పవన్ ఇంటికి చంద్రబాబు.. ఇక ఉమ్మడి కార్యాచరణే!
posted on Dec 18, 2023 @ 12:04PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలో అధికార వైఎస్ఆర్సీపీ.. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన దూకుడు పెంచాయి. ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలతో ముందడుగు వేస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఎప్పుడో పదేళ్ల కిందట ఆయన ఇలా పవన్ ఇంటికి వెళ్లగా.. మళ్లీ ఇప్పుడు వెళ్లారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు అదే గౌరవాన్ని నిలబెట్టుకుంటూ, చంద్రబాబు కూడా హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఆయనకు పవన్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సుమారు రెండున్నర గంటల పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఇక ఇప్పుడు ఈ భేటీ రాజకీయ వర్గాలలో సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నది. ఈ భేటీలో ఏం చర్చించారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల సన్నద్ధతపై వీరిరువురూ చర్చించారు. తెలుగుదేశం, జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై ఇరువురు నేతలు చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణపై కూడా వీరి భేటీలో చర్చ జరిగిందంటున్నారు. ఏపీలో మార్చిలోనే ఇంకా మాట్లాడితే ఫబ్రవరి చివరి వారంలోనే ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సంక్రాంతి నాటికి సీట్ల పంపకాలపై క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఎక్కడ నుంచి బరిలో దిగాలనే అంశంపై బాబు, పవన్ భేటీలో చర్చ జరిగిందంటున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏయే అంశాలు పొందుపరచాలి? మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి తదితర అంశాలపైనా ఇరువురూ చర్చించినట్లు చెబుతున్నారు. ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరు హాజరవ్వాలి? వాటిని ఎప్పట్నుంచి ప్రారంభించాలనే అంశాలపైనా కూడా విస్తృత చర్చ జరిగిందంటున్నారు. ఇద్దరూ కలిసి బహిరంగ వేదికపైకి వచ్చి కీలక నిర్ణయాలను వెల్లడించనున్నట్లు చెబుతున్నారు. అదే వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. బుధవారం (డిసెంబర్ 20) యువగళం ముగింపు సభ జరగనున్నది. ఆ తరువాత చంద్రబాబు, పవన్ ల ఉమ్మడి సభలు ఎప్పుడు, ఎక్కడెక్కడ అన్నది నిర్ధారణ అవుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
కాగా, ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో పవన్ తో బాబు భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా విస్తృత చర్చకూ ఆస్కారమిచ్చింది. నిజానికి చంద్రబాబు అరెస్టు అనంతరం ఏపీలో రాజకీయ పరిణామాలన్నీ పూర్తిగా మారిపోయాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఈ తకెఱంలొ తెలుగుదేశం, జనసేన వారికి అండగా ఉంటే చాలు భారీ విజయం గ్యారంటీ అన్న భావన పరిశీలకులలోనే కాదు సామాన్యులలో కూడా వ్యక్తమౌతున్నది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పలుమార్లు ఉమ్మడి సమావేశాలు కూడా నిర్వహించాయి. అలాగే సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణపై చర్చ జరిగింది. కానీ.. వీటి గురించి ఇరు పార్టీలు అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు తొలిసారి పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలలో వేడి మొదలైంది.
ఇక బుధవారం(డిసెంబర్ 20) విజయనగరం జిల్లాలో జరగనున్న లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ జరగనున్నది. ఈ సభతో తెలుగుదేశం ఎన్నికల శంఖారావం మోగిస్తుందని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి. ఒకవైపు అధికార వైసీపీ అభ్యర్థుల మార్పు పేరిట నేతల నుండే అసంతృప్తిని ఎదురుకొంటున్న తరుణంలో ప్రతిపక్షాలు ఏకమై యుద్ధం ప్రకటించడం జగన్ కు సంకటంగా మారడం ఖాయమంటున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు, పవన్ భేటీ వైసీపీలో గుబులును ద్విగిణీకృతం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.