గుండె, కాలేయం లోకి ఇనుప ఊచ.. అయినా బ్రతికాడు..
posted on Jun 17, 2016 @ 6:12PM
కొన్ని సార్లు ఎంత చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాలు కోల్పోతుంటారు. అదృష్టం ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడుతుంటారు. అలా ప్రాణాలతో బయటపడి అది నిజమే అని నిరూపించాడు చైనా కి చెందిన ఓ వ్యక్తి. చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్స్ లో నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు 5 మీటర్ల ఎత్తు నుంచి ఇనుప ఊచలపై పడిపోయాడు. దీంతో అతని శరీరంలో ఇనుప ఊచలు దిగిపోయాయి. అయితే కొన్ని ఇనుప ఊచలు కత్తిరించినా ఒక ఇనుప ఊచ మాత్రం కపాలం, శ్వాసనాళం, గుండె, గళధమని, కాలేయం పక్కనుంచి చొచ్చుకుపోయింది. అదృష్టం ఏంటంటే ఏ భాగానికి అది తగలకుండా ఉండటంతో ప్రాణాలు పోలేదు. ఇక అతనిని ఆస్పత్రిలో చేర్పించగా.. 7 గంటలకు పైగా శ్రమించి.. అతడి ప్రాణాలను నిలిపారు. ప్రధాన అవయవాలకు ఏమాత్రం గాయం అయినా అతడి ప్రాణాలు పోయేవని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు వారాల పాటు అతడిని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందన్నారు.