నేను రాజీనామా చేస్తాను... నువ్వు పార్టీ మూస్తావా.. చంద్రబాబు వ్యూహం

  వైసీపీ పార్టీ నేతలు టీడీపీలో చేరుతున్నప్పటినుండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుంటున్నారని.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు అవకాశం దొరికినప్పుడల్లా విమర్శిస్తూనే ఉన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి జంప్ అయిన భూమా నాగిరెడ్డి స్పందించి జగన్ పై ఫైర్ అయ్యారు. వైసీపీని వీడిన నేతలు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపించడం సరికాదని భూమా అన్నారు. అంతేకాదు ఈ సందర్బంగా భూమా జగన్ కు ఓ సవాల్ కూడా విసిరారు. తాను, తన కూతురు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో గెలిస్తే జగన్ వైసీపీని మూసేస్తారా అని సవాల్ విసిరారు. జగన్‌ పుట్టకముందు నుంచే తాము రాజకీయాల్లో ఉన్నామని.. బ్రిటీష్‌కాలం నుంచే ధనవంతులమని భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. అలాంటి తాము ఎలా అమ్ముడుపోతామని ప్రశ్నించారు?   మరోవైపు భూమా నాగిరెడ్డితో సవాల్ చేయించటం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భూమా నాగిరెడ్డి అయితే రాజీనామా చేసినా మళ్లీ గెలవగల సత్తా ఉందని.. అందుకే భూమా నాగిరెడ్డితో సవాల్ చేయించారని అనుకుంటున్నారు. అయితే భూమా నాగిరెడ్డి ఒక్కరే రాజీనామా చేస్తారా.. లేక అందరూ రాజీనామా చేస్తారా అన్నది తెలియని విషయం. అంతకన్నా ముందు భూమా సవాల్ జగన్ స్వీకరిస్తారా లేదా అన్నది చూడాలి.

పాడేరు ఏఎస్పీ మృతి.. ఆత్యహత్యా..?

  పాడేరు ఏఎస్పీ శశికుమార్ ప్రమాదవశాత్తు తుపాకీ పేలి మృతి చెందారు. ఆయన తన ఛాంబర్లో ఉండగా.. సడెన్ గా తుపాకీ పేలిన శబ్దం రావడంతో మిగిలిన సిబ్బంది వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో ఉన్నారు. తుపాకీ ఆయన తలలోని కుడివైపు కణితిలో నుంచి దూసుకుపోవడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆయన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే శశికుమార్ కావాలనే ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ప్రమాదవశాత్తు పేలిందా అనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా ఈ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.   కాగా శశికుమార్‌ స్వస్థలం తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా. 2012లో ఐపీఎస్‌కు ఎంపికైన ఆయన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఏఎస్పీగా విధుల్లో చేరారు. అక్కడి నుంచి జనవరిలో పాడేరు ఏఎస్పీగా బదిలీ అయ్యారు.

వైద్య పరీక్షలకు ఓకే కానీ...ముద్రగడ

  కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని.. తుని అల్లర్ల కేసులో అరెస్ట్ చేసిన నిందితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన దీక్ష చేపట్టి ఈరోజుతో దాదాపు వారం రోజులు గడుస్తున్నా ఆయన మాత్రం వైద్య పరీక్షలకు అంగీకరించడంలేదు. మరోవైపు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. అయితే జేఏసీ సభ్యులు పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం ఎట్టకేలకు ఆయన వైద్యపరీక్షలకు అంగీకరించినట్టు తెలుస్తోంది. రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఈ విషయాన్ని తెలిపారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ముద్రగడకు వివరించామని, అరెస్టయిన పదిహేడు మందికి బెయిల్, సీబీసీఐడీ విచారణ నిలిపివేతపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పామని.. దీంతో శరీరంలోకి ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించేందుకు ఆయన అంగీకారం తెలిపారన్నారు. అయితే ఆయన దీక్ష మాత్రం విరమించడానికి ఒప్పుకోవడంలేదని.. అది కొనసాగుతోందని తెలిపారు.

నేను రాజీనామా చేశానని ఎవరన్నారు- మాణిక్యాలరావు

తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు వస్తున్న వార్తలపై స్పందించారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడుతూ రాజీనామా చేస్తున్నట్టు తాను ముఖ్యమంత్రికి ఫోన్ చేశానంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. జెడ్పీ ఛైర్మన్ బాపిరాజు సొంతనియోజవర్గంలో తాను లేకుండా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఇలాంటి వార్తలు వెలువడ్డాయని, అయితే అవన్నీ ఆవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు. రేపు విజయవాడ క్యాంపు కార్యాలయంలో సీఎంను కలుస్తానని ఆయన చెప్పారు.

జమ్మూలో పురాతన ఆలయం ధ్వంసం..ఉద్రిక్తత

జమ్మూకాశ్మీర్‌లో ఓ పురాతన ఆలయం ధ్వంసమవ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రూప్‌నగర్‌లోని ఓ పురాతన ఆలయంలోకి ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ప్రవేశించి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. మూడు వాహనాలను తగులబెట్టారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రూప్‌నగర్ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, పుకార్లు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అటు ఆలయాన్ని ధ్వంసం వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  

టీఆర్ఎస్ లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి...

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఆయనతో పాటు వివేక్‌, వినోద్‌, భాస్క‌ర్ రావు, జువ్వాడి న‌ర్సింగ్ పలువురు కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ నేత‌ల‌కి పార్టీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటోన్న సంద‌ర్భంగా టీఆర్ఎస్ భ‌వ‌న్‌కి టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు భారీగా చేరుకున్నారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బ‌లం ఇప్పుడు 13కు ప‌డిపోయింది.   ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 14 ఏళ్ల ఉద్యమంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నాం.. టీడీపీ, కాంగ్రెస్ ఏకమై రాష్ట్రానికి అన్యాయం చేశారు అని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఏర్పడింది.. తెలంగాణ అభివృద్ది కోసమే నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని.. 2019 లో గెలిచే పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని.. 2019 నాటికి ప్రధాన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు.

18 సింహాలు కస్టడీకి.. విచారణ కోసం

  సాధారణంగా నేరం చేసినందుకు నిందితులకు శిక్ష విధిస్తారు. ఎవరు నేరం చేశారో తెలుసుకునేందుకు వారిని విచారిస్తాం. అయితే ఇక్కడ వెరైటీగా సింహాలను విచారించేందుకు వాటిని అదుపులోకి తీసుకున్నారు. విచిత్రంగా ఉంది కదా.. అసలు మ్యాటరేంటంటే.. గుజరాత్ లోని ప్రఖ్యాత గిర్ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ సాంచురీలో నివసిస్తోన్న సింహాలు సమీప గ్రామాల్లోని ప్రజలపై దాడులకు పాల్పడి వారిని చంపి తింటున్నాయి. ఇప్పటికి ముగ్గురిని చంపాయి. దీంతో ఆ సింహాన్ని గుర్తించి జీవితఖైదు విధించాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే.. 18 సింహాలను అరెస్ట్ చేశారు పోలీసులు. హత్యకు పాల్పడింది ఏ సింహమో తెలుసుకునేందుకు వాటికి రకరకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి వారికి ఆ సింహం దొరుకుతుందో లేదో చూడాలి.

సచివాలయ పనులపై చంద్రబాబు ఆగ్రహం.. అప్పుడు షెడ్డుల్లోనే పని చేశారు..

  ఏపీ తాత్కాలిక సచివాలయం నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. తాత్కాలిక సచివాలయం పనులు జరుగుతున్న తీరుపై చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పనులు మరింత వేగంగా జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాను ఇటీవల వచ్చినప్పుడు నిర్మాణం ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే కనిపిస్తోందని అభిప్రాయపడ్డ ఆయన, ఉన్నతాధికారులు దగ్గరుండి పనులను వేగవంతం చేయాలని సూచించారు.   ఇంకా ఆయన మాట్లాడుతూ.. అన్ని విభాగాలు ఇక్కడికి రావాలి.. ఎవరికి మినహాయింపు లేదు..కుటుంబ సమస్యల కన్నా ప్రజాహితం ముఖ్యం అని అన్నారు. కర్నూలులో రాజధాని ఉన్నప్పుడు షెడ్డుల్లోనే పని చేశారు.. హైదరాబాద్లో ఉండి పని చేయడం సరికాదు.. భవిష్యత్ లో అంతా ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

నిద్రరావడం లేదా.. మీకోసం యాప్..

  స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వాళ్లకి యాప్ప్ గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ మనం ఎన్నో రకాల యాప్ప్ వినుంటాం. అయితే ఇప్పుడు మరో యాప్ వచ్చింది. అదేంటనుకుంటున్నారా. నిద్రపుచ్చే యాప్. నిద్రపుచ్చడానికి కూడా యాప్ ఉంటుందా..నిజంగానే నిద్రొస్తుందా అని అనుకుంటున్నారా. వస్తుందనే చెబుతున్నారు. సిమన్‌ ఫ్రేజర్‌’ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పరిశోధకుడు బ్యూడోయిన్‌. నిద్రరాని వారు ఆ సమస్యను అధిగమించేందుకు కెనడాకు చెందిన పరిశోధకులు ఓ స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను అభివృద్ధి చేశారు. నిద్రపోవాల్సిన సమయంలో మెదడులో మెదిలే అనవసర ఆలోచనలను దూరం చేసేందుకు సీరియల్‌ డైవర్స్‌ ఇమేజినింగ్‌(ఎస్‌డీఐ) విధానాన్ని ఈ అప్లికేషన్‌లో వాడినట్లు.. మానసిక ప్రశాంతతను ఇచ్చే పదాల రికార్డులను ఈ యాప్‌ ప్లే చేస్తుందని. అందులోని అర్థానికి సంబంధించిన రూపాన్ని మనసులో వూహించేందుకు వీలుగా ఒక పదాన్ని 8 సెకన్లలో చెబుతుంది. ఆ తర్వాత మరో యాధృచ్చిక పదం వస్తుంది. అలా పదాలను వింటూ కొద్ది సేపటికే మానసిక ప్రశాంతత మెరుగుపడి నిద్రలోకి జారుకుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ముందు ముందు ఇంకెన్ని యాప్ప్ వస్తాయో..

'ఆంధ్రా ఉద్యోగులు గోబ్యాక్'.. తెలంగాణ ఉద్యోగుల ధర్నా..

  ఒకపక్క హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులందరూ జూన్ 27 నాటికి ఏపీ రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశిస్తుంటే మరోపక్క ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు. అంతేకాదు ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నా కానీ.. ఉద్యోగులు మాత్రం అక్కడికి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు దీనికి తోడు తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘాలు ధ‌ర్నాకు దిగాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ‌ సెక్ర‌టేరియ‌ట్ లో ‘ఆంధ్రా ఉద్యోగులు గోబ్యాక్’ అంటూ వారు ర్యాలీ నిర్వహించి, నిర‌స‌న వ్య‌క్తం చేశారు. వారు ఆంధ్రప్ర‌దేశ్‌లోనే ప‌నిచేయాల‌ని, తెలంగాణ వారు మాత్ర‌మే ఇక్క‌డ విధులు నిర్వ‌హించాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎవరు ఏం చేస్తారో.. ఎలా ముందడుగు వేస్తారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

ఎన్ఎస్జీ లో భారత్ కు సభ్యత్వం వ్యతిరేకిస్తున్నాం...

  న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు చైనా ఎన్ఎస్జీ లో భారత్ కు సభ్యత్వం ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియాకు సభ్యత్వం ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు చైనా పేర్కొంది. ఇందుకు కారణం కూడా చైనా చెప్పుకొచ్చింది.. ఎన్ఎస్జీలో ఇండియాను చేరిస్తే, పాకిస్థాన్ ను రెచ్చగొట్టినట్టు అవుతుందని.. తమ దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని, అది తమకు ప్రమాదమని పేర్కొంది. దక్షిణాసియాలో తీవ్ర అణ్వస్త్ర పోటీ నెలకొంటుందని తన భయాన్ని వ్యక్తం చేసింది.

ఓర్లాండో ఘటనలో ట్విస్ట్... భార్యకు కూడా తెలుసు.

  ఓర్లాండో నరమేధంపై రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ఇప్పటికే ఈ దారుణానికి పాల్పడిన ఒమర్ మతీన్ పై నిజాలు బయటపడుతుంటే.. ఇప్పుడు ఆయన భార్య గురించి కూడా కొన్ని విషయాలు వెలుగుచూస్తున్నాయి. కాల్పుల ఘటన గురించి మతిన్‌ రెండో భార్య నూర్‌ సల్మాన్‌కు ముందే తెలుసని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.   విడాకులు తీసుకున్నప్పటికీ, ఆమెకు మతీన్ తో సంబంధముందని, గే క్లబ్బులకు పలుమార్లు మతీన్ తో కలసి వెళ్లిందని అధికారులు గుర్తించారు. దాడికి వారం ముందు కూడా మతీన్ తో ఆమె కలిసి కనిపించిందని, ఇద్దరూ కలిసి తిరుగుతున్న సమయంలోనే మతీన్ ఆయుధాలను సమకూర్చుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. దీంతో ఏ క్షణమైనా నూర్ ను అదుపులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది.

మరోసారి చంద్రబాబుపై జేసీ.. చంద్రబాబుకు అది అత్యాశే..

  ఇతర పార్టీ నేతలపైన విమర్సలు చేయడం కామన్. కానీ ఇతర పార్టీ నేతలను విమర్శిస్తూ.. తమ పార్టీ నేతలపై కూడా విమర్సలు చేసే ధైర్యం ఎవరికి ఉందంటే వెంటనే మనకు జేసీ బ్రదర్స్ గుర్తొచ్చేస్తారు. ఎవరు ఏమనుకున్నా తమకి నచ్చినట్టు, తమకు చెప్పాలనిపించింది చెప్పడంలో వీరిద్దరూ దిట్ట. తాజాగా అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రుణమాఫీపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఒకే దఫా రైతులందరికీ కనీసం రూ.50 వేలు రుణమాఫీ గనుక చేసుంటే.. ఈపాటికి చంద్రబాబును రైతులంతా నెత్తికెక్కించుకునేవారని, అనవసర అత్యాశకు పోయి చంద్రబాబు రుణమాఫీ హామి ఇచ్చారని' విమర్శించారు. అంతేకాదు నియోజక వర్గ ప్రజలకు ఓ సలహా కూడా ఇచ్చారు. ఈ నెల చివరి వారం వరకు రుణమాఫీ పూర్తవుతుందన్న ప్రభుత్వం హామి ఇచ్చింది.. ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టు రుణాలు మాఫీ కాకపోతే నియోజకవర్గ ఎమ్మెల్యేలను నిలదీయండి అంటూ సూచించారు.

ఐసిస్ కు ఒబామా వార్నింగ్.. మాతో పెట్టుకోవద్దు...

  అగ్రరాజ్యమైన అమెరికాపై ఉగ్రవాదులు దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. మొన్ననే ఒమర్ మతీన్ అనే ఉగ్రవాద సంబంధి 50 మందిని అత్యంత దారుణంగా మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాను కాని, ఆ దేశ మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుంటే... ఐఎస్ ఉగ్రవాదులకు ప్రపంచంలో ఎక్కడ కూడా సురక్షిత స్థానం దొరికే అవకాశమే లేదని.. పూర్తిగా పెకలించేస్తాం అని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే సిరియా అండ్ ఇరాక్ లో ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపాము.. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన 120 మంది అగ్ర నేతలను మట్టుబెట్టాము..అక్కడ ఆ సంస్థ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు.

కేక్ పై అసదుద్దీన్.. కట్ చేసిన రాజ్ ఠాక్రే!

  మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. ఇప్పుడు ఆయన వివాదస్పద చర్యలకు తెరతీసినట్టు కనిపిస్తోంది. రాజ్ ఠాక్రే నిన్న సెంట్రల్ ముంబైలోని దాదర్ లోని తన ఇల్లు ‘కృష్ణ కుంజ్’లో 48వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన కేక్ కట్ చేశారు. అయితే ఆయన కేక్ కట్ చేయడంలో అంతా వివాదాస్పదం ఏముందనుకుంటున్నారా.. అక్కడే ఉంది ట్విస్ట్.. తాను కట్ చేసిన కేక్ పై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ బొమ్మ ఉండటమే. ఒవైసీ బొమ్మతో ఉన్న కేక్ ను ఆయన ముక్కలు ముక్కలుగా కట్ చేశారు. ఆ తర్వాత అభిమానులందరికీ దానిని పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు మాట్లాడినా... ఈ కేక్ మాదిరే ముక్కలు ముక్కలు చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. మరి దీనిపై ఎంఐఎం పార్టీ నేతలు.. అసదుద్దీన్ ఎలా స్పందిస్తారో.. ఈ వ్యవహరంలో ఇంకెంత దుమారం రేగుతుందో చూడాలి.

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా తప్పుకోనున్న అజయ్ దేవగన్.. కారణం అదేనా..?

  ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా అజయ్ దేవగన్ దంపతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పదవి నుండి అజయ్ దేవగన్ తప్పుకుంటున్నారా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. దీనికి ఆయన ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉండటమే కారణమంట.   ఎందుకంటే.. ఇంత వరకు అడ్వర్టయిజ్‌మెంట్ నిమిత్తం ఒక్క యాడ్ ఫిల్మ్‌ను కూడా అజయ్ దేవగణ్‌తో చిత్రీకరించలేదు.. ఏపీలో గల పర్యాటక ప్రాంతాల గురించి వివరించిన సందర్భాలు లేవట. దీనికితోడు ఈ ప్రాజెక్టు కోసం తాను ఎలాంటి డబ్బులు తీసుకోకపోయినా టాప్ ఏజెన్సీల ద్వారా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అజయ్ దేవగణ్ భావించారని, ఇందుకోసం అజయ్ - కాజోల్‌లు లింటాస్, ఒజిల్వీ వంటి సంస్థలను కూడా చూపించారని కానీ.. ఏపీ అధికారులు మాత్రం స్థానిక ఏజెన్సీతో పట్టాలెక్కించాలని భావిస్తోందట. అందుకే అజయ్ దేవగన్ అప్ సెట్ అయ్యారని బ్రాండ్ అంబాడిడర్ గా తప్పుకోవాలని చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.