పెన్సిల్ కోసం పిల్లల తగవు.. నిండు ప్రాణం బలి!

ఒక పెన్సిల్ కోసం ఇద్దరు పిల్లల ఘర్షణ పెద్ద వాళ్ల జోక్యంతో పెద్ద గొడవగా మారి నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా శెట్లూరు పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.  అనంతపురం జిల్లా శెట్టూరు లోని ఎర్రిస్వామి, మరియమ్మ దంపతుల కుమారుడు క్రిష్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగలి చదువుతున్నాడు. అదే పాఠశాలలో అదే తరగతి చదువుతున్న  అదే గ్రామానికి చెందిన  ప్రకాష్, ప్రమీల దంపతుల కుమారుడు గగన్ తో పెన్సిల్ విషయంలో గొడవపడ్డాడు.   పిల్లల తగవే కదాని వదిలేయకుండా  క్రిష్ తల్లిదండ్రలు బంధువులతో కలిసి గగన్ తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డారు. గగన్ ఇంటికి వెళ్లి మరీ కొట్టారు. ఈ దాడిలో గగన్ తండ్రి  ప్రకాష్ (37) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కల్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రకాష్ మృత్యువాత పడ్డారు. ప్రకాష్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన  ఎర్రిస్వామి సహా ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు.  

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్

  పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆపరేషన్ సిందూర్ తరువాత ఇరు దేశాల మధ్యా నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో పాక్ అభ్యర్థన మేరకు భారత్ సీజ్ ఫైర్ కు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ తరువాత తొలి సారిగా సరిహద్దుల్లో పాకిస్థాన్ ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ సైనికులు భారత సైనిక పోస్టులు లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. దాదాపు పావుగంట సేపు ఈ కాల్పులు జరిగాయి. అయితే భారత సైన్యం దృష్టి మళ్లించి ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం కల్పించడానికే పాక్ సైన్యం కాల్పులకు తెగబడి ఉంటుందని భావిస్తున్న ఇండియన్ ఆర్మీ బోర్డర్ లో హై అలర్ట్ ప్రకటించింది.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట.. ప్రభుత్వానికి NHRC నోటీసు

  తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి రామకృష్ణారావుకి జాతీయ మానవ హక్కుల సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తు తీరుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చింది. ఈ ఘటనపై ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది. ముందే చర్యలు తీసుకోని ఉంటే తొక్కిసలాట ఘటన జరిగేది కాదు అని పేర్కొంది. నిష్పక్షపాతంగా దర్యాప్తు పూర్తిచేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ని ఆదేశించింది. గత ఏడాది పుష్ప -2 మూవీ ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్‌లో ప్రదర్శించారు. అయితే అదే సమయంలో థియేటర్‌ వద్దకు హీరో అల్లు అర్జున్ రావడంతో ఆయనను చూడటానికి భారీగా ఫ్యాన్స్  చేరారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూడటానికి వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై రేవతి కుటుంబానికి పుష్ప మూవీ టీమ్ పరిహారం అందజేసింది. గతంలో ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతీ తెలిసిందే.

పొలిటికల్ ఎంట్రీపై హీరో సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  ఏపీలో కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందని సినీ నటుడు సుమన్ వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఆయన ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు చాలా సమయం ఉందని... ఎన్నికల గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలంటే ప్రభుత్వాలకు అందరూ మద్దతివ్వాలని సూచించారు.  దేశంలో కొన్ని రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయని... ఆ ఎన్నికల గురించి  తర్వాత ఆలోచిస్తానని తెలిపారు. తాను తమిళనాడులోనే పుట్టి పెరిగానని... అందుకు తనను అక్కడ పోటీ చేయమని అడిగారని... అయితే, తర్వాత చెబుతానని తాను వారికి చెప్పానని తెలిపారు. సుమన్ ఇవాళ గుంటూరులో పర్యటించారు. 

మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు

  తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల నరనరాల్లో కుల పిచ్చి పాతుకుపోయిందని మంత్రి ఆరోపించారు.  42 శాతం బీసీ రిజర్వేషన్ల  సాధన కోసం ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్  వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది మూర్ము వితంతు మహిళ అని ప్రధాని మోదీ పిలవలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆమె గిరిజన మహిళ అని అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదని కొండా సురేఖ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రపతి వంటి గౌరవ పదవిపై జరిగిన వ్యాఖ్యలపై సమాజంలో అన్ని వర్గాల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

అసెంబ్లీకి వెళ్లుటయా.. మానుటయా.. కింకర్తవ్యం?.. కేసీఆర్ మథనం!?

అటు చూస్తే బాదం హల్వా,  ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ ఎంచుకునే సమస్య కలిగిందొక విద్యార్థికి.. అంటారు మహాకవి శ్రీశ్రీ తన సంధ్యా సమస్యలు కవితలో.. ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎటూ తేల్చుకోలేని సమస్యతో మథనపడుతున్నారు.  ఔను ఇప్పుడు ఆయనకు పెద్ద చిక్కు సమస్యే ఏదురైంది.   అసెంబ్లీకి వెళ్లుటయా? మానుటయా అన్నది తేల్చుకోలేక తీవ్రంగా మథన పడుతున్నారంటున్నారు పరిశీలకులు.  అసలు అసెంబ్లీకి వెళ్లుటయా? మానుటయా అన్న సంశయంతో కేసీఆర్ మథనపడటమేంటి? అసలాయన గత ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత రెండు సార్లు వినా అసెంబ్లీకి వెళ్లిందే లేదుగా అనుకుంటున్నారా? అ విషయానికి వద్దాం.  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్లకుంట్ల చంద్రశేఖరరావుకు గొప్ప చిక్కే వచ్చి పడింది. పార్టీ  పరాజయం తరువాత దాదాపుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ రాజకీయంగా ఏ మాత్రం క్రియాశీలంగా వ్యవహరించలేదు. పార్టీ వ్యవహారాలలోనూ అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి హాజరయ్యే బాధ్యతనూ విస్మరించారు. పార్టీ పరాజయం తరువాత ఆయన కేవలం రెండంటే రెండు సార్లు అసెంబ్లీకి హాజరయ్యారు. అప్పుడు కూడా నోరెత్తి మాట్లాడలేదు. మరి ఇప్పుడు అసెంబ్లీ హాజరవ్వాలా వద్దా అన్న మీమాంశ ఎందుకంటే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాలలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించి.. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ నివేదికను అనుసరించి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతికి బాధ్యులపై చర్యకు నిర్ణయం తీసుకుంటారు.  కాళేశ్వరంలో చాలా అవకతవకలు, అవినీతి జరిగిందంటూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికపైనా తెలంగాణ అసెంబ్లీ చర్చించబోతోంది. అయితే ఆ నివేదిక అంతా బూటకమని మాజీ మంత్రి హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు కొట్టి పారేస్తున్నారు.  నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ నిపుణులు డిల్లీ నుంచి వచ్చి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను పరిశీలించి ఆ మూడు చాలా ప్రమాదకరంగా మారాయని నివేదిక ఇస్తేదానిని బీజేపీ కుట్రగా అభివర్ణించారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదికనున కాంగ్రెస్ నివేదిక అంటున్నారు. అయితే ఈ  నివేదికపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ  ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తే ఆ సమావేశాలకు కేసీఆర్ హాజరై నివేదికను ఎండగడతారని చెబుతున్నారు. ఇక్కడే కేసీఆర్ కు చిక్కు వచ్చింది. దాదాపు ఏడాదిన్నరకు పైగా అసెంబ్లీ సమావేశాలకు రాని కేసీఆర్.. ఇప్పుడు సమావేశాలకు హాజరై తనను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించడానికి రెడీ అయిపోవడం, ఒక వేళ నివేదిక ఆధారంగా తనపై చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే సుప్రీం కోర్టు వరకూ వెళ్లైనా న్యాయం కోసం పోరాడతాం అనడంపై పరిశీలకులే కాదు, సామాన్య ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు.   ఇంతకాలం ప్రజా సమస్యలను కనీసం పట్టించుకోకుండా ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్.. ఇప్పుడు కాళేశ్వరం కేసు తన మెడకు చుట్టుకునే పరిస్థితి రావడంతో తగుదునమ్మా అని అసెంబ్లీకి హాజరై తనను తాను సమర్ధించుకుంటూ గళమెత్తితే ప్రజలకు ఏం సంకేతమించినట్లు అవుతుందని కేసీఆర్ భయపడుతున్నారట. మాజీ ముఖ్యమంత్రిగా, పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధినేతగా, ఒక ఎమెల్యేగా ఈ ఏడాదిన్నర కాలం కేసీఆర్ ప్రజాసమస్యలపై గళమెత్తి, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై తన వాణిని వినిపించి ఉంటే.. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో తనను తాను సమర్ధించుకొనే విషయంలో జనం నుంచి ఎటువంటి అభ్యంతరాలూ వచ్చి ఉండేవి కావు. కానీ అలా చేయకుండా కేవలం తన సమస్యే రాష్ట్ర సమస్య అన్నట్లు ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ప్రభుత్వాన్నీ, కమిషన్ నివేదికనూ సభ వేదికగా ఎండగడతానంటే జనం తనను స్వార్థపరుడిగా భావిస్తారన్న సంశయం కేసీఆర్ ను వేధిస్తున్నదంటున్నారు. అలాగని కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చకూ డుమ్మా కొడితే.. తన హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలకు సమాధానం చెప్పుకోలేక భయపడి ఫామ్ హౌస్ లో దాక్కున్నారన్న నిందను మోయాల్సి వస్తుందన్న భావనా ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని అంటున్నారు. దీంతో కేసీఆర్ ఎంచేయాలో తెలియని పరిస్థితుల్లో దిక్కుతోచక ఆందోళనకు గురౌతున్నారని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట.  

సీఎం రేవంత్‌ భాష మార్చుకోవాలి.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  సీఎం రేవంత్‌రెడ్డిపై మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి తన భాష  హావభావాలను మార్చుకోవాలని ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు చెప్పాలని తెలిపారు. రేవంత్ రెడ్డి గంటలు గంటలు మాట్లాడకుండా.. ఆ శ్రద్ధ పని మీద చూపించాలని హితవు పలికారు.  ఇంకో మూడున్నర ఏళ్లు ఆయనే సీఎం.. ఆ తర్వాత ఎవరు అనేది అధిష్టానం, ప్రజలు నిర్ణయిస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి పదవిపై తనకు అధిష్ఠానం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.  రేవంత్ వెనుకాల 20 మంది ఆంధ్రా పెట్టుబ‌డిదారులు ఉన్నార‌ని రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.  

పిచ్చోడి చేతిలో బలైన సైకాలజిస్ట్

ఆమె ఒక మంచి డాక్టర్.. తన వద్దకు వచ్చిన మానసిక రోగికి వైద్యం చేసి నయం చేయడమే కాకుండా అతడిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది.  కానీ చివరకు అతని  వేధింపులు భరించ లేక ఆత్మహత్య చేసుకుంది... ఈ విషాద  ఘటన హైదరాబాదు నగరంలో చోటుచేసుకుంది. సనత్ నగర్ లో నివాసముంటున్న సబ్ ఇన్స్పెక్టర్ నర్సింహ గౌడ్ కుమార్తె రజిత (33) సైకాలజిస్ట్ గా ఇంటర్నషిప్ లో భాగంగా జూబ్లీ హిల్స్ లోని ఓ మానసిక చికిత్సాలయంలో పనిచేస్తున్న సమయంలో అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న.. కెపిహెచ్ బి  కి చెందిన ఆగు రోహిత్ (33) అనే వ్యక్తితో డాక్టర్ రజితకు పరిచయం ఏర్పడింది. అయితే డాక్టర్ రజిత మానసిక రోగి అయిన రోహిత్ కు వైద్యం చేసింది.  తాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నని డాక్టర్ రజితకు చెప్పాడు. అంతే కాకుండా  ప్రేమిస్తున్నానంటూ డాక్టర్ రజిత వెంట పడ్డాడు.. రోహిత్ కు పూర్తియా నయం అయ్యిందని భావించిన రజిత   అతడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది.  తల్లిదండ్రుల అనుమతిలో  అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.  రజిత ఎంతో సంతోషంతో రోహిత్ జీవితంలోకి  అడుగు పెట్టింది. అయితే ఆమెకు విషాదమే ఎదురయ్యింది. వి వాహం అయిన తర్వాత రోహిత్ పని చేయ కుండా జల్సాలకు అలవాటు పడ్డాడు. రజిత మాత్రం నగరంలోని ప్రముఖ ఇంటర్నేషనల్ పాఠశాలలో చైల్డ్ సైకాలజిస్ట్ గా పని చేస్తున్నారు. రజిత జీతం డబ్బులు కూడా తీసుకొని రోహిత్ ఎంజాయ్ చేసేవాడు. చెడు అలవాట్లు మాను కోవాలని రజిత ఎన్ని మార్లు చెప్పినా కూడా అతనిలో మార్పు రాలేదు. పైగా వేధింపులు మొదలు పెట్టాడు. తానే కాకుండా తన  తల్లి సరేష, తండ్రి కిష్టయ్య, సోదరుడు మోహిత్ తో కలిసి భార్య రజిత ను వేధించేవాడు. రజిత జీతం డబ్బులు ఇవ్వక పోతే ఇష్టం వచ్చి నట్లు ఆమెను కొట్టేవాడు.  రోజు రోజుకి భర్త రోహిత్ వేధింపులు మితి మీరిపోవడంతో భరించలేక రజిత గత నెల 16వ తేదీన నిద్ర మాత్రలు  మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కానీ సమయానికి తల్లిదండ్రులు హాస్పిటల్ కి తీసుకు వెళ్లడంతో ప్రాణా లతో బయటపడింది. ఆ తర్వాత గత నెల జూలై 28న బాత్రూం కిటికీ లోనుంచి కిందకు దూకి మరోసారి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు వెంటనే  అమీర్ పేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు పరీక్ష చేసి ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా  నిర్ధారించారు...  రజిత బుధవారం (ఆగస్టు 6) మరణించారు. రజిత తల్లిదం డ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డికి రాచమర్యాదలు.. ఒకే రోజు రెండు ములాఖత్ లు!

మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. అంటే జగన్ హయాంలో  నారా చంద్రబాబునాయుడిని వైసీపీ స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు మగ్గేలా చేశారు. అప్పట్లో అధికారులు ఆయన్ని  ఎన్నో ముప్పతిప్పలు పెట్టారు. అప్పట్లో రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయంలో వైసీపీ రాజ్యాంగం నడిచిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో పరిస్థితులు ఏమీ మారలేదనీ, ఇప్పుడు కూడా ఆ జైలులోనూ, బయనా కూడా  వైసీపీ రాజ్యాంగమే నడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాడు చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో ములాఖత్‌లకే ముప్పుతిప్పలు పెట్టారు. జైలు పరిసరాల్లోకి టీడీపీ నేతలను అనుమతించనేలేదు. మరిప్పుడో.. మద్యం స్కాంలో   ఏ-4 నిందితుడు, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి రాజమహేందరవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు సెంట్రల్‌ జైలు అధికారులు రాచమర్యాదలు చేస్తున్నారు. అడిగింది లేదనకుండా.. కోరింది కాదనకుండా సెల్యూ ట్‌ చేసి మరీ సౌకర్యాలు కల్పిస్తున్నారు. రిమాండ్‌లో ఉన్న నిందితుడికి రోజుకు ఒకసారి ములాఖత్‌ అంటేనే కష్టం. కానీ మిథున్‌రెడ్డికి మాత్రం రోజుకు రెండు సార్లు ములాఖత్ లకు అవకాశం ఇస్తున్నారు.   అంతేకాదు.. సెంట్రల్‌ జైలు ప్రధాన గేటు ఎదుట వైసీపీ నాయకులు, శ్రేణులు గుంపులు గుంపులుగా గుమిగూడి.. హంగామా చేస్తు న్నా కనీస చర్యలు తీసుకోవడం లేదు.   మిథున్‌రెడ్డిని మంగళవారం (ఆగస్టు 5) ఆయన తండ్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్‌లో కలిశారు. ఆయన వెంట ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే జక్కం పూడి రాజా ఉన్నారు. సాధారణంగా ములాఖత్‌కు ముగ్గురికే అనుమతి ఉంది. ప్రధాన గేటు గుండా పెద్దిరెడ్డి, తలశిల, రాజా కలిసి సెంట్రల్‌ జైలు ఆవరణ నుంచి జైలు గుమ్మం వరకూ వెళ్లారు. వారిని నల్లకోటు లేని న్యాయవాది హుస్సేన్‌ కూడా అనుసరించారు. ఆయన్ను పోలీసులు గానీ, సెంట్రల్‌ జైలు అధికారులు గానీ ఆపలేదు. తర్వాత పెద్దిరెడ్డి, తలశిల కలిసి ముందుగా మిథున్‌రెడ్డితో ములాఖత్‌ అయ్యారు.  వారు వచ్చేసిన తర్వాత జక్కంపూడి రాజా ప్రత్యేకంగా మిథున్‌రెడ్డితో ములాఖత్‌ అయ్యారు. ఆయనతో హుస్సేన్‌ కూడా వెళ్లారు. వారు వచ్చేవరకూ పెద్దిరెడ్డి, తలశిల జైలు ప్రధాన ద్వారం వద్దే నిలబడి ఉన్నారు. మిథున్‌రెడ్డికి రోజుకు ఒకే ములాఖత్‌కు అనుమతి ఉండగా.. జైలు అధికారులు రెండింటికి ఎలా అనుమతించారనేది చర్చనీయాంశంగా మారింది.

కేటీఆర్ నోట జగన్ పాట.. రాబోయే పరాజయానికి ఇప్పటి నుంచే సాకుల వెతుకులాట?!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలూ దాదాపు ఒకే పడవ మీద నడుస్తున్నాయా అనిపించక మానదు. ఈ పార్టీలు తమ తమ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత మాట్లాడుతున్న మాటలూ దాదాపు ఒకేలా ఉన్నాయి. తాము గెలిచినప్పుడు ఈవీమ్ లు భేష్.. అదే ఒటమి రాగానే ఈవీఎంల ట్యాంపరింగే పరాజయానికి కారణమంటూ గగ్గోలు పెట్టే విషయంలో ఈ రెండు పార్టీలూ ఒకే పాట పాడుతున్నాయి.  2024 ఎన్నికలలో వైసీపీ అత్యంత ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలతో మిగిలింది. పరిశీలకులైతే.. ఈ 11 స్థానాలైనా.. రాష్ట్రంలో పొత్తు కారణంగా కొన్ని స్థానాలలో బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టక తప్పని పరిస్థితి కూటమి కూటమి పార్టీలకు రావడం వల్లనే వచ్చాయంటారు. పొత్తు ధర్మంలో భాగంగా కూటమిలో  సీట్ల సర్దుబాటు కారణంగానే  వైసీపీకి ఆ 11 స్థానాలైనా దక్కాయనీ, లేకుంటే కనీసం సింగిల్ డిజిట్ కూడా దాటే అవకాశం ఉండేది కాదనీ చెబుతున్నారు.  అయితే ఈ వాస్తవాలనన్నిటిని విస్మరించి జగన్ ఈవీఎంల ట్యాంపరింగే తమ పార్టీ ఓటమికి కారణం అంటుంటే.. బీఆర్ఎస్ ఓటమి తరువాత దాదాపు రెండేళ్లకు అదే పాట ఎత్తుకుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ కానీ ఓడిపోవడానికి ఆయా పార్టీలు అధికారంలో ఉండగా అనుసరించిన విధానాలు, అవినీతి, అరాచకాలు, పాలనా లోపాలే కారణమన్నది నిర్వివాదాంశం. ఈవీఎంల వల్లే ఓడిపోయామంటే.. ఆ పార్టీలు గతంలో తమ విజయాలు కూడా ఈవీఎంల వల్లే వచ్చాయని కూడా అంగీకరించాల్సి ఉంటుంది. అయితే రెండు పార్టీలూ కూడా విజయాలు తమ ఘనత, పరాజయం ఈవీఎంల వల్ల అంటూ చెప్పుకుంటున్నాయి. తమ పాలనా వైఫల్యాలను అంగీకరించడానికి వాటికి అహం అడ్డొస్తోందని పరిశీలకులు అంటున్నారు.   ఇప్పుడు తాజాగా కేటీఆర్ కూడా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగితే విజయం తమదే అంటూ జగన్ పాట అందుకున్నారు.   బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర ఎన్నికల కమిషనర్ ను బుధవారం (ఆగస్టు 5)  బ్యాలెట్ పద్ధతిలోనే  ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇక ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడంలో బీఆర్ఎస్, వైసీపీలు ఒకే పాట పాడుతున్నాయి.  అయినా 2014, 2019 ఎన్నికలలో ఈవీఎంలతో దక్కించుకున్న విజయాన్ని ఓన్ చేసుకున్న బీజేపీకి, అలాగే 2019 ఎన్నికలలో గెలుపొందిన వైసీపీకి.. అప్పుడు ఈవీఎంలపై లేని అభ్యంతరం పరాజయం తరువాత ఎందుకు వచ్చింది?  అంటే.. రాబోయే ఎన్నికలలో పరాజయాన్ని ఇప్పుడే అంగీకరించి.. ఆ రాబోయే ఓటమికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కుంటున్నాయా అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

సిరాజ్ టాలెంట్.. రేవంత్ ముందే గుర్తించారు!

మహ్మాద్ సిరాజ్.. డీఎస్పీ సాబ్.. లండన్ లో  ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండియా చివరిదైన ఓవెల్ టెస్ట్ లో చారిత్రాత్మక విజయం తరువాత దేశ వ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. అద్భుత ప్రతిభ ఉన్నప్పటికీ.. అందుకు తగిన విధంగా సిరాజ్ కు టీమ్ ఇండియాలో గుర్తింపు రాలేదు. ఇందుకు కారణం.. అద్భుత ఫిట్ నెస్, ఫామ్ ఉన్నప్పటికీ.. ప్రధాన బౌలర్ బుమ్రా నీడలో సిరాజ్ కు రావలసినంత గుర్తింపు రాలేదు. ఇండియన్ బౌలింగ్ అటాక్ గురించి ఎప్పుడు, ఎవరు మాట్లాడినా పేసర్ బుమ్రా, స్పీన్నర్లు అశ్విన్ ల పేర్లే ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే.. 2004లో సిరాజ్ లో ఉన్న టాలెంట్ ను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ కోటాలో సీరాజ్ ను డీఎస్పీని చేశారు. తెలంగాణలో ఆయనకు డీఎస్పీ పోస్టు ఇచ్చి ప్రోత్సహించడం అప్పట్లో పలు విమర్శలు దారి తీసింది.  అయితే  ఇంగ్లాండ్ తో సిరీస్ లో భాగంగా సిరాజ్ అద్భుత ప్రదర్శన టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చిన తరువాత అందరూ డీఎస్పీ అన్న పదాన్ని సిరాజ్ ఇంటిపేరుగా మార్చి సంబోధించడం మొదలు పెట్టారు. సరైన సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ హైదరాబాదీ యువ క్రికెటర్ లోని టాలెంట్ ను, ఫైర్ ను గుర్తించి గౌరవించిందని ఇప్పడు అంతా అంటున్నారు. నేషనల్ హీరో సిరాజ్ ను తొట్ట తొలత గుర్తించి సముచిత రీతిలో గౌరవించిందని తెలంగాణ సర్కార్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. స్టార్ బౌలర్ బుమ్రా ఆబ్సెన్స్ లో జట్టు బౌలింగ్ భారాన్ని సిరాజ్ పూర్తిగా భుజానికెత్తుకుని టీమ్ ఇండియాకు చారిత్రక విజయాన్ని అందించాడని వేనేళ్ల పొగడుతున్నారు. అన్నిటికీ మించి ఒక పేస్ బౌలర్ గా ఆయన తన ఫిట్ నెస్ ను, అంకిత భావాన్ని అనితర సాధ్యమన్న రీతిలో ప్రదర్శించారు. ఇంగ్లాండ్, ఇండియా ఐదు టెస్టుల సిరీస్ మొత్తంలో  ఐదు టెస్టులూ ఆడిన ఏకైక పేస్ బౌలర్ గా నిలిచాడు. సిరీస్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గానే కాకుండా అందరి కంటే ఎక్కువ ఓవర్లు వేసిన బౌలర్ గా కూడా నిలిచాడు. 

వివేకా హ‌త్య కేసులో అస‌లేం జ‌రుగుతోంది?

వివేకా  హ‌త్య కేసులో త‌మ విచార‌ణ ముగిసింద‌ని సుప్రీం కోర్టుకు విన్న‌వించుకుంది సీబీఐ. 2019 మార్చి 15న జ‌రిగిన ఈ హ‌త్య కేసు రెండు ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పాత్ర పోషించింది. 2019లో టీడీపీని ఇరుకున పెట్టిన ఈ కేసు.. త‌ర్వాత 2024 నాటికి వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. గూగుల్ టేక‌వుట్ అనే కొత్త ప‌దాన్ని  ఈ హత్య కేసే పరిచయం చేసింది. గూగుల్ టేకౌట్ ద్వారా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్క‌ర్ రెడ్డి కార్న‌ర్ అయ్యారు. ఇక భాస్క‌ర్ రెడ్డి అయితే  అరెస్ట‌య్యారు. అవినాష్ రెడ్డి అరెస్టు అతి పెద్ద డ్రామాను త‌ల‌పించింది. జ‌గ‌న్, భార‌తీ రెడ్డికి ఈ హ‌త్య స‌మాచారం ఫ‌లానా ఫ‌లానా స‌మ‌యాల్లో తెలిసింద‌న్న వార్త‌లు వెలుగు చూశాయి. ఎంద‌రో అధికారులు మారిన ఈ కేసులో.. తొలుత జ‌గ‌న్ పార్టీ చంద్రబాబును టార్గెట్ చేయ‌గా.. త‌ర్వాత త‌న హ‌యాంలో ఈ కేసు విష‌యంలో వివేక కుమార్తె సునీత.. జ‌గ‌న్ నే ప్ర‌ధాన కార‌కుడిగా ఆరోపణలు చేశారు. ఇది కుటుంబ హ‌త్యా లేక వ్యాపార లావాదేవీల మ‌ధ్య జ‌రిగిన హ‌త్యా? అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డింది. ఈ కేసులో  ద‌స్త‌గిరి అప్రూవ‌ర్ గా మార‌డం,  అత‌డు అప్పుడ‌ప్పుడూ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వంటివెన్నో న‌డిచాయ్. వివేకాకు కడప ఎంపీ టికెట్ ఇవ్వాల్సి వస్తుందన్న   కోణంలో ఈ హ‌త్య జ‌రిగింద‌న్న‌ది ఒక వ‌ర్గం వాద‌న కాగా.. రెండో భార్య, ఆమె పిల్ల‌లు ఆస్తిపంప‌కాల వ్య‌వ‌హారంలో వ‌చ్చిన త‌గువులాట‌లే కార‌ణ‌మంటూ మ‌రొక వ‌ర్గం వాద‌న‌. బెంగ‌ళూరులో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ క‌మీష‌న్లలో వ‌చ్చిన గొడ‌వ‌లే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌న్న‌ది మ‌రో వ‌ర్ష‌న్.  కాదు.. రేప‌టి రోజున జ‌గ‌న్ అరెస్ట‌యితే.. అధికారం భార‌తికి ఇవ్వాలా, ష‌ర్మిలకా అన్న విషయంలో .. వివేకా ష‌ర్మిళ వైపు నిలవడమే ఈ హ‌త్య కారణమన్న వాదనా వెలుగులోకి వచ్చింది.   ఈ కేసు మీద వివేకం, హ‌త్య అనే రెండు సినిమాలు రాగా.. వీటిలో హ‌త్య అనే సినిమా వైసీపీ తీసిన‌ట్టుగా చెబుతారు. అయితే సినిమా క్లిప్పింగుల‌ను షేర్ కొట్టినా కేసులు పెట్టిన ప‌రిస్థితులు. ఒక వేళ కోర్టు మ‌రేదైనా విచార‌ణకు ఆదేశిస్తే తాము త‌దుప‌రి ద‌ర్యాప్తులోకి దిగుతామ‌ని సీబీఐ సుప్రీం కోర్టు ముందు విన్న‌వించుకుంది. మ‌రి ఈ కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ ర‌ద్ద‌వుతుందా? హత్యకు  కార‌కులు వీరేన‌ని ఏదైనా తేలుతుందా? వంటి అంశాలు ఉత్కంఠ భ‌రితంగా మారాయి. ఇప్ప‌టికున్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టీ చూస్తే ఈ కేసులో కావ‌చ్చు, మ‌ద్యం కేసులో కావ‌చ్చు జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌లు జ‌గ‌న్ అండ్ కోను ఏమంత ఇబ్బంది పెడుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. దీంతో వివేకా కేసు విష‌యంలోనూ అనూహ్య ప‌రిణామాలేవీ ఉండ‌క పోవ‌చ్చిన పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్.. ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ

బెట్టింగ్ యాప్ ల ప్రచారానికి సంబంధించిన ఈడీ దర్యాప్తు జోరందుకుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేసిన కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ను విచారించిన ఈడీ.. బుధవారం (ఆగస్టు 6) హీరో విజయ్ దేవరకొండను విచారించనుంది.  నిషేధానికి గురైన బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి స్టార్ సినిమా నటుల వరకూ పలువురిపై నజర్ పెట్టిన ఈడీ వారికి నోటీసులు పంపి వరుసగా విచారణకు పిలుస్తున్నది.  బెట్టింగ్ యాప్స్ కారణంగా అప్పుల ఊబిలో కూరుకుని బలవన్మరణాలకు పాల్పడిన వారెందరో ఉన్నారు. అటువంటి బెట్టింగ్ యాప్స్ ను సెలబ్రిటీలే ప్రమోట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈడీ వారిని విచారణ చేస్తున్నది. అందులో భాగంగా నటుడు విజయ్ దేవరకొండను ఈడీ విచారించనుంది. ఇక ఇదే కేసులో మరో నటుడు దగ్గుబాటి రాణాను ఈ నెల 11న, నటుడు మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మిని ఈ నెల 13న ఈడీ విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్ ను గత నెల 30 దాదాపు ఐదుగంటల పాటు విచారించిన ఈడీ ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.  

బీఆర్ఎస్‌తో బాల్క సుమన్‌కు రుణం తీరిపోయిందా?

గులాబీ పార్టీలో ముఖ్యనేతలకు అత్యంత వీరవిధేయుడు మాజీ ఎంపీ కమ్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. పార్టీలోని ముఖ్య నాయకులలో ఒకరిగా ఎదిగిన దళిత, విద్యార్ధి నాయకుడాయన.  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితుడు..  తెలంగాణ ఆవిర్భావం తర్వాత తన రాజకీయ గురువు,  ఆర్ధికంగా ప్రోత్సహించిన గడ్డం వివేక్‌పై పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. తర్వాత తెలంగాణ ముందస్తు ఎన్నికల్ల చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో అప్పటి వరకూ అంత హడవుడి చేసిన సుమన్ ఎక్కడా కనిపించడం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి.   ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సుమన్.. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.  తెలంగాణ రాష్ట్ర సమితి విభాగమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగం, టీఆర్ఎస్వీకి 2007లో అధ్యక్షుడిగా పనిచేశారు. టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వీకి 2010లో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.  2009, 2014 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటి చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేకానంద్ పై గెలుపొందారు.  2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తరపున చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటి చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై గెలిచారు. తర్వాత బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ముందు నుంచి అత్యంత సన్నిహితుడైన  బాల్క సుమన్  2022 జనవరి 26న గులాబీ  పార్టీ, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు.. ఎంపీగా, ఎమ్మెల్యేగా తెగ హడావుడి చేసిన బాల్క సుమన్ దళిత కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే కేటీఆర్ ఆశీస్సులున్నా..  కేసీఆర్ మాత్రం ఆయనకు మంత్రిగా అవకాశమివ్వలేదు. చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలిచి దళిత కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశించిన సుమన్ ప్రభుత్వ విప్ పదవితో తృప్తి పడాల్సి వచ్చింది.  సీన్ కట్ చేస్తే ఆ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదంట.  గత ఎన్నికల్లో కాకా తనయుడు వివేక్ కు దమ్ము ఉంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిన బాల్క సుమన్ ఓటమి పాలవడంతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట.కేవలం తన అవసరానికి చెన్నూరు నియోజకవర్గం నుండి పోటీ చేశారు.. ఓడిపోయాక కనీసం ఇటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని  బీఆర్ఎస్ వర్గాలే చర్చించుకుంటున్నాయట. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే  పట్టించుకోకపోవడంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ క్యాడర్ కూడా తలో దారి అన్నట్టు అయ్యారట..  చెన్నూరు నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో అడపాదడపా వచ్చే నాయకులు తప్ప బీఆర్ఎస్‌కు చెన్నూరు నియోజకవర్గంలో పెద్ద దిక్కు లేకుండా పోయిందట.. ఏదిఏమైనా స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళనైనా   మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలో అడుగుపెడతారా? లేక చెన్నూరు నియోజకవర్గంతో సంబంధాలు పూర్తిగా తెంచేసుకున్నారా? వేచి చూడాలి మరి.

మరో విమాన ప్రమాదం.. ఉత్తర అరిజోనాలో నలుగురి మ‌ృతి

ఉత్తర అరిజోనాలోని నవజో నేషన్‌లో మంగళవారం( ఆగస్టు 5)  వైద్య రవాణా విమానం కుప్పకూలిపోయింది. విమానంలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.  చిన్లే మున్సిపల్ విమానాశ్రయం సమీపంలో మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో  విమానంలో ముగ్గురు వైద్య సిబ్బంది ఒక పేషెంట్‌ ఉన్నారు. ఈ నలుగురూ కూడా మృత్యువాత పడ్డారు. అయితే  ప్రమాదానికి కారణమేంటన్నది తెలియరాలేదు. న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుండి బయలుదేరిన సీఎస్ఐ ఏవియేషన్ కంపెనీకి చెందిన ఈ విమానం..  ఫీనిక్స్‌కు ఈశాన్యంగా 483 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్లే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు  తెలిపారు.  ఈ ఘటనపై జాతీయ రవాణా భద్రతా బోర్డు, ఎఫ్ఏఏ  దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. కాగా.. జనవరిలో ఫిలడెల్ఫియాలో ఒక వైద్య రవాణా విమానం కూలిపోయి ఎనిమిది మంది మరణించారు. ఆ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న జాతీయ రవాణా భద్రతా బోర్డు, ఆ విమానంలోని వాయిస్ రికార్డర్ పనిచేయడం లేదని తెలిపింది.

భార‌త్ పై ట్రంప్ కి ఇంత మంట ఎందుకంటే?

బ్రిక్స్ దేశాలు ఎన్ని? ఈ దేశాలు కొత్త క‌రెన్సీ ఏర్పాటు చేసుకుంటున్నాయా?  ఆ భయమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను భయపెడుతోందా? బ్రిక్స్ కూటమికి భారత్ సారథ్యం కారణంగానే ట్రంప్ ఇండియాపై  కారాలూ, మిరియాలూ నూరుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.   బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా ఇలా మొత్తం 11 దేశాలు బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాలు.   అయితే.. బ్రిక్స్ దేశాలు ఇప్ప‌టి వ‌ర‌కూ తమ సొంత కరెన్సీని ఏర్పాటు చేయలేదు కానీ.. ఇప్ప‌టికే ఈ దేశాలు అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక కరెన్సీల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడం.. ఆపై తమ సొంత చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి. అందులో భాగంగా యూరో, డాల‌ర్ తో స‌మానంగా ఒక క‌రెన్సీ రూపొందించే దిశ‌గా ఈ దేశాలు అడుగు వేస్తున్నాయి. ఇదే ట్రంప్ కి కంట‌కింపుగా మారింది. ఆయ‌న ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హించే నాటో యురోపియ‌న్ దేశాల‌కు సొంత క‌రెన్సీ ఉండొచ్చు.  అదే ఏషియ‌న్ దేశాల‌కు ఉండొద్దన్నదే ఆయన ఉద్దేశం. అందుకు భిన్నంగా బ్రిక్స్ దేశాలు అడుగులు వేయడంతోనే ట్రంప్ ఉలికిపాటుకు, ఉక్రోషానికి గురైతున్నారు.   ఉక్రెయిన్ లో మార‌ణ హోం జ‌రుగుతుంటే ర‌ష్యా నుంచి చ‌మురు ఎలా కొంటార‌ని ప్ర‌శ్నించే ట్రంప్.. మ‌రి అంత ర‌క్త‌పాతం జ‌రుగుతుంటే.. ఉక్రెయిన్ లో ప‌దేళ్ల ఖ‌నిజ త‌వ్వ‌కాలకు అమెరికా ఒప్పందం ఎందుకు, ఎలా చేసుకున్నట్లు?  ఈ విష‌యంలో ఆయ‌న స‌మాధానం ఇవ్వ‌రు. ఎక్క‌డా దాన్నొక అనైతిక వ్య‌వ‌హారంగా భావించ‌రు. త‌న చేతుల‌కు ఇంత‌టి ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటించుకుని.. ఇత‌రుల‌ నైతికతను ప్రశ్నిస్తారు. ఓవ‌రాల్ గా భార‌త్  ర‌ష్యా, చైనాతో స‌మానంగా స్వ‌యంప్ర‌తిప‌త్తిగ‌ల దేశంగా ఎద‌గడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎళ్లకాలమూ   డిపెండెంట్ లాగానే ఉండాలి.. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగకూడదన్నదే అమెరికా అధ్యక్షుడి ఉద్దేశంగా కనిపిస్తోంది.  అందుకే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి దిగ్గ‌జ సంస్థ‌ల్లో భార‌తీయుల‌కు ఉద్యోగాలు ఇవ్వొద్దని ఆయా సంస్థలకు హుకుంలాంటి సూచన చేశారు. తాజాగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ప్ర‌క‌ట‌న‌బ‌ట్టీ చూస్తే.. అమెరికాలో అమ్మే ఐ ఫోన్లలో  త‌యార‌వుతున్న‌వే ఎక్కువ‌ని తేలింది.  దానికి తోడు భార‌త్ ని ఫ్రాన్స్ వంటి దేశాలు నాయ‌క‌త్వం వ‌హించ‌మ‌ని కోర‌డం. గ్లోబ‌ల్ సౌత్ కి మోడీ సైతం నేతృత్వం వ‌హించేలాంటి అడుగులు వేయ‌డం.. వంటివి ట్రంప్ కి అస్స‌లు గిట్ట‌డం లేదు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ లో మోడీ ఆయుధాల‌పై దృష్టి సారించ‌డం. ఆపై కొన్ని బ్రిక్ దేశాల‌కు ఆయుధాల‌ను చౌక‌గా స‌ర‌ఫ‌రా చేసే సామ‌ర్ధ్యం క‌లిగి ఉండ‌టంతో.. ట్రంప్ తమ ఆయుధ వ్యాపారానికి మోడీ రూపంలో భార‌త్ అడ్డు త‌గులుతుండ‌టం కడుపుమంట కలిగిస్తోంది. అందుకే అన‌వ‌స‌రంగా వీసాల ర‌ద్దు, స్టూడెంట్స్ అని కూడా చూడ‌కుండా వేధింపులు,  అక్క‌డ నివ‌సించే భార‌తీయులు త‌మ సొంత కుటుంబాల‌కు డ‌బ్బు పంపాల‌న్నా సుంకాల విధింపు.. తాజాగా  25 శాతం సుంకాల‌ు,  జ‌రిమానాగా అద‌న‌పు వడ్డింపులు.. వంటి   చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. త‌మ‌కు బ‌ద్ధ శ‌తృవైన ర‌ష్యాతో భార‌త్ చెలిమి చేయ‌కూడ‌దంటారు ట్రంప్. మ‌రి భార‌త్ కి ఆగ‌ర్భ శ‌తృవైన  పాకిస్థాన్ లో త‌మ కుటుంబ సంస్థ డ‌బ్ల్యూఎల్ఎఫ్ చేత పెట్టుబ‌డులు పెట్టించ‌వ‌చ్చు. ఆపై పాకిస్థాన్ లో పెట్రోలు నిల్వ‌ల కోసం కోట్ల డాల‌ర్లు  కుమ్మ‌రించి ప‌రిశోధ‌న‌లు చేయించ‌వ‌చ్చు. ఆ దేశం భార‌త్ కి వ్య‌తిరేకంగా టెర్ర‌రిస్టుల‌ను పెంచి పోషించ‌డానికి వీలుగా ప్ర‌పంచ బ్యాంకు వంటి సంస్థ‌ల ద్వారా ఏటా క్ర‌మం త‌ప్ప‌కుండా వేల కోట్ల రుణాలు ఇప్పించ‌వ‌చ్చు. భార‌త్ కి వ్య‌తిరేకంగా ట్రంప్ ఇన్ని చేయొచ్చుగానీ.. భార‌త్ మాత్రం.. త‌న స్వ‌యం  స‌మృద్ధిని మాత్రం కాంక్షించ‌వ‌ద్దు.   ఇదెక్క‌డి లెక్క‌? అని ప్ర‌శ్నిస్తోంది స‌గ‌టు భార‌తీయం.  అందుకే  కేంద్ర మంత్రి  ఎస్ జైశంక‌ర్  భార‌త ప‌రిపాల‌న వాషింగ్ట‌న్ డీసీలోని వైట్ హౌస్ నుంచి జ‌ర‌గ‌ట్లేదు.. కావాలంటే వారు పాకిస్థాన్ని అక్క‌డి నుంచి ప‌రిపాలించుకోవ‌చ్చు. మాకెలాంటి అభ్యంత‌రం లేద‌న్నారు. మ‌రి చూడాలి ఈ సుంకాల యుద్ధం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుందో. 

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ప్రచారంపై డ్రోన్లతో నిఘా

పులివెందుల అంటే జగన్ అడ్డా. అలాంటి అడ్డాలో జగన్ పార్టీ ఎదురీదుతోంది. ఔను పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో విజయం కోసం వైసీపీ చమటోడుస్తోంది. అయినా కూడా విజయంపై ఆ పార్టీ శ్రేణులకు విశ్వాసం కలగడం లేదు. వాస్తవానికి పులివెందులలో ఇజ్పుడు జరగనున్నది ఒక మండలానికి సంబంధించిన  జడ్పిటిసి  ఉప ఎన్నిక. అయినా కూడా రాజకీయ వేడి అమాంతంగా పెరిగిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు మించిన టెన్షన్ వాతావరణం నెలకొంది.   శాంతి భద్రతల సమస్య తలెత్తే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల విషయంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారంపై డ్రోన్ కెమేరాలతో నిఘా పెట్టారు. జిల్లా ఎస్పీ స్వయంగా ఎన్నికల ప్రచారాన్ని, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.   వివాదాలకు తావు లేకుండా, ఆరోపణలకు అవకాశం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు పోలీస్ శాఖ గట్టి ప్రయత్నమే చేస్తుంది. ఇందుంలో భాగంగా  జిల్లా ఎస్.పి  ఇ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు  అత్యాధునిక డ్రోన్ కెమెరా ద్వారా నిఘా  పెట్టారు.   మంగళవారం (ఆగస్టు 5) పులివెందుల మండలంలోని ఆర్.తుమ్మలపల్లి, నల్లపురెడ్డి పల్లి, రాగిమాని పల్లి, రాయలాపురం ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారాన్ని డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షించారు. వివిధ పార్టీల అభ్యర్థులు చేస్తున్న ప్రచారం ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ఓటర్లు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు.   పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందన్న అంచనాతో  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నేరుగా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ చేపడుతున్నారు. నేరుగా ఆయనే  పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎన్నిక ప్రశాంతంగా సాగేందుకు చర్యలు చేపట్టారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొరసాగుతున్నది. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. బుధవారం (ఆగస్టు 6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 27 కంపార్టుమెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (ఆగస్టు5) శ్రీవారిని మొత్తం 72 వేల951 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 143 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 71 లక్షల రూపాయలు వచ్చింది. శ్రీవారి దర్శనం కోసం క్యైలైన్ లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అన్న, జల ప్రసాదాలను పంపిణీ చేస్తున్నది. రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేసింది.

ఉత్తరాఖండ్‌ వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతు

  ఉత్తరాఖండ్‌ వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలో వరద ఉధృతికి ధరాలీలోని హార్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. అయితే ఆ సమయంలో క్యాంప్‌లో ఉన్న జేసీవో సహా ఆర్మీ జవాన్లు గల్లంతు అయినట్లు వార్తలు విస్తృతం అయ్యాయి. మరోవైపు.. వరదల విషయం తెలిసిన వెంటనే అక్కడకు వచ్చిన ఆర్మీ జవాన్లు 20 మంది పౌరులను కాపాడారు.  హర్షిల్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వారికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. ప్రస్తుతం ధరాలీ గ్రామంలో NDRF, SDRF సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఈ ప్రకృతి విలయంలో 60 మందికి పైగా ప్రజలు గల్లంతైన విషయం తెలిసిందే. 20-25 హోటళ్లు, నివాసాలు నెలమట్టమయ్యాయి. రంగంలోకి దిగిన సైన్యం సహాక చర్యలు చేపట్టింది.