కమలంలో కుమ్ములాటలు? లోక్ సభ ఎన్నికలలోనూ చతికిలపడ్డట్టేనా?
posted on Dec 18, 2023 @ 2:06PM
తెలంగాణ బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్టు అన్నట్లుగా తయారైంది. అంతర్గత కుమ్ములాటల కారణంగా అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ దారుణంగా దెబ్బతింది. గతంలో కంటే అధికస్థానాలు గెలుచుకున్నాం, సార్వత్రిక ఎన్నికలలో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నప్పటికీ ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తొలగింపుతో మొదలైన ఆ పార్టీ పతనం అంతకంతకు దిగజారడమేగా కనిపిస్తున్నది.
ఇప్పుడు వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓ వైపు మీడియా సమావేశాలు పెట్టి ప్రకటనలు గుప్పిస్తుంటే.. మరో వైపు లోక్ సభ టికెట్ల విషయంలో ఆ పార్టీలో పెద్ద ఎత్తున లొల్లి మొదలైంది. ముఖ్యంగా కరీంనగర్ లోక్ సభ స్థానంలో పోటీకి పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ను నిలబెడితే తాము మద్దతిచ్చేది లేదని పలువురు సీనియర్లు ఇప్పటికే పార్టీ హై కమాండ్ కు అల్టిమేటమ్ ఇచ్చినట్లుగా పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఆ
యన తన ఒంటెత్తు పోకడలతో పార్టీని భ్రష్టుపట్టించారని ఆయన వ్యతిరేకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో బండి మద్దతు దారులు మాత్రం బండిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన క్షణం నుంచే రాష్ట్రంలో బీజేపీ పతనం ప్రారంభమైందనీ, ఆ కారణంగానే రాష్ట్రంలో అధికారానికి దూరం కావడమే కాకుండా సింగిల్ డిజిట్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే కరీంనగర్ పార్లమెంటు స్థానంలో పోటీ చేసి గెలిచే సత్తా బండికి కాక పార్టీలో మరెవరికి ఉందని సవాల్ విసురుతున్నారు.
బండి సంజయ్ కు ఈ సారి టికెట్ ఇవ్వొద్దంటూ బండిని వ్యతిరేకించే కొందరు నాయకులు రహస్య సమావేశంలో తీర్మానం చేసినట్లు పార్టీ శేణులు చెబుతున్నాయి. బండి సంజయ్ వ్యవహారశైలి కారణంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వెనుకబడ్డామని వారంటున్నారు. అయితే ఆయన మద్దతు దారులు మాత్రం బండి సంజయ్ కారణంగానే తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ప్రత్యామ్నాయం అన్న స్థాయికి ఎదిగిందనీ, ఎప్పుడైతే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించారో అప్పటి నుంచే పార్టీ వెనుకబడిందని చెబుతున్నారు. గత లోక్ సభ ఎన్నికలలో బండి సంజయ్ కరీంనగర్ నుంచి విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన అభ్యర్థిగా ఉంటేనే కమలం పార్టీ గెలుస్తుందని లేకుంటే అంతే సంగతులని అంటున్నారు. రాష్ట్రంలో లోక్ సభ స్థానాలలో గెలిచే సీటు ఏదైనా ఉంటే అది కరీంనగర్ మాత్రమేననీ, అయితే బండి అభ్యర్థి కాకపోతే అక్కడా ఓటమే ఎదురౌతుందని అంటున్నారు. ఈ పంచాయతీని బీజేపీ హై కమాండ్ ఎలా పరిష్కరిస్తుందన్నది చూడాల్సిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానం నుంచి బండిని తప్పించి తప్పు చేశామని అధిష్ఠానం ఇప్పటికే గ్రహించిందని బండి మద్దతు దారలు అంటున్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండిని స్టార్ క్యాంపెయినర్ ను చేశారని చెబుతున్నారు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన పరాజయ పరాభవం నుంచి తెలంగాణ బీజేపీ గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదు.