పంతం నెగ్గించుకున్న బాలినేని.. విజయం అంత వీజీ కాదు!
posted on Jan 2, 2024 5:38AM
మొత్తానికి ఒంగోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. నేనెక్కడి వెళ్ళను ఒంగోలులోనే ఉంటా.. ఒంగోలు నుంచే పోటీ చేస్తా అంటూ ప్రకటనలు ఇస్తూ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఒక దశలో వచ్చేఎన్నికల్లో బాలినేనికి టికెట్ దక్కదని కూడా గట్టిగా వినిపించింది. వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు అభ్యర్థుల మార్పు పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును తప్పించి ఇక్కడ నుండి బాలినేనిని పోటీ చేయించాలని సీఎం జగన్ భావించారు. కానీ బాలినేని మాత్రం ఒంగోలు నుండే పోటీ చేస్తా అని తనకు తానే టికెట్ ప్రకటించేసుకున్నారు. దీంతో ఆయన పార్టీని వీడడం లేదా వైసీపీ ఆయనకు సీటు కేటాయించకపోవడం జరుగుతుందని రాజకీయ వర్గాలు భావించాయి. బాలినేని కూడా జనసేన పార్టీతో టచ్ లోకి వెళ్లారని ప్రచారం జరిగింది. కానీ బాలినేని పంతం ముందు జగన్ మోహన్ రెడ్డి మొండితనం ఓడిపోయింది. ఎంతైనా బంధువులు కదా ఏం చర్చించారో.. ఏం నిర్ణయించుకున్నారో కానీ ఫైనల్ గా ఒంగోలు బాలినేనిదేనని తేల్చేసినట్లు తెలుస్తున్నది.
బాలినేని సీటు దక్కించుకునే విషయంలో తన పంతం అయితే నెగ్గించుకోగలిగారు కానీ, ఈసారి ఇక్కడ గెలవడం మాత్రం అంత ఈజీ కాదు. దానికి సవాలక్ష కారణాలున్నాయి. అందులో ఆయనకి ఆయన చేసుకున్నవి కొన్ని కాగా.. పార్టీ చేసినవి మరికొన్ని ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాలినేని దాదాపు మూడేళ్ల పాటు ఉన్నారు. కానీ ఆ తర్వాత మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆయనలొ అలక మొదలైంది. బాలినేని గత రెండున్నరేళ్లుగా చీటికి మాటికి పార్టీమీద అలగటం, సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించడం, పరోక్షంగా జగన్ పైన కూడా వాగ్బాణాలు సంధించటం తెలిసిందే. సొంత పార్టీ నేతలే అరాచకాలు, అక్రమాలు చేస్తున్నారని ఆధారాలతో సహా బయటపెట్టారు. అయితే బాలినేని అలిగిన ప్రతిసారి జగన్ ఆయనను బుజ్జగించి సముదాయించారు. కానీ బాలినేని డిమాండ్లు మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో అటు బాలినేని వర్గం సంతృప్తిగా లేదు.. బాలినేని చేష్టలతో ఆయన వ్యతిరేక వర్గం కూడా సంతృప్తిగా లేదు. రేపు ఈ రెండు వర్గాలు కలిసి పనిచేయడం దాదాపు అసంభవంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బాలినేని ఆరోపించినట్లు జగన్ ప్రభుత్వంలో ఒంగోలులో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయి. ఇసుక దందాతో ఒక వర్గం కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలున్నాయి. ఇతర దేశాలలో ఉంటూ ఇక్కడ ఆస్తులు కలిగి ఉన్నవారి కుటుంబాలను టార్గెట్ చేసి భారీ స్థాయిలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్వయంగా బాలినేనినే ఆధారాలతో సహా బయటపెట్టగా.. అప్పట్లో పోలీసులు పదిమందిని అరెస్ట్ చేశారు. అయితే, అసలు దొంగలు మాత్రం దర్జాగానే ఉన్నారు. ఇది పార్టీకి ఇక్కడ అతిపెద్ద మైనస్. అలాగే ఒంగోలు నగరంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. బాలినేని మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరుతో కాలం గడిపేశారు తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఆ మాటకొస్తే ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ తారస్థాయిలో ఉంది. దీనికి తోడు పార్టీలో వర్గపోరు. బాలినేని అంటేనే ఆయన వ్యతిరేక వర్గం మండిపడుతున్నారు.
అదే సమయంలో తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఈ ఐదేళ్లలో నియోజకవర్గంపై పట్టు బిగించారు. కొండెపి ఎస్సీ రిజర్వ్ కావడంతో ఒంగోలుకు వచ్చిన జనార్దన్ గత ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెట్టించారు. అంతకు ముందు ఇదే బాలినేని ఇక్కడ ఎమ్మెల్యే అయినా ఒంగోలు అభివృద్ధిని పట్టించుకోలేదు. కానీ జనార్దన్ వచ్చీ రాగానే నగర రూపురేఖలు మార్చేశారు. అప్పుడు ఆయన ఎక్కడ ఆపారో ఒంగోలు నగరం ఇప్పటికీ అక్కడే ఉంది. జనార్దన్ తోనే ఒంగోలు నగర అభివృద్ధి అనే ముద్ర ప్రజలలో గట్టిగా పడింది. దీంతో ప్రజలే ఆయనను ఓడించి తప్పు చేసినట్లు భావిస్తున్నారు. జనార్దన్ హయాంలో నియోజకవర్గం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది అనేది తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అటు సొంత పార్టీలో బాలినేనికి పట్టు తగ్గడం, ప్రజలలో అసంతృప్తి, దామచర్లపై సానుభూతి కలిసి..ఈసారి ఒంగోలులో బాలినేని గెలుపు అంత వీజీ కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.