లండన్‌లో భారత రాయబారి కార్యక్రమంలో మాల్యా..
posted on Jun 18, 2016 @ 6:46PM
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా లండన్ పారిపోయిన కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యా కోసం భారత్‌లోని అత్యున్నత దర్యాప్తు సంస్థలు వేటాడుతున్నాయి. మాల్యాను ఎలాగైనా దేశానికి రప్పించాలని అవి చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో లండన్‌లోని ఒక పుస్తకావిష్కరణ సభలో మాల్యా ప్రత్యక్షమయ్యాడు. ఆ కార్యక్రమానికి బ్రిటన్‌లోని భారత రాయబారి కూడా హాజరుకావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రముఖ రచయిత సుహెల్ సేథ్ రచించిన మంత్రాస్ ఫర్ సక్సెస్: ఇండియాస్ గ్రేటెస్ట్ సీఈవోస్ టెల్ యు హౌ టు విన్ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిన్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా భారత రాయబారి నవతేజ్ సర్న హాజరయ్యారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంపై సుహేల్ సేథ్ స్పందించారు. ఈ కార్యక్రమానికి మాల్యా హాజరయ్యారని, ప్రేక్షకుల్లో కూర్చున్నారన్నారు. ఈ కార్యక్రమం ఓపెన్ ఈవెంట్ అని ప్రత్యేకించి ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని, కేవలం ట్విట్టర్ ద్వారా మాత్రమే ప్రచారం చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరైనా హాజరుకావచ్చునని చెప్పడం వల్ల మాల్యా ఈ కార్యక్రమానికి వచ్చారని, ప్రేక్షకుల్లో కూర్చోని కార్యక్రమాన్ని వీక్షించారని ట్వీట్ చేశారు. మీడియా కావాలనే దీన్ని హైలెట్ చేస్తోందని సుహెల్ విమర్శించారు.