31 నుంచి మోడీ రెండు రోజుల చైనా పర్యటన
posted on Aug 7, 2025 @ 10:15AM
ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటన ఖరారైంది. ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 1 వరకూ ప్రధాని మోడీ చైనాలో పర్యటిస్తారు. షాంగై సహకార సదస్సులో మోడీ పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత నేపథ్యంలో మోదీడీ చైనా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సదస్సుకు హాజరు కావాలంటూ చైనా నుంచి అందిన ఆహ్వానం మేరకు మోడీ ఈ దేశ పర్యటనకు వెడుతున్నారు. 2019లో గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆ తర్వాత కూడా పలు సార్లు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడగా భారత్ దీటుగా సమాధానమిచ్చింది. ఆ ఘటన తరువాత మోడీ చైనా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.
ఇప్పుడు ట్రంప్ టారీఫ్ టెర్రర్ నేపథ్యంలో భారత్ చైనాలు సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే మోడీ చైనా పర్యటనకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు సంబంధించి కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.