సార్వత్రిక ఎన్నికల తరువాతే నామినేటెడ్ పోస్టులు.. కాంగ్రెస్ నిర్ణయం
posted on Dec 19, 2023 8:53AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇక ఇప్పుడు మరో మూడు నెలలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై దృష్ఠి పెట్టింది. లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రం నుంచి అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది.
అందుకే పార్టీ అధికారంలోకి వచ్చినా వెంటనే నామినేటెడ్ పోస్టల భర్తీ చేపట్టరాదని నిర్ణయించింది. అలాగే ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వారిని అకామిడేట్ చేయడానికి నామినేటెడ్ పోస్టుల పందేరం అన్న సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టేంది. ఈ మేరకు తాజాగా జరిగిన పీసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వారు తమతమ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించి.. లోక్ సభ ఎన్నికలలో ఆయా సెగ్మెంట్లలో కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని టార్గెట్ నిర్దేశించింది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఈ ఐదేళ్లు పని చేసేలా వారికి టార్గెట్ నిర్దేశించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన వారిలో కొందరిని కేబినెట్ లోకి తీసుకుంటారనీ, అందుకోసం వారిని ఎమ్మెల్సీ చేసే అవకాశాలున్నాయనీ వచ్చిన, వస్తున్న వార్తలకు కాంగ్రెస్ హై కమాండ్ ఫుల్ స్టాప్ పెట్టేసింది. పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులపై ఎటువంటి నిర్ణయాలూ తీసుకోవద్దని విస్పష్టంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి తేల్చి చెప్పింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల సమయంలో వారి నియోజకవర్గాల పరిధిలో పార్టీకి గణనీయంగా ఓట్లు పడేందుకు కృషి చేయాలని ఆదేశించింది.