ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల.. సీమలో ప్రచారానికి మాత్రం దూరం!?
posted on Dec 18, 2023 @ 10:15AM
ఇప్పుడా, అప్పుడా అన్న మీమాంశ తొలగిపోయింది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం దాదాపు ఖరారైపోయింది. అందుకు ముహూర్తం కూడా ఫిక్సయ్యిందని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తున్నది. వచ్చే ఏడాది జనవరిలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, అక్కడ నుంచి ఏపీ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటారని చెబుతున్నారు. షర్మిల ఏపీ ఎంట్రీ కచ్చితంగా రాష్ట్రంలో అధికార వైసీపీకి తీరని నష్టం చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణలు ఎలా ఉన్నా.. ఏపీలోకి షర్మిల ఎంట్రీ మాత్రం నిస్సందేహంగా జగన్ కు కోలుకోలేని దెబ్బగానే ఉంటుందన్నది వాస్తవం. ఎందుకంటే.. విపక్ష నేతగా జగన్ ఉన్న సమయంలో షర్మిల వైసీపీ కోసం చేసిన సేవలను ఇప్పటికీ వైసీపీ శ్రేణులు మరచిపోలేవు. జగన్ జైలులో ఉండగా ఆమె రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్రం చుట్టేశారు. అటువంటి షర్మిలను జగన్ అధికారంలోకి రాగానే దూరం పెట్టారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో షర్మిల తెలంగాణ వెళ్లి సొంత కుంపటి పెట్టుకున్నారు.
ఆ సమయంలో కూడా జగన్ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ ఆమెకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు సరికదా, అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ కు మద్దతుగా తన పార్టీని ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంచారు. అంతకు ముందు నుంచీ షర్మిల వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న వార్తలు వచ్చినప్పటి నుంచీ అది జరగలేదు. సరే ఇప్పుడు మాత్రం ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో తన సోదరుడు జగన్ కు వ్యతిరేకంగా ఆమె కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నారని గట్టిగా వినిపిస్తోంది. ప్రియాంకతో కలిసి ఏపీలో ఆమె ప్రచార సభల్లో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాల నంచే సమాచారం అందుతోంది. బహిరంగ సభలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా (రాయలసీమ మినహా)ఆమె కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారని చెబుతున్నారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసి, కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన క్షణం నుంచే కాంగ్రెస్ పెద్దలు షర్మిలతో ఏపీ రాజకీయాలలోకి ఆమెను ఆహ్వానిస్తూ సంప్రదింపులు జరుపుతున్నారనీ, రాజ్యసభకు పంపడం తో పాటు, ఆమెకు ఏఐసీసీలో కీలక పదవి కట్టబెడతామని ప్రతిపాదిస్తున్నారని రాజకీయ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.
వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమంటూ జరిగితే.. పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారతాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ స్థానాన్ని వైసీపీ ఆక్రమించింది. దీంతో ఏపీలో కాంగ్రెస్ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఈ స్థితిలో వైఎస్ షర్మిల రంగంలోకి దిగితే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఏదో మేరకు పుంజుకుంటుందన్న భావన ఆ పార్టీ హైకమాండ్ లో ఉంది.
ఇప్పఇకే ఏపీలో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ ఓటు స్టేక్ ఒక శాతం కంటే తక్కువే. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పరిస్థితీ అదే. అంటే ఏపీలో ఇప్పటికిప్పుడైతే పోటీ ద్విముఖమే. అంటే తెలుగుదేశం ప్లస్ జనసేన, వర్సెస్ వైసీపీ అన్నమాట. అదే షర్మిల కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకుంటే.. వైసీపీలో అవమానాలు భరిస్తూ మరో గత్యంతరం లేక వైసీపీలో కొనసాగుతున్న వైఎస్ అభిమానులు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ వారసుడిగా జగన్ ను అంగీకరించలేని వారికి కూడా కాంగ్రెస్ ఒక ప్రత్యామ్నాయంగా మారుతుంది. వైఎస్ వారసురాలిగా షర్మిలను అంగీకరించే వారు కాంగ్రెస్ వైపు చూస్తారు. దీంతో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఓట్ షేర్ ఏదో ఒక మేరకు పెరుగుతుంది. అది విపక్ష కూటమికి ఏమాత్రం నష్టం చేయదు కానీ, వైసీపీ బలాన్ని గణనీయంగా తగ్గించేస్తుంది. అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ప్రచారం చేయడానికి సుముఖత వ్యక్తం చేసిన షర్మిల రాయలసీమకు దూరంగా ఉంటానన్న షరతు ఎందుకు పెడుతున్నారన్న విషయంపై రాజకీయవర్గాలలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద షర్మిల ఏపీ రాజకీయాలలో క్రీయాశీలం కానున్నారన్న వార్తే వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.