సమాధిగా మారిన సగం ధరాలీ

ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు అవరోధం ఉత్తరాఖండ్ ఎగువ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్  కారణంగా ధరాలీ గ్రామాన్ని బురద ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘోర విళయంలో గల్లంతైన వారీ ఆచూకీ కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పది మంది మరణించినట్లు అధికారికంగా ధృవీకరించిన అధికారులు 190 మందిని ప్రాణాలతో కాపాడినట్లు ప్రకటించారు. అయితే ఇంకా వందల సంఖ్యలో గల్లంతైన వారి జాడ కోసం ప్రతికూల పరిస్థితుల్లోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.   ఐటీబీపీ, ఎస్ఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసు, సహాయక బృందాలు గాలింపు చర్యలలో నిమగ్నమై ఉన్నారు.  హార్సిల్లోని ఆర్మీ  క్యాంప్ కు చెందిన 11 మంది జవాన్ల జాడ ఇంకా తెలియలేదు.  అలాగే గంగోత్రి ధామాన్ని దర్శించుకునేందుకు వచ్చిన 28 మంది యాత్రికుల బృందం గల్లంతైంది.   దీంతో వారి బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.  ఇలా ఉండగా ఈ ఘటనలో ధరాలీలోని అత్యంత పురాతనమైన  కేదార్ శివాలయం పూర్తిగా బుదరలో కూరుకుపోయింది.  ధరాలీ దాదాపు సగభాగం సమాధిలా మారిపోయింది. ఈ గ్రామన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామీ  బుధవారం (ఆగస్టు 6) సందర్శించారు.  ధరాళీలో ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్ స్టేలు, చెట్లు.. ఇలా అన్నీ బురదలో కూరుకుపోయాయి.  బాధితులకు ఆహారం, ఔషధాలు అందజేస్తున్నామని సీఎం చెప్పారు. సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.  

ట్రంప్ టారీఫ్ ల మోత.. ప్రభావితమయ్యే రంగాలేంటో తెలుసా?

భారత్‌పై అదనంగా పాతిక శాతం సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. దీంతో  భారత్ నుంచి దిగుమతి అయ్యే కీలక ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం మేర  సుంకాలను విధించినట్లైంది. ట్రంప్ నిర్ణయం పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా  లెదర్, వజ్రాలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్, రసాయనాలు వంటి భారత కీలక ఎగుమతి రంగాలు ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితమౌతాయి. ఆయా రంగాలు సంక్షోభంలో కూరుకుపోయే ముప్పు కూడా ఉంది.  ఇప్పటికే ఉన్న సుంకానికి అదనంగా, బుధవారం (ఆగస్టు 6) నుంచి పాతిక శాతం,  ఆగస్టు 27 నుంచి మరో పాతిక శాతం టారిఫ్ పెరుగుతుంది.  దీనితో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు దాదాపు 50 శాతం వరకూ పడిపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  అంతే కాకుండా  అమెరికా మార్కెట్లో భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఫలితంగా వాటికి డిమాండ్ పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.    ప్రధానంగా టెక్స్‌టైల్స్, వజ్రాలు, అర్నమెంట్స్, ఫుట్ వేర్, ఫ్రాన్స్, రసాయనాలు, యంత్ర పరికరాల రంగాలపై ఈ టారిఫ్ పెంపు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భారత్ ఎగుమతులలో ముఖ్యంగా, భారత ఎగుమతుల్లో కీలక మూర డైమండ్స్, ఆర్నమెట్స్  పరిశ్రమ నష్టాలలో కూరుకుపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. ఈ టారిఫ్ పెంపు.. ఈ రంగంలో పని చేసే కార్మికుల ఉపాధి, ఉద్యోగావకాశాలను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు.   

31 నుంచి మోడీ రెండు రోజుల చైనా పర్యటన

ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటన ఖరారైంది. ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 1 వరకూ ప్రధాని మోడీ చైనాలో పర్యటిస్తారు.  షాంగై సహకార సదస్సులో మోడీ పాల్గొననున్నారు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత నేపథ్యంలో మోదీడీ చైనా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సుకు హాజరు కావాలంటూ చైనా నుంచి అందిన ఆహ్వానం మేరకు మోడీ ఈ దేశ పర్యటనకు వెడుతున్నారు.  2019లో గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆ తర్వాత కూడా పలు సార్లు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడగా భారత్ దీటుగా సమాధానమిచ్చింది. ఆ ఘటన తరువాత మోడీ చైనా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.  ఇప్పుడు ట్రంప్ టారీఫ్ టెర్రర్ నేపథ్యంలో భారత్ చైనాలు సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయి.  ఈ క్రమంలోనే మోడీ చైనా పర్యటనకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది.  ఈ పర్యటనలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు సంబంధించి కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.

టిటిడీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. కోటి విరాళం

  తిరుమల తిరుపతి దేవస్థానం  శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌ కి సీకేపీసీ ప్రాపర్టీస్  ఎండీ చిరాగ్ పురుషోత్తం కోటి రూపాయల విరాళాన్ని అందించారు.  దీనిపై ఆయనను అభినందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఎక్స్ వేదికగా ఆయనను అభినందించారు.  చిరాగ్ పురుషోత్తం, మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ విరాళాన్ని అందజేశారు. పేద ప్రజలకు ఉచితంగా మెదడు, గుండె, మూత్రపిండాల శస్త్ర చికిత్సలను అందించే ప్రాణదానం ట్రస్ట్ సేవా దృక్పథానికి చిరాగ్ పురుషోత్తం ఇచ్చిన విరాళం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. పేదలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు ప్రాణదాన ట్రస్ట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ సందర్భంగా చిరాగ్ పురుషోత్తం ప్రశంసించారు.   గుండె, మూత్రపిండాలు, మెదడు మొదలైన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న అనేకమంది పేదలకు ఉచిత సేవలందిస్తున్న ప్రాణదాన ట్రస్ట్ కు ట్రస్ట్ కు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో రూ. కోటి విరాళం అందజేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.   

ట్రంప్ టారిఫ్ టెర్రర్.. వినాశకాలే విపరీత బుద్ధి!

ఎవరికైనా పోయేకాలం వస్తే బుద్ధి పెడదారి పడుతుంది.  అందుకే మన పెద్దలు పెద్దలు వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. అయితే.. అమెరికా ఆధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  చాణక్యుడు చెప్పిన ఈ నీతి  వాక్యం విని ఉండక పోవచ్చును. అందుకే..  అసలే ట్రంప్  ఆపైన,పోయే కాలం తరుముకోస్తోంది అన్నట్లుగా.. తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. ఇది.. ఎవరో అమెరికా ఆగర్భ శతృవులో   ట్రంప్ ను వ్యక్తిగతంగా వ్యతిరేకించే వారో చేస్తున్న వ్యాఖ్యలో విమర్శలో కాదు.   నిజానికి..  భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై ఇంటా, బయటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రష్యా నుంచి వాణిజ్యం కొనసాగిస్తున్న ఐరోపా దేశాల పట్ల ప్రేమ కనబరుస్తున్న ట్రంప్..  భారత్ విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారని.. అనేక మంది అమెరికన్లు విమర్శిస్తున్నారు. సొంత పార్టీ నేతలు సైతం నిరసన గళం వినిపిస్తున్నారు. భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలు దెబ్బతీసుకోకూడదని భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ హితవు పలికారు. అయితే..  ట్రంప్ కు మంచి   మాటలు రుచించడం లేదు. అందుకే ట్రంప్ విరీత పోకడలు పోతున్నారు. బారత దేశాన్ని సుంకాలతో దెబ్బ తీయాలని, అలా దెబ్బతీసి తన దారికి తెచ్చుకోవాలని తహతహలాడుతున్నారు. తప్పటడుగులు వేస్తున్నారు.  అందులో భాగంగానే..  ట్రంప్  భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ పై ఇప్పటికే ఉన్న పాతిక శాతం సుంకాలతో పాటు, ఇప్పుడు అదనంగా మరో 25 శాతం విధించడంతో మొత్తం టారీఫ్ 50 శాతానికి చేరుకుంది. ఈ మేరకు ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.అయితే..  ట్రంప్ విపరీత ప్రకటనలపై ప్రధాని మోదీ ప్రభుత్వంతో పాటుగా, పారిశ్రామిక వర్గాలు అదే స్థాయిలో స్పందించాయి.  భారత విదేశాంగ శాఖ అమెరికా నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇది అన్యాయం, అసమర్థనీయం, అసమంజసమైన చర్యగా అభివర్ణించింది.  రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్ ను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. మా దిగుమతులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. 1.4 బిలియన్ల భారతీయుల ఇంధన భద్రతను కాపాడే లక్ష్యంతో జరుగుతాయి. అనేక దేశాలు తమ జాతీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ..  అమెరికా భారతదేశంపై అదనపు సుంకాలు విధించడం దురదృష్టకరం. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది అని విదేశాంగ శాఖ పేర్కొంది. మరోవంక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై మరో 25 శాతం మేర సుంకాలు విధించడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష్‌ గోయెంకా..   భారత్‌ ఎవరికీ తలవంచదని పేర్కొంటూ  ఎక్స్‌ లో పోస్టు పెట్టారు.  మీరు మా ఎగుమతులపై సుంకాలు విధించవచ్చేమో గానీ.. మా సార్వభౌమాధికారంపై కాదు. మీ ఆదేశాల ఒత్తిడి కంటే ఇంధన భద్రతే ముఖ్యం. డిస్కౌంట్లనే మేం ఎంచుకుంటాం.మీరు సుంకాలు పెంచండి.. మేం మా సంకల్పాన్ని పెంచుకుంటాం. మెరుగైన ప్రత్యామ్నాయాలు కనుగొని స్వావలంబనను సాధిస్తాం.  అని పేర్కొన్నారు. మరోవంక భారత్‌పై అదనంగా పాతికశాతం సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం స్వీయ విధ్వంసకరమని ఆర్థికరంగ నిపుణుడు శరద్‌ కోహ్లీ అన్నారు. దాని వల్ల జరిగే పరిణామాలేంటో ట్రంప్‌నకు తెలియదన్నారు. బలమైన మిత్రదేశంతో ఆయన శత్రుత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారత్‌, అమెరికా సహజ మిత్రులు. అమెరికా ప్రజలు తమ సాంకేతిక పరిజ్ఞానం విషయంలో, వైద్యరంగానికి సంబంధించినంతవరకు భారత్‌పైనే ఆధారపడతారనే వాస్తవాన్ని ట్రంప్‌ మరిచిపోతున్నట్లున్నారని భావిస్తున్నా. ట్రంప్ మిగతా ప్రపంచం నుంచి తనను తాను దూరం చేసుకుంటున్నారు’’ అని విశ్లేషించారు.

ఏపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ నియామకం

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైన సరే ఎక్కువ సీట్లు  గెలుచుకోవాలని అస్త్రాలను సిద్దం చేస్తోంది. సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ముందుగా పార్టీ నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలని రాష్ట్ర నేతలను ఆదేశించింది. తొలుత పార్టీలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయాలని నిర్ణయించింది.  మాణిక్కం ఠాగూర్ ఛైర్మన్‌గా 25 మంది సభ్యులతో  ఏపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏఐసీసీ నియామించింది. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జేడీ శీలం మస్తాన్ వలీ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ జననల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభిస్తాం : లోకేష్

  మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా భవిష్యత్ లో అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో “సోలార్, విండ్ ఎనర్జీ టాలెంట్ హబ్ గా ఆంధ్రప్రదేశ్” అనే అంశంపై ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, స్వనీతి ఇనీషియేటివ్ సంయుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ కు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. ఈ కాన్ఫరెన్స్ కేవలం దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ ను శక్తివంతం చేయడం, సౌర, పవన శక్తికి నైపుణ్య హబ్ గా ఏపీని తీర్చిదిద్దడమే కాదు.. ప్రపంచ గ్రీన్ ఎనర్జీ  భవిష్యత్ ను శక్తివంతం చేసే దిశగా ఈ కాన్ఫరెన్స్ ను నిర్వహించడం జరుగుతోంది. తద్వారా మన యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.  యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు అందరం కష్టపడి పనిచేస్తున్నాం దేశంలో ఏ పార్టీ సాధించని విధంగా కూటమి ప్రభుత్వం 94శాతం స్ట్రైక్ రేట్ తో 164 సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. ఇందుకోసం అందరం కష్టపడి పనిచేస్తున్నాం. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. క్లస్టర్ విధానంలో పెట్టుబడులను ఆకర్షిస్తాం.  ఇందుకు కావాల్సిన ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తాం. అనంతలో ఆటోమొబైల్, కర్నూలు రెన్యువబుల్ ఎనర్జీ, కడప, చిత్తూరును ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, నెల్లూరులో ఎయిర్ కండిషనర్స్ వంటి స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రకాశం జిల్లాను సీబీజీ హబ్ గా, గుంటూరు, కృష్ణాను క్యాంటమ్ వ్యాలీ హబ్ గా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను ఆక్వా హబ్ గా, ఉత్తరాంధ్రను ఫార్మా, డేటా సెంటర్, ఐటీ హబ్ గా, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు చేస్తాం. ప్రతి వంద కి.మీలకు ఓ క్లస్టర్ ఏర్పాటుచేసి ఆయా రంగాల్లో టాప్ 20 కంపెనీలను తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నాం. దీంతో పాటు నైపుణ్యం పెంపు, నవీన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.   సెప్టెంబర్ 1వ తేదీన నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభిస్తాం రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ప్రైవేటు సెక్టార్ తో నైపుణ్యం గల యువతను అనుసంధానించాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభించడం జరుగుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, సీడాప్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తాం. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.  పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్రం చొరవ తీసుకుని యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తాం. అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. నా ఛాలెంజ్ ను స్వీకరించి సుజ్లాన్ సంస్థ ఇప్పటికే 2 నైపుణ్య శిక్షణా కేంద్రాలను నిర్మించింది. అవి ఇప్పటికే పనిచేస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ రంగం ద్వారా యువతకు విస్తృత అవకాశాలు గ్రీన్ ఎనర్జీ రంగం ద్వారా మహిళలకు వారి గ్రామాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యువగళం పాదయాత్ర సమయంలో అనంత జిల్లాలోని కియా యాన్సిలరీ యూనిట్స్ లో మహిళలు పనిచేయడం చూశాను. ఓ మహిళ నా వద్దకు వచ్చి నాతో పాటు నడిచారు. ఏం చేస్తున్నారని ఆ మహిళను ప్రశ్నించగా.. తాను కియా యాన్సిలరీ యూనిట్స్ లో పనిచేస్తున్నానని, గతంలో సాధారణ గృహిణిగా ఉన్న తాను ఇప్పుడు నెలకు రూ.40వేలు సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలిచానని గర్వంగా చెప్పారు.  ఇప్పుడు కుటుంబంలో తనకు ఎంతో గౌరవం దక్కుతోందని చెప్పారు. ఒక్క కియా పరిశ్రమ వల్ల అనంతపురం జిల్లాలో వచ్చిన మార్పు ఇది. గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయి. అందుకే విండ్, సోలార్, రెన్యువబుల్, పంప్డ్ స్టోరేజీ, సీబీజీ ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టిసారించాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై  సీఎం చంద్రబాబు  చాలా పట్టుదలతో ఉన్నారు. దీనిని చాలా ప్రాముఖ్యతగా తీసుకున్నాం. ఇందుకోసం ప్రైవేటు సెక్టార్ తో కలిసి పనిచేస్తాం. ఓంక్యాప్ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు  

విశాఖ జీవీఎంసీ స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం

  విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయి. మొత్తం 10 స్థానాల్లో తొమ్మిది కైవసం చేసుకున్న కూటమి కేవలం ఒక్క స్థానం మాత్రం వైసీపీకి దక్కింది. అంటే 8 స్థానాల్లో టీడీపీ, ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ అతి కష్టం మీద ఈ సీటును గెలుచుకుందని తెలుస్తోంది. ఇక ఈ జీవీఎంసీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.  ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మొత్తం 92 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అయితే గతేడాది స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూటమి క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం కూటమి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది. జీవీఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను ఇప్పటికే కూటమిలోని పార్టీలు కైవసం చేసుకున్నా సంగతి తెలిసిందే. 

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

  తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధ‌వారం శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.  అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి, వ‌కుళమాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనులవారికి, యోగ‌న‌ర‌సింహ‌స్వామి వారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.  అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. 

భారత్‌కు ట్రంప్ మరో బిగ్ షాక్

  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌కు మరో బిగ్ షాక్ ఇచ్చారు. మరో 25 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన మన దేశంపై 25 శాతం సుంకాలు విధించారు. దీనికి అదనంగా సుంకాలు ఉంటాయిని ఇటీవల ప్రకటించారు. ఈక్రమంలో ఇప్పటికే 25 శాతం సుంకాలను విధించి.. దానిని ఇప్పుడు 50 శాతానికి విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు.  రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హూస్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ పరిణామాల తర్వాత కూడా.. రష్యా నుంచి ఇంకా ఆయిల్‌ కొనుగోలు చేస్తున్నందునే ఆయన మరో 25 శాతం టారిఫ్‌తో తాజా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు 50 శాతానికి చేరాయి. తాజా సుంకాల పెంపుపై అర్ధరాత్రి తర్వాత ఆయన అధికారికంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. 

డాక్టర్ నమ్రతపై మరో కేసు నమోదు.. నేడు 9 మంది అరెస్టు

  సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత కేసులో అక్రమాలు ఒక్కొ క్కటిగా బయటప డుతున్నాయి. ఇప్పుడు తాజాగా డాక్టర్ నమ్రతపై మరో కేసు నమోదు అయింది... ఈ నమ్రత అలాంటి ఇలాంటి లేడీ డాక్టర్ కాదు... ఒకవైపు పిల్లల్ని అమ్మే గ్యాంగ్ తో సంబం ధాలు పెట్టుకోవ డమే కాకుండా మరోవైపు గాంధీ హాస్పిటల్ లో పని చేస్తున్న అనస్థీ షియా డాక్టర్ ను గుప్పిట్లో పెట్టుకుంది... పేదవారి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని... వారికి డబ్బు ఆశ చూపించి... పిల్లల్ని కొనుగోలు చేసింది. అంతటితో ఆగలేదండోయ్ ఈ లేడీ కిలాడీ డాక్టర్... ఏకంగా సికింద్రా బాద్ కు చెందిన ప్రముఖ గైనకా లజిస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లో కన్సల్టెంట్ గా పని చేస్తున్న వైద్యురాలి లెటర్ హెడ్ లను  వినియోగించింది... తన వద్దకు వచ్చిన.. పేషెంట్లకు ఆ లెటర్ హెడ్  మీద మందులు, ఇంజక్షన్లు రాసి ఇచ్చేది... అయితే తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ లను చూసి వైద్యాలు ఒక్కసారిగా అవ్వక్కయ్యారు.  నా లెటర్ హెడ్ లను ఎటువంటి అనుమతి లేకుండా డాక్టర్ నమ్రత ఉపయోగించిందని ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యురాలు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గోపాలపురం పోలీసులు నమ్రతపై మరో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు సృష్టి టెస్టిట్యూబ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఈరోజు పోలీసులు ఈ కేసులో మరో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. దీంతో అరెస్టుల పర్వం 18 కి చేరుకుంది. ఘటన వెలుగులోకి రావడంతో... విదేశాలకు పారిపో యేందుకు ప్రయ త్నించిన లేడీ డాక్టర్ విద్యులత తో పాటు మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.  అరెస్టు చేసిన వీరందరినీ వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. మరికాసేపట్లో ఈ తొమ్మిది మందిని కోర్టులో హాజరుపర చానున్నారు. ఈ కేసులో డాక్టర్ నమ్రతను మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలని భావించిన పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు....86 మంది సరోగసీ దంపతుల వివరాలు సేకరించా లని.... అలాగే  సరోగసీ పేరుతో చైల్డ్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డ నమ్రత పిల్లలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న దానిపై విచారించాలని... అందుకే మరో మారు నమ్రతను కస్టడీలోకి తీసు కునేందుకు అను మతి ఇవ్వాలంటూ కోర్టును కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు..కెమిస్ట్రీ బాగాలేదని విడాకులు : వెంకయ్యనాయుడు

  దేశంలో ఉండే రాజకీయాలు, రాష్ట్రంలో ఉండే పరిణమాలపై ప్రజలు ఆలోచన చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. విజయవాడలో వల్లూరు శ్రీమన్నారాయణ అభినంద సభలో పాల్గోన్నారు. నేడు వివాహ వ్యవస్థపై కూడా నమ్మకం పోతుందని వెంకయ్య పేర్కొన్నారు. కుటుంబ, వివాహ వ్యవస్థ చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయన్నారు. ఇటీవల ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు..కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారని మాజీ ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు.  ఇప్పుడు ఏ నాయకులు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. చిన్న పిల్లలకు డైపర్లు మార్చినట్లు పార్టీలు మారుతున్నారని తెలిపారు.స్నేహం ఎలా ఉండాలి అంటే కంటికి కనురెప్ప లా ఉండాలని..శ్రీమన్నారాయణ స్నేహానికి పెట్టింది పేరు ఆయన అన్నారు. అదే విధంగా శ్రీమన్నారాయణ కూడా తను నమ్మిన పార్టీ కోసం పని చేశారు.. ఎటువంటి పదవులు ఆశించకుండా పని చేశారని తెలిపారు.

పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

  రాష్ట్రంలో మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆగస్ట్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. అర్హులైన నాయీ బ్రాహ్మణులకు చెందిన హెయిల్ సెలూన్లకు ఫ్రీ కరెంట్  అమలు చేయాలని మంత్రులు నిర్ణయించారు.  40వేల హెయిర్‌ కటింగ్‌ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25 నుండి నూతన రేషన్ కార్డులు పంపిణీకి కేబినెట్ మంత్రులు ఆమోదం తెలిపారు.  ఏపీ టూరిజంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని.. అరకు, భవానీ ఐలాండ్స్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. రూ.900 కోట్ల ఏపీ బీడీసీఎల్‌ రుణాలకు ప్రభుత్వ హామీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైష్ణవి ఇన్‌ఫ్రా కంపెనీకి 25 ఎకరాల టీటీడీ భూమిని ఇచ్చేందుకు క్యాబినెట్‌ అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. బీసీ వర్గాల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని చెప్పారు. మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం పెంచామన్నారు. 40వేల హెయిర్‌ కటింగ్‌ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు తెలిపారు.  ఫార్చ్యూన్-500 లిస్టులోని ఐటీ సంస్థలకు తక్కువ ధరకే భూములపై క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది.  

ఏపీలో అంబులెన్సులకు ఇక కొత్త రూపు, కొత్త రంగులు

ఆంధ్రప్రదేశ్ లో అంబులెన్సులు ఇక కొత్త రూపంతో కనిపించనున్నాయి. వైసీపీ హయాంలో రాష్ట్రంలో అంబులెన్సులకు వేసిన నీలం రంగును తొలగించి.. తెలుపు రంగుతో పాటు ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు రంగులతో రిఫ్లెక్టివ్ టేపులతో అందుబాటులోకి తీసుకురావాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించించింది. రూపం, రంగులు మార్చడమే కాదు అత్యాధునిక  సాంకేతిక పరికరాలను కూడా అమర్చి అంబులెన్సుల సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా దూసుకువస్తున్నాయి. ఈ కొత్త అంబులెన్సులకు సంజీవని అనే పేరు ఖరారు చేశారు. వీటిపై ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఫొటోలు ఉంటాయి. ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, అత్యాధునిక సాంకేతకతతో అంబులెన్సులు మరింత సమర్ధవంతంగా సేవలు అందిచనున్నాయని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. 

బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదు : సీఎం రేవంత్

  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన విషయంలో ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో మాట్లాడారు. మన పోటీ తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, టీబీజేపీ చీఫ్ రామచందర్‌రావుతో కాదు. నరేంద్ర మోదీ భారత ప్రభుత్వంపైనే.. ప్రధానికి సవాల్ విసురుతున్నాం  మా బీసీ రిజర్వేషన్ల డిమాండ్ ఆమోదించకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగరేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.  రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసి రిజర్వేషన్లు సాధించేవరకు నిద్రపోమని సీఎం తెలిపారు. బీసీ రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతిని అపాయింట్‌మెంట్‌ అడిగాం.. కానీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల కల్పనలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ తరహాలో దేశంలోనూ జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేశారు. తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని మోదీ, అమిత్‌షా చెప్పి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.  

నడిరోడ్డుపై లారీలో మంటలు.. పేలిన గ్యాస్ సిలెండర్లు

మంగళగిరిలో పట్టపగలు నడిరోడ్డుపై ఒక లారీ దగ్ధమై అందులో ఉన్న గ్యాస్ సిలెండర్లు పేలిన ఘటన స్థానికంగా ప్రజలలో తీవ్ర భయాందోళనలు కలిగించింది. ఈ ఘటన మంగళగిరి ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం (ఆగస్టు 6) చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీలో హఠాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆ లారీలో ఉన్న మూడు గ్యాస్ సిలెండర్లు భారీ శబ్డంతో పేలిపోయాయి. లారీ చూస్తుండగానూ పూర్తిగా దగ్ధమైంది. లారీ దగ్ధం కావడం, ఆ లారీలోని గ్యాస్ సిలెండర్లు పెద్ద శబ్బంతో పేలిపోవడంపై ఆ ప్రాంత ప్రజలు, జాతీయ రహదారిపై వెడుతున్న వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అదృష్ట వశాత్తూ ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు.   సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.  

పెన్సిల్ కోసం పిల్లల తగవు.. నిండు ప్రాణం బలి!

ఒక పెన్సిల్ కోసం ఇద్దరు పిల్లల ఘర్షణ పెద్ద వాళ్ల జోక్యంతో పెద్ద గొడవగా మారి నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా శెట్లూరు పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.  అనంతపురం జిల్లా శెట్టూరు లోని ఎర్రిస్వామి, మరియమ్మ దంపతుల కుమారుడు క్రిష్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగలి చదువుతున్నాడు. అదే పాఠశాలలో అదే తరగతి చదువుతున్న  అదే గ్రామానికి చెందిన  ప్రకాష్, ప్రమీల దంపతుల కుమారుడు గగన్ తో పెన్సిల్ విషయంలో గొడవపడ్డాడు.   పిల్లల తగవే కదాని వదిలేయకుండా  క్రిష్ తల్లిదండ్రలు బంధువులతో కలిసి గగన్ తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డారు. గగన్ ఇంటికి వెళ్లి మరీ కొట్టారు. ఈ దాడిలో గగన్ తండ్రి  ప్రకాష్ (37) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కల్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రకాష్ మృత్యువాత పడ్డారు. ప్రకాష్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన  ఎర్రిస్వామి సహా ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు.  

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్

  పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆపరేషన్ సిందూర్ తరువాత ఇరు దేశాల మధ్యా నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో పాక్ అభ్యర్థన మేరకు భారత్ సీజ్ ఫైర్ కు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ తరువాత తొలి సారిగా సరిహద్దుల్లో పాకిస్థాన్ ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ సైనికులు భారత సైనిక పోస్టులు లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. దాదాపు పావుగంట సేపు ఈ కాల్పులు జరిగాయి. అయితే భారత సైన్యం దృష్టి మళ్లించి ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం కల్పించడానికే పాక్ సైన్యం కాల్పులకు తెగబడి ఉంటుందని భావిస్తున్న ఇండియన్ ఆర్మీ బోర్డర్ లో హై అలర్ట్ ప్రకటించింది.