బాబాయ్ కోరిక షర్మిల తీరుస్తున్నారా?.. పులివెందుల నుంచే పోటీ.. ప్రకటన ఎప్పుడంటే..?
posted on Jan 2, 2024 @ 9:44AM
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 4న వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనమయ్యే లాంఛనాన్ని హస్తినలో పూర్తి చేస్తారు. ఈ మేరకు ఢిల్లీ మీడియాలో ప్రముఖంగా వార్తలు ప్రచురితమయ్యాయి. అసలు కాంగ్రెస్ నుంచే ఢిల్లీ మీడియాకు లీకులు వెళ్లాయని అంటున్నారు. ఇలా ఉండగా షర్మిల తన కుమారుడి పెళ్లి పనులలో బిజీగా ఉండి కూడా పార్టీ విలీనం, తాను ఏపీ కాంగ్రెస్ లో క్రీయాశీల పాత్ర తదితర విషయాలపై పార్టీ నేతలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. మంగళవారం (జనవరి2 ) ఉదయం హైదరాబాద్ లోఅందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో షర్మిల భేటీ అయ్యారు. పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించారు. ఆ చర్చల అనంతరం ఆమె కుటుంబ సమేతంగా ఇడుపుల పాయకు బయలుదేరి వెళ్లారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇడుపుల పాయలో తన కుమారుడు రాజారెడ్డి వివాహ శుభలేఖను తండ్రి సమాధి వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో షర్మిల కడప నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆమె పులివెందుల పర్యటన, అక్కడ నుంచి చేయబోయే విలీనం ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. పులివెందులలో వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల తన రాజకీయ భవిష్యత్ పై చేసే ప్రకటన పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఒక వేళ ఆమె తాను పులివెందుల నుంచి బరిలోకి దిగనున్నట్లు వైఎస్సార్ ఘాట్ వద్ద నుంచ ప్రకటన చేస్తే రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా సొంత బాబాయ్, దివంగత వైఎస్ వివేకా కూడా షర్మిల పులివెందుల నుంచి పోటీ చేయాలని ఆకాంక్షించారు. ఆ డిమాండ్ తోనే అనినాష్ రెడ్డికి శతృవయ్యారు. గొడ్డలి పోటుకు హతమయ్యారు. ఇప్పుడు షర్మిల పులివెందుల నుంచి రంగంలోకి దిగితే బాబాయ్ కోరిక నెరవేర్చినట్లే అవుతుంది. షర్మిల పులివెందుల నుంచి పోటీ నేపథ్యంలో చెల్లితో తలపడే ధైర్యం జగన్ చేస్తారా? లేక నియోజకవర్గం వదిలేసి మరో స్థానం వెతుక్కుంటారా? అన్న చర్చ ఇప్పటికే మొదలైంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర రాజకీయాలలో క్రీయాశీలంగా వ్యవహరించడమంటూ జరిగితే.. వైసీపీలో కాంగ్రెస్ వాదులంతా షర్మిల పంచన చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ పట్ల అసంతృప్తితో ఉన్న వారంతా షర్మిల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి ధిక్కార స్వరం వినిపించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంటే తాను అని ప్రకటించడమే కాకుండా.. షర్మిల వెంట పార్టీ విలీన కార్యక్రమంలో పాల్గొనేందుకు హస్తిన వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.
షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైనప్పటికీ వైఎస్ సతీమణి, షర్మిల తల్లి విజయమ్మ నిర్ణయం ఏలా ఉంటుందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కుమారుడికి వ్యతిరేకంగా ఆమె కూడా ఏపీలో షర్మిలతో పాటు కాంగ్రెస్ తరఫున గట్టిగా నిలబడతారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విజయమ్మ నోటి వెంట ఇప్పటి వరకూ షర్మిల కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుని ఏపీలో అన్నకు వ్యతిరేకంగా పని చేస్తారన్న వార్తలపై ఎటువంటి స్పందనా రాలేదు.
గతంలో ఒక సందర్భంగా విజయమ్మ తన బిడ్డలు ఎవరికి వారుగా రెండు రాష్ట్రాలలో రాజకీయపార్టీలు స్థాపించి ఎవరి పని వారు చేసుకుంటారనీ, ఒకరిపై ఒకరు తలపడరనీ, పోటీ చేయరనీ చెప్పారు. అయితే ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదని తేటతెల్లమైపోయింది. షర్మిల తెలంగాణను వదిలి ఏపీలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించేందుకు నిర్ణయం తీసేసుకున్నారు.
అంతే కాదు జగన్ పార్టీ లక్ష్యంగానే ఆమె ఏపీలో రాజకీయం చేయనున్నరనీ, అవసరమైతే జగన్ కు ప్రత్యర్థిగా పులివెందుల నుంచి పోటీకి దుగుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ ఎవరికి మద్దతు తెలుపుతారన్నది కీలకంగా మారింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు విజయమ్మ తన కుమార్తె షర్మిలతో పాటే ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఆమె బయటకు వచ్చి ప్రచారం చేసే అవకాశాలు లేవని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు విజయమ్మ ఏ నిర్ణయం తీసుకుంటారో. షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయం బాధ్యతలు చేపట్టిన తరువాత ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఆమె తన కుమారుడు జగన్ నివాసానికి వెళ్లలేదు. ఆమె విజయవాడ వెళ్లినప్పటికీ జగన్ ను నివాసానికి వెళ్లిన దాఖలాలు లేవు. వీటన్నిటినీ ప్రస్తావిస్తూ పరిశీలకులు ఆమె జగన్ కు మద్దతు ప్రకటించే అవకాశాలు మృగ్యమేనని విశ్లేషిస్తున్నారు. .