వాకర్ సాయంతో మాజీ సీఎం కేసీఆర్ నడక ప్రాక్టీస్!
posted on Jan 2, 2024 @ 11:18AM
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరజయం పాలైన రోజే ఆయన తన ఫామ్ హౌస్ లో జారి పడి గాయపడిన సంగతి తెలిసిందే. బాత్ రూంలో జారిపడటంతో కేసీఆర్ తుంటి ఎముకకు తీవ్ర గాయం అయ్యింది. యశోదా ఆస్పత్రిలో శస్త్ర చికిత్స అనంతరం ఆయన నందినగర్ లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆస్పత్రిలో శస్త్ర చికిత్స పూర్తి అయిన తరువాత అక్కడే వాకర్ సాయంతో ఆయన చేత అడుగులు వేయించిన వైద్యులు పూర్తిగా కోలుకోవడానికి ఎనిమిది వారాలు పడుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నందినగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ప్రస్తుతం వాకర్ సాయంతో నడుస్తున్నారు.
వైద్యులు ఎప్పటికప్పుడు ఆయనను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వాకర్ సాయంతో అటూ, ఇటూ నడుస్తున్నారు. జనవరి చివరి నాటికి స్టిక్ తో నడుస్తారని వైద్యులు చెప్పినట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ నెలాఖరు నుంచి కేసీఆర్ మళ్లీ రాజకీయంగా క్రియాశీలం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.