ముద్రగడ దీక్షపై బొత్స ఆగ్రహం.. గొప్పలకు పోవద్దు..
posted on Jun 17, 2016 @ 4:39PM
ఏపీ ప్రభుత్వం తీరుపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, తుని కేసులో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ముద్రగడను చూసి రావడానికి వీలు లేకుండా అంక్షలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. సమస్యను జటిలం చేయకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ముద్రగడ దీక్షపై మంత్రులు పలు వ్యాఖ్యలు చేస్తున్నారని, బాధ్యతలు లేని మాటలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని బొత్స దుయ్యబట్టారు. ‘ప్రభుత్వం గొప్పలకు పోవద్దు, ఒంటెద్దు పోకడలు పోవద్దు, సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం వ్యవహరించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా ముద్రగడ దీక్ష చేపట్టి ఈరోజుతో తొమ్మిది రోజులకి చేరింది. మరోవైపు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన సిబ్బంది.. మూత్రంలో కీటోన్ బాడీస్ పెరగడంతో పరిస్థితి క్షీణిస్తోందని.. కీటోన్ బాడీస్ పెరగడం ప్రమాదకరమని తెలుపుతున్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటారో.. ముద్రగడ దీక్షను విరమిస్తారో లేదో చూడాలి.