ఎయిర్‌హోస్టెస్ ప్రేమలో కేంద్రమంత్రి
posted on Jun 17, 2016 @ 5:58PM
కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తున్న బాబుల్ సుప్రియో ప్రేమలో పడ్డారు. జెట్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న రచనా శర్మను తొలి చూపులోనే ప్రేమించారు. 2014లో కోల్‌కతా నుంచి ముంబయి వెళ్లే విమానంలో యోగా గురువు రాందేవ్ బాబాతో కలిసి ప్రయాణిస్తుండగా సుప్రియోను రచన పలకరించింది. లోక్‌సభ ఎన్నికలపై చర్చిస్తుండగా టికెట్ లభిస్తే విజయం ఖాయమంటూ ఆయన భుజం తట్టిందట. అప్పుడే ఆమెపై మనుసు పారేసుకున్నానని సుప్రియో తెలిపారు. ఆమె పేరు, ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ మాట్లాడుకుంటూ ప్రేమలో మునిగిపోయారట.
అపై రచన చెప్పినట్లే టికెట్ లభించడం, విజయం సాధించడం, కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంటకు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. తమ రెండేళ్ల ప్రేమాయణానికి ఆగస్టు 9న తెరదించి ఒక ఇంటివారు కాబోతున్నారు. కాగా ఆయనకు ఇది రెండో పెళ్లి. గతంలో బాలీవుడ్ గాయకుడిగా ఉండగా ఆయనకు రియా పరిచయం కావడంతో ఆమెను 1995లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి కూతురు షర్మిలి పుట్టింది. అయితే మనస్పర్థల కారణంగా రియాకు 2006లో విడాకులిచ్చారు.