సమాధిగా మారిన సగం ధరాలీ
posted on Aug 7, 2025 @ 10:55AM
ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు అవరోధం
ఉత్తరాఖండ్ ఎగువ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ధరాలీ గ్రామాన్ని బురద ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘోర విళయంలో గల్లంతైన వారీ ఆచూకీ కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పది మంది మరణించినట్లు అధికారికంగా ధృవీకరించిన అధికారులు 190 మందిని ప్రాణాలతో కాపాడినట్లు ప్రకటించారు. అయితే ఇంకా వందల సంఖ్యలో గల్లంతైన వారి జాడ కోసం ప్రతికూల పరిస్థితుల్లోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఐటీబీపీ, ఎస్ఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసు, సహాయక బృందాలు గాలింపు చర్యలలో నిమగ్నమై ఉన్నారు. హార్సిల్లోని ఆర్మీ క్యాంప్ కు చెందిన 11 మంది జవాన్ల జాడ ఇంకా తెలియలేదు. అలాగే గంగోత్రి ధామాన్ని దర్శించుకునేందుకు వచ్చిన 28 మంది యాత్రికుల బృందం గల్లంతైంది.
దీంతో వారి బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇలా ఉండగా ఈ ఘటనలో ధరాలీలోని అత్యంత పురాతనమైన కేదార్ శివాలయం పూర్తిగా బుదరలో కూరుకుపోయింది. ధరాలీ దాదాపు సగభాగం సమాధిలా మారిపోయింది. ఈ గ్రామన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామీ బుధవారం (ఆగస్టు 6) సందర్శించారు. ధరాళీలో ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్ స్టేలు, చెట్లు.. ఇలా అన్నీ బురదలో కూరుకుపోయాయి. బాధితులకు ఆహారం, ఔషధాలు అందజేస్తున్నామని సీఎం చెప్పారు. సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.