పులివెందుల వైసీపీలో భయం.. క్యాడర్ లో అయోమయం

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక భయం పట్టుకుంది. పులివెందుల పులి.. పులివెందులలో తిరుగే లేదు అని ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చిన ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ కూడా ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో ఓటమి ఖాయమంటూ చేతులెత్తేస్తున్న పరిస్థితి. ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ పరాజయం పాలైతే.. ఆ ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు. ఎందుకంటే..పులివెందుల అంటే వైఎస్ కంటుకోట.. వైఎస్ తదననంతరం జగన్ కంచుకోట అని ఇంత కాలం చెప్పుకుంటూ తిరిగిన వైసీపీ నేతలకు ఇప్పుడు అక్కడే ఎదురు గాలి వీచడం జీర్ణం కావడం లేదు. ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం, అదీ ఆరునెలలు మాత్రమే ఉండే పదవి కోసం వైసీపీ యంత్రాంగం మొత్తం పులివెందులలో తిష్ట వేసింది. అయినా విజయం పట్ల ధీమా కరవై కంగారెత్తిపోతున్నది. పులివెందుల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగి దశాబ్దాలు దాటిపోయింది. ఇక్కడ జగన్ కు, ఆయన పార్టీకి ప్రత్యర్థులుగా రంగంలోకి దిగడానికే భయపడే పరిస్థితి  ఉండేది. దాదాపుగా ఇక్కడ స్థానిక ఎన్నికలన్నీ ఏకగ్రీవమే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఇక్కడ తెలుగుదేశం కూటమి అభ్యర్థిని నిలపడమే కాదు, గెలిపించుకుంటామని కూడా ధీమాగా ఉంటే.. ఇంత కాలం ఇక్కడ తమదే రాజ్యమని విర్రవీగిన వైసీపీయులు తమపై దాడులు జరుగుతున్నాయంటూ డ్రామాలు ఆరంభించేశారు. ఈసీ వద్దకు వెళ్లి రక్షణ కావాలని మొరపెట్టుకుంటున్నారు. రిగ్గింగు చేసుకునే అవకాశం లేకుండా పోలింగ్ స్టేషన్లను మార్చేశారని గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇక్కడి జనం మాత్రం ఇన్నాళ్లకు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసే పరిస్థితి ఏర్పడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.  పరిశీలకుల విశ్లేషణల ప్రకారం వైసీపీ అధినేత సొంత నియోజకవర్గంలో ఇప్పుడు ఆయనకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో పరాజయం ఎదురైతే.. ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై పడుతుందని జగన్ కూడా భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే తాను స్వయంగా పులివెందులలో ప్రచారానికి రాకపోయినా.. బెంగళూరు ప్యాలస్ నుంచి నిరంతరం ప్రచార తీరును పరిశీలిస్తున్నారు. పర్యవేక్షిస్తున్నారు.  ఎంతగా దిశానిర్దేశం చేసినా పరిస్థితి అనుకూలంగా కనిపించడం లేదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఇక భయపెట్టి గెలిచేద్దామనుకుంటే.. పటిష్ట పోలీసు బందోబస్తు ఆ అవకాశం లేకుండా చేస్తున్నది. ఏది ఏమైనా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం వైసీపీకి వ్యతిరేకంగా వస్తే..పార్టీ నుంచి వలసలు ఊహించని స్థాయిలో మొదలౌతాయన్న భయం పార్టీ అగ్రనాయతక్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత

  గుంటూరు ప్రజల సెంటిమెంట్ బ్రిడ్జిగా చెప్పుకునే,  శంకర్ విలాస్ బ్రిడ్జిని అధికారులు కూల్చివేశారు... గుంటూరు తూర్పు,  గుంటూరు పశ్చిమ నియోజకవర్గలను కలిపే ఈ బ్రిడ్జ్,  పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరింది ...ఈ బ్రిడ్జ్ దాదాపుగా 70 సంవత్సరాలు పాటు గుంటూరు పరిసర ప్రాంత ప్రజలకు సేవలు అందించింది... 1950 ప్రాంతంలో నిర్మాణ పనులు ప్రారంభించుకున్న ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి,  గడిచిన  పాతికేళ్లుగా పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకుంటుంది.   దీంతో స్పందించిన కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ బ్రిడ్జి స్థానంలో టాప్ క్లాస్ బ్రిడ్జి నిర్మాణం చేయించాలని పూనుకున్నారు. అనుకున్నదే తడవుగా 110 కోట్ల రూపాయలతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ,ఈ బ్రిడ్జిని నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 70 ఏళ్లుగా గుంటూరు ప్రజలతో మమేకమైపోయిన శంకర్ విలాస్ బ్రిడ్జి, అనేక ధర్నాలకు, ర్యాలీలకు, వేడుకలకు, వేదికయింది  

ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కార్యాలయం వద్ద సినీ కార్మికులు నిరసన

  ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద 24 యూనియన్లకు చెందిన సినీ కార్మికులు ఆందోళనకు దిగారు. వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున కార్మికులు నినాదాలు చేశారు.  నిరసనలో 24 యూనియన్ల సినీ కార్మికులు  పాల్గొన్నారు.  శనివారం నిర్మాతలు, కార్మిక సంఘాలు చర్చలు జరపగా మూడు కేటగిరీలుగా విభజించి, కార్మికుల వేతనాల్ని పెంచాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. న్యాయమైన పద్దతిలో వేతనాలు పెంచలని డిమాండ్ చేస్తున్నాయి. రేపటి నుంచి చిత్రీకరణలు పూర్తిగా నిలిపేస్తున్నట్లు ఫిల్మ్ ఫేడరేషన్ అధ్యక్షుడు అనిల్ ప్రకటించారు. ఇప్పటికే షేడ్యూల్ ఉంటే 2 రోజులు సమయమిస్తామని, ఆతర్వాత అవి కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. నిన్న జరిగిన  సమావేశంలో నిర్మాతలు రెండు రకాల వేతన పెంపు విధానాలను ప్రకటించారు. రోజుకు రూ. 2000 లేదా అంతకంటే తక్కువ వేతనం తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15 శాతం, రెండవ ఏడాది 5 శాతం, మూడవ ఏడాది మరో 5 శాతం చొప్పున వేతనం పెంచడానికి సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా, రోజుకు రూ. 1000 లేదా అంతకన్నా తక్కువ వేతనం పొందుతున్న కార్మికులకు మొదటి ఏడాది 20 శాతం, మూడవ ఏడాది 5 శాతం పెంచనున్నట్లు తెలిపారు. అయితే, వీరికి రెండవ ఏడాది వేతన పెంపు ఉండదని స్పష్టం చేశారు.

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక టోల్‌ ఛార్జ్‌ రూ.15లే

  దేశంలోని వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్రం. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నిన్న ఆగస్టు 9న ఒక కీలక ప్రకటన చేశారు. వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ప్రారంభం గురించి తెలియజేశారు. ఈ కొత్త పాస్ ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేట్ వాహనదారులకు చాలా డబ్బు, సమయం ఆదా అవుతుంది. ఈ కొత్త ఫాస్ట్ ట్యాగ్ పాస్ ద్వారా డ్రైవర్లు కేవలం రూ. 15కే టోల్ ప్లాజాను దాటగలరని, ఇది ప్రస్తుత ఖర్చు కంటే చాలా తక్కువ అని గడ్కరీ అన్నారు.  వార్షిక ఫాస్ట్‌ ట్యాగ్‌ పాస్‌ ధర రూ.3000  వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ప్రయోజనాలను వివరిస్తూ నితిన్ గడ్కరీ ఈ పాస్ ధర రూ.3000గా నిర్ణయించినట్లు చెప్పారు. దీనిలో వాహనదారులు 200 ప్రయాణాలు చేయవచ్చని చెప్పారు. ఇక్కడ 'ఒక ప్రయాణం' అంటే ఒక టోల్ ప్లాజాను దాటడం. ఈ లెక్క ప్రకారం.. రూ.3000కి 200 టోల్‌లను దాటడం అంటే టోల్‌కు కేవలం రూ.15 మాత్రమే ఖర్చవుతుందని అన్నారు. సాధారణంగా, మీరు ఏదైనా టోల్ ప్లాజా గుండా ఒకసారి వెళ్ళడానికి సగటున రూ.50 చెల్లిస్తే, 200 టోల్ ప్లాజాలను దాటడానికి మీరు మొత్తం రూ.10,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్‌ని ఉపయోగించడం ద్వారా మీరు నేరుగా రూ.7000 వరకు ఆదా చేయవచ్చు.  వార్షిక పాస్ ప్రయోజనాలు:  కొత్త వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫాస్ట్ ట్యాగ్‌ను తరచుగా రీఛార్జ్ చేసుకోవాలి. అయితే వార్షిక పాస్‌ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. దాని చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత మీరు దానిని మళ్ళీ పునరుద్ధరించాలి. ఈ వార్షిక పాస్ జారీ చేసిన తర్వాత ప్రజలు టోల్ చెల్లించడానికి పొడవైన క్యూలలో నిలబడే ఇబ్బంది నుండి కూడా బయటపడతారు. ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ఆగస్టు 15, 2025 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. అయితే ఇది జాతీయ రహదారులపై మాత్రమే చెల్లుతుంది. రాష్ట్ర రహదారులపై దీని ఉపయోగం చెల్లదు. ఈ చొరవ రవాణాను మరింత సౌకర్యవంతంగా, ఆర్థికంగా మారుస్తుందని భావిస్తున్నారు. ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఆగస్టు 15 నుండి ఇప్పటికే ఉన్న ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రాజ్‌మార్గ్ యాత్ర యాప్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా  అధికారిక వెబ్‌సైట్ (www.nhai.gov.in) లేదా www.morth.nic.in లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.  ఇది తప్పనిసరియా?  ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ పొందడం తప్పనిసరి కాదా? ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ పొందడం తప్పనిసరి కాదు. అయితే, రోజువారీ ప్రయాణికులు చెల్లించే టోల్ ఛార్జీలను తగ్గించడం దీని లక్ష్యం. వార్షిక పాస్ కొనడానికి ఇష్టపడని వారికి, వారి ప్రస్తుత ఫాస్ట్ ట్యాగ్ యథాతథంగా పనిచేస్తుంది. టోల్ ప్లాజాలలో వర్తించే విధంగా వినియోగదారులు దీనిని సాధారణ లావాదేవీల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది.

వారం రోజుల పాటు ఏపీకి భారీ వర్షాలు

తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. గత మూడు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులూ వంకలూ పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ మహానగరం అయితే వర్షాలకు చిగురుటాకులా వణికి పోతున్నది. ఇక ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. ఆదివారం (ఆగస్టు 10) నుంచి వారం రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడం ఏర్పడిందనీ, దీనికి తోడు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 13వ తేదీ నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ, తెలంగాణలో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.  

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తుల నిత్యం పోటెత్తుతుంటారు. వారాంతంలో భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంటుంది. ఆదివారం (ఆగస్టు 10) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం శ్రీవారిని మొత్తం 84 వేల 404 మంది దర్శించుకున్నారు. వారిలో 34 వేల 930 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 6 లక్షల రూపాయలు వచ్చింది. ఇలా ఉండగా ఆదివారం (ఆగస్టు 10) ఉదయం చిరుజల్లులతో తిరుమలలో వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంది. చిరుజల్లులలో తిరుమల గిరుల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ తన్మయు లౌతు న్నారు. 

బెంగళూరులో కొత్త క్రికెట్ స్టేడియం.. సీఎం సిద్దరామయ్య గ్రీన్ సిగ్నల్

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విషాద సంఘటన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కసలాట. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయం తరువాత చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణాలు సంభవించాయి. ఈ విషాద సంఘటన తరువాత నగరం నడిబొడ్డున ఉన్న స్టేడియంలో మ్యాచ్ ల నిర్వహణ, జనాలను కంట్రోల్ చేయడం కష్టమని భావించిన కర్నాటక ప్రభుత్వం  బెంగళూరు శివార్లలోని  బొమ్మసాంద్ర ప్రాంతంలో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణానికి  శ్రీకారం చుట్టింది.  1650 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 80 వేల మంది ప్రేక్షకుల కూర్చునే కెపాసిటీతో భారీ స్టేడియం నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.   ఈ మెగా క్రికెట్ స్టేడియం ప్రాజెక్ట్ కు పాలనాపరమైన అనుమతులే కాకుండా, నిధుల విడుదలకూడా జరగడంతో త్వరలోనే   నగరం నడిబొడ్డున ఉన్న చిన్నస్వామి స్టేడియం నుండి శివార్లలో ఉన్న బొమ్మసాంద్రలోని కొత్త స్టేడియంకు క్రికెట్ మ్యాచ్ లు తరలిపోనున్నాయి. ఈ కొత్త స్టేడియం   దాదాపు 80,000 మంది కూర్చునే సామర్థ్యంతో. ఆధునిక సౌకర్యాలతో ఉంటుంది. చిన్న స్వామి స్టేడియం సామర్థ్యం 40 వేలు మాత్రమే.. అంటే ఈ కొత్త స్టేడియంలో అంతకు రెట్టింపు మంది ప్రేక్షకులు మ్యాచ్ లు వీక్షించే అవకాశం కల్పిస్తుంది.   

మంగళగిరి మహిళలే తోబుట్టువులు.. జన హృదయాలను గెలిచిన లోకేష్

నారా లోకేష్ ప్రజల మనిషిగా గుర్తింపు పొందుతున్నారు. జనంలో మమేకం కావడం, వారి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా.. వారిలో తానూ ఒకడినేనని తన చర్యలు, మాటలతో చాటుతున్నారు. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా లోకేష్ శుక్రవారం (ఆగస్టు 9) మంగళగిరిలోనే ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వాస్తవానికి జాతీయ ఆదివాసీ దినోత్సవంలో భాగంగా ముఖ్యంమంత్రి చంద్రబాబుతో పాటు మన్యం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో లోకేష్ పాల్గొనాల్సి ఉంది. అయితే.. తన సొంత నియోజకవర్గం అయిన మంగళగిరిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్న లోకేష్ మన్యం పర్యటనను స్కిప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. నియోజకవర్గ మహిళలతో ఆయన రాఖీలు కట్టించుకున్నారు.  మంగ‌ళ‌గిరి నేత చీర‌ల‌ను కానుక‌గా అందించారు. ఈ సందర్భంగా నారా లోకేష్..  తన‌కు తోబుట్టువులు లేరనీ, అందుకే  తపపే గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించి, అఖండ మెజారిటీతో గెలిపించిన మంగళగిరి మహిళలే తనకు అక్క చెల్లెళ్లనీ పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఈ ఒక్క మాటతో ఆయన మంగళగిరి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం దక్కించుకున్నారు. లోకేష్ మంగళగిరిని ఓన్ చేసుకోవడం కాదు. మంగళగిరి ప్రజలే లోకేష్ ను ఓన్ చేసుకున్నారు. ఇందుకు నిదర్శనం.. నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన తరువాత నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచీ పెద్ద సంఖ్యలో మహిళలు మంగళగిరి కార్యాలయానికి వచ్చి లోకేష్ కు రాఖీ కట్టేందుకు పెద్ద ఎత్తున క్యూలో నిలుచున్నారు. అలా తనకు రాఖీ కట్టేందకు వచ్చిన వారెవరినీ లోకేష్ నిరాశ పరచలేదు. గంటల తరబడి ఓపికగా నిలుచుని వారందరికీ తనకు రాఖీ కట్టేందుకు అవకాశం ఇచ్చారు.

హైదరాబాద్‌లో కుండ‌పోత వ‌ర్షం

  హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో  భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్  ఎల్‌బీ నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌,  సికింద్రాబాద్, తార్నాక‌, రామాంత‌పూర్‌, అంబ‌ర్‌ఫేట్, అమీర్‌పేట్‌, ఎర్ర‌గ‌డ్డ‌, కూక‌ట్‌పల్లి, మియాపూర్, గ‌చ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.  దీంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెండు రోజుల కిందట హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి జన జీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. శనివారం రాత్రి సైతం హైదరాబాద్ లో వర్షం దంచికొడుతోంది. రోడ్లన్నీ జలమయం కావడంతో.. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.  

చెప్పు తెగే వరకు కొడతా..కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు

  తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని ఎ. కొండూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడకల్లో జిల్లా కలెక్టర్లతో కలిసి కొలికపూడి పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఎ. కొండూరు మండలంలో వాటర్ సరఫరాపై జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలా ప్రచారం చేస్తే చెప్పుతో కొడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిముఖ్య అనుచరుడిని టార్గెట్ చేశారు కొలికపూడి. గిరిజనులకు మరుగుదొడ్లు కట్టించేందుకు గతంలో కాంట్రాక్ట్‌ తీసుకున్న టీడీపీ నేత రమేష్‌రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 320 మరుగుదొడ్లు కట్టించేందుకు బిల్లులు తీసుకున్నారన్నారు. అటువంటి వారి వెనుక  తిరుగుతారా? అంటూ గిరిజనును నిలదీశారు. అసలు మీకు సిగ్గుందా? గిరిజనులపై సైతం నోరు పారేసుకున్నారు కొలికపూడి.  

జగన్ అడ్డా టీడీపీ కంచుకోట కాబోతుంది

  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డా పులివెందుల టీడీపీ కి కంచుకోట కాబోతోందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం పులివెందులలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులంతా జడ్పీటీసీ ఎన్నికల్లో కలిసి పాల్గొంటున్నారని తెలిపారు. కడప, పులివెందులకు ఐదేళ్లలో  ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కు ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. కేంద్ర ప్రభుత్వం కొప్పర్తికి రూ.1,500 కోట్లు ఇచ్చింది. ఆ డబ్బును దారి మళ్ళించారని ఆరోపించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో దోచుకోవడంతోనే సరిపోయింది అన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసిన ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు.  మరోవైపు పులివెందుల ఓటర్లలో ఆనందం వెల్లవిరించింది.  1995 తరువా తొలిసారి జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటేయబోతున్న సంతోషం పండగ వాతావరణం గ్రామాల్లో తలపిస్తున్నాయి. పులివెందుల్లో తొలి నుంచి వైఎస్ కుటుంబం ఆదిపత్యం చెలాయిస్తున్నాయి. తొలిసారి వైఎస్ కోటలో బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలుపొందారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాంభూపాల్ రెడ్డి విజయం సాధించారు. తొలిసారి టీడీపీ నేతల్లో గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. పులవెందులలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయినా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ నెలకొంది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి సతీమణి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు.  ఈ ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో రెండు కూడా తమ ఫోకస్‌ అంతా అక్కడే పెట్టాయి. ఎంపీ అవినాశ్‌రెడ్డి వైసీపీ గెలుపు బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి , ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి టీడీపీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పులివెందులలో వరుసగా రెండురోజుల పాటు టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పులివెందులలో ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తుంది  

ఏపీలో 5, తెలంగాణలో 13 పార్టీలను డీలిస్ట్ చేసిన ఈసీ

  దేశంలో రాజకీయ పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. గుర్తింపు పొందని 334 రాజకీయ పార్టీలను జాబితాను తొలగించింది. నిబంధనల ప్రకారం ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు ఆరేళ్లలో కనీసం ఒక్క ఎన్నికలో అయిన పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈసీ డీలిస్ట్ చేసిన పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికలోనూ బరిలోకి దిగకపోవడంపై వాటిపై ఈసీ వేటు వేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 334 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 2,854 గుర్తింపు పొందిన పార్టీలు ఈసీ వద్ద రిజిస్టర్ అయి ఉన్నాయి. తాజా చర్యలతో ఆ సంఖ్య 2,520కి తగ్గింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం డీ లిస్ట్ చేసిన పార్టీల జాబితాతతో ఏపీ నుంచి 5, తెలంగాణ నుంచి 13 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఎస్పీ, ఆప్, నేషనల్ పీపుల్స్ పార్టీలకు మాత్రమే ఈసీ జాతీయ పార్టీల గుర్తింపు లభించింది.

మూడు విడతలుగా సినీ కార్మికుల వేతనాలు పెంపు

  సినీ కార్మికుల ఆందోళనపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మూడు విడతలుగా వేతనలు పెంచలని నిర్ణయించారు. రోజుకు రూ.2000 లోపు ఉన్నవారికి తొలి విడతలో 15 శాతం, రెండో వితలో 5 శాతం, మూడో విడతలో 5శాతం పెంచలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే 1000 లోపు ఉన్న కార్మికులకు 20శాతం ఒకేసారి పెంచుతమని వెల్లడించారు. తాము పెట్టిన నిబంధనలకి ఒప్పుకుంటే వేతనలు పెంచడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. చిన్న సినిమాలకు ఇవి వర్తించవని స్ఫష్టం చేశారు. మరోవైపు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశంలో, సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంపుపై తాను హామీ ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. ఫిలిం ఫెడరేషన్‌కు చెందిన కొందరు సభ్యులు తనను కలిశారనీ... వారి డిమాండ్లకు తాను అంగీకరించి, షూటింగ్స్ త్వరలో ప్రారంభిస్తానని హామీ ఇచ్చాననీ... మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని  మెగాస్టార్ తన ప్రకటనలో తెలిపారు. "నేను ఫెడరేషన్ నుంచి ఎవరినీ కలవలేదు. అసలు వాస్తవాలు వెల్లడించడానికే ఈ ప్రకటన చేస్తున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.  

తెలంగాణలో రూ.80 వేల కోట్లు పెట్టుబడులు

  తెలంగాణలో రూ.80 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ బృందం ఇవాళ జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని  మర్యాదపూర్వకంగా కలిసి విద్యుత్ ఉత్తత్తి రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్‌ ఉత్పత్తికి అవకాశం ఉందని సీఎంకు ఎన్టీపీసీ బృందం తెలిపింది.  దీంతో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాలా సహకరిస్తామని  రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఎన్టీపీసీ సుముఖత తెలిపింది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు ఎన్టీపీసీ సుముఖంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆ ప్రతినిధి బృందం తెలిపింది. ప్రధానంగా సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో దాదాపు 80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ వివరించారు.

ఢిల్లీలో గోడ కూలి 8 మంది మృతి

  దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది.  జైత్‌పూర్ ప్రాంతంలో ఓ గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి అక్కడి ఓ ఆలయం సమీపంలోని గోడ పూర్తిగా నానిపోయింది.  ఉదయం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గోడ కూలిపోవడంతో సమీపంలో నివసిస్తున్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మృతులను ముట్టు అలీ (45), రబీబుల్ (30), షబీబుల్ (30), రుబీనా (25), డాలీ (25), హషిబుల్, రుఖ్సానా (6), హసీనా (7)గా గుర్తించారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యంలోనే వారు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పాత ఇనుము వ్యాపారులు నివసించే ఈ మురికివాడలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.

ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్..20 శాతం డిస్కౌంట్

  ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఫెస్టివల్ సమయాల్లో రద్దీ దృష్ట్యా రౌండ్ ట్రిప్ ప్యాకేజీ స్కీమ్​ కింద రిటర్న్ ఛార్జీలపై డిస్కౌంట్‌ను ప్రవేశపెట్టింది.  20 శాతం రాయితీ ప్రకటించింది. ఆక్టోబర్ 13 నుంచి 26 మధ్య ఏ ప్రాంతానికైనా ప్రయాణించి తిరుగు ప్రయాణం నవంబర్ 17నుంచి డిసెంబర్ 1 మధ్య ప్రయాణం చేసే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ నెల 14న తేదీ నుంచి ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేశాక టిక్కెట్ రద్దు చేస్తే డబ్బులు రావు.  పండుగల సమయంలో ఒక వైపుకు ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ పథకం ద్వారా రెండు వైపులా రైళ్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ ఉద్దేశం. దీనివల్ల ప్రత్యేక రైళ్లకు కూడా బుకింగ్ ఆశించిన స్థాయిలో ఉంటుందని భావిస్తోంది. ఆన్ లైన్ లేదా ఆఫ్​లైన్ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.  రైల్వే బుకింగ్ వెబ్‌సైట్‌లోని ‘కనెక్టింగ్ జర్నీ’ ఫీచర్ ద్వారా ప్రయాణికులు ఈ స్కీమ్‌ను ఉపయోగించకోవచ్చు. అయితే, వెళ్లడానికి, తిరుగు ప్రయాణానికి ఒకేసారి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికుల వివరాలు, ప్రయాణించే క్లాస్, బయలుదేరే స్థానం, గమ్యస్థానం ఒకేలా ఉండాలి. రెండు టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయితే డిస్కౌంట్ వస్తుంది. ఈ పథకం కింద రిటర్న్‌ టికెట్‌ బుకింగ్‌ చేసేటప్పుడు సాధారణంగా ఉండే 60 రోజుల ముందస్తు రిజర్వేషన్‌ కాలపరిమితి (ఏఆర్‌పీ) వర్తించదని రైల్వే శాఖ తెలిపింది

శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా..మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

  మేడ్చల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నానని.. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకునే ఆలోచనలో ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఖీ పండుగ సందర్భంగా.. తన అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకున్న అనంతరం ఇవాళ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాఖీ పండగంటే తనకు ఎంతో ఇష్టమన్న మల్లారెడ్డి.. ఈ పండుగ నాడే తన ఇంజనీరింగ్‌ కళాశాలలు ప్రారంభించానని తెలిపారు.  తనకు 73 సంవత్సరాలు వచ్చాయని... ఈ వయసులో ఏవైపూ చూడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని... ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. ఆ తర్వాత రాజకీయం వద్దనుకుంటున్నానని... ప్రజలకు సేవ చేస్తూ కాలేజీలు, యూనివర్శిటీలు నడిపిద్దామనుకుంటున్నానని తెలిపారు. రాజకీయంగా బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ పార్టీల వైపా అన్నది కాదని.. తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని మల్లారెడ్డి చెప్పారు.ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యా. ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటా’’ అని చెప్పుకొచ్చారు.

సొంత చెల్లికి అన్యాయం చేసి.. అక్కచెల్లెమ్మలకు శుభాకాంక్షలా?

రాఖీ పూర్ణిమ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్  రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు  శుభాకాంక్షలు తెలిపారు.  అయితే రాఖీ పండుగ సందర్భంగా జగన్ రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు శుభాకాంక్షలు తెలపడాన్ని నెటి జనులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలందరికీ శుభాకాంక్షలు అన్న జగన్ ట్వీట్ పై నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. సొంత చెల్లెమ్మకు న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలోని చెల్లెమ్మలకు శుభాకాంక్షలు చెప్పడమేంటంటూ ఎద్దేవా చేస్తున్నారు.   జగన్ అధికారం కోసం, అలాగే దోచుకున్న సొత్తు దాచుకోవడం కోసం చేస్తున్న మోసం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  జగన్ తన సోదరి షర్మిలను దూరం పెట్టి, ఆమెకు రావలసిన ఆస్తులను ఇవ్వకుండా వేధిస్తున్నారని నెటిజనులు దుయ్యబడుతున్నారు. ఆస్తుల కోసం, వాటాల కోసం   సొంత తల్లి,  చెల్లిపైనే కేసు వేసిన మాజీ ముఖ్యమంత్రి రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలంతా సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.  

ఎంపీ మిథున్‌కు సోదరి రాఖీ కట్టడానికి జైలు అధికారులు అభ్యంతరం

    రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తన సోదరి రాఖీ కట్టడాన్ని జైలు అధికారులు  అభ్యంతరం తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్‌ రెడ్డిని ఆయన సోదరి శక్తి రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ కలిసేందుకు వెళ్లారు.  ఈ క్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టేందుకు తీసుకు వెళుతున్న రాఖీలను జైలు అధికారులు వాటిని వెనక్కి పంపించారు. దీంతో, రాఖీలు లేకుండానే ఆమె ములాఖత్‌కు వెళ్లారు. అనంతరం, ఎంపీ గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ..‘జైలు అధికారులు  వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. చేదు అనుభవాలతో జైలులోకి వెళ్లాల్సి వచ్చింది. రక్షాబంధన్‌ రోజున సోదరితో రాఖీ కట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదని గురుమూర్తి  ఆవేదన వ్యక్తం చేశారు.