కవిత, కేటీఆర్.. రక్షాబంధన్ రోజూ ఎడబాటే!

దేశ మంతా రాఖీ పౌర్ణమిని ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు తన అనుబంధాన్ని చాటుకుంటున్నారు. అయితే కేసీఆర్ కుటుంబంలో మాత్రం రాఖీ పండుగ వెలతెలబోయింది.  ప్రతిఏటా రాఖీ పండుగ సందర్భంగా తమ అనుబంధాన్ని చాటుకుంటూ వస్తున్న కేటీఆర్, కవితలు మాత్రం ఈ ఏడాది ఎడముఖం, పెడముఖంగా దూరంగా ఉండిపోయారు. రాఖీ సందడి కేసీఆర్ కుటుంబంలో ఇసుమంతైనా కనిపించలేదు. బీఆర్ఎస్ లో కేటీఆర్, కవితల మధ్య ఆధిపత్య పోరు కారణంగా గత కొద్ది కాలంగా కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినా రాజకీయం రాజకీయమే, అనుబంధం అనుబంధమే అని భావించిన కవిత రాఖీ కట్టేందుకు వస్తానని కేటీఆర్ కు ఫోన్ చేశారు. అయితే ఆయన మాత్రం తాను బిజీగా ఉన్నాననీ, అసలు హైదరాబాద్ లోనే లేననీ తప్పించుకున్నారు.  ఈ విషయాన్ని కవిత స్వయంగా చెప్పారు. తాను రాఖీ కట్టేందుకు అన్న కేటీఆర్ వద్దకు వెడదామని భావించినా ఆయన హైదరాబాద్ లో లేరనీ, బేంగళూరులో ఉన్నారనీ అందుకే రాఖీ రోజు కూడా అన్నకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు.   అయితే రాఖీ పౌర్ణమి రోజునే కేటీఆర్ బేంగళూరు టూర్ పెట్టుకోవడం.. కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత పోరులో భాగమే అయి ఉంటుందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాజకీయంగా ఎంతగా విభేదించినా.. అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ రోజున వీరు తమ మధ్య విబేదాలను పక్కన పెటతారని అంతా భావించారు. ఏటా జరిగే విధంగానే కవిత స్వయంగా కేటీఆర్ నివాసానికి వెళ్లి రాఖీ కడతారని అనుకున్నారు. అందుకు అనుగుణంగానే కవిత కేటీఆర్ నివాసానికి వెళ్లడానికి సిద్ధపడినా.. కేటీఆర్ మాత్రం అందుబాటులో లేను బేంగళూరులో ఉన్నానంటూ సమాచారం ఇవ్వడంతో కవిత అన్నకు రాఖీ కట్టే అవకాశం లేకుండా పోయింది. గత ఏడాది కూడా కవిత కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయారు. అందుకు కారణం అప్పట్లో ఆమె లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్నారు. బెయిలుపై విడుదలై వచ్చిన తరువాత ఆమె ప్రత్యేకంగా కేటీఆర్ నివాసానికి వెళ్లి అన్నకు రాఖీ కట్టారు. అయితే ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కవితను తప్పించుకోవడానికే కేటీఆర్ బేంగళూరు పర్యటన పెట్టుకున్నారన్న చర్చ బీఆర్ఎస్ వర్గాలలోనే గట్టిగా వినిపిస్తోంది.  

అరకు కాఫీ తాగిన సీఎం చంద్రబాబు

  అల్లూరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పాడేరులోని లగిశపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా సీఎం జీసీసీ ఉత్పత్తులను పరిశీలించి ఆయన గిరిజన డ్వాక్రా మహిళలు తయారు చేసిన అరకు కాఫీని ఆస్వాదించారు. అరకు కాఫీకి మరింత బ్రాండింగ్, మార్కెటింగ్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘‘ఏజెన్సీ ప్రాంతాల్లో స్వచ్ఛమైన, అందమైన కొండలు దర్శనమిస్తాయి. మంచి మనసు ఉండే ప్రజలు ఇక్కడ ఉంటారు. ఆదివాసీలంటే గుర్తొచ్చేది సహజ నైపుణ్యం, సామర్థ్యం. గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై మొదట దృష్టి సారించింది ఎన్టీఆర్‌’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.  ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని... చెప్పినట్లే సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని తెలిపారు. సంపద సృష్టించి పేదలకు పంచాలనేదే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు. గత ఐదేళ్లు వైసీపీ హయాంలో విధ్వంసం జరిగిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను సర్వనాశనం చేయడానికే వైసీపీ పుట్టిందని ఆక్షేపించారు. తాను చెప్పినట్లే పెన్షన్లు పెంచి ఇచ్చానని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని  సీఎం తెలిపారు. గంజాయి సాగు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను ముఖ్యమంత్రి అడిగారు. డ్రోన్ల వినియోగం ద్వారా గంజాయి సాగును నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. గంజాయి సాగు వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకుంటే.. టూరిజం కూడా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. జీరో గంజా కల్టివేషన్, జీరో క్రైమ్ దిశగా పోలీసులు ప్రణాళికాబద్దంగా పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఏజెన్సీ ప్రాంతంలో సెరీకల్చర్ సాగును 10 వేల ఎకరాల్లో చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.  సెరీకల్చర్ ద్వారా వచ్చిన పట్టుదారాలతో నేసిన వస్త్రాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. నిఫ్ట్ వంటి సంస్థలతో కలిసి పని చేయడం ద్వారా ఏజెన్సీలో నేసిన వస్త్రాలకు మంచి డిమాండ్ వచ్చేలా చేయొచ్చని సూచించారు. ఏజెన్సీలో నేసిన వస్త్రాల మార్కెటింగ్ కోసం మంచి భాగస్వాములను అన్వేషించాలని ఆదేశించారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్‌ని సందర్శించి కాఫీ తాగారు. కూకీస్, మిల్లెట్ బిస్కట్లు, స్థానికంగా లభించే ముడిసరుకులనే ఉపయోగించి చాక్లెట్ల తయారీ మీద దృష్టి సారించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు  

చర్చకు సై.. భార్యా బిడ్డల మీద ప్రమాణం చేయాలంటూ సవాల్!

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మాటల యుద్ధం సవాళ్ల పర్వం నడుస్తోంది.  కేటీఆర్  తనపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రంగా  రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ ను ట్విట్టర్ టిల్లుగా అభివర్ణించారు.  చేసిన అన్యాయాలు, పాల్పడిన అక్రమాలను మరిచిపోయి లీగల్ నోటీసుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.  కేటీఆర్ చిల్లర చేష్టలకు  భయపడేది లేదని, ధైర్యం ఉంటే ముఖాముఖి చర్చకు రావాలంటూ సంజయ్ సవాల్ విసిరారు.  తాను తన   భార్య పిల్లలతో వస్తానన్న బండి, కేటీఆర్ కూడా ఆయన తండ్రి, తల్లి, భార్యాపిల్లలతో సహా రావాలని, ఏ గుడి అంటే ఆ గుడి, లేదూ చర్చి, మసీదు ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.  ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదని కేటీఆర్ కుటుంబంపై ప్రమాణం చేయాలనీ, అలాగే తాను తన కుటుంబ సభ్యులతో కేటీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం ఉందని ప్రమాణం చేస్తాననీ, ఈ సవాల్ కు కేటీఆర్ సై అనాలని చాలెంజ్ చేశారు.   కేటీఆర్ స్వంత చెల్లెలు కవిత స్వయంగా ఫోన్ ట్యాపింగ్‌ను అంగీకరించారని బండి సంజయ్ అన్నారు.  ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపథ్యంలో కేటీఆర్, బండి సంజయ్ మద్య రాజకీయ, వ్యక్తిగత విమర్శలు ఎంత దూరం వెడతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంద.  

ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ షాక్.. ఖాతా తెరవాలంటే మినిమం బ్యాలెన్స్ 50 వేలు ఉండాల్సిందే!

ప్రమఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తాజాగా తీసుకున్న నిర్ణయం కొత్త కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆగస్ట్ 1 నుంచి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసే వారు ఇకపై మినిమం బ్యాలెన్స్ రూ.50 వేలు మెయింటెన్ చేయాలని స్పష్టం చేసింది.  తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్‌ మినిమం బ్యాలెన్స్ విషయంలో కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం ముఖ్యంగా మెట్రో, అర్బన్ ఏరియాల్లో సేవింగ్స్ అకౌంట్‌లకు మినిమం బ్యాలెన్స్ రూ.10,000 నుంచి ఏకంగా రూ.50,000కి పెంచేసింది. ఈ కొత్త రూల్ ఆగస్టు 1, 2025 తర్వాత ఓపెన్ అయ్యే అన్ని కొత్త ఖాతాలకూ వర్తిస్తుంది. ఈ విషయం శనివారం బ్యాంక్ విడుదల చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. దీంతోపాటు సెమీ-అర్బన్, రూరల్ ఏరియాల్లో కూడా మినిమం బ్యాలెన్స్ పెంచారు. సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు రూ.5,000 మినిమం బ్యాలెన్స్ ఉంటే, ఇప్పుడు అది పాతిక వేల రూపాయలకు పెరిగింది.   అలాగే గ్రామీణ ప్రాంతాల బ్రాంచ్‌లలో రూ.2,500 నుంచి రూ.10,000కి పెంచారు. అంటే, ఇప్పుడు ఎక్కడైనా సరే, అకౌంట్‌లో ఎక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.

రక్షా బంధన్ రోజున వంగలపూడి అనిత ఏం చేశారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత రక్షా బంధన్ ను వినూత్నంగా జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమి రోజున ఆమె విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు. శనివారం (ఆగస్టు 9) ఉదయం ఆమె తన నివాసం వద్ద విధి నిర్వహణలో ఉన్న గార్డులకు ముందుగా రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు. ఆ తర్వాత  ఎం.వి.పి నుండి ఉషోదయ జంక్షన్ వరకు ర్యాపిడో ద్వారా  ఆటో బుక్ చేసుకుని అందులో  ప్రయాణించిన హోం మంత్రి అనిత ఆ ఆటో డ్రైవర్  గిరీష్ యోగక్షేమాలు అడిగితెలుసుకుని అతడికి కూడా రాఖీ కట్టారు. స్వయంగా రాష్ట్ర హోంమంత్రి తన ఆటోలో ప్రయాణించి తనకు రాఖీ కట్టడంతో గిరీష్ షాక్ కు గురయ్యారు. అనంతరం ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. ఆ తరువాత హోంమంత్రి నేరగా అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి ఆయనకు కూడా రాఖీ కట్టారు. కుటుంబానికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చి అతని కుటుంబ సభ్యులలో ధైర్యం నింపారు.   అనంతరం విశాఖ సెంట్రల్ జైలులో ఖైదీలకు రాఖీలు కట్టారు.   రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆమె సెంటర్ జైలుకు వెళ్లి రిమాండ్ లో ఉన్న పలువురు ఖైదీలను కలిశారు వారి కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఖైదీలకు రాఖీలు కట్టి  శుభాకాంక్షలు తెలిపారు వచ్చే ఏడాది సత్ప్రవర్తనతో జైలు విడిచి కుటుంబ సభ్యులతో రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని ఆశీర్వదించారు.

సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

  రక్షాబంధన్‌ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి మహిళా మంత్రులు రాఖీలు కట్టారు. మంత్రులు సీతక్క, కొండాసురేఖ సహా పలువురు రాఖీ కట్టారు. భారీగా తరలివచ్చిన ఆడపడుచులు ముఖ్యమంత్రికి రాఖీ కట్టేందుకు పోటీ పడ్డారు. అనంతరం మిఠాయి తినిపించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి  నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు గీతా రెడ్డి  రాఖీ కట్టారు.  డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తదితరులకు మంత్రి సీతక్క రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. అటు హీరో బాలయ్యకు ఆయన సోదరి ఎంపీ పురందశ్వరి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు.మంత్రి సీతక్క నా అనుబంధం… అక్షరాలతో రచించలేనిది…మాటలతో నిర్వచించలేనిది…ప్రతి రాఖీ పౌర్ణమి నాడు…ఆ బంధం మరింతగా వికసిస్తునే ఉంటుంది అని సీఎం రేవంత్‌ ఎక్స్ వేదికగా తెలిపారు.

ఏపీలో పాలన భేష్.. జస్టిస్ ఇండియా ర్యాంకింగ్ లో ఏపీ @2

జగన్  హయాంలో   అరాచక, ప్రతీకార, దౌర్జన్య, దుర్మార్గ పాలన సాగిందన్న ఆరోపణలు వాస్తవమేనని తాజాగా ఇండియా జస్టిస్ రిపోర్ట్ తేల్చేసింది. జగన్ హయాంలో పోలీసు శాఖను ప్రైవేటు సైన్యంగా మార్చుకుని ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను లక్ష్యం వేధింపులకు పాల్పడిన ఘటనలపై అప్పట్లోనే తెలుగుదేశం, జనసేనలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. వాటిని కూడా పాశవికంగా అణచివేశారు అది వేరే సంగతి. అయితే జగన్ హయాంలో ప్రతీకార చర్యలు, ప్రత్యర్థులపై దాడులు, వేధింపులే పాలనగా సాగిందన్న ఆరోపణలు, విమర్శలూ వాస్తవమేనని ఇండియా జస్టిస్ తాజా నివేదిక తేటతెల్లం చేసింది.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి, నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పోలీసులు వ్యవహార తీరులో మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. పాలనలో చట్టబద్ధత, జవాబుదారీ తనం పెరిగాయి. ఇదే విషయాన్ని ఇండియా జస్టిస్ తాజా నివేదికలో పేర్కొంది.   శాంతి భద్రతల పరిస్థితి విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పోలీసింగ్, న్యాయవ్యవస్థ పనితీరు, చట్టబద్ధ పాలన, సామాజిక పరిస్థితులు.. ఇలా అనేక అంశాలను పరిగణనలోనికి తీసుకుని ఇండియా జస్టిస్ సంస్థ రాష్ట్రాలకు ర్యాంకింగ్ కు కేటాయిస్తుంది.  2019, 2024 మధ్య కాలంలో ఇండియా జస్టిస్ ర్యాంకింగ్ లలో ఆంధ్రప్రదేశ్ దిగువ నుంచి తొలి స్థానానికి పోటీ పడుతూ ఉండేది. అటువంటిది రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యిందో లేదో.. ఏపీ ర్యాంకింగ్ ఒక్కసారిగా ఎగబాకి దేశంలోనే రెండో స్థానానికి చేరుకుంది. ఈ  జస్టిస్ ఇండియా ర్యాంకింగ్స్ లో కర్నాటక తొలి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.  

జగన్, అవినాష్ ఆధ్వర్యంలోనే వివేకా హత్య!

ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు ఆరేళ్లుగా సా..గుతూనే ఉన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇన్నేళ్లుగా రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగానే ఉంది. ఈ కేసు విషయంలో సీబీఐ తీరు కూడా పదేపదే ప్రశ్నార్థకంగానే ఉంటూ వస్తున్నది. తాజాగా సుప్రీం కోర్టులో ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యిందంటూ నివేదిక సమర్పించడంపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం ఆదేశిస్తే అదనపు దర్యాప్తు చేస్తామనడంపైనా అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఈ కేసులో నిందితులకు ముందస్తు బెయిలు మంజూరు కావడానికి, అలాగే మంజూరైన బెయిలు రద్దు కాకుండా ఉండేందుకే సీబీఐ దర్యాప్తు పూర్తయ్యిందని చెబుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.  వివేకా జయంతి సందర్భంగా పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లిన ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ..  గతంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తాను నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.  వైఎస్ వివేకాతో తనకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. హత్య అన్న ఆలోచనే ఎన్నడూ చేయలేదన్నారు.  వివేకా హత్య జరిగిన రోజున మీడియాను అనుమతించకుండా అడ్డుకున్నారనీ, గొడ్డలిపోటు అని  స్పష్టంగా కనిపిస్తున్నా గుండెపోటు అంటూ ప్రకటనలు గుప్పించడంతోనే వివేకా హత్య కుట్రపూరితంగా జరిగిందని స్పష్టమౌతోందని ఆదినారాయణ రెడ్డి అన్నారు.  కాగా కోడి కత్తి ఘటన,  గులకరాయి దాడి సంఘటనా కూడా నాటకాలేనని అన్నారు. జగన్ కంటి దగ్గర గులక రాయి తగలడం కూడా మరో నాట కం అని విమర్శించారు. వివేకా హత్య సమయంలో తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని తాను మొదటి నుంచీ చెబుతున్నాన్న ఆదినారాయణ రెడ్డి... వివేకా కూతురు సునీతా రెడ్డి ఇప్పుడు వాస్తవాలు తెలుసు కున్నారన్నారు.  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి సునీత వస్తే తనకు అభ్యంతరం లేదని ఆదినారాయణ రెడ్డి అన్నారు. 

కోమటిరెడ్డిపై సస్పెన్షన్ వేటు?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న  మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి  పై కాంగ్రెస్ పార్టీ వేటు వేస్తుందా? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా? అంటే.. అవును,కాదు అంటూ రెండు వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా    ఆదివారం (ఆగష్టు 10)  క్రమశిక్షణ కమిటీ చైర్మన్  మల్లు రవి అధ్యక్షతన సమావేశమవుతున్న పీసీసి క్రమశిక్షణ కమిటీ ఇతర అంశాలతో పాటుగా.. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించిన అంశాన్ని చర్చించనున్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశం ప్రాధాన్యత  సంతరించుకుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.  కాగా.. మంత్రి పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి  గత కొద్ది రోజులుగా బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా  విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవంక..  ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుమారం సృష్టిస్తున్నాయి.   ఈ నేపథ్యంలోనే  కోమటి రెడ్డి వ్యాఖ్యలు, విమర్శలను సీరియస్  గా తీసుకున్న క్రమశిక్షణ కమిటీ  చైర్మన్ మల్లు రవి  ఆదివారం (ఆగస్టు 10) ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఎమ్మెల్యే  కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డికి సమన్లు పంపినట్లు తెలుస్తోంది. నిజానికి  కమిటీ చైర్మన్ మల్లు రవి రెండు రోజుల క్రితం ఢిల్లీ నుంచే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డితో  ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శల వల్ల  ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలుగుతోందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోందని స్పష్టం  చేసినట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా తనకు మంత్రి పదవి ఇస్తామని ఒకటికి రెండు సార్లు ప్రామిస్  చేసి, ఇప్పడు  కులం, కుటంబం, జిల్లా లెక్కలు చూపించి తనకు మొండి చేయి చుపించడం పట్ల కోమటి రెడ్డి  రాజగోపాల్ రెడ్డి  తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.   బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేర్చుకునే సమయంలో..  ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల సమయంలో, భువనగిరి బాధ్యతలు అప్పగించిన సమయంలో మరోమారు తనకు మంత్రి పదవి హామీ ఇచ్చే సమయంలో  అడ్డు రాని  కులం, కుటుంబం, జిల్లా లెక్కలు ఇప్పడు ఎలా ఆడ్డు వస్తున్నాయని కోమటి రెడ్డి ప్రశ్నిస్తున్నారు.  కాదు కాదు గట్టిగా నిలదీస్తున్నారు.  అంతే కాకుండా..  తమ అసంతృప్తిని వ్యక్తం చేసే క్రమంలో కోమటి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ చేసిన వ్యాఖ్యల మొదలు, సోషల్ మీడియా వ్యవహార శైలికి సంబంధించి చేసిన హెచ్చరికల వరకు అనేక విషయాల్లో బహిరంగంగా ముఖ్యమంరి  చేసిన విమర్శలను  పార్టీ  ముఖ్య  నాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. విమర్శించడమే కాకుండా.. ఒక విధంగా తిరుగుబాటు ధోరణి అవలంబిస్తున్న తీరు పట్ల పార్టీ  ముఖ్య  నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 10) భేటిలో ఏమి జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇప్పటి కిప్పుడు కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేదనీ, రేపటి సమావేశంలో సర్ది చెప్పే ప్రయత్నమే జరుగుతుందని అంటున్నారు.అందుకే..  క్రమశిక్షణ కమిటీ చైర్మన్  మల్లు రవి స్వయంగా  రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి వివరాలు తీసుకుంటామని..  ఆ తర్వాతనే  ఏం చేయాలనే దానిపై నిర్ణయం ఉటుందని చెప్పినట్లు  తెలుస్తోంది. మరో వంక రాజగోపాల రెడ్డికి కూడా తెగే వరకు లాగే ఆలోచన లేదని అంటున్నారు.

ముంతాజ్ కు మంగళం!

తిరుపతి సమీపంలో వివాదాస్పద ముంతాజ్ హోటల్ ప్రాజెక్టుకు గత జగన్ ప్రభుత్వం చేసిన భూ కేటాయింపును తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.  ముంతాజ్ హోటల్ కు స్థల కేటాయింపుపై సాధు సంతులు సహా , హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే.  ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో తిరుమల విషయంలో  వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు.  అందుకే అప్పట్లో అంటే  అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో  జగన్ ను తన ప్రియశిష్యుడిగా పేర్కొన్న శారదాపీఠం అధిపతి స్వరూపానంద సర్వస్వతి కూడా ఒక సమయంలో జగన్ హిందూ ధర్మాన్ని, హైందవ సంప్రదాయాన్ని మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీనిని బట్టే సీఎంగా అధికారంలో ఉండగా ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేదో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. జగన్ రెడ్డి హయాంలో  హిందువుల మనోభావాలను పనిగట్టుకుని దెబ్బ తీసేవారనడానికి బోలెడు ఉదాహరణకు కనిపిస్తాయి.  ఏపీలో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత    దేవాలయాల మీద జరిగిన దాడులకు, అన్యాక్రాంతమైన దేవుని ఆస్తులకు లేక్కే లేదని చెప్పవచ్చు. ఆఖరికి తిరుమలలో కూడా అన్యమత ప్రచారం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులకు కొలువులు కట్టబెట్టారు.   ఆగమ శాస్త్రం, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి జగన్ హయాంలో టీటీడీ  ఇష్టారాజ్యంగా తీసుకున్న పలు నిర్ణయాలు భక్తులను ఆవేదనకు గురిచేశాయి.  ఏడుకొందలపై   డ్రోన్లు సంచరించడం మొదలు,   టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పించడం వరకూ జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అరాచకాలకు లెక్కే లేదు.  ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ జగన్ హయాంలో  ఆ హిందూ ధర్మ వ్యతిరేక చర్యలకు నిలయంగా మారిందన్న ఆరోపణలు  వెల్లువెత్తాయి.     తిరుమల లడ్డూ ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దొరికినంత దోచుకో  పద్దతిలో  జగన్ హయాంలో టీటీడీ తీరు ఉండేదన్న ఆరోపణలు ఉన్నాయి.   అంతే కాదు భక్తులకు   సదుపాయాల విషయాన్ని   అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా విస్మరించింది.  స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి  దప్పికలు తీర్చేందుకు   సమయానుకూలంగా జరిగే ప్రసాద వితరణను నిలిపేసింది.  క్యూ కాంప్లెక్స్ లో పారిశుధ్యం  లేకుండా పోయింది.   అంతేనా నిత్యం గోవిందనామస్మరణ తప్ప మరో పేరు వినిపించడమే మహాపరాథంగా భక్తులు భావించే తిరుమల కొండపై ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం ఇచ్చాయి.  ఇంతగా తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించిన జగన్.. కొండ కింద కూడా తన హిందూ వ్యతిరేకతను ప్రస్ఫుటంగా చాటుకున్నారు.    2016లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అలిపిరి మార్గంలో ఆధ్యాత్మిక‌, సంస్కృతిక‌ కార్యక్రమాలకు వేదికగా దేవలోకం ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయించారు. 38 ఎకరాలలో 750 కోట్ల‌ రూపాయలతో ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం అప్పుడే పాతిక ఎకరాలు కేటాయించారు. ఆ తరువాత 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు మూలనపడింది. అయితే ఈ ప్రాజెక్టు కోసం   కేటాయించిన పాతిక ఎకరాలలో ఓ ఇరవై ఎకరాలను జగన్ ముంతాజ్ హోటల్స్  నామమాత్రపు ధరకు కట్టబెట్టేశారు.   90 ఏళ్ల పాటు ఏడాదికి రెండు లక్షల రూపాయల చొప్పున  లీజుకు జగన్ ఈ స్థలాన్ని అప్పగించేశారు. ఇప్పుడక్కడ పునాదులు లేచాయి.   తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి తొలి సమావేశంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  టీటీడీ కొత్త పాలక మండలి సమావేశం ఈ కేటాయింపును రద్దు చేయాలని తీర్మానించి.. ఆ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది.  దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముంతాజ్ హోటల్ స్థల కేటాయింపును రద్దు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా పర్యాటక శాఖ అధికారికంగా ముంతాజ్ హోటల్ కు జగన్ హయాంలో జరిపిన స్థల కేటాయింపును రద్దు చేసినట్లు ప్రకటించింది.  

కమలం గూటికి గువ్వల బాలరాజు.. సీనియర్ల సమక్షంలో పార్టీ కండువా!

 మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు  బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మూడు రోజుల వ్యవధిలోనే కమలం కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే అయిన గువ్వల బాలరాజు.. బీఆర్ఎస్ లో అధికారంలో ఉన్నంత కాలం పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు అత్యంత సన్ని హితుడిగా గుర్తింపు పొందారు.  అయితే పార్టీ పరాజయం తరువాత నుంచీ ఆయన పార్టీ నాయకత్వం తీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదనీ, అచ్చంపేట నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగా పార్టీ అధినాయకత్వం తన ప్రాధాన్యతను తగ్గించేస్తున్నదనీ ఆయన ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా గువ్వల బాలరాజు పార్టీ వ్యవహారాలలో, కార్యక్రమాలలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల కిందట పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం శుక్రవారం (ఆగస్టు 8) మీడియా సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనను స్వార్థపరుడిగా అభివర్ణించారు. అంతే కాకుండా శుక్రవారం నాడే ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తాను కమలం కండువా కప్పుకోవడం, తన రాజకీయ భవిష్యత్ తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే తన అనుచరులతో పలుమార్లు చర్చించి, నియోజకకవర్గ  ప్రజల అభిప్రాయాలనూ పరిగణనలోనికి తీసుకుని కమలం గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు గువ్వల బాలరాజు చెప్పారు. బీజేసీ సీనియర్ నాయకుల సమక్షంలో  శనివారం (ఆగస్టు 9)  కమలం గూటికి చేరనున్నట్లు తెలిపారు. కాగా గువ్వల బాలరాజు చేరికతో నాగర్ కర్నూల్ జిల్లాలో బీజేపీ ఒకింత బలపడే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  

శ్రావణ శుక్రవారం రోజు చంద్రబాబుతో వరలక్ష్మి భేటీ

చంద్రబాబుపై అభిమానంతో.. ఆయన సీఎం కావాలన్న బలమైన ఆకాంక్షతో 108 దేవాలయాలలో సంగీత కచ్చేరీలు చేసిన వరలక్ష్మి శుక్రవారం (ఆగస్టు 8) ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. ఈ  సందర్భంగా ఆమె చంద్రబాబు సీఎం అయితే 108 దేవాలయాల్లో సంకీర్తనా గానం చేస్తానని మొక్కుకున్న సంగతినీ, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ మొక్కుతీర్చుకున్న విధానాన్ని వివరించారు.  మంగళగిరిలో జన్మించిన వరలక్ష్మి ముంబైలో స్థిరపడినా.. జన్మభూమి పట్ల మమకారాన్ని వదులు కోని వరలక్ష్మి.. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతమై.. అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం అయ్యి తీరాలని భావించారు. స్వతహాగా గాయని అయిన వరలక్ష్మి చంద్రబాబు సీఎం అయితే.. 108 దేవాలయాల్లో సంగీత కచ్చేరీలు చేస్తానని మొక్కుకున్నారు. చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె ఆ మొక్కుతీర్చుకున్నారు.   ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలోని వివిధ ప్రసిద్ధ దేవాలయాలలో ఆమె సంగీత కచ్చేరీలు చేసి ఆ మొక్కును తీర్చుకున్నారు. అన్నవరం సత్యన్నారాయణ స్వామి దేవాలయంలో తొలి కచ్చేరీ చేసిన ఆమె.. తన 108వ కచ్చేరీని బెజవాడ దుర్గమ్మ ఆలయంలో చేశారు.  చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఆమె తన కచ్చేరీలకు సంబంధించిన వివరాలను రాసుకున్న పుస్తకాన్ని చంద్రబాబుకు చూపారు. దానిని పరిశీలించిన ఆయన ఆ పుస్తకంపై సంతకం చేశారు. తన పట్ల వరలక్ష్మి చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం కోసం, తన కోసం దేవుళ్లను ప్రార్ధించడం వల్లే ప్రజల అభిమానానికి, కార్యకర్తల కష్టానికి దైవ కృప తోడైందని చంద్రబాబు అన్నారు. వరలక్ష్మీ లాంటి అభిమానులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తానని అన్నారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష  దైవం కొలువై ఉన్నతిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. నిత్యం వేలాది మంది తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం తరలి వస్తుంటారు. అటువంటి తిరుమల క్షేత్రంలో శనివారం (ఆగస్టు 9)  శ్రీనివాసుడి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 26 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (ఆగస్టు 8) శ్రీవారిని మొత్తం  70 వేల 480 మంది దర్శించుకున్నారు. వారిలో  28 వేల 923 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం  3 కోట్ల 17 లక్షల రూపాయలు వచ్చింది. 

వ్యాపారాల పేరుతో కోట్ల రూపాయలలో మోసాలు...వైసీపీ నేతపై పీడీ యాక్ట్

  వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డారు. ఇందులో వీరి పై సుమారు 36 కేసులు నమోదు అయినాయి. ఇప్పటికే వీరు పాల్పడ్డ మోసాలపై బాధితులు ఒక్కొక్కరు వచ్చి ఫిర్యాదులు చేస్తుండంతో వీరి మోసాలు బయటపడ్డాయి. కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడడమే కాక ఆర్థిక నేరాలకు పాల్పడడం జరిగింది. దీనితో దాల్ మిల్ సూరి పై కలెక్టర్  ఉత్తర్వులు మేరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేసామని జిల్లా  ఎస్పీ తెలియజేసారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ విజయ కుమార్ తో కలిసి ఈ కేసు వివరాలను ఎస్పీ విలేకర్ల సమావేశంలో తెలియజేసారు.  కొత్తచెరువుకు చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దాల్ మిల్ సూరిపై పీడీ యాక్ట్‌ నమోదు తెలిపారు. జిల్లాలో వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డ దాల్ మిల్ సూరిపై 36 కేసులు నమోదయ్యాయి. కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిందని.. సూరిపై కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశామని వెల్లడించారు.

పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. SCO సదస్సుకు ఆహ్వానం

  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌కు  భారత్‌ ప్రధాన నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్బంగా రష్యా- ఉక్రెయిన్ యుద్దానికి సంబంధంచిన తాజా పరిమాణాలను పుతిన్ ప్రధానికి వివరించారు. అయితే, ఈ సంక్షోభానికి శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని భారత్ తన స్థిరమైన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది. వివాద పరిష్కారానికి హింస మార్గం కాదని భారత్ మొదటి నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. భారత్-రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో, ఈ ఏడాది చివర్లో జరగనున్న 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు రావాల్సిందిగా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ కోరారు. ఈ సానుకూల వాతావరణంలోనే ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. 2019 తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనకు ముందు ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవలే చైనాలో పర్యటించారు.  ముఖ్యంగా ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని విడనాడాలని, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అజిత్ దోవల్ ఎస్సీఓ భద్రతా సలహాదారుల సమావేశంలో గట్టిగా చెప్పారు. కాగా భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్ సహా మొత్తం పది దేశాలు సభ్యులుగా ఉన్న షాంఘై సహకార సంస్థను 2001లో స్థాపించారు. ఈ ఏడాది టియాంజిన్‌లో జరిగే సదస్సు SCO చరిత్రలోనే అతిపెద్ద సదస్సుగా నిలవనుందని చైనా వెల్లడించింది. సుమారు 20 దేశాల అధినేతలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

బండి సంజయ్‌కి కేటీఆర్ సవాల్.. ఆరోపణలు నిరూపించు

  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బీఆ‌ర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అయినప్పటికీ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆయనకు కనీస పరిజ్ఞానం లేదని అని విమర్శించారు. బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు హద్దు మీరాయని కేటీఆర్‌ అన్నారు. చిల్లర, బజారు మాటలు మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. తనకు రాజకీయ ప్రాధాన్యత దక్కకపోవడంతో వార్తల్లో నిలవాలని తనకు అలవాటైన చౌకబారు నాటకాలకు తెరదీశారని మండిపడ్డారు.  ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. 48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కోర్టుకు లాగాల్సి ఉంటుందని హెచ్చరించారు.నువ్వు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. .కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా పని చేస్తున్నప్పటికీ.. ఆయనకు ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోవడం విచారకరమని అన్నారు.  హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ వద్ద సిట్ విచారణ అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేశారని దీనికి కారణమైన  ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు, రాధాకిషన్‌రావును ఉరి తీయాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. సిట్ అధికారులు చూపించిన ఆధారాలు చూసి షాక్ అయ్యానని వెల్లడించారు. ఫోన్ ట్యాప్ జరుగుతుందని మొదటి సారి నేనే గుర్తించాని బండి సంజయ్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ ఉన్నారని ఆయన ఆరోపించారు. తన సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో భార్యభర్తలు ఫోన్లును కూడా విన్నారని తెలిపారు. వావి వరుసలు లేకుండా సొంత కూతురు ఎమ్మెల్సీ కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. 6 వేల 500 మంది ఫోన్ ట్యాప్‌కు గురియ్యాని చెప్పారు. ఆ జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లూ సైతం ఉన్నాయన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గతంలోనే తాను చెప్పానని గుర్తు చేశారు. 

ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు : బీజేపీ స్టేట్ చీఫ్

  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు బాంబు పేల్చారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉనన్నారంటూ బీజేపీ స్టేట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరు, వారు పార్టీలో చేరే తేదీలను కూడా త్వరలో వెల్లడిస్తామన్నారు. దీంతో రాంచందర్రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వీళ్లే కాకుండా మరింత మంది బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు.  మరోవైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈనెల 10న కమలం గూటికి చేరనున్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. కేసులు, సిట్‌లు, కమిషన్లు, విచారణలు, దర్యాప్తులు అంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనికితోడు బీజేపీ కూడా అటు బీఆర్ఎస్‌పై.. ఇటు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంది. ఫోన్ ట్యాపింగ్‌ కేసుపైనా రాంచందర్ రావు స్పందించారు. ఈ కేసును సిట్ కాకుండా సీబీఐకి అప్పగిస్తేనే వాస్తవాలు బయటికి వస్తుందని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల్లో ఓడిపోతామనే భయంతోనే..రేవంత్ రెడ్డి ఎన్నికలు నిర్వహించడం లేదని టీ బీజేపీ చీఫ్ ఆరోపించారు.  

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్.. నువ్వెంత నీ బ్రతుకెంత?

  బీఆర్‌ఎస్ నేత దుబ్బాక ఎమ్మెల్యే  కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి మండిపడ్డారు.  శుక్రవారం నాంపల్లిలోని గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కమీషన్లలో వాటా ఇవ్వలేదని జగ్గారెడ్డి కార్యకర్తల మీటింగ్ ఏడ్చారని కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై  జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రభాకర్ రెడ్డి.. నీవ్వుంతా నీ బతుకెంతా?, వ్యక్తిత్వంలో నాతో సరిపోడు. నీ మాదిరిగా నేను ప్యాకేజీ ఇచ్చి బీ ఫామ్ తెచ్చుకోలేదు. బీఆర్ఎస్ 40 దొంగల్లో ప్రభాకర్ కూడా ఓ దొంగ'. అని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో ఎవర్ని అడిగినా నా క్యారెక్టర్ గురించి చెబుతారన్నారు. నా క్యారెక్టర్‌కి, ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్‌కి చాలా తేడా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఉన్నంత ఆస్తి నా వద్ద ఉంటే ప్రజలకి ఎప్పుడో పంచేసే వాడినని తెలిపారు. పంచే గుణం మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తి అని చెప్పారు. భవిష్యత్తులో నేను రూ. వేల కోట్లు సంపాదించినా వాటిని ప్రజలకే పంచుతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నా ఆస్తి నా పిల్లల కోసం కాదని.. ప్రజల కోసమని తెలిపారు. రూ. 1000 కోట్లు కొన్ని గంటల్లోనే పంచేస్తానన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఎలా పంచాలో కూడా తెలియదని ఆక్షేపించారు.  నేను ఎలాంటి వాడినో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుని అడిగి తెలుసుకోవాలంటూ ప్రభాకర్ రెడ్డికి సూచించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి.. నీవు మగాడవయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డిది నా స్థాయి కాదన్నారు. కొన్ని విషయాల్లో ఎమోషనల్ కావ్వడం నా బలహీనత అని తెలిపారు. ప్రజల సమస్య వింటే వాళ్ళ కంటే ముందు నాకే ఏడుపు వస్తుందన్నారు. నా చుట్టూ పేదలు ఉంటారని.. నా వద్దకు క్యాన్సర్ పేషెంట్లు సైతం వస్తారని చెప్పారు. నేమైనా ప్యాకేజీల లీడర్‌ నా అంటూ బీఆర్ఎస్ నేతలను ఈ సందర్భంగా జగ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు.