీ అనే మహిళ ఆ రోజు కారు నడిపిందని గుర్తించారు. ఆమెను విచారించగా అసలు నిజం బయటపడింది. ఆ ప్రమాదం యాక్సిడెంటల్‌గా జరిగింది కాదని..ఆమె ఆ సైక్లిస్ట్ గర్ల్‌ఫ్రెండ్ అని పోలీసులు కనిపెట్టారు. అతడికి హెచ్ఐవీ ఉందని, ఆ విషయం తనతో చెప్పలేదనే ఆగ్రహంతోనే అతడిని హత్య చేయాలనుకున్నట్లు ఆమె అంగీకరించింది. విక్కీపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారు.

యువతికి మత్తు మందు ఇచ్చి హాస్టల్ యజమాని అత్యాచారయత్నం

తెలియని ప్రాంతంలో ఎవరు లేకుండా హాస్టల్‌లో చేరిన ఆ యువతికి అండగా ఉండాల్సింది పోయి..ఒక హాస్టల్ యజమాని కీచకుడిలా మారాడు. హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్, బీకే గూడలోని ఓ ప్రైవేట్ లేడిస్ హాస్టల్‌లో బస చేస్తూ ఓ యువతి స్థానిక విల్లా మేరి కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే ఆ యువతిపై ఎప్పటి నుంచో కన్నేసిన హాస్టల్ యజమాని రవీందర్ యువతిని ఎలాగైనా వశపరచుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో మత్తు మందు ఇచ్చి అత్యాచారయత్నం చేశాడు. స్పృహరావడంతో యువతి అతడి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు రవీందర్‌ను అరెస్ట్ చేసి యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు

దిమ్మతిరిగే బాబా బురిడి.. పరమాన్నం పెట్టి రూ 1.33 కోట్లతో జంప్..

  రోజుకో దొంగ బాబా.. జనాల్ని బురిడీ కొట్టింటే బాబాల బయటకు వస్తున్నా జనాలు మాత్రం మారరు. గుడ్డిగా నమ్మేసి వారు చెప్పింది చేసేస్తుంటారు. ఇప్పుడు అలాంటి దొంగ బాబా ఉదంతమే ఒకటి బయటపడింది. తన మాటలతో నమ్మించి ఏకంగా రూ.1.33 కోట్ల నగదును దోపిడి చేశాడు.   వివరాల ప్రకారం.. ‘లైఫ్‌స్టైల్‌’ భవనం యజమాని మధుసూదన్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్నారు. అయితే ఆయనకు కర్ణాటకలో ఉన్న బాబా గురించి తెలుకొని.. ఇంట్లో పరిస్థితులు బాగుండకపోవడంతో అతని చేత పూజలు చేయిద్దామని అనుకన్నాడు.అనుకున్నట్టు గానే ఎలాగొలా తన బంధువుల సహాయంతో అతని వివరాలు తెలుసుకొని ఆహ్వానించాడు. నిన్న ఇక్కడికి వచ్చిన ఆయన కోసం ఓ లాడ్జిలో గది తీసుకున్నారు. అక్కడ నుండి మధుసూధనరెడ్డి ఇంటికి చేరుకొని ఉదయం 11 గంటలకు పూజ ప్రారంభించాడు. పూజ కోసం ఓ ముగ్గు కూడా వేశాడు. మధుసూదన్‌రెడ్డి, ఆయన భార్య విద్యావతి(46), కుమారుడు సందేశ్‌రెడ్డి(28) పూజలో కూర్చున్నారు. పూజ ప్రారంభించిన కొద్ది సేపటికి ఇంట్లో ఉన్న సొమ్మంతా తీసుకొచ్చి ముగ్గులో పెట్టాలని చెప్పగా.. రూ 1.33 కోట్లు తీసుకొచ్చి పెట్టారు. ఇక ఆతరువాత సాయంత్రం నాలుగు గంటలకు పూజ అయిపోగా.. ఇంట్లో భోజనం చేయకూడదని చెప్పి.. తాను స్వయంగా చేసుకొచ్చిన పరమాన్నం.. తినమని వాళ్లకి ఇచ్చాడు. అంతే అది తిన్న వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే బాబాగారు డబ్బుతో ఉడాయించాడు.   ఇక ఆతరువాత మధుసూధన రెడ్డి బంధువులు వచ్చి వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యావతి, సందేశ్‌రెడ్డి కోలుకోగా మధుసూధనారెడ్డి ఐసియూలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇక్కడ ఆఫీసులు పెట్టాలంటే వాచీపోయిద్దీ..!

ఆఫీస్..ఎలాంటి సంస్థకైనా గుండెకాయ లాంటిది. మొత్తం వ్యవస్థనే నియంత్రించే సత్తా ఆఫీసులకే సొంతం. అలాంటి ఆఫీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి..సామాన్యులు కూడా త్వరగా వచ్చేందుకు సౌకర్యంగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఎలాంటి రంగానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే కార్పోరేట్ సంస్థలు లక్షలు ఖర్చు పెట్టి మరీ తమ కార్యాలయాలను అందరికి పరిచయమున్న ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన కార్యాలయ స్థలాలపై ప్రముఖ రియల్‌ ఎస్టేట్ కన్సల్‌టెంట్ సంస్థ సీబీఆర్‌ఈ సర్వే చేసింది. దీని ప్రకారం హాంకాంగ్ సెంట్రల్ మొదటి స్థానంలో నిలిచింది. భారత్ విషయానికి వస్తే ఢిల్లీలోని కనాట్ ప్లేస్ ఏడవ స్థానంలో నిలిచింది. గతేడాది ఆరో స్థానంలో ఉండగా ఇప్పుడు ఏడో స్థానంలో నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు స్థలానికి ఏడాది అద్దె 149.71 డాలర్లు (మన కరెన్సీలో రూ.10,000 డాలర్లు). ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ 19వ స్థానంలోనూ, నారిమన్ పాయింట్ 34వ స్థానంలోనూ నిలిచాయి. ఖరీదైనా కార్యాలయ స్థలాలు ఇవే: 1. సెంట్రల్                      హాంకాంగ్ 2. సెంట్రల్ (వెస్ట్ ఎండ్)        లండన్ 3. ఫైనాన్స్ స్ట్రీట్                 బీజింగ్ 4. సెంట్రల్ బిజినెస్ డిస్ట్        బీజింగ్ 5. వెస్ట్ కౌలూన్                 హాంకాంగ్ 6. మరునౌచి, ఒటెమాచి       టోక్యో 7. కనాట్ ప్లేస్                    ఢిల్లీ 8. సెంట్రల్ (సిటీ)                 లండన్ 9. మిడ్‌టౌన్ మన్‌హట్టన్       న్యూయార్క్ 10. పుడాంగ్                     షాంఘై

రాహుల్ కాదు.. ప్రియాంక కాదు.. సీఎం అభ్యర్ధిగా షీలా దీక్షిత్..?

  ఉత్తర ప్రదేశ్ లో ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే యూపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ముందు రాహుల్ ను నిలబెట్టాలని చూసినా.. ఆతరువాత రాహుల్ గాంధీ అయితే గెలిచే అవకాశాలు తక్కువని కాంగ్రెస్ నేతలు మొత్తుకోవడంతో ప్రియాంక గాంధీ తెరపైకి తీసుకువచ్చారు. ప్రియాంక గాంధీ అయితే  గెలిపు వరిస్తుందని.. యూపీ నుండి సీఎం అభ్యర్ధిగా ప్రియాంకానే దాదాపుగా బరిలోకి దింపుతారని అనుకున్నాం. కానీ అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాకుండా.. మరో పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఎవరో కాదు షీలా దీక్షిత్. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మాత్రం  షీలా దీక్షిత్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సమాచారం అందుకున్న ఆమె, నేడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరి ఆఖరకి ఎవరూ బరిలో దిగుతారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

భారత్ మా మద్దతు ఓకే.. పాక్ కు కూడా ఇవ్వండి.. టర్కీ

  భారత్ ఎన్ఎస్జీ సభ్యత్వంపై రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటుంది. భారత్ కు ఎన్ఎస్జీలో సభ్యత్వం ఇవ్వడానికి అగ్రరాజ్యమైన అమెరికా తన మద్దతు ఇవ్వగా.. చైనా మాత్రం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో పెద్ద దేశమైన న్యూజిలాండ్ కూడా భారత్ కు తన మద్దతు తెలిపింది. ముందు ఎన్ఎస్జీలో భారత్ కు సభ్యత్వం ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. తన వైఖరి మార్చుకొని భారత్ కు సభ్యత్వం ఇవ్వడంపై మద్దతు తెలిపింది.   ఇక అప్పటి వరకూ సైలెంట్ గా ఉండి ఎప్పుడైతే భారత్ ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తుందని తెలుసుకుందో..  పాక్ అప్పుడు మేల్కొని తనకు కూడా సభ్యత్వం కావాలని ధరఖాస్తు చేసుకుంది. అయితే పాక్ కు టర్కీ మద్దతు తెలిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక మెలిక పెట్టింది టర్కీ. ముందు భారత్ కు మద్దతు ఇవ్వడానికి మద్దతు తెలుపని టర్కీ.. ఆతరువాత భారత్ కు తన మద్దతు ఓకే కానీ.. పాక్ కు పాక్ కు కూడా సభ్యత్వమివ్వాల్సిందేనని మెలిక పెట్టింది. మరి ఏం జరుగుతుందో ఈ నెల 20న సీయోల్ ప్రారంభం కానున్న కూటమి భేటీలో తెలుస్తోంది.

పక్షుల ఫొటోకు.. ఓర్లాండో ఘటనకు సంబంధం ఏంటి..?

  ఈ ఫొటో చూస్తే ఏమనిపిస్తుంది. ఏముంది గాల్లో తేలుతున్న పక్షులను ఫొటో తీశారు అని అనుకుంటారు. అయితే ఈ ఫొటోకి ఓర్లాండో ఘటనకు సంబంధం ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఫొటోకి, ఘటనకు సంబంధం ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ఒమర్ మతీన్ అనే వ్యక్తి కాల్పులు జరిపి 49మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన వారందరికి ఒకచోట చేర్చి వారికి నివాళులు అర్పిస్తుండగా.. అదే సమయంలో ఆకాశంలో ఒకేసారి పక్షులు ఎగరడం కనిపించాయి ఓ ఫొటోగ్రాఫర్ కు. అంతే ఆ అద్భుతాన్ని తన కెమెరాలో బంధించేసింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చనిపోయింది 49 మంది కాగా.. పక్షుల సంఖ్య కూడా 49 రావడం. ఈ విషయాన్ని ప్రసారం చేశారు కూడా. అయితే తన వివరాలు మాత్రం గోప్యంగా ఉంచాల‌ని కోరింది. మొత్తానికి యాదృచ్ఛికంగా జరిగినా..సరిగ్గా 49 పక్షులే ఉండటం ఎంతైనా అద్భుతమే.

ఒక్క సెల్ఫీ.. చిక్కుల్లో టాప్ మోస్ట్ నక్సల్...

  సెల్పీ వల్ల ప్రాణాలు కోల్పోవడం లాంటి చెడు పరిణామాలు ఎదురవుతున్నా.. ఈమధ్య ఈ సెల్ఫీల వల్ల కొన్ని మంచి పనులే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈమధ్యనే సెల్ఫీ దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా.. ఎన్నో రోజులుగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న హంతకుడు దొరికిపోయాడు. ఇప్పుడు ఇదే సెల్పీ మోజుతో కొన్ని సంవత్సరాలుగా సవాల్ గా మారిన ఓ మావోయిస్ట్ జాడ తెలిసిపోయింది. టాప్ నక్సల్ చలపతి అలియాస్ అప్పారావు చాలా కాలంగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే ఈయన సోదరుడు ఆజాద్ గత నెలలో  గ్రేహాండ్స్ చేతిలో హతమైన నేపథ్యంలో ఆయన దగ్గర నుండి ఆయుధాలు, ల్యాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్ టాప్ ను  తెరచి చూడగా చలపతి ఆయన భార్య తీసుకున్న సెల్ఫీ ఫొటో దొరికింది. దీంతో పోలీసులకు చలపతి ఎలా ఉంటాడో అర్ధమైపోయింది. ఇక ఆ జంటను గుర్తించడం సులువేనని వైజాగ్ పోలీసు అధికారులు చెబుతున్నారు. కాగా చలపతి తలపై రూ. 20 లక్షలు, ఆయన భార్య అరుణ తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది.

మోడీకి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ప్రశ్న.. చిరునవ్వే సమాధానం...

  పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రధాని మోడీకి తన కోరికను చెప్పారంట.. దానికి మోడీ ఓ చిరునవ్వు నవ్వి సమాధానం ఇచ్చారంట. ఇంతకీ ఆయన కోరిక ఏంటనుకుంటారో.. ఇమ్రాన్ ఖాన్ ఈమధ్య భారత్ పర్యటన వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోడీని కలిశారట. ఈ నేపథ్యంలో ఆయన భారత్-పాక్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్ ల గురించి మాట్లాడారంట. చాలా కాలంగా భారత్, పాక్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరగలేదని, ఇరు దేశాల మధ్యా క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించాలని ఖాన్ కోరగా, మోదీ ఎలాంటి సమాధానమూ చెప్పలేదని.. ఒక చిరునవ్వు నవ్వారు అని చెప్పారు. తాను ప్రధానిని కవలడం ఇదే తొలిసారి అని.. ఒకవేళ రెండోసారి కలిసే అవకాశం వస్తే.. భారత విదేశాంగ విధానం అపరిపక్వంగా ఉందని చెబుతాను" అని అన్నారు. మరి ఇమ్రాన్ ఖాన్ కు ఆ అవకాశం వస్తుందో లేదో చూడాలి..

నేను రాజీనామా చేస్తాను... నువ్వు పార్టీ మూస్తావా.. చంద్రబాబు వ్యూహం

  వైసీపీ పార్టీ నేతలు టీడీపీలో చేరుతున్నప్పటినుండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుంటున్నారని.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు అవకాశం దొరికినప్పుడల్లా విమర్శిస్తూనే ఉన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి జంప్ అయిన భూమా నాగిరెడ్డి స్పందించి జగన్ పై ఫైర్ అయ్యారు. వైసీపీని వీడిన నేతలు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపించడం సరికాదని భూమా అన్నారు. అంతేకాదు ఈ సందర్బంగా భూమా జగన్ కు ఓ సవాల్ కూడా విసిరారు. తాను, తన కూతురు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో గెలిస్తే జగన్ వైసీపీని మూసేస్తారా అని సవాల్ విసిరారు. జగన్‌ పుట్టకముందు నుంచే తాము రాజకీయాల్లో ఉన్నామని.. బ్రిటీష్‌కాలం నుంచే ధనవంతులమని భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. అలాంటి తాము ఎలా అమ్ముడుపోతామని ప్రశ్నించారు?   మరోవైపు భూమా నాగిరెడ్డితో సవాల్ చేయించటం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భూమా నాగిరెడ్డి అయితే రాజీనామా చేసినా మళ్లీ గెలవగల సత్తా ఉందని.. అందుకే భూమా నాగిరెడ్డితో సవాల్ చేయించారని అనుకుంటున్నారు. అయితే భూమా నాగిరెడ్డి ఒక్కరే రాజీనామా చేస్తారా.. లేక అందరూ రాజీనామా చేస్తారా అన్నది తెలియని విషయం. అంతకన్నా ముందు భూమా సవాల్ జగన్ స్వీకరిస్తారా లేదా అన్నది చూడాలి.