టీడీపీ నేతలపై బాంబుల దాడి..
posted on Jun 20, 2016 @ 10:54AM
విశాఖపట్నంలో టీడీపీ నేతలపై గుర్తు తెలయని దుండగలు బాంబులతో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. విశాఖ డెయిరీ డైరెక్టర్, టీడీపీ మండల నాయకుడు గేదెల సత్యనారాయణ జిల్లా బుచ్చియ్యపేట మండలం కోమర్లపూడి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి వెళ్లి విధుల్లో భాగంగా.. పెద్దగొట్టు చెరువు వద్ద పనులు చేయిస్తున్నారు. పనులను పరిశీలిస్తున్న క్రమంలోనే కొంతమంది దుండగులు వచ్చి.. ఆయనపై బాంబులు విసిరి పారిపోయారు. బాంబులు పేలడంతో.. ఇనుప ముక్కలు ఆయన శరీరంలోకి గుచ్చుకుపోయి తీవ్ర గాయాలవ్వగా.. అతనిని రావికమతంలోని ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు సమాచరం అందుకున్న చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్ రాజు హూటాహుటిన రావికమతం చేరుకొని సత్యనారాయణను తన కారులో విశాఖపట్నం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నామని బుచ్చియ్యపేట ఎస్‌ఐ ధనుంజయ్ తెలిపారు. అయితే ఈ దాడికి కారణం రాజకీయాలా? లేక వ్యక్తిగత కక్షలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. దాడిలో గాయపడ్డ ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు.