ట్రంప్ టారిఫ్ టెర్రర్.. వినాశకాలే విపరీత బుద్ధి!
posted on Aug 7, 2025 @ 9:32AM
ఎవరికైనా పోయేకాలం వస్తే బుద్ధి పెడదారి పడుతుంది. అందుకే మన పెద్దలు పెద్దలు వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. అయితే.. అమెరికా ఆధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాణక్యుడు చెప్పిన ఈ నీతి వాక్యం విని ఉండక పోవచ్చును. అందుకే.. అసలే ట్రంప్ ఆపైన,పోయే కాలం తరుముకోస్తోంది అన్నట్లుగా.. తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. ఇది.. ఎవరో అమెరికా ఆగర్భ శతృవులో ట్రంప్ ను వ్యక్తిగతంగా వ్యతిరేకించే వారో చేస్తున్న వ్యాఖ్యలో విమర్శలో కాదు.
నిజానికి.. భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై ఇంటా, బయటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రష్యా నుంచి వాణిజ్యం కొనసాగిస్తున్న ఐరోపా దేశాల పట్ల ప్రేమ కనబరుస్తున్న ట్రంప్.. భారత్ విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారని.. అనేక మంది అమెరికన్లు విమర్శిస్తున్నారు. సొంత పార్టీ నేతలు సైతం నిరసన గళం వినిపిస్తున్నారు. భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలు దెబ్బతీసుకోకూడదని భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ హితవు పలికారు. అయితే.. ట్రంప్ కు మంచి మాటలు రుచించడం లేదు. అందుకే ట్రంప్ విరీత పోకడలు పోతున్నారు. బారత దేశాన్ని సుంకాలతో దెబ్బ తీయాలని, అలా దెబ్బతీసి తన దారికి తెచ్చుకోవాలని తహతహలాడుతున్నారు. తప్పటడుగులు వేస్తున్నారు.
అందులో భాగంగానే.. ట్రంప్ భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ పై ఇప్పటికే ఉన్న పాతిక శాతం సుంకాలతో పాటు, ఇప్పుడు అదనంగా మరో 25 శాతం విధించడంతో మొత్తం టారీఫ్ 50 శాతానికి చేరుకుంది. ఈ మేరకు ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.అయితే.. ట్రంప్ విపరీత ప్రకటనలపై ప్రధాని మోదీ ప్రభుత్వంతో పాటుగా, పారిశ్రామిక వర్గాలు అదే స్థాయిలో స్పందించాయి.
భారత విదేశాంగ శాఖ అమెరికా నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇది అన్యాయం, అసమర్థనీయం, అసమంజసమైన చర్యగా అభివర్ణించింది. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్ ను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. మా దిగుమతులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. 1.4 బిలియన్ల భారతీయుల ఇంధన భద్రతను కాపాడే లక్ష్యంతో జరుగుతాయి. అనేక దేశాలు తమ జాతీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అమెరికా భారతదేశంపై అదనపు సుంకాలు విధించడం దురదృష్టకరం. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది అని విదేశాంగ శాఖ పేర్కొంది.
మరోవంక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరో 25 శాతం మేర సుంకాలు విధించడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా.. భారత్ ఎవరికీ తలవంచదని పేర్కొంటూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. మీరు మా ఎగుమతులపై సుంకాలు విధించవచ్చేమో గానీ.. మా సార్వభౌమాధికారంపై కాదు. మీ ఆదేశాల ఒత్తిడి కంటే ఇంధన భద్రతే ముఖ్యం. డిస్కౌంట్లనే మేం ఎంచుకుంటాం.మీరు సుంకాలు పెంచండి.. మేం మా సంకల్పాన్ని పెంచుకుంటాం. మెరుగైన ప్రత్యామ్నాయాలు కనుగొని స్వావలంబనను సాధిస్తాం. అని పేర్కొన్నారు.
మరోవంక భారత్‌పై అదనంగా పాతికశాతం సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం స్వీయ విధ్వంసకరమని ఆర్థికరంగ నిపుణుడు శరద్ కోహ్లీ అన్నారు. దాని వల్ల జరిగే పరిణామాలేంటో ట్రంప్‌నకు తెలియదన్నారు. బలమైన మిత్రదేశంతో ఆయన శత్రుత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారత్, అమెరికా సహజ మిత్రులు. అమెరికా ప్రజలు తమ సాంకేతిక పరిజ్ఞానం విషయంలో, వైద్యరంగానికి సంబంధించినంతవరకు భారత్‌పైనే ఆధారపడతారనే వాస్తవాన్ని ట్రంప్ మరిచిపోతున్నట్లున్నారని భావిస్తున్నా. ట్రంప్ మిగతా ప్రపంచం నుంచి తనను తాను దూరం చేసుకుంటున్నారు’’ అని విశ్లేషించారు.