తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. వారాంతాలలో అయితే తిరుమల కొండ భక్త జన సముద్రాన్ని తలపిస్తుంటుంది. శుక్రవారం ( ఆగస్టు 8) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.  ఇక గురువారం (ఆగస్టు 7) శ్రీవారిని మొత్తం 65 వేల 234 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 133 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 80 లక్షల రూపాయలు వచ్చింది.  

హైదరాబాద్‌లో రికార్డు స్ధాయి వర్షం..జనజీవనం అస్తవ్యస్తం

  హైదరాబాద్‌ సిటీలో కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం 6.30 నుంచి 7.30 మధ్యలో గంట పాటు నాన్ స్టాప్గా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టుప్రాంతాల్లో వరదనీళ్లు పొంగిపొర్లుతున్నాయి. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు నరకం చూశారు. గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్‌, ఏఎంబీ, ఇనార్బిల్‌ మాల్, రాయదుర్గం, హైటెక్‌ సిటీలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనాలు ముందుకు కదలడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. మియాపూర్‌, హిమాయత్‌నగర్‌, లక్డీకపూల్‌, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌ ఏరియాల్లో వాహనదారులు ట్రాఫిక్ కారణంగా నానా తిప్పలు పడ్డారు.  జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, షేక్ పేట్ ఏరియాల్లో వాన దంచి కొట్టింది. బంజారాహిల్స్ లో భారీ వర్షం కురవడంతో దేవరకొండబస్తీ లో సంతలో కూరగాయలు, వాహనాలు కొట్టుకుపోయాయి. మాదాపూర్లోని శిల్పారామం ఎదురుగా కొండాపూర్, హైటెక్స్, కొత్తగూడ నుంచి కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వెహికల్స్ కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. సైబర్టవర్స్ నుంచి నీరూస్ జంక్షన్ వరకు నీళ్లు నిలిచిపోవడంతో ఈ రూట్లో వెళ్లే వెహికల్స్కు రోడ్డు బ్లాక్ అయింది. ఇనార్బిట్ మాల్నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వెహికల్స్‌తో ట్రాఫిక్ జామ్ అయింది. ఐకియా, ఏఐజీ నుంచి వచ్చే వెహికల్స్, గచ్చిబౌలి నుంచి కొండాపూర్, కొత్తగూడ, హఫీజ్ పేట్ వైపు వెళ్లే వాటితో ఆ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది.  బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర అయితే ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం‌.. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, పోలీసు, ట్రాఫిక్, జలమండలి (హైడ్రా) అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఇళ్లలోకి నీళ్లు రావడం, ట్రాఫిక్ అంతరాయం, విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్‌లోని ఈ ఫోన్ నెంబర్ 040 2302813 / 7416687878 కి కాల్ చేయాలన్న ప్రజలకు జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు. అలాగే అధికారులందరూ అందుబాటులో ఉంటూ.. హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే రెవిన్యూ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వర్షాలు, వరదల వల్ల ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే, వాటిని ఎదుర్కొనేందుకు అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆయన గట్టిగా సూచించారు. గచ్చిబౌలిలోని ఖాజాగూడ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద అత్యధిక వర్షపాతం నమోదైంది. 123.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ తెలిపింది. ఆ తర్వాత శ్రీనగర్‌ కాలనీలో 111.3 మి.మీ, ఖైరతాబాద్‌లోని సెస్‌ వద్ద 108.5 మి.మీ, యూసఫ్‌గూడ జోనల్‌ కమిషనర్‌ కార్యాలయం సమీపంలో 104.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

  ఏపీలో  ట్రైబల్ శాఖలో  ఓ ఉన్నత స్థాయి అధికారి అవినీతి బాగోతం బయటపడింది. ఆ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) అబ్బవరపు శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విజయవాడలో అరెస్ట్ చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 25 లక్షల లంచం తీసుకుంటుండగా ఆయను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం సృష్టించింది. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 25 లక్షల లంచం తీసుకుంటుండగా ఆయన రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన నిర్మాణ పనుల బిల్లులను మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ కృష్ణంరాజు నుంచి ఈఎన్‌సీ శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపు కోసం మొత్తం రూ. 50 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గుత్తేదారు ఇప్పటికే రూ. 25 లక్షలు చెల్లించారు.అయితే, మిగిలిన రూ. 25 లక్షల కోసం శ్రీనివాస్ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో, వేధింపులు తట్టుకోలేక కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం గురువారం నాడు శ్రీనివాస్ రూ. 25 లక్షల నగదును స్వీకరిస్తున్న సమయంలో అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.  

బీసీ రిజర్వేషన్లు విషయంలో అన్ని ప్రయత్నాలు చేశాము : సీఎం రేవంత్

  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు క్షేత్రస్థాయిలో మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం జాతీయ స్థాయిలో పోరాడాలనే ఉద్దేశంతోనే ఢిల్లీకి వచ్చామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  అపాయింట్‌మెంట్‌ రాకుండా ప్రధాన మంత్రి మోదీ, హొం శాఖ మంత్రి అమిత్‌షా అడ్డుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు.  రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ దక్కకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉందని విమర్శించారు. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి ధర్నాలో బీఆర్‌ఎస్‌ ఎందుకు పాల్గొనలేదని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ధర్నాలో పాల్గొనకపోగా అవహేళన చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  బీజేపీ, బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఇందుకోసం హైదరాబాద్ లో పీఏసీ సమావేశం ఏర్పాటు చేసి కీలక సమావేశం నిర్వహిస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది మా విధానం అని పార్టీ పరంగా ఇవ్వాలా, మరేదైనా ఉపాయం ఉందేమో పీఏసీలో చర్చిస్తామన్నారు.  హైకమాండ్ అభిప్రాయంతో కోర్టులో వాదన వినిపిస్తామన్నారు. బిల్లులు, ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదించకుంటే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై పీఏసీ సమావేశంలో చర్చిస్తామన్నారు. నిన్నటి ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గే రాలేదన్న వాదన అర్థరహితం అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అనుమానాలు ఉంటే అధికారిక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయనకు అవగాహన కల్పిస్తామన్నారు. అన్ని కులాల వివరాలు సేకరించి కులగణన చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు  

హైదరాబాద్‌‌కు క్లౌడ్ బరస్ట్ ముప్పు..ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

  హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరాన్నికి క్లౌడ్ బరస్ట్ ముప్పు పొంచి ఉందని  వాతవరణ నిపుణులు చెబుతున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మియాపూర్‌, హిమాయత్‌నగర్‌, లక్డీకపూల్‌, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌, మాదపూర్‌, కొండాపూర్‌, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్‌, ఏఎంబీ, ఇనార్బిల్‌ మాల్, కొండాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీలో వర్షం దంచికొడుతోంది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.  దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులంతా ఆఫీస్‌ల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.  ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 2.5-4 సెం.మీ వర్షం పడుతుందని ఐఎండీ వెల్లడించింది.

హైదరాబాద్‌లో భారీ వర్షం..చెరువులను తలపించిన రోడ్లు

  హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట్‌, మణికొండ, హైటెక్‌ సిటీలో వాన జోరుగా కురుస్తోంది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ భారీగా స్తంభించిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో రెండు గంటలపాటు హైదరాబాద్‌లో భారీవర్షం కురిసే అవకాశం ఉందని హైడ్రా వెల్లడించింది. ప్రజలు రోడ్లపైకి రావొద్దని, లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.. రోడ్ల‌న్నీ జ‌లమ‌యం కావ‌డంతో.. వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప‌లు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ప‌లు కాల‌నీల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. ఈ ప‌రిస్థితుల దృష్ట్యా ఎమ‌ర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల  కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హెచ్చరించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రంగంలోకి కేంద్ర హోంశాఖ

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులోకి కేంద్రం ఎంటరైంది. ఈ వ్యవహారం జాతీయ అంశమని తొలి నుంచీ బీజేపీ చెబుతూనే ఉంది. ఇప్పుకు ఈ కేసు విషయంలో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఈ విషయమై ఆరా తీసేందుకు కేంద్ర హోంశాఖ అదికారులు హైదరాబాద్ చేరుకున్నారు. వీరు గురువారం (ఆగస్టు 7) కేంద్ర మంత్ిర బండి సంజయ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, ఎస్ ఐబీ, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులూ కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని ఇప్పటికే బండి సంజయ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ బండి సంజయ్ కు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది.  

ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

  భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగబోతుండగా.. అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. పార్లమెంటు సభ్యులు ఓటర్లుగా ఉంటారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఏక బదిలీ ఓటు పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. పార్లమెంటు సభ్యులు ఓటర్లుగా ఉంటారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారు.  ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖర్ జులై 21న ఆరోగ్య కారణాలతో ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. ఆయన పదవీకాలం వాస్తవానికి ఆగస్టు 2027 వరకు ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మధ్యంతర ఎన్నికల ద్వారా ఎన్నికైన వ్యక్తికి పూర్తి ఐదేళ్ల పదవీకాలం ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం పార్లమెంటులోని ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో ఎంపీలందరూ (ఎన్నికైనవారు, నామినేటైనవారు) పాల్గొంటారు.

ఒకే వ్యక్తి నాలుగు చోట్ల ఓట్లు వేశాడు..రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

  నకిలీ ఓటర్ల జాబితాలతో  ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్‌ చోరీ పేరిట నేడు ఢిల్లీ ఇందిరా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్‌  మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ సుదీర్ఘంగా ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్‌లో అగ్రనేత కీలక వ్యాఖ్యలు చేశారు. గురుక్రీత్ సింగ్ అనే వ్యక్తి పేరు కర్ణాటక ఓటర్ల లిస్టులో 4 సార్లు వచ్చింది. ఓకే నియోజకవర్గంలో 4 పోలింగ్ కేంద్రాల్లో అతను ఓటేశారు. సేమ్ పేరు, అడ్రస్‌తోనే అంతా జరిగింది.  ఇలాంటి ఘటనలు వేలల్లో ఉన్నాయి. కొందరి పేర్లు యూపీ, కర్నాటక, మహారాష్ట్ర పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలున్నాయని రాహుల్ ఆరోపించారు. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై పరిశోధన చేసినట్లు వివరించారు. పరిశోధనలో తమ అనుమానాలు నిజమయ్యాయని చెప్పుకొచ్చారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ అనుమానాలకు తావిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్‌ మహదేవ్‌పూర్‌ అసెంబ్లీ స్థానంలో సుమారు లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని ప్రకటించారు.  మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ స్పందించారు. ఫేక్ ఓట్లపై డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. లేదంటే ఆరోపణలు ఉపసంహరించుకోవాలని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.  

తురకా కిశోర్‌‌ అరెస్ట్ నిబంధనలకు విరుద్దం..విడుదల చేయాలి : హైకోర్టు

  వైసీపీ నేత తూరకా కిశోర్‌ను వెంటనే విడుదల చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్దంగా తూరకా కిశోర్‌ను అరెస్ట్ చేశారని  హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో మేజిస్ట్రేట్‌ సంతృప్తి చెందినట్లు రిమాండ్‌ ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదని తెలిపింది. అరెస్టుతో పాటు రిమాండ్‌ విధింపు విషయంలో చట్టనిబంధనలు ఉల్లంఘిస్తే నిందితుడిని ఒక్క నిమిషం కూడా జైలులో ఉంచడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాసనం గుర్తు చేసింది.  ఓ దశలో రిమాండ్‌ ఉత్తర్వులను రద్దు చేసేందుకు సిద్ధమైంది. కిశోర్‌ విడుదలకు ఆదేశాలిస్తామని తెలిపింది. కిశోర్‌ను అరెస్టు చేసే సమయంలో బీఎన్‌ఎస్ఎస్‌ సెక్షన్‌-47 (అరెస్టు గురించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం), సెక్షన్‌-48 (అరెస్టుకు గల కారణాల) కింద ఇచ్చిన నోటీసులు నిరాకరించి ఉంటే మధ్యవర్తి సమక్షంలో ఆ విషయాన్ని నమోదు చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది.   

చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ : సీఎం చంద్రబాబు

    చేనేత కార్మికులను కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. అమరావతిలో చేనేత వస్త్ర వైభవాన్ని చాటిచెప్పేలా హ్యాండ్లూమ్  మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేత కార్మికులు సీఎం అన్నారు.  టీడీపీకి నేతన్నలకు అవినాభావ సంబంధం ఉందని.. నేతన్నాలకు ఉపాధి కల్పించిన నేత ఎన్టీఆర్ అని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ చేనేత అని చంద్రబాబు తెలిపారు. వారికి 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించినట్లు కీలక ప్రకటన చేశారు.  నేతన్నలు చిన్న వయసులోనే అనారోగ్యాల బారినపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేతలే ప్రతీకలని ముఖ్యమంత్రి కొనియాడారు. వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ వయసును తగ్గించినట్లు వివరించారు. చేనేత రంగానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు. గతంలో 55,500 మంది కార్మికులకు రూ. 27 కోట్ల రుణాలు అందించామని, 90,765 కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు.  ఈ మద్దతును మరింత విస్తరిస్తూ మరమగ్గాల కార్మికులకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చంద్రబాబు ప్రకటించారు. మరమగ్గాలకు 50 శాతం సబ్సిడీతో రూ. 80 కోట్లు కేటాయిస్తున్నామని, వారికి ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో దీనిని 500 యూనిట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93 వేల చేనేత, మరమగ్గాల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, సవితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, చేనేత సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్రంప్ టారిఫ్ వార్.. అమెరికాకు చుక్కలు చూపేలా మోడీ వ్యూహం!?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ భారత్ పై సుంకాలతో విరుచుకుపడితే.. ప్రతిగా భారత్ పక్కా వ్యూహంతో ఆయన మెడలు వంచి దారికి తీసుకురావడానికి వ్యూహాలు రచిస్తోందా? అంటే మోడీ చైనా పర్యటన, అదే సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనలు చూస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.  రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయకుంటే పన్నుల కొరడా ఝుళిపిస్తానంటూ  భారత్ ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ తాను కేవలం హచ్చరికలతో ఊరుకునే రకాన్ని కాననీ, చేసి చూసుతాననీ అదనంగా పాతిక శాతం సుంకాల విధింపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసి చూపించారు. దీంతో అప్రమత్తమైన ఇండియా.. ప్రతి వ్యూహాలతో సిద్ధమైంది.   అమెరికాతో లక్ష కోట్లు విలువగల ఎఫ్-35 యుద్ధ విమానాలు కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటామని ఇప్పటికే కౌంటర్ అటాక్ ఇచ్చింది.  అక్కడితో ఆగకుండా అమెరికాకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే పనిలో పడింది.  ఇందులో భాగంగానే జాతీయ భద్రతా సలహాదారును రష్యా పర్యటనకు పంపింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 31న రెండు రోజుల పర్యటన కోసం చైనా బయలుదేరుతున్నారు. పేరుకు అక్కడ జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు అని చెబుతున్నా.. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జన్ పింగ్ తో భేటీకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.  డోనాల్డ్ ట్రంప్‌ భారత్‌, రష్యా, చైనాలకు వ్యతిరేకంగా చేస్తున్న ట్రేడ్ వార్ కు దీటైన సమాధానం ఇచ్చే విషయంలో ఈ మూడు దేశాలూ ఉమ్మడిగా ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నాయనడానికి అజిత్ దోవల్  రష్యా పర్యటన, మోడీ చైనా పర్యటనలు తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ మూడు దేశాలూ చేతులు కలిపి ట్రంప్ ట్రేడ్ వార్ కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడితే.. అమెరికాకు చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు. ఇదే వ్యూహంతో  ప్రధాని మోడీ ట్రంప్‌పై ఒత్తిడి పెంచి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. 

కాంగ్రెస్ నేతని వాటర్ బాటిల్‌తో కొట్టిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

  కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం నెలకొంది. స్ధానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ శ్యామ్ నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శ్యామ్ నాయక్ తనను అవమానించారంటూ వాటర్ బాటిళ్లతో ఆయనపైకి విసిరింది ఎమ్మెల్యే. దీంతో ఆయనపైకి వాటర్ బాటిల్ బలంగా విసరడంతో శ్యామ్‌కు దెబ్బ తగిలింది. ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ రైతు వేదిక వద్ద రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం రసాభాసగా మారింది.  రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది.  అయితే, పలు చోట్ల ఘర్షణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా  ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. ఇక్కడే కాదు.. ఇటీవల ఇలాంటి ఘటనలు  చాలా చోట్ల జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారిపోతుంది. ఇరు పార్టీల నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం రచ్చ రేపుతోంది.  మొన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య కూడా తీవ్ర ఘర్షణ జరిగింది.

కేసీఆర్ స్వార్థపరుడు.. గువ్వల బాలరాజు

 మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 24 గంటలు గడిచిందో లేదో.. తాను ఇంత కాలం ఉన్న పార్టీపై, ఆ పార్టీ అధినేతపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను స్వార్థజీవిగా అభివర్ణించారు.  కేసీఆర్ స్వార్థానికి తాను బలయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను గత ఎన్నికలలో పరాజయం పాలు కావడానికి కేసీఆర్ అసమర్ధ నాయకత్వమే కారణమని దుయ్యబట్టారు.  కేసీఆర్ ఎక్కడికక్కడ రాజీపడి పార్టీ భవిష్యత్ ను, తన వంటి నాయకుల రాజకీయ భవిష్యత్ ను నాశనం చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.   తాను అమ్ముడుపోయానని కొందరు బీఆర్ఎస్ నేతలు అంటున్నారనీ, అయితే అది పూర్తి అవాస్తవమని గువ్వల బాలరాజు అన్నారు. ఈ గువ్వల బాలరాజు ఒకరి మోచేతి నీళ్లు తాగే రకం కాదన్నారు. తాను వంద కోట్లకు అమ్ముడు పోయానంటున్న వారు ఆధారాలు చూపి నిరూపిస్తే ముక్కు నులకు రాస్తాననీ, రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతానని సవాల్ చేశారు.  తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్ మీద  గౌరవంతోనే బీఆర్ఎస్ లో చేరాన్న గువ్వల.. కేసీఆర్ స్వార్థజీవిగా మారడంతోనే ఆయనను వదిలేశానని చెప్పారు.   గత ఎన్నికల్లో తనను మాయ చేసి టికెట్ అమ్ముకున్నారనీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కూడా విపక్ష నేతగా కేసీఆర్ తన పాత్రను సమర్ధంగా పోషించడం లేదనీ, ఫామ్ హౌస్ కే పరిమితమై పార్టీని గాలికొదిలేశారన్నారు.  ప్రజల తరఫున గళమెత్తాలనే బీఆర్ఎస్ నుంచి వైదొలిగాన్న గువ్వల.. తాను ఏ పార్టీలో చేరతానన్న విషయం త్వరలో వెల్లడిస్తానన్నారు.  

ట్రంప్ టారిఫ్ వార్.. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవాలి.. ఆనంద్ మహీంద్రా

క్షీర సాగర మథనంలో అమృతం పుట్టినట్లుగా ట్రంప్ సుంకాల సంక్షోభాన్ని సమర్ధంగా ఎదుర్కొంటే భారత్ కు కూడా అమృతం వంటి అవకాశాలు లభిస్తాయని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు.   రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్నదుగ్ధతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  భారత్ పై సుంకాలను 50 శాతానికి పెంచడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రా  ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలనీ, ఇందు కోసం ఇండియా బలంగా రెండు అడుగులు ముందుకు వేయాలని అభిప్రాయపడ్డారు.  ట్రంప్ ప్రారంభించిన టారిప్ వార్ తీవ్ర పరిణామాలకు దారి తీసు అవకాశాలున్నాయన్న ఆయన..  జర్మనీ, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు ఇప్పటికే ట్రంప్ టారిఫ్ వార్ ను ఎదుర్కొనేందుకు వ్యూహాలకు పదును పెట్టాయనీ, ఫలితంగా   ప్రపంచ అభివృద్ధికి కొత్త ఇంజిన్లు లభిస్తున్నాయన్నారు. భారత్ కూడా ఈ సంక్లిష్ట పరిస్థితిని అవకాశంగా మలచుకోవాలన్నారు.  1991లో  భారత్ లో నెలకొన్న విదేశీ మారక నిల్వల సంక్షోభం  లిబరలైజేషన్  దారి తీసిందనీ, అలాగే ఇప్పుడు ట్రంప్ సుంకాల కారణంగా తలెత్తిన క్లిష్ట పరిస్థితులను నుంచి బయటపడి కొత్త అవకాశాలకు బాట ఏర్పడుతుందనీ అన్నారు. ప్రపంచ పెట్టుబడులకు తిరుగులేని వేదికగా భారత్ అవతరించాలంటే..  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సత్వరమే మెరుగుపరచాలని సూచించారు.  అలాగే టూరిజం రంగాన్ని మరింత మెరుగుపరుచుకోవాలన్నారు.  

హస్తినలో రేవంత్ సింహగర్జన.. సౌత్ నుంచి ఏకైక నాయకుడు!

ఎటు నుంచి ఎటు చూసినా కాంగ్రెస్ కి హైప‌ర్ యాక్టివ్ గా  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే క‌నిపిస్తున్న‌ట్టుంది చూస్తుంటే. ఇక్క‌డి బీసీ రిజ‌ర్వేష‌న్ల వ్య‌వ‌హారం ఢిల్లీ వ‌ర‌కూ తీసుకెళ్లి.. అక్క‌డ స‌భ‌లు- స‌మావేశాలు- ధ‌ర్నాలు- వ‌గైరా ఏర్పాటు చేసి.. దీన్ని అమ‌లు చేయ‌కుంటే మోడీ ముక్కు నేల‌కేసి రాసి.. గ‌ద్దె దింపుతాం అంటూ హెచ్చరిస్తున్నారు రేవంత్.  ఒక్క‌మాట‌లో చెప్పాల్సి వ‌స్తే రేవంత్ కాంగ్రెస్ కాంగ్రెస్ సింహంలా గర్జిస్తున్నారు. జాతీయ స్థాయిలో  కాంగ్రెస్ ప‌రంగా చూస్తే రాహుల్ త‌ర్వాత ఆ స్థాయిలో ఐకానిక్ లీడ‌ర్షిప్ క‌నిపిస్తోంది ఒక్క రేవంత్ రెడ్డిలోనే అని పరిశీలకులు అంటున్నారు.   రేవంత్ రాజకీయ జీవితం ప్రారంభమైనది ఏబీవీపీలో.. రాజ‌కీయ పుట్టుక తీస ఏబీవీపీలో, అటు పిమ్మ‌ట కేసీఆర్ కి శిష్యుడిగానూ త‌యార‌వ్వాల‌ని చూసి..  ఆపై టీడీపీలోకి వ‌చ్చి.. రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశంలో ఉండటం వల్ల  ఉండ‌టం వ‌ల్ల యూజ్ లేద‌ని గుర్తించి.. కాంగ్రెస్ లో చేరారు. చేరడంతోనే  టీపీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. ఆ తరువాత తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చి సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టారు. ఇదేమంత మామూలు విషయం కాదు. దీంతో  రేవంత్ రెడ్డి   కాంగ్రెస్ లీడ‌ర్ల‌లోనే హైప‌ర్ యాక్టివ్ గా క‌నిపిస్తున్నారు. ఢిల్లీ గ‌డ్డ మీద మోడీగా తొడగగొట్టి సవాల్ విసురుతున్నారు.   గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సరిగ్గా ఇలానే ఉండేవారు.  ఇక్క‌డి నుంచి అధిక మొత్తంలో ఎంపీ సీట్లు గెలిచి.. ఢిల్లీలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చేలా చేశార‌న్న పేరు సంపాదించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అలా గే క‌నిపిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హించే తెలంగాణ‌లో ఆ స్థాయిలో ఎంపీ సీట్ల సాధ‌న‌కు స్కోప్ పెద్దగా కనిపించడం లేదు కానీ.. ఆ దిశగా రేవంత్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.   ప్ర‌స్తుతం కాంగ్రెస్ కి కూడా ఏమంత గొప్ప నాయ‌క‌త్వ ప‌టిమ లేదు. ఇంటా బ‌య‌టా రాహుల్ ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. ఇందిర‌ను పోలి ఉన్న ప్రియాంక కూడా ఏమంత గొప్ప వాయిస్ వినిపించ‌లేక పోతున్నారు. ఆమె స్టామినా అంతంత మాత్రంగానే క‌నిపిస్తోంది. ఇక కాంగ్రెస్ లోని కొంద‌రు సీనియ‌ర్ ఎంపీలైతే.. పార్టీ వ్య‌తిరేక వాయిస్  వినిపిస్తున్నారు. ఆప‌రేష‌న్ సిందూర్ విష‌యంలో మోడీని ఇరకాటంలో పెట్టాల్సింది పోయి రివ‌ర్స్ లో కాంగ్రెస్ కే కౌంట‌ర్లు వేశారు. అయితే రేవంత్ ఒక్కరే కాంగ్రెస్ లో గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు.  రాహుల్ ఆయ‌న్ను ఒక్కో సారి దూరం పెడుతున్నా.. వెన‌కాడ‌క రాహుల్ తోటిదే ప్ర‌యాణం అంటూ భ‌రోసా అందిస్తున్నారు. దీంతో  ప్రస్తుతం  సౌత్ నుంచి రేవంత్ ఫ్లాగ్ షిప్ లీడ‌ర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ గా మారిన దృశ్యం ఆవిష్కృతమైతోంది.

తిరుపతిలో చెలరేగిపోతున్న వైసీపీ చోటా నేతలు.. షాపు కాంట్రాక్ట్ కోసం గిరిజన యువకుడిపై దాడి

అధికారం కోల్పోయినా కూడా వైసీపీ దాష్టికాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట వైపీపీయులు దౌర్జన్యాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతిలో ఓ వైసీపీ చోటా నేత గిరిజన యువకుడిపై దాష్టీకం చేశాడు.  తిరుపతి శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న షాపు కాంట్రాక్టును తనకు రాసి ఇవ్వాలంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ ఓ గిరిజన యువకుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అనిల్ రెడ్డి గిరిజన యువకుడు పవన్ ను ఇష్టం వచ్చినట్లు కొడుతుంటూ.. అనిల్ రెడ్డి స్నేహితులు దానిని వీడియోగా తీశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనిల్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. అయితే అనిల్ రెడ్డి దాడితో భయపడిన బాధితుడు పవన్ అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. బాధితుడు పవన్ ది పులిచర్ల మండలం అని గుర్తించారు. పవన్ పేరుపై ఉన్న కాంటాక్ట్ ను తన పేరు మీద రాసివ్వాలని అనిల్ రెడ్డి ఈ దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.