"అతి"థి మర్యాద..జడ్జిల భోజనం కోసం వెండికంచాలు..
posted on Jun 19, 2016 @ 2:33PM
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ అతిథుల కోసం "అతి" చేసింది. అదేంటంటే ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి నాలుగు రోజుల పాటు సుప్రీంకోర్టు జడ్జిల నాలుగో సదస్సు జరిగింది. దీనిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జడ్జిలతో పాటు వారి భార్యలు కూడా హాజరయ్యారు. సదస్సు తమ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి వీరందరికి ఎలాంటి లోటు చూసుకోవాలనుకుంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడి వరకు బాగానే ఉంది కాని..వీరిని ప్రభుత్వ అతిథులుగా ప్రకటించింది. అంతేకాకుండా వారు భోజనం చేయడానికి ఏకంగా వెండి కంచాలను, పాత్రలను కొనుగోలు చేసింది. వాటి కొనుగోలుకు రూ.3.57 లక్షలు, ఆహార పదార్థాల కోసం రూ.3.37 లక్షలు ఖర్చు చేసింది. అంతేకాకుండా అతిథులకు బహుమతులు కూడా అందజేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను అజయ్ దూబే అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించడంతో ప్రభుత్వ అతి మర్యాదలు బయటపడ్డాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.