కాంగ్రెస్ టార్గెట్ జగన్.. ఏపీలో పావులు కదుపుతున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ!?
posted on Dec 19, 2023 5:43AM
దక్షణాదిలో కర్నాటక, తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు మూడో రాష్ట్రంపై కన్నేసిందా? అంటే ఔననే సమాధానమే వస్తుంది. అయితే కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో లా ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోగలుగుతుందా అంటే మాత్రం పరిశీలకులు అంత సీన్ లేదనే అంటున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ కు ఏ మాత్రం బలం పెరిగినా, అది అంతకు రెట్టింపు అధికార వైసీపీకి నష్టం చేస్తుందని విశ్లేషిస్తున్నారు.
ఇక విషయానికి వస్తే.. తెలంగాణలో విజయంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ బాగా బలహీనపడింది. తెలంగాణలో కోలుకుంది. విభజన జరిగిన పదేళ్ల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏపీలో కూడా పార్టీకి జవసత్వాలు నింపే పనిని కాంగ్రెస్ అధిష్టానం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ ఇప్పటినుంచే ఆ దిశగా ఫోకస్ మొదలు పెట్టింది. తాజాగా విజయవాడలో జరిగిన కాంగ్రెస్ కీలక సమావేశంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో జనంలోకి వెళ్లేందుకు నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీ నుండి పరిశీలకులు వచ్చి వెళ్లడం పెరుగుతున్నది. కాంగ్రెస్ పెద్దలు కూడా ఏపీ కాంగ్రెస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి బూస్టింగ్ ఇచ్చే పని మొదలు పెట్టారు.
కర్నాటకలో విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగినట్లే.. తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఏపీ కాంగ్రెస్ నేతలలో ఉత్సాహం పెరిగిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఏపీలో కాంగ్రెస్ కు ప్రధాన సమస్య నేతల లోటు. ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, సీనియర్లు రఘువీరారెడ్డి, జెడి శీలం, పల్లంరాజు, తులసి రెడ్డి లాంటి నేతలు ఉన్నా.. వారెవరూ ప్రజాకర్షణ ఉన్న నేతలు కాదు. జగన్ వేరు కుంపటి అనంతరం, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ నేతలు, క్యాడర్ వైసీపీ వైపుకు మళ్లింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపాలంటే ముందుగా నేతలను ఆకర్షించాలి. ఇప్పుడు అధికార వైసీపీలో నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ అధినాయకుడు జగన్ ఇష్టారీతిన అభ్యర్థులను మార్చేయడం ఎమ్మెల్యేలకు నచ్చడం లేదు. చివరికి మంత్రులను కూడా నియోజకవర్గాలను మార్చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇప్పటికే జగన్ 11 మంది అభ్యర్థులను మార్చేయగా.. మరో 45 మందితో రెండో జాబితా కూడా సిద్ధం చేసినట్లు చెప్పుకుంటున్నారు. మొత్తం 90 మంది అభ్యర్థులను మార్చేస్తారని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బెంగళూరులో ఓ ఎంపీ నివాసంలో వైసీపీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నట్లు వినిపిస్తున్నది. సంక్రాంతి తర్వాత వైసీపీ నుండి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతున్నది. కొందరు ఇప్పటికే తెలుగుదేశం నేతలతో టచ్ లోకి వెళ్లారని.. త్వరలోనే వీరు సైకిలెక్కేస్తారనీ అంటున్నారు. అయితే, తెలుగుదేశం, జనసేన పొత్తుతో వైసీపీ నేతలకు పెద్దగా స్పేస్ లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు వైసీపీ నేతలకు కాంగ్రెస్ పార్టీ బెస్ట్ అప్షన్ గా మారుతున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ కాస్త ఫోకస్ చేస్తే వైసీపీకి వెళ్లిన వారిలో చాలామంది వెనక్కు వస్తారని విశ్లేషిస్తున్నారు.
అదే జరిగితే ఏపీలో వైసీపీ దారుణంగా పతనమవుతుంది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తి కనిపిస్తున్నది. ఇప్పుడు నేతలు కూడా అసంతృప్తితో పార్టీ నుండి వెళ్ళిపోతే ప్రభావం వైసీపీపై చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే ఇక వైసీపీకి ఘోరపరాజయం తప్పదు. వైసీపీ గత ఎన్నికల ఫలితాలలో కనీసం నాలుగు, ఐదు శాతం ఓటింగ్ ను కాంగ్రెస్ చీల్చగలిగినా, వైసీపీకి పాతిక సీట్లు రావడం కష్టమే అవుతుంది. కనీసం రెండు మూడు శాతం ఓటింగ్ చీల్చినా పాతిక సీట్లు కూడా రావు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో వైసీపీకి మరో టెన్షన్ మొదలైంది. వైనాట్ ఏపీ అంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీని కోలుకోలేని దెబ్బ కొడుతుందా అనే చర్చ జరుగుతుంది.