మహ్మద్ సిరాజ్.. ఫిట్ నెస్ లో మహరాజ్

నరాలు తెగే ఉత్కంఠ, గోళ్లే కాదు.. వేళ్లే కొరికేసుకునేంత టెన్షన్.. ఇదీ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా ఐదో టెస్టు చివరి రోజు పరిస్థితి. చేతిలో నాలుగు వికెట్లు ఉండగా, కేవలం 35 పరుగులు చేస్తే విజయం వరించే స్థితిలో ఐదో రోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేపట్టింది. నాలుగో రోజు ఆట తిలకించిన ఎవరైనా సరే ఇంగ్లాండ్ విజయం లాంఛనమే అన్న నిర్ణయానికి వచ్చేశారు. కానీ భారత్ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన హైదరాబాదీ స్టార్ బౌలర్ ఔను స్టార్ బౌలరే మహమ్మద్ సిరాజ్  టీమ్ ఇండియా విజయమే ఈ టెస్టు ఫలితం అన్న నమ్మకంతో ఉన్నాడు. అదే నమ్మకంతో బౌలింగ్ చేశాడు. అయితే మ్యాచ్ మాత్రం భారత్ కు అంత సునాయాసంగా చిక్కలేదు. చెమటోడ్పించింది. ఉత్కంఠ రేకెత్తించింది. నిరాశలో ముంచింది. ఆశలు చిగురింప చేసింది. చివరకు విజయం అందింది. అందుకు ముఖ్య కారకుడు నిస్సందేహంగా సిరాజ్ అనడంలో సందేహం లేదు.  అన్నిటికీ మించి ఆదరణ తగ్గిపోతున్నదని అంతా భావిస్తున్న టెస్ట్ క్రికెట్ లోని మజా ఏమిటో ఈ టెస్టు మ్యాచ్ ప్రతి బంతిలోనూ కనిపించేలా చేసింది. టీ20లు టెస్టు క్రికెట్ ముందు బలాదూర్ అని నిరూపించింది. ఆరు పరుగుల ఆధిక్యతతో టీమ్ ఇండియా ఐదో టెస్టును గెలుచుకుని సిరీస్ ను సమంజసం చేసింది ఈ విజయం సిరాజ్ బౌలింగ్ హైలైట్. ఒక సంచలనం. ఈ టెస్ట్ సిరీస్ లోనే సిరాజ్ నిలకడగా వికెట్లు పడగొడుతూ వచ్చాడు. అంతే కాదు మొత్తం 23 వికెట్లు పడగొట్టి  అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. అంతే కాదు ఇరు జట్లలోనూ కూడా సిరీస్ లోని ఐదు మ్యాచ్ లూ ఆడిన ఏకైక పేసర్ గా కూడా నిలిచాడు. ఫిట్ నెస్ విషయంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.  ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో మబూమ్రా కేవలం మూడు మ్యాచ్ లే ఆడాడు. అలా బూమ్రా లేని రెండు మ్యాచ్ లలో కూడా సిరాజ్ ఇండియన్ బౌలింగ్ బాధ్యతను సమర్థంగా భుజాన మోశాడు.    ఇక మళ్లీ చివరిదైన ఐదో టెస్ట్ వద్దకు వస్తే నాలుగో రోజు ఆటలో  ఇంగ్లాండ్ బ్యాటర్ బ్రూక్  ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద పట్టి కూడా నియంత్రించుకోలేక బౌండరీ లైన్ టచ్ చేసి గొప్ప అవకాశాన్ని జారవిడిచిన సిరాజ్.. తన ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆ తప్పిదాన్ని అంతా మరిచిపోయేలా చేశాడు ఓటమి అంచు నుంచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.   మొత్తంగా  ఉత్కంఠ, ఉత్సాహం,  కోపం, నిట్టూర్పు ఇలా అన్ని రకాల మానసిక స్థితులను కలిగేలా చేసిన మ్యాచ్ ఇది. టి20, వన్డేలు తీసికట్టేననిపించిన టెస్ట్ మ్యాచ్ ఇది.  

తిరుమలలో చిరుత సంచారం.. భయాందోళనల్లో భక్తులు

తిరుమల నడకమార్గం, తిరుమలలో చిరుతల సంచారం భక్తులను బెంబేలెత్తిస్తోంది. భక్తుల భద్రత కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామంటూ అధికారలు భరోసా ఇస్తున్నప్పటికీ చిరుతల సంచారం కారణంగా భక్తుల ఆందోళన తగ్గడం లేదు. ఇటీవల తిరుపతి జూపార్క్ రోడ్డులో, శ్రీవారి మెట్టుమార్గంలో చిరుతల సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా  తిరుమలలో చిరుత సంచారం భక్తులనే కాకుండా స్థానికులను సైతం తీశ్ర భయాందోళనలకు గురి చేస్తున్నది. తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్ ప్రాంతంలో సోమవారం రాత్రి చిరుత సంచరించింది. బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి. అప్రమత్తమైన అటవీ శాఖ, టీటీడీ అధికారులు భయాందోళనలు వద్దని భక్తులు, స్థానికులకు భరోసా ఇచ్చారు. చిరుతను అటవీ ప్రాంతంలోనికి మళ్లిస్తామని చెప్పారు. రాత్రి వేళల్లో ఒంటరిగా సంచరించవద్దని సూచించారు. 

తిరుమలలో ప్రయివేటు అతిథి గృహాల పేర్ల మార్పు

తిరుమలలో గోవిందనామస్మరణ మాత్రమే వినిపించాలి, ఆధ్మాత్మిక వాతావరణమే కనిపించాలి అన్న ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రయివేటు అతిథి గృహాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు సంస్థలు, వ్యక్తులు తిరుమలలో నిర్మించిన అతిథి గృహాలకు తమకు నచ్చిన పేర్లను నమోదు చేశారు. అయితే ఇటీవల పాలకమండలి సమావేశంలో ప్రయివేటు అతిథి గృహాల పేర్లు ఆధ్యాత్మికంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా తొలివిడతలో 42 అతిథి గృహాల పేర్లను మార్చారు . ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆదేశాలు జారీచేసింది. తిరుమలలో  ఆధ్యాత్మిక శోభ మరింతగా పరిఢవిల్లడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది.  తిరుమలలో శ్రీవారి పేర్లు, గోవింద నామస్మరణ మాత్రమే వినిపించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాతల సొంత పేర్లు ఉన్న 42 విశ్రాంతి భవనాలకు మార్చిన పేర్లను టీటీడీ ప్రకటించింది. అలా మారిన కొన్ని అతిథి గృహాలు పేర్లు ఇలా ఉన్నాయి.  జిఎంఆర్ విశ్రాంతి భవనానికి ఆనంద నికేతనం, మాగుంట నిలయం కు రాఘవ నిలయం, మైహోమ్ పద్మప్రియ కు పద్మప్రీయ నిలయం, సుధాకృష్ణ నిలయంకు వైకుంఠ నిలయం, శ్రీ రచన   గెస్ట్ హౌస్ కు విధాత నిలయం, పాండవ విశ్రాంతి భవనం  విరజా నిలయంగా పేర్లు మార్పు చేసారు  

మహ్మద్‌ సిరాజ్‌పై ప్రశంసల వర్షం

  ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన మహ్మద్‌ సిరాజ్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు. ట్వీట్టర్ వేదికగా సిరాజ్‌ను హైదరాబాద్‌ స్టైల్లో పొగడ్తలతో ముంచెత్తాడు. సిరాజ్‌ ‘ఎప్పుడూ విజేతే @mdsirajofficial! మన హైదరాబాదీలో మాట్లాడతే.. పూరా ఖోల్ దియే పాషా!’అంటూ అభినందించాడు. మరోవైపు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన  పేసర్  సిరాజ్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.  టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌కు ఏదీ సాటిరాదని అభిప్రాయపడ్డారు. కీలక మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ గడ్డపై భారత జట్టు మరుపురాని విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే.. సిరాజ్ ఆటతీరుపై తెలంగాణ డీజీపీ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘డీఎస్పీ సిరాజ్ అద్భుతంగా పోరాడారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భవిష్యత్‌లో జట్టు మరిన్ని విజయాలు అందించాలి. ప్రతీ  విజయంలో ఆయన కీలక పాత్ర పోషించాలి.  ఇవాళ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఐదు వికెట్లు తీసి జట్టును గెలిపించిన సిరాజ్‌కు అభినందనలు’ అని డీజీపీ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ఓవల్‌ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఆరుపరుగుల తేడాతో ప్రత్యర్ధి జట్టు ఇంగ్లండ్‌ను భారత్‌ మట్టి కరిపించింది. ఈ మ్యాచ్‌ విజయంతో సిరీస్‌2-2 సమమైంది. మమ్మద్ సిరాజ్ ఈ సిరీస్‌లో మొత్తం 23 వికెట్లు తీసి మెరుపులు మెరిపించాడు. చివరి మ్యాచ్‌లో అతడు తీసిన ఫైవ్ వికెట్ హల్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

స్టీల్ స్లాగ్ విధానంలో రోడ్ల అభివృద్ధిపై అనుబంధ సమాచారం

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యర్థాల నుండి సంపద అనే దృష్టితో వ్యవస్థాపక మార్పుల వైపు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్కు పరిశ్రమల నుండి ఏర్పడే స్టీల్ స్లాగ్ అనే వ్యర్థ పదార్ధాన్ని రహదారుల నిర్మాణం మరియు మరమ్మతుల పనుల్లో వినియోగించాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సూచనల ప్రకారం, పర్యావరణ హితంగా మరియు ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉండే విధంగా “ఎకోఫిక్స్ ” అనే కొత్త మిశ్రమ పదార్ధాన్ని అభివృద్ధి చేశారు.    1. ఎకోఫిక్స్ ప్రత్యేకతలు : స్టీల్ స్లాగ్ అనే ఉక్కు పరిశ్రమలోని వ్యర్థ పదార్ధాన్ని తారు‌తో మేళవించి తయారుచేసిన మిశ్రమమే ఎకోఫిక్స్. ఇది పారిశ్రామిక వ్యర్థాన్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే సరైన ఉదాహరణ. 2.    ఎప్పుడైనా – ఎక్కడైనా పాత్ హోల్ రిపేర్ : ఇది మెటీరియల్ కావడంతో, అవసరం వచ్చిన వెంటనే రోడ్డుపై గుంతల్ని పూడ్చేందుకు ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. 3.    వేడి చేయాల్సిన అవసరం లేదు: సాధారణ తారు రిపేర్ వర్క్ మాదిరిగా దీనిని వేడి చేయాల్సిన అవసరం లేదు. ఇది సెట్టింగ్ తక్కువ సమయంలో జరుగుతుంది. దీని వలన ఫ్యూయల్ ఖర్చు తగ్గి, కాలుష్యం కూడా ఉండదు. 4.    నీటి ఉనికిలో కూడా పని చేస్తుంది : వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలిచినప్పటికీ, ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.. ఇది వర్షాకాలంలో పనులు ఆగకుండా చేయగలిగే అత్యుత్తమ పరిష్కారం. 5.    ఎక్కువ మన్నిక, తక్కువ ఖర్చు : సిఆర్‌ఆర్‌ఐ శాస్త్రజ్ఞులు ఈ మిశ్రమాన్ని పరీక్షించి, ప్రస్తుతం వినియోగిస్తున్న అన్ని పదార్ధాలకంటే మన్నికగా, మరియు తక్కువ వ్యయంతో పని చేసే ఉత్తమమైన పదార్ధంగా గుర్తించారు. 6. పర్యావరణ పరిరక్షణ: పారిశ్రామిక వ్యర్థాల వినియోగం ద్వారా భూమి, నీరు, వాయు కాలుష్యాలను తగ్గించడం. 7. ఆర్థిక ప్రయోజనం: తక్కువ ఖర్చుతో అధిక పనితీరు కలిగిన ఈ మిశ్రమాన్ని వినియోగించి ప్రజాధనాన్ని ఆదా చేయడం.

నిరాహార దీక్షను విరమించిన కవిత..పోరాటం ఆగదని స్పష్టీకరణ

  చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ  కవిత తెలిపారు. నిరాహార దీక్షకు హైకోర్టు కోర్టు అనుమతి నిరాకరించిందని కవిత వెల్లడించారు. కోర్టులను ధిక్కరించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. న్యాయస్థానాల పట్ల తనకు గౌరవం ఉందని కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ జరగకుండా వెళ్తే.. ఎన్నికలను ఎలా ఆపాలో తమకు తెలుసన్నారు.  బీసీ బిల్లు సాధన కోసం తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన ఆర్. కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. నిరాహార దీక్ష చేసేందుకు సాయంత్రం 5 గంటల వరకే పర్మిషన్ ఉండగా.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో భారీ వర్షం కురవడం, కోర్టు ఆదేశాలతో కవిత దీక్షను విరమించారు. . ఈ పోరాటం ఆగదని.. అనేక రూపాల్లో చేస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ధర్నాలతో సాధించేది ఏం లేదన్నారు.   

కాళేశ్వరం నివేదికను శాసన సభలో ప్రవేశపెడతాం : రేవంత్‌రెడ్డి

  కాళేశ్వరం కమిషన్‌ నివేదికను త్వరలోనే శాసన సభలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ సమర్పించిన నివేదికకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. విచారణకు సంబంధించిన వివరాలను కమిషన్‌ విశ్లేషణాత్మకంగా నివేదికలో పొందుపరిచిందని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రివర్గం సమావేశం అనంతరం మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. అసెంబ్లీలో చర్చించాకే తదుపరి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.  దీనిపై అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.  అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక భవిష్యత్తు కార్యాచరణతో పాటు కమిషన్‌ సూచనలను అమలు చేసేందుకు ముందుకెళ్తామని సీఎం తెలిపారు. ఎవరిపైనా కక్ష సాధింపులు, వ్యక్తిగత ద్వేషం తమ ఉద్దేశం కాదనే అన్ని వివరాలనూ మీడియా ముందు ఉంచామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చిందని  నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్‌లో చాలా లోపాలున్నట్లు సీడబ్యూసీ చెప్పిందని, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదనడం సరైంది కాదని ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికలో స్పష్టమైనట్లు ఆయన పేర్కొన్నారు.   మేడిగడ్డ బ్యారేజ్‌ వద్దని హై పవర్‌ కమిటీ ఇచ్చిన నివేదికను మాజీ సీఎం కేసీఆర్‌ పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఉత్తమ్‌ విమర్శించారు. ఆర్థిక అవతవకలు, అవినీతి, ప్లానింగ్‌, డిజైనింగ్‌ అంతా కేసీఆర్‌ పర్యవేక్షణలోనే జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడేలా మేడిగడ్డ బ్యారేజ్‌ అంచనాలు పెంచి నిర్మించారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ ఇష్టానుసారం ప్రాజెక్టు డిజైన్‌లు మార్చేశారు. అధిక వడ్డీకి ఎన్‌బీఎఫ్‌  దగ్గర  లోన్లు తెచ్చారు. అధిక వడ్డీలకు రూ. 84 వేల కోట్ల రుణాలు తీసుకొచ్చారు.  రుణాలు తెచ్చే విషయంలో అవతవకలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. నీళ్లు  కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దాదాపు రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయే ప్రమాదంలో పడింది. డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణ అవకతవకలు అన్నింటికీ బాధ్యుడు, జవాబుదారీ అప్పటి సీఎం కేసీఆరే అని నివేదికలో పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సూచనలకు కాకుండా సొంత నిర్ణయంతోనే మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించారని  డిప్యూటీ సీఎం ఆరొపించారు

ఏపీలో సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త లిక్కర్ పాలసీ : సీఎం చంద్రబాబు

  ఏపీలో సెప్టెంబర్‌ 1 నుంచి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా ఈ కొత్త బార్‌ పాలసీ అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. లిక్కర్ పాలసీ అంటే ఆదాయం కాదు.. ప్రజల ఆరోగ్యం ముఖ్యమనే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది.  దీంతో అల్కాహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం విక్రయాలతో నష్టం తగ్గించ వచ్చునని భావిస్తుంది. అంటే.. మద్యం కారణంగా పేదల ఇళ్లు, ఒళ్లు గుల్లా కాకుండా చూడాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఆ క్రమంలో బార్లలో కూడా గీత కార్మిక వర్గాలకు 10 శాతం షాపులు కేటాయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు  కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం..రోడ్లపై భారీ వరద

  హైదరాబాదులో మరొకసారి భారీ వర్షం కుమ్మేసింది.. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డు మీద వరద నీరు ఏరులై పారాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.. అన్ని ప్రధాన రోడ్లమీదకి వరద నీరు భారీగా చేరడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.. కొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వరకు వర్షం నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు.. రాత్రి వరకు వర్షం ఇదే మాదిరిగా పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు జలమ యిపోయినాయి.. అమీర్పేటలోని మైత్రివనం అమీర్పేట మెట్రో స్టేషన్ కిందిభాగం పూర్తిగా నాలుగు అడుగుల వరకు వరద నీరు చేరిపోయింది.. దీంతో పాటు సారధి స్టూడియో పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వరద నీరు వచ్చి చేరింది.. నాంపల్లి జూబ్లీహిల్స్ లోని పలు కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది.. మరోవైపు పలు మల్లెపల్లి చౌరస్తాలోని పలు కాలనీలు నీట మునిగి పోయాయి.  బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ లో భారీ చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్థంగా మారిపోయింది..అలాగే  నాంపల్లి స్టేషన్ రోడ్ లోని కమత్ హోటల్ లోకి  వర్షపు నీరు చేరు కుంది.హోటల్ లో లంచ్ చేయడానికి వచ్చిన  కస్టమర్లు వరద నీరు చూసి షాక్ అయ్యారు.ఈ భారీ వర్షానికి నాంపల్లి గాంధీభవన్ పక్కన ఉన్న సాయి కృప అపార్ట్మెంట్ లోకి భారీగా వరదనీరు చేరుకుంది.కొన్ని ప్రాంతాల్లో అయితే 10 సెంటీమీటర్ల వర్షం నమోదయింది.. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ సెంట్రల్ ప్రాంతం మొత్తం కూడా బీభత్సం అయిపోయింది.

జగన్ సెక్యూరిటీలో సొంత సైన్యం... క్యాడర్ కోసమే అంటున్న నేతలు

  వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది. ఇప్పటికే పదిమంది రిటైర్డ్ ఆర్మీని జగన్ పెట్టుకున్నారు. అలాగే జెడ్ ప్లస్ కేటగిరి లో 58 మంది సిబ్బంది తో రాష్ట్ర ప్రభుత్వం జగన్ కు భద్రత ఏర్పాటు చేస్తోంది. జగన్ సెక్యూరిటీలో మార్పులు ఎల్లుండి డోన్ పర్యటన నుంచి అందుబాటులోకి రానున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.  అయితే జగన్‌పై ఎవరైనా దాడి చేస్తారన్న నేపథ్యంలో కాకుండా.. వైసీపీ కార్యకర్తల దృష్ట్యా సెక్యూరిటీ పెంచినట్లు తెలుస్తొంది. అయితే జనగ్ పర్యటనల్లో వైసీపీ కార్యకర్తలు ఆయన దగ్గరకు ఎక్కువ సంఖ్యాలో రావడంతో.. కార్యకర్తల భద్రత దృష్ట్యా సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ సెక్యూరిటీ జగన్ పర్యటనల్లో ఎలాంటి వివాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటుందని వైసీపీ అభిప్రాయ పడుతుంది. మరోవైపు జగన్ పర్యటనల్లో టీడీపీ ప్రభుత్వం సరైనా శాంతిభద్రత కలిగించక పోవడం వల్లే సొంత సెక్యూరిటీని నియమించున్నామని వైసీపీ నాయకులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం జగన్‌కు సెక్యూరిటీ ఇవ్వడంలో ఫేల్ అవుతోందని విమర్శిస్తున్నారు. అయితే.. జగన్ ఇది వరకు చేసిన పర్యటనల్లో హెలిప్యాడ్ పై వైసీపీ కార్యకర్తలు పడి ధ్వంసం చేయడం, రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద వైసీపీ కార్యకర్త పడి చనిపోవడం వంటి అంశాల దృష్ట్యా జగన్ కు వైసీపీ అధిష్టానం ప్రైవేట్ సెక్యూరిటీ నియమించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ చైర్ పర్సన్‌గా ఉపాసన నియామకం

  తెలంగాణ అంతర్జాతీయ స్పోర్ట్స్ చైర్మన్లు గా సంజీవ్ గోయంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయంకా, యువర్ లైఫ్ సిఇఓ ఉపాసన కొణిదెల నియమితులయ్యారు. మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. తెలంగాణ లో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ, అభివృద్ధి తదితర అంశాలఫై దృష్టి సారిస్తారు.   సభ్యులుగా విటా డానీ (డానీ ఫౌండేషన్), మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సన్ నెట్ వర్క్స్ సిఇఓ కావ్య మారన్,  సి. శశిధర్ (విశ్వ సముద్ర), పుల్లెల గోపీచంద్ (బ్యాడ్మింటన్), రవికాంత్ రెడ్డి (వాలీబాల్), బైచుంగ్ భూటియా (ఫుట్ బాల్), అభినవ్ బింద్రా (షూటింగ్), క్రీడల శాఖ అధికారులు బి. వెంకట పాపారావు,  ఇంజేటి శ్రీనివాస్ లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది.  తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ కో చైర్మన్ ఉపాసన కొణిదెల మాట్లాడుతూ ప్రపంచంలో తెలంగాణ క్రీడా శక్తిగా మార్చేందుకు కృషి చేస్తానని సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి చైర్ పర్సన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలకు ఉచిత ప్రయాణం : మంత్రి మండిపల్లి

  ఏపీలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చాని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ‘శ్రీ శక్తి’ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ ఇలా మొత్తం 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం 1,950 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు.  ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలకు ఎన్నో స్కీములు చెప్పామని, దానిలో ఉచిత బస్సు పథకాన్నికి మహిళలు మొగ్గు చూపారు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికయినా జీరో టికెటింగ్ విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, అల్ట్రా ఎక్స్ ప్రెస్‌లలో కూడా ఈ పథకం అమలులో ఉటుందని మంత్రి స్పష్టం చేశారు.  

కాళేశ్వరం నివేదికపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

  కాళేశ్వరం కమీషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కమీషన్ రిపోర్ట్ ఊహించిందే. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని గులాబీ బాస్ అన్నారు. అది కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ పేర్కొన్నారు. కొంత మంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయొచ్చుని భయపడవద్దని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలని నాయకులతో చెప్పినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం పనికిరాదు అన్న వాడు అజ్ఞాని..  ప్రాజెక్టుపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పేర్కొన్నారు.  కాళేశ్వరంపై క్యాబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం’’ అని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో హరీష్ రావు, కేటిఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఇదిలా ఉంటే.. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే ప్రభుత్వం ఆ నివేదికను బయటపెట్టడం కంటే ముందే మీడియాకు లీకు కావడం చర్చనీయాంశమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను నిర్మించారు. అయితే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగాయి. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. అనంతరం ఈ ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు 15 నెలలపాటు ఈ కమిషన్ విచారణ జరిపింది. చివరకు జులై 31వ తేదీన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. తన నివేదికను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. ఆగస్టు 1వ తేదీన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.   

సిరాజ్ మ్యాజిక్.. విజయానికి ఏడు పరగుల దూరంలో ఇంగ్లాండ్ ఆలౌట్

ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు. 374 పరుగల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఒక దశలో  సునాయాసంగా విజయం సాధిస్తుందా అనిపించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ధారాళంగా పరుగులు చేయడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. హ్యారీ బ్రూక్, జోరూట్ లు సెంచరీలతో చెలరేగడంతో 374 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకగా ఛేదించేస్తుందని అంతా భావించారు. అయితే జోరుమీదున్న ఇంగ్లాండ్ కు ప్రసిద్ధకృష్ణ, మహ్మద్ సిరాజ్ లు కళ్లెం వేశారు. ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగుల వద్ద నాలుగో రోజు ఆట ముగించిన ఇంగ్లాండ్.. నాలుగు వికెట్లు చేతిలో ఉండటంతో అలవోకగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణలు పదునైన బంతులతో ఇంగ్లాండ్ దూకుడుకు కళ్లెం వేశారు.  ఓవర్ నైట్ బ్యాట్స్ మన్ జెమీ స్మీత్  ఓవర్టన్ లను సిరాజ్ పెవిలియన్ కు పంపాడు. జోష్ టంగ్ ను ప్రసిద్ధ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో గాయంతో బాధపడుతున్న క్రిస్ వోక్స్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఆ దశలో ఇంగ్లాండ్ కు విజయానికి 17  పరుగులు అవసరం. గాయంతో ఉన్న వోక్స్ కు స్ట్రైక్ ఇవ్వకుండా అట్కిన్సన్ ఓవర్ కీప్ చేస్తూ బ్యాటింగ్ కొనసాగించాడు. ఓ సిక్సర్ బాదిన అట్కిన్సన్ ఇంగ్లాండ్ విజయంపై ఆశలను పెంచేశాడు. ఇంగ్లాండ్ విజయానికి 7 పరుగులు అవసరమైన స్థితిలో అట్కిన్సన్ ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేసి ఇండియాకు చిరస్మరణీయమనదగ్గ విజయాన్ని అందించాడు.  స్కోర్లు.. ఇండియా తొలి ఇన్నింగ్స్  224, రెండో ఇన్నింగ్స్ 396 ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 247, రెండో ఇన్నింగ్స్ 367 ఫలితం ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం  నాలుగు వికెట్లను 29 పరుగులకే కూల్చేసింది.  

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

  ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.  ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన ఇంటి అద్దె భత్యం ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సచివాలయ ఉద్యోగులు, శాఖాధిపతులకు వర్తించనుందని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వ ఉద్యోగులు అమరావతికి వచ్చారు. వారికి కొంత హెచ్‌ఆర్‌ఏ పెంచి ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. అమరావతి పరిధిలో నివసించే ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తోంది. ఆ వసతి సౌకర్యాన్ని మరో ఏడాది తాజాగా పొడిగించింది. ఉద్యోగుల కుటుంబాలు హైదరాబాద్‌లో ఉండడం.. ఉద్యోగులు మాత్రమే అమరావతిలో ఉంటుండడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

ఐదో టెస్టులో భారత్ అద్భుత విజయం.. సిరీస్ సమం

ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు. 374 పరుగల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఒక దశలో సునాయాసంగా విజయం సాధిస్తుందనిపించింది. అయితే ఇండియన్ పేసర్లు  మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణలు ఇంగ్లాండ్ కు కళ్లెం వేశారు. మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ నాలుగు వికెట్లు పగడొట్టి ఇంగ్లాండ్ విజయాన్ని అడ్డుకున్నారు. ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులతో  ఉన్న ఇంగ్లాండ్.. చివరి రోజు నాలుగు వికెట్లు చేతిలో ఉండగా  35 పరుగులు చేస్తే చాలు అన్న స్థితిలో చివరి రోజు ఆట మొదలైంది. అయితే ఎక్కడా పట్టు వదలని టీమ్ ఇండియా చివరి నాలుగు వికెట్లను 29 పరుగులకే కూల్చేసింది.  

పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం..నలుగురికి సీరియస్

  అనకాపల్లి జిల్లాలో పరవాడ ఫార్మాసిటీలో  ప్రమాదం చోటుచేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకవ్వడంతో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే స్థానికులు అప్రమత్తమై అస్వస్థతకు గురైన కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదంలో లూపిన్ ఫార్మా యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం తెల్లవారు జామున ప్రమాదం జరిగింది.  అయితే ఈ ప్రమాదాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారిలో సాయి షిఫ్ట్ ఇంచార్జ్, గణేష్ కెమిస్ట్, రాఘవేంద్ర, నాయుడులను షీలా నగర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో నలుగురు చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.    

బీఆర్ఎస్ నుంచి కవితకు ఉద్వాసన?

భారతీయ రాష్ట్ర సమితి నుంచి ఆ పార్టీ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉద్వాసన తప్పదా? పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. కవితను పార్టీ నుంచి బహిష్కరించే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని గట్టిగా చెబుతున్నారు.  తాజాగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ కవితకు ఉద్వాసన చెప్పడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి జగదీశ్వరెడ్డిని ఉద్దేశించిన లిల్లీపుట్ వ్యాఖ్యలతో  కవిత  లక్ష్మణ రేఖను పూర్తిగా దాటేశారని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా కవిత  కేటీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా, జగదీశ్ రెడ్డిపై ప్రత్యక్షంగా చేసిన వ్యాఖ్యల తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో జగదీశ్ రెడ్డి, కేటీఆర్ లు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు జరిగిన ఈ భేటీలో  కవితకు ఉద్వాసన చెప్పాలన్న నిర్ణయాన్ని కేసీఆర్ బయటపెట్టినట్లు చెప్పారు.  కవిత ఇటీవల జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన లిల్లీపుట్ వ్యాఖ్యలు పార్టీలో పెను సంచలనానికి తెరలేపాయి. తెలంగాణ ఉద్యమంతో కానీ, బీఆర్ఎస్ తో కానీ జగదీశ్ రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటని? కవిత ప్రశ్నించారు.  ఆయన ఓ లిల్లీపుట్ నాయకుడంటూ దుయ్యబట్టారు. తానెవరో తెలియకుండానే ఇంత కాలం బీఆర్ఎస్ లో ఉన్నారా అంటూ నిలదీశారు.  అలాగే మరో నాయకుడు పటోళ్ల కార్తిక్ రెడ్డిపై కూడా విమర్శల వర్షం కురిపించారు.  వీళ్లంతా పార్టీలో చేరి పదవులు అనుభవించి ఇప్పుడు తనపై విమర్శలు చేసే స్థాయికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   అక్కడితో ఆగని కవిత.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తన సోదరుడు కల్వకుంట్ల తారకరామారావుపైనా పరోక్షంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  పార్టీలోని అగ్ర స్థాయిలో ఉన్న నేతలు తన కార్యకలాపాలపై నిఘా పెట్టారని పరోక్షంగా కేటీఆర్, హరీష్ రావులపై ఆరోపణలు గుప్పించారు.   ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్లు పలువురు కవితపై చర్య తీసుకోవాలని కేసీఆర్ ను కోరినట్లు తెలుస్తోంది. కవిత తీరు వల్ల పార్టీకి తీవ్ర నష్టంవాటిల్లోతోందని వివరించారనీ, దీంతో ఆమెకు ఉద్వాసన పలకడమే మేలని కేసీఆర్ కూడా చెప్పారనీ పార్టీ వర్గాలు అంటున్నాయి.  కేసీఆర్ త్వరలోనే ఆమెకు పార్టీ నుంచి ఉద్వాసన పలుకుతారని అంటున్నారు.