ఇందిర బాటలో సోనియా...తెలంగాణ నుంచి లోకసభకు
posted on Dec 18, 2023 @ 3:51PM
ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ సీట్లపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఫలితాల తరహాలోనే లోక్ సభ స్థానాలను అత్యధిక సంఖ్యలో గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో హృదయాల్లో వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధించింది. ప్రజలు బాగా రిసీవ్ చేసుకున్నారు. తెలంగాణ తెచ్చిన ఉద్యమ పార్టీ వరుసగా రెండుపర్యాయాలు గెలిచిన టిఆర్ఎస్ (ఇప్పటి బిఆర్ఎస్) ను ఈ ఎన్నికలలో ఓడించారు. అందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏకంగా పార్టీ కీలక నాయకురాలు, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ని తెలంగాణలో పోటీ చేయాలని తీర్మానించారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫెర్స్ కమిటీ సమావేశంలో ఈ తీర్మానం చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసినట్లుగా ..ఇప్పుడు సోనియాగాంధీ కూడా తెలంగాణలోని ఏదో ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని హస్తం పెద్దలు తీర్మానించారు. వచ్చే లోకసభ ఎన్నికలలో తన అత్త పోటీ చేసిన మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నారు. బిజెపి నుంచి కాంగ్రెస్ లో జంప్ అయిన విజయశాంతి పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ స్థానం నుంచి పోటీ చేయవచ్చని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. ఆమె గతంలో ఇదే నియోజకవర్గం నుంచి మొదటి సారి టిఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. కెసీఆర్ తో విభేధించి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి మెదక్ నుంచి పోటీ చేయవచ్చనే ప్రచారం జరిగింది.