మంగళగిరిలో గెలుపు పక్కా.. చరిత్ర తిరగరాయనున్న లోకేష్!
posted on Jan 2, 2024 5:09AM
మంగళగిరి నియోజకవర్గం పుట్టాక రెండే రెండు సార్లు తెలుగుదేశం పార్టీకి విజయం దక్కింది. 1985 తరువాత ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచిందే లేదు. అలాంటి చోట ఒకసారి ఓడిపోతే, మళ్ళీ అక్కడ పోటీ చేయాలంటే తలపండిన రాజకీయ నేతలైనా భయపడతారు. మొత్తం పార్టీయే చేతుల్లో ఉండగా అసలు అలాంటి చోటకు వెళ్లేందుకు కూడా ఆలోచించరు. కానీ అందరూ వేరు తాను వేరు అంటున్నారు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తగ్గేదేలే ఓడిన చోటనే మళ్ళీ గెలిచి తానేంటో నిరూపిస్తా అంటున్నారు. చరిత్రను తిరగరాసి తండ్రి చంద్రబాబుకు బహుమతి ఇస్తా అంటున్నారు. అయితే, ఇది లోకేష్ మొండితనమా.. ధీమానా అంటే ఖచ్చితంగా గెలుపు ధీమాయే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మంగళగిరిలో లోకేష్ విజయం సాధించడం గ్యారంటీ అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం ఇక్కడ ప్రతి అంశం వైసీపీకి ఇప్పుడు వ్యతిరేకంగా మారడమే కాకుండా.. వాటిని అనుకూలంగా మార్చుకునేందుకు నారా లోకేష్ కూడా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అందుకే ఈసారి మంగళగిరిలో లోకేష్ విజయం గ్యారంటీ అంటున్నారు.
లోకేష్ గెలుపు అవకాశాలను చూస్తే.. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి 2014, 2019లలో రెండు సార్లు ఇక్కడ నుంచి గెలిచారు. 2014లో జస్ట్ 12 ఓట్ల తేడాతో బయటపడిన ఆర్కే 2019లో నారా లోకేష్ పై 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. నిజానికి ఈ మెజారిటీ కూడా అంత గొప్పదేమీ కాదు. 2019 జగన్ వేవ్ లో కూడా జస్ట్ 5 వేల మెజార్టీ అంటే అది అతిపెద్ద గెలుపేమీ కాదు. ఇక ఇప్పుడు ఇన్నాళ్లు నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ కు తెలిసిన ఆర్కే ఇక్కడ లేరన్న సంగతి తెలిసిందే. ఆర్కే వైసీపీకి బైబై చెప్పేయగా.. ఆయన షర్మిల వస్తే కాంగ్రెస్ వైపు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. పైగా ఇప్పుడు వైసీపీపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో వైసీపీకి ఇక్కడ గెలుపు కష్టం. వైసీపీ ఇక్కడ లోకేష్ మీద బీసీ నేత గంజి చిరంజీవిని నిలబెడుతోంది. ఈయనే గతంలో 2014లో ఆర్కే చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీకి చేరిన గంజికి గతసారి టికెట్ దక్కలేదు. ఇప్పుడు మాత్రం జగన్ సీటిచ్చేశారు.
గంజి చిరంజీవి బీసీ సామజిక వర్గం నేత కాగా ఆయన కమ్మవారి అల్లుడు అని చెప్పుకుంటారు. అందుకే జగన్ ఈసారి ఈయనకు సీటిచ్చారు. అయితే, పూర్తిస్థాయిలో వైసీపీ క్యాడర్ ఈయన వైపు మళ్లే పరిస్థితి కనిపించడం లేదు. పైగా అమరావతిని నాశనం చేసిన కోపం ఇక్కడ ప్రజలలో తీవ్రంగా ఉంది. బీసీ నేత అనే ఒకే ఒక్క అంశంపై వైసీపీ ఆధారపడగా.. ప్రభుత్వంపై అసంతృప్తి, రాజధాని అంశం, ఆర్కే వర్గం వంటివి ఎన్నో టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క అంశం ప్రభావం చూపినా, కనీస రెండు శాతం ఓటర్లలో మార్పు వచ్చినా గతసారి వచ్చిన ఐదు వేల మెజార్టీ ఉఫ్ మన్నట్లే. పైగా గతసారి నారా లోకేష్ అంటే ఇక్కడ ప్రజలకు కొత్త. ఆర్కే సిట్టింగ్ ఎమ్మెల్యే కనుక కొంత ప్రభావం కనిపించింది. కానీ, ఇప్పుడు అటు ఆర్కే లేరు.. ఈ నాలుగున్నరేళ్లలో లోకేష్ ఇక్కడ ప్రజలకు చాలా దగ్గరయ్యారు.
అంతేకాదు, కాస్త దృష్టి పెడితే పక్కా విజయం సాధించే సీటు కావడంతో సొంత నియోజకవర్గంపై ఈసారి లోకేష్ మరింత గురి పెట్టారు. టీడీపీ అధిష్టానం కూడా ఈసారి మంగళగిరిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. గత నాలుగేళ్లుగా ఇక్కడ పార్టీని పటిష్ఠం చేసే బాధ్యతలను చంద్రబాబు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు అప్పగించారు. ఆమె అధిష్టానం వ్యూహాలను పగడ్బందీగా అమలు చేశారు. పైగా లోకేష్ కూడా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకూ ప్రతి నాయకుడిని వ్యక్తిగతంగా కలిసి దగ్గరయ్యారు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి లోకేష్ గెలుపు నల్లేరు మీద నడకే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ కోణంలో చూసినా ఇక్కడ వైసీపీ గల్లంతేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.