పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే సీట్లివేనా?
posted on Dec 18, 2023 @ 2:59PM
తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చేసిందా? చంద్రబాబు పవన్ కల్యాణ్ తో ఆదివారం ఆయన నివాసంలో జరిపిన భేటీలో సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి వచ్చేశారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోయే సీట్ల సంఖ్యపై ఒక అవగాహనకు వచ్చేశారా అన్న ప్రశ్నలకు తెలుగుదేశం, జనసేన వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తున్నది.
ఈ భేటీలో ఇరువురు నేతల మధ్యా సీట్ల సర్దుబాటుపైనే చర్చ జరిగిందనీ, పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు, నియోజకవర్గాలపై కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఏవో ఒకటి రెండు నియోజకవర్గాల విషయంలో ప్రతిష్ఠభన ఏర్పడినా చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరిం చుకోవచ్చని వాటిని పక్కన పెట్టేశారనీ, మొత్తంగా ఇరు పార్టీల జాబితా ఒకే సారి ప్రకటించే వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చారనీ అంటున్నారు.
ఇప్పటి వరకూ బీజేపీ కలిసి వస్తుందన్న భావనతో వేచి చూసే ధోరణి అవలంబించిన జనసేనానికి ఇక ఆ యోచనకు స్వస్తి పలికి తెలుగుదేశంతో మాత్రమే కలిసి సాగాలన్న అభిప్రాయానికి వచ్చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశంతో సీట్ల సర్దుబాటు విషయంలో పెద్దగా పేచీల్లేకుండానే ఒక ఒప్పందానికి జనసేనాని వచ్చేశారని చెబుతున్నారు. ఇక విషయానికి వస్తే తెలుగుదేశం, జనసేన వర్గాల నుంచి విశ్వసనీయంగా అందుతున్న సమాచారాన్ని బట్టి పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాలలో పోటీ చేస్తుంది. ఆ వర్గాల సమాచారం మేరకు టెంటటివ్ గా జనసేన పోటీ చేసే ఓ 20 స్థానాలు కూడా ఖరారైపోయాయి.
గుంటూరు జిల్లాలో
సత్తెనపల్లి. తెనాలి
కృష్ణా జిల్లాలో
పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్
తూర్పుగోదావరి జిల్లాలో
అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్
పశ్చిమ గోదావరి జిల్లాలో
భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు
విశాఖ జిల్లాలో
పెందుర్తి, గాజువాక, చోడవరం
చిత్తూరు జిల్లాలో
చిత్తూరు లేదా, తిరుపతి
ప్రకాశం జిల్లాలో
దర్శి, గిద్దలూరు
ఇక మిగిలిన స్థానాలలో జనసేన పోటీ చేసే స్థానాల విషయంలో ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని రెండు పార్టీల వర్గాల ద్వారా తెలుస్తోంది.