ప్రాణం తీసిన సోనియా గాంధీ ఫొటో..
posted on Jun 17, 2016 @ 12:45PM
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫొటో ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. అదేంటీ సోనియా ఫొటోకి.. వ్యక్తి మరణించడానికి సంబంధం ఏంటనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. మధ్యప్రదేశ్ జబల్పూర్ లోని విజయ్ నగర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ జతిన్ రాజ్ ' విజయ నగర్ ఫ్రెండ్స్ ' పేరిట వాట్స్ యాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. అయితే ఈ గ్రూపులో అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నాయక్ అనే వ్యక్తి సోనియా పాత్రలు తోముతున్నట్టు ఉన్న ఓ వ్యంగ్య చిత్రాన్ని గ్రూపులో పోస్ట్ చేశాడు. అంతేకాదు దానికింద సోనియాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మోడీ అన్నట్టు వ్యాఖ్యానించాడు. దీంతో ఆగ్రహానికి గురైన జతిన్ రాజ్.. ప్రశాంత్ నాయక్ తన స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో తమ అనుచరులతో కలిసి వచ్చి అతనితో వాగ్వాదానికి దిగారు. అది కాస్త పెద్దదై కొట్టుకునే వరకూ వెళ్లింది. ఇక అటుగా వెళుతున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించినా అక్కడ కూడా వారు కొట్టుకోవడం జరిగింది. ఈ గొడవలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు మాత్రం స్టేషన్ బయట జరిగిందని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం స్టేషన్ లోపల జరిగిందని ఆరోపిస్తున్నారు.