రాజన్న బిడ్డల వారసత్వ పోటీ .. నెగ్గేదెవరో?!
posted on Jan 2, 2024 8:12AM
వారసత్వం సహజం అనేలా మారిపోయింది ప్రస్తుత రాజకీయాలలో. ఇక్కడా అక్కడా అని లేకుండా మన దేశమంతా ఈ వారసత్వపు రాజకీయాలు మనకి కనిపిస్తున్నవే. అయితే ఇది దక్షణాదిలో అందునా మన తెలుగు రాష్ట్రాలలో కొంచెం ఎక్కువగా, ఇంకొంచం స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీ విషయానికి వస్తే ఇప్పుడున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ వారసత్వపు పునాదులపైనే నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు దేశం పార్టీలో ప్రస్తుతానికైతే వారసత్వపు పోరు లేదు. వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సారధ్యం వహిస్తుండగా.. ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఇదే పార్టీలో కీలకంగా ఉన్నారు. ఎన్టీఆర్ వారసత్వానికి, చంద్రబాబు వారసత్వానికి కూడా ఇప్పుడు ఎలాంటి పోటీ లేదు. ఇక వైసీపీ విషయానికి వస్తే దివంగత సీఎం రాజశేఖర రెడ్డి కుమారుడిగా వైఎస్ జగన్.. కాంగ్రెస్ పార్టీతో విభేదించి సోంత కుంపటి గా వైసీపీ పెట్టుకున్నారు. వైసీపీ వైఎస్ జగన్ కు చెందిన సొంత కంపెనీ. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. అయితే, వైఎస్ఆర్ వారసత్వానికి మాత్రం పోటీ ఉంది. జగన్ మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ తనయ షర్మిల కూడా వైఎస్ బ్రాండుకు వారసులుగా ఉన్నారు.
గత ఎన్నికల సమయంలో జగన్, షర్మిల ఇద్దరూ వైసీపీలో ఉండడంతో ఈ వారసత్వం కోసం పోటీ కనిపించలేదు. వైసీపీ అనే పొలిటికల్ కంపెనీలో షర్మిల ఒక ఉద్యోగిగా చేరి.. ఆమె బాధ్యత నిర్వహించి బయటకొచ్చేశారు. ఇంకా చెప్పాలంటే అధినేత కష్టకాలంలో ఉండగా షర్మిల వారసురాలిగా బాధ్యత తీసుకున్నారు. కానీ, కష్టం పోయి మంచి రోజులు వచ్చాక అదే వారసురాలిని బయటకి తరిమేశారు. దీంతో షర్మిల వైఎస్ఆర్ వారసురాలిగా అదే బ్రాండ్ తో తెలంగాణలో మరో బ్రాంచి ఓపెన్ చేసుకున్నారు. కానీ, అక్కడా ఆ బ్రాంచ్ వృద్ధిలోకి రాకుండా సొంతవారే అడ్డుతగులుతుండడంతో ఇప్పుడు షర్మిల అసలు సిసలైన వైఎస్ఆర్ వారసురాలిని నేనే అంటూ తిరిగి తన తండ్రి పనిచేసిన కాంగ్రెస్ బాధ్యతలు తీసుకొనేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ వారసత్వానికి పోటీ నెలకొంది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ వారసత్వం కోసం ఆయన కుమారుడు, కుమార్తె తలపడుతున్నారు. పోటీ పడుతున్నారు.
వైఎస్ వారసత్వం అనే వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పేలా కఉంది. ఇప్పటి వరకు ఏపీలో వన్ అండ్ ఓన్లీగా జగన్ వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా చెలామణి అయ్యారు. అయితే ఇప్పుడు ఆయన సోదరి షర్మిలే ఆయనకు పోటీ వస్తున్నారు. తాను కూడా వైఎస్ బిడ్డనేనని, తాను కూడా ఆయన రాజకీయ వారసురాలినేని అంటూ ప్రచారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందునా తండ్రి చివరి శ్వాస వరకూ పనిచేసిన పార్టీ కాంగ్రెస్ నుంచి అన్నతో తలపడడానికి రెడీ కావడం షర్మిలకు మరింత అడ్వాంటేజ్గా మారింది. అప్పుడు వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు, తెచ్చిన పాలసీలు, కట్టిన ప్రాజెక్టులు అన్నీ చెప్పుకొనేందుకు షర్మిలకు అవకాశం దక్కనుంది. తన తండ్రి వైఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ అంటేనే వైఎస్ఆర్ అని గర్వంగా చెప్పుకొనేందుకు షర్మిలకు ఎలాంటి అడ్డంకులు లేవు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే వైఎస్ఆర్ కలలను సాకారం చేస్తుందని.. అసలు సిసలైన రాజన్న రాజ్యం రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పుకొనేందుకు షర్మిలకు ఆస్కారం ఉంది.
రాజకీయాలలో కుమారుడు, కుమార్తెల వారసత్వంలో ఎలాంటి తేడాలు ఉండవు. వారసుడంటే కేవలం కుమారుడు మాత్రమే కాదు.. కుమార్తెలకు కూడా హక్కు ఉంటుంది. కనుక తన తండ్రికి గుర్తింపునిచ్చిన పార్టీలో ఉన్న వారికే ఈ వారసత్వంపై ఎక్కువ హక్కు ఉంటుంది. ఆ మాటకొస్తే వైసీపీకి వైఎస్ఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆయన ఆశయాల ఆధారంగానే పుట్టిన పార్టీగా మాత్రమే చెప్పుకుంటారు. కానీ వైఎస్ఆర్ ది కాంగ్రెస్ తో విడదీయరాని బంధం. కనుక ఇప్పుడు షర్మిల అప్పుడు తండ్రి కాంగ్రెస్ లో ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు అదే స్థానంలో కూర్చుంటే ఆమెనే అసలు సిసలైన వారసురాలిగా భావించాల్సి వస్తుంది. అప్పుడు జగన్ మోహన్ రెడ్డికి ఎదుర్కోవడం కఠిన పరీక్షగానే మారుతుంది. ఇప్పటికే నాలుగున్నరేళ్ల పాలనలొ జగన్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. వైఎస్ బ్రాండ్ ను దాదాపుగా ఆయన పార్టీలో కనిపించకుండా చేసేశారు. ఇప్పుడు తన తండ్రి పేరు చెప్పుకుని కాంగ్రెస్ తరఫున షర్మిల రంగంలోకి దిగితే జగన్ ను కఠిన పరీక్షే అవుతుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు వైఎస్ వారసత్వ పోటీ లో ప్రజలు ఎవరిని గుర్తిస్తారు? ఎవరిని ఆదరిస్తా రన్నది చూడాల్సి ఉంది.