ఏపీ ఉద్యోగుల్ని తీసుకువెళ్లడానికి రైలే వస్తోంది..
posted on Jun 17, 2016 @ 5:10PM
అమరావతికి తరలివచ్చే ఏపీ ఉద్యోగుల సుడి మామూలుగా లేదు. వాళ్లు ఏది కోరుకుంటే అది క్షణాల్లో వారి ముందు ప్రత్యక్షమవుతోంది. ఐదు రోజుల పనిదినాలు, హెచ్‌ఆర్ఏ పెంపు ఆఖరికి స్థానికత ఇలా ఏది కావాలంటే దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదనకుండా ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రయాణించేందుకు వీలుగా తమకు ప్రత్యేక రైలు కావాలని సీఎంతో పాటు కేంద్రానికి లేఖ రాశారు సచివాలయ ఉద్యోగులు. దీనికి చంద్రబాబు సిఫారసు తోడవ్వడంతో రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పందించారు. ఏపీ ఉద్యోగుల కోసం విజయవాడ-సికింద్రాబాద్ మధ్య వారానికి మూడు రోజుల పాటు ప్రత్యేక రైలు నడపాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రత్యేక రైలు రాత్రి 10 గంటలకు విజయవాడలో బయలుదేరి..ఉదయం సికింద్రాబాద్ చేరుకోనుంది. తిరిగి సికింద్రాబాద్‌లో రాత్రి 10 గంటలకు బయల్దేరి..ఉదయం విజయవాడకు చేరుకోనుంది. మరో పది రోజుల్లో ఈ రైలు పట్టాలెక్కనుంది.