టీడీపీలోకి అమర్నాథ్ రెడ్డి... నా నోటికి పని చెప్పొద్దు..
posted on Jun 17, 2016 @ 1:03PM
వైసీపీ పార్టీ నుండి మరో ఎమ్మేల్యే టీడీపీలోకి జంప్ అయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తాను డబ్బులు తీసుకొని టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. దీనికి సమాధానం జగనే చెప్పాలని మండిపడ్డారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన సవాల్ కూడా విసిరారు.. తనకు ఉన్నది ఒకే బిడ్డని.. డబ్బులు తీసుకోలేదని వాడి మీద ప్రమాణం చేసి చెబుతానని, జగన్‌కు ఏసుక్రీస్తు పైన నమ్మకం ఉంటే నేను డబ్బులు తీసుకున్నానని క్రీస్తు దగ్గర తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరారు. పత్రిక ఉంది కదా అని ఏది పడితే అది రాయడం సరికాదని.. తనను ఇబ్బంది పెడితే తన నోటికి పని చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వీపీఆర్) కూడా టిడిపిలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి.