గోదావరి జిల్లాల్లో వైసీపీ జీరోయే!
posted on Dec 31, 2023 @ 3:52PM
ఏపీలో రానున్న ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖరారైంది. పరిశీలకుల విశ్లేషణలూ, సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు, చివరాఖరికి ఐప్యాక్ రిపోర్టులూ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. జగన్ కు కూడా విషయం అవగతమైనట్లే కనిపిస్తోంది. అందుకే పైకి ఎంత బింకంగా వైనాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోన మాత్రం ఓటమి భయం వెంటాడుతోంది. ప్రజలలో గూడు కట్టుకున్న అసంతృప్తిని కొంత వరకైనా తగ్గించాలని అభ్యర్థులను మార్చే పనిలో ఉన్నారు. ముందుగా ఇన్ చార్జిలను మార్చేసి తర్వాత వారినే అభ్యర్థులుగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ ప్రయత్నం మరింత నష్టం తెచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజలతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఇప్పుడు జగన్ పై ఆగ్రహంతో ఉన్నారు. అసలే ప్రజలు తనని ఓడించేది ఖాయమైతే.. ఇప్పుడు ఎక్కడైనా ఏమూలో మిణుక్కుమిణుక్కు మంటూ గెలిచే అవకాశం ఉన్న స్థానాలను కూడా ఇన్ చార్జీల మార్పు పేరుతో జగన్ ఓటమి ఖాతాలో చేజేతులా వేసేసుకుంటున్నారు. దీంతో ఈసారి వైసీపీకి ఘోర ఓటమి తప్పదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, జగన్ మోహన్ రెడ్డి మొండిగా తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్నీ కూడా ప్రతిపక్ష నేతలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే.. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఉభయగోదావరి జిల్లాలు కీలకం. ఇక్కడ ఎక్కువ స్థానాలు ఏ పార్టీ సొంతం చేసుకుంటే ఆ పార్టీదే అధికారం. గత ఎన్నికలలో అధికారం దక్కించుకున్న వైసీపీ కూడా ఈ జిల్లల్లోఅత్యధిక స్థానాలను దక్కించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 13 చోట్ల వైసీపీ గెలిచింది. రెండు ఎంపీ స్థానాలు కూడా దక్కాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా 19 స్థానాలకు గాను వైసీపీ 14 చోట్ల గెలిచింది. మూడు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలలకే ఇక్కడ అసంతృప్తి మొదలైంది. ఈ రెండు జిల్లాలో కాపు సామజిక వర్గం రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయితే జగన్ కాపు రిజర్వేషన్లు కుదిరే అంశం కాదని తేల్చేయడం వైసీపీకి అతిపెద్ద మైనస్ గా మారింది. సాధారణ ప్రజలలో జగన్ పాలనపై అసంతృప్తి తీవ్రంగా కనిపిస్తుండగా.. కాపులలో జగన్ పై ఆగ్రహం పెరిగింది.
అదే సమయంలో మరోపక్క పార్టీలో అంతర్గత పోరు కూడా తీవ్రమైంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్‌పై తిరుగుబాటు చేశారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య వైరం తీవ్రస్థాయికి చేరి రెండు గ్రూపులుగా విడిపోయి ప్రత్యక్ష యుద్దానికి దిగారు. అమలాపురంలో కూడా మంత్రి పినిపె విశ్వరూప్, ఎంపీ చింతా అనూరాథ మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీకి పంపుతున్న ఎంపీ భరత్ పనితీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. పిఠాపురం నుంచి దొరబాబును కాదని ఎమ్మెల్యేగా పోటీకి దింపుతున్న కాకినాడ ఎంపీ వంగా గీతపై కూడా సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. అలాగే మరో అరడజను స్థానాలలో కూడా వైసీపీది అదే పరిస్థితి. సరిగ్గా ఇప్పుడు ఈ పరిస్థితిని పవన్ కళ్యాణ్ క్యాష్ చేసుకొనేందుకు రంగంలోకి దిగారు. వైసీపీకి కనీస స్థానాలు కూడా దక్కకూడదని పవన్ టీడీపీతో కలిసి పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు.
పవన్ ఇప్పటికే రెండు వారాల కిందట మంగళగిరిలో ఉభయగోదావరి జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. తాజాగా కాకినాడ వేదికగా నియోజకవర్గాల రివ్యూ కూడా చేపట్టారు. కాకినాడ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో విడివిడిగా మాట్లాడారు. న్యాయవాదులు, వైద్యులు, నియోజకవర్గ ప్రముఖులతో కూడా సమావేశమై వారి సలహాలు, సూచనలను తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు విషయంలో కూడా పవన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉభయగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రజలలో వైసీపీపై అసంతృప్తికి తోడు పవన్ దూకుడు చూస్తుంటే అధికార పార్టీలో ఇప్పటికే కలవరం ప్రారంభమైంది. తెలుగుదేశం, జనసేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడం.. ఇప్పుడు ఆ రెండు పార్టీలూ కలిసి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడం చూస్తుంటే.. ఈసారి వైసీపీకి ఇక్కడ జీరో స్థానాలే ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.