రేపటి నుంచి మరోమారు భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
posted on Jan 2, 2024 @ 10:44AM
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట బుధవారం ( జనవరి 3) నుంచి మరో మారు యాత్ర ప్రారంభించనున్నారు. చంద్రబాబాబు అక్రమ అరెస్ట్ తో మనస్తాపం చెంది చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. వారికి ఆర్థిక చేయూత కూడా ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం అక్టోబర్ నెలలో కూడా నారా భువనేశ్వరి ఈ యాత్ర నిర్వహించిన సంగతి విదితమే. నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి చంద్రగిరికి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మనోవేదనతో చనిపోయిన వారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్ పై ఆవేదనతో గత సంవత్సరం అక్టోబర్ నెల 17న చంద్రగిరిలో టీడీపీ కార్యకర్త ప్రవీణ్ రెడ్డి చనిపోయారు. భువనేశ్వరి ప్రవీణ్ కుటుంబ సభ్యులను అప్పట్లో పరామర్శించి ప్రవీణ్ రెడ్డి తల్లి అనురాధకు రూ.3లక్షల చెక్కును అందజేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగుదేశం పార్టీదే అన్నారు. నిజం గెలవాలి యాత్ర ప్రారంభానికి ముందు ఆమె తిరుమల దర్శించున్నారు. రేపు కూడా ఆమె తిరుమల దర్శించుకుంటారని సమాచారం. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అక్రమ అరెస్ట్ తో మనస్థాపం చెందిన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. చంద్రబాబు విడుదల తర్వాత నిజం గెలవాలి యాత్రను మరో మారు పున: ప్రారంభించాలని నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు. చంద్రబాబు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో మనస్థాపం చెందిన టిడిపి కార్యకర్తలు , అభిమానులు చనిపోయారు. భువనేశ్వరి విజయనగరం జిల్లాలో నిజం గెలవాలి యాత్ర కొనసాగుతున్న సమయంలోనే చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఆమె అర్ధంతరంగా ఈ యాత్ర ఆపారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల అయిన తర్వాత పార్టీ అధినేతకు అనారోగ్యసమస్యలు ఉండటం వల్ల ఈ యాత్ర ఆగిపోయింది. ప్రస్తుతం చంద్రబాబు పూర్తిగా కోలుకున్న నేపథ్యంలో ఈ యాత్ర ఆగిపోయిన విజయనగరం జిల్లా నుంచే పున: ప్రారంభం కానుంది. వారానికి మూడు రోజుల పాటు ఈ యాత్ర నిర్వహించాలని యోచిస్తున్నారు. గతంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆగిపోయింది. జైలు నుంచి విడుదలైన తర్వాత యువగళం యాత్ర పున: ప్రారంభించిన మాదిరిగానే భువనేశ్వరి అర్ధంతరంగా ఆగిపోయిన నిజంగెలవాలి యాత్రను ప్రారంభించబోతున్నారు.