ఏఎస్పీది ఆత్మహత్యే.. కారణం అదేనా..?
posted on Jun 17, 2016 @ 2:46PM
పాడేరు ఏఎస్పీ నిన్న అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. తుపాకీ పేలి ఆయన మరణించగా.. ఏఎస్పీ కావాలనే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రమాదవశాత్తు పేలిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇది ఆత్మహత్యే అని పోలీసులు తెలుపుతున్నారు. అంతేకాదు.. ఓ సూసైడ్ నోటు కూడా దొరికిందని తెలుపుతున్నారు. ‘నా చావుకు ఏ అధికారి, ఎవరూ బాధ్యులు కారు. మూడు నెలలుగా విధి నిర్వహణలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నా’ అని లేఖలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ సందర్బంగా హోంమంత్రి చినరాజప్ప ఏఎస్పీ కుటుంబాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఘటనా స్థలంలో సూసైడ్ నోటు దొరికింది.. వారి కుటుంబ సభ్యుల అనుమతితోనే బయటపెడుతున్నాం.. సూసైడ్ లో అంశాలన్నీ సెంట్ మెంట్ తో కూడుకున్నవని అన్నారు. సెప్టెంబర్ 4 న శశికుమార్ వివాహం జరగాల్సి ఉంది.. ఈలోగా ఘటన జరగడం బాధాకరంగా ఉందని వెల్లడించారు. పెళ్లికి సంబంధించిన అంశాలు మాట్లాడేందుకు మూడు రోజులు సెలవు పెట్టి వస్తున్నానని రెండు రోజుల క్రితం ఆయన తన తల్లికి ఫోన్ చేసి చెప్పారు. సెలవుపై వెళ్లాల్సిన రోజే... ఆత్మహత్య చేసుకున్నారు. తను ఇష్టపడిన అమ్మాయితో కాకుండా... మరొకరితో పెళ్లి కుదర్చడంతో మనస్తాపానికి గురైనందునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.