మరింత పెరగనున్న బంగారం ధరలు!

జేపీ మోర్గాన్ ప్రైవేట్ బ్యాంక్  ఓ సంచలన విషయాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని అంచనా వేసింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఔన్స్ బంగారం ధర 5 వేల 200 నుంచి 5 వేల 300 డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది. ఇదే నిజమైతే ప్రస్తుతమున్న ధరలతో పోల్చితే ఏకంగా 20 నుంచి 25 శాతం బంగారం ధరలు పెరగడం తథ్యం. ఈ ఏడాది ఇప్పటికే బంగారం ధర ఓసారి రికార్డ్‌ను క్రియేట్ చేసింది. అక్టోబర్‌లో ఔన్స్‌ బంగారం ధర 4 వేల 380 డాలర్లను తాకింది. ఆ తర్వాత 4 వేల డాలర్లకు పడిపోయింది. కానీ ప్రస్తుతం మళ్లీ 4 వేల 130 డాలర్ల వరకు చేరింది. ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని ఆ బ్యాంకు అంచనా వేసింది. రానున్న రోజుల్లో కాస్త తగ్గినా.. ఆ తర్వాత  మాత్రం క్రమక్రమంగా పెరిగే అవకాశమే ఉందన్నది ఆ అంచనా. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ వార్ పుణ్యమా అని గోల్డ్‌కు డిమాండ్ పెరిగింది. అన్ని దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటున్నాయి. ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్‌లోనే  634 టన్నుల బంగారాన్ని సెంట్రల్‌ బ్యాంక్‌లు కొనుగోలు చేశాయి. ఈ ఏడాది చివరి నాటికి ఆ మొత్తం 750 నుంచి 900 టన్నులకే చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.   చైనా, భారత్‌తో పాటు పోలాండ్, టర్కీ, కజక్‌స్థాన్ కూడా తమ గోల్డ్‌ రిజర్వ్‌లను పెంచుకుంటున్నాయి. డాలర్‌ రిజర్వ్‌లను కొనసాగిస్తూనే బంగారంపై దేశాలు ఆధారపడుతున్నాయి. అయితే అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌ డీల్‌పై పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బంగారం ధర కాస్త తగ్గినా కానీ.. మళ్లీ ఇప్పుడు పెరగడం ప్రారంభమైంది.  ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గోల్డ్‌పై ఇన్వెస్ట్‌ చేసేందుకే ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపుతారని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో డిమాండ్ పెరగడానికి ఇదే కారణం కాబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే కొండెక్కి కూర్చున్న బంగారం ధర.. రానున్న రోజుల్లో మరింత పెరిగి ఆకాశానికి చేరడం ఖాయమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  

పాకిస్థాన్, శ్రీలంకల వన్డే సిరీస్ రద్దు?

పాకిస్థాన్, శ్రీలంక మధ్య పాకిస్థాన్‌లో జరుగుతున్న వన్డే సిరీస్‌ రద్దయ్యే పరిస్థితులు ఏర్పాడ్డాయి. పాక్‌లో పర్యటిస్తోన్న లంక జట్టులోని ఎనిమది మంది ఆటగాళ్లు  గురువారం (నవంబర్ 13) స్వదేశానికి వెళ్లిపోయారు. తాజాగా ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడుతో 12 మంది మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఈ ఆటగాళ్లు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారని క్రికెట్‌ శ్రీలంక వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల్లో గురువారం రావల్పిండిలో జరగాల్సిన రెండో వన్డే జరిగే అవకాశం లేకుండా పోయింది.  మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రావల్పిండిలోనే జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గెలిచింది. మూడో వన్డేకూ రావల్పిండి ఆతిథ్యమివ్వాల్సింది. షెడ్యూలు ప్రకారం వన్డే సిరీస్‌ తర్వాత శ్రీలంక, జింబాబ్వే, పాకిస్థాన్‌లతో పాక్‌లోనే ముక్కోణపు సిరీస్‌ ఆడాల్సి ఉంది.  ఇస్లామాబాద్‌కు చాలా దగ్గర్లోనే రావల్పిండి ఉండడం భద్రతపై తమ క్రికెటర్లు ఆందోళన చెందడానికి కారణమని ఓ శ్రీలంక బోర్డు అధికారి చెప్పాడు. దాంతో పాక్‌-శ్రీలంక సిరీస్‌ రద్దైనట్లే. 2009లో లాహోర్‌లో గడాఫీ స్టేడియానికి వెళ్తుండగా శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. అజంత మెండిస్, చమింద వాస్, మహేల జయవర్దనే సహా చాలా మంది ఆటగాళ్లు ఈ దాడిలో గాయపడ్డారు. అనేక మంది భద్రత సిబ్బంది మృతి చెందారు. ఆ దాడి నేపథ్యంలో దాదాపు దశాబ్దం పాటు ఏ విదేశీ క్రికెట్ జట్టూ   పాకిస్థాన్‌కు వెళ్లలేదు. విశేషమేంటంటే.. 2019 డిసెంబరులో శ్రీలంక పర్యటనతోనే పాకిస్థాన్‌కు తిరిగి విదేశీ జట్ల రాక మొదలైంది. ఇప్పుడు తాజా పేలుళ్లతో విదేశీ జట్లు పాక్‌లో పర్యటనకు సంశయించే పరిస్థితి తలెత్తింది.

ఈమె ఎవరో తెలుసా?

పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గంగా స్నానమాచరించడానికి వచ్చిన ఓ యువతికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక సాధారణ ప్రయాణీకురాలిగా వారణాసి చేరుకున్న ఆమె అంతే సాదాసీదాగా గంగాస్నారం ఆచరించింది. ఆ సందర్భంగా అత్యంత సామాన్యురాలిగా మెట్ల మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంది. ఆ తరువాత అంతే నిశ్శబ్దంగా వారణాసిలో రైలు ఎక్కి స్వస్థలానికి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియోను ఓ యూట్యూబర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే క్షణాల్లో ఆ వీడియో వైరల్ అయ్యింది.  ఇంతకీ ఆమె ఎవరంటే.. దేశ ప్రధాని నరేంద్రమోడీ ఏకైన సోదరి బసంతి బెన్ మోడీ. అయినా ఆమె కాశీ ప్రయాణం ఆద్యంతం అత్యంత నిరాడంబరంగా సాగింది. ఎక్కడా వీఐపీ రాచమర్యాదలు లేవు. ప్రత్యేక ఏర్పాట్లు లేవు. ఒక సాదాసీదా మహిళగా రైల్లో వచ్చారు. గంగాస్నానమాచరించి తిరిగి వెళ్లిపోయారు.  చేతిలో ఓ సంచీ, భుజాలపై శాలువాతో కనిపించిన ఆమె ప్రధాని నరేంద్రమోడీ ఏకైక సోదరి. పైగా వారణాసి మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గం.  ఆమె నిరాడంబరతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

ఐదు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు!

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో గురువారం (నవంబర్ 13) దాడులు నిర్వహించింది.    గుజరాత్ ఉగ్రవాద కుట్రలో  బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారుల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్న ఎన్ఐఏ   పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలలో దాదాపు పది చోట్ల గురువారం (నవంబర్ 13) విస్తృత తనిఖీలు నిర్వహించింది.  అనుమానితులు, వారి సహచరులకు సంబంధించిన స్థలాల్లో ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహించాయి. గుజరాత్ లో ఈ కేసు 2023లో నమోదైంది. నలుగురు బంగ్లాదేశ్ జాతీయులు మొహమ్మద్ సోజిబ్ మియాన్, మున్నా ఖలీద్ అన్సారీ, అజ్రుల్ ఇస్లాం, అబ్దుల్ లతీఫ్ పేర్లు ఈ కేసులో ఉన్నాయి. ఈ నిందితులు ఫేక్ ఐడీలను ఉపయోగించి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశించారు.వారికి నిషేధిత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది.   బంగ్లాదేశ్ లోని అల్-ఖైదా కార్యకర్తల కోసం నిధులు సేకరించడమే కాకుండా, ఆ నిధులను వారికి బదిలీ చేసినట్లుగా తేలింది. అలాగే ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించిన  ఎన్ఐఏ నవంబర్ 10, 2023న అహ్మదాబాద్లోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. గతంలో మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్  నిషేధిత ఉగ్రవాద సంస్థలు అల్-ఖైదా, భారత ఉపఖండంలోని అల్-ఖైదా  తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ పుణేకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ను అరెస్టు చేసింది. అలాగే థానేకు చెందిన ఓ ఉపాధ్యాయుడిని ప్రశ్నించింది.  

ఢిల్లీ లాల్ కిల్లా మెట్రో స్టేషన్ నిరవధిక మూసివేత

హస్తినలో సోమవారం కారు బాంబు పేలుడు ఘటన తర్వాత  మూతపడిన లాల్ కిల్లా మెట్రో స్టేషన్ ఇంకా తెరుచుకోలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మెట్రో స్టేషన్ ను నిరవధికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీలోని అన్ని రైల్వే స్టేషన్లూ యథావిధిగా పని చేస్తున్నాయి. అయితే లాల్ కిల్లా మెట్రో స్టేషన్ ను మాత్రం తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్టు చేసింది. సోమవారం జరిగిన పేలుడు ఘటనలో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే.  

అమెరికా షట్ డౌన్ ఎత్తివేస్తూ బిల్లుపై ట్రంప్ సంతకం

అమెరికా లో 43 రోజుల ప్రభుత్వ షట్ డౌన్ కు తెరపడింది.   షట్‌డౌన్‌ క్లోజ్ చేసే బిల్లును అమెరికా కాంగ్రెస్  ఓటింగ్ ద్వారా ఆమోదించింది. ఈ ఓటింగ్ లో 222-209 ఓట్ల తేడాతో షట్‌‌డౌన్ ఎత్తివేత బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదముద్ర వేసింది.   అమెరికా అధ్యక్షుడు షట్ డౌన్ ఎత్తివేత ఫైలుపై సంతకం చేశారు.   ప్రభుత్వం షట్‌డౌన్‌తో వారాల తరబడి ప్రభుత్వ సాయంపై ఆధారపడిన లక్షలాది అమెరికన్లకు ఆహార సహాయం నిలిచిపోయింది. వేతనాలు లేకుండా పని చేయడానికి సిద్ధంగా లేని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు షట్ డౌన్ ఎత్తివేస్తూ అగ్రరాజ్యాధినేత ట్రంప్ సంతకం చేయడంతో అమెరికా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడినట్లేనని అంటున్నారు.  అయితే ఈ ఎత్తివేత ఆమెదం బిల్లు ద్వారా వచ్చే ఏడాది  జనవరి 30 వరకు ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన నిధులను మాత్రమే కల్పిస్తుంది. ఆ తరువాత మరోసారి అమెరికా షట్ డౌన్ అయినా ఆశ్చర్యం లేదని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి.  

విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు లోకేష్ శంకుస్థాపన

విశాఖలో మరో భారీ ప్రాజెక్టుకు గురువారం (నవంబర్ 13) శంకుస్థాపన జరగనుంది. దాదాపు 1250 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖలో నిర్మించనున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం (నవంబర్ 14) నుంచి రెండు రోజుల పాటు జరగనున్న భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే అంటే గురువారం (నవంబర్ 13) లోకేష్ విశాఖ రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విశాఖలో నిర్మించనున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. విశాఖ ఎండాడలోని మనోరమ హిల్స్ సమీపంలో పది ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. దీని వల్ల కనీసం 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.  

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి, నగదు, ఎలక్ట్రానిక్ గూడ్స్ స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కష్టం సార్ అధికారులు నిఘా నేత్రాలతో ప్రతి ఒక్క ప్రయాణికుడి కదలికలను పర్యవేక్షిస్తునా కూడా ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా స్మగ్లర్లు అక్రమరవాణాకు ప్రయత్నిస్తూ అధికారులకు పట్టుబడుతున్నారు.  తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు వేర్వేరు సంఘటనల్లో అక్రమంగా తీసుకువస్తున్న భారీ మొత్తంలో నగదు, గంజాయి, సెల్ ఫోన్ లను అధికారులు సీజ్ చేశారు. ఈ మూడు ఘటనలూ మంగళవారం (నవంబర్ 11) జరగాయి. వివరాలిలా ఉన్నాయి. బ్యాంకాక్ నుండి వచ్చిన ఒక ప్రయాణికుడి కదలికలకు అనుమానాస్పదంగా ఉండటంతో అతడి బ్యాగును తనిఖీ చేసిన అధికారులకు ఆ బ్యాగులో పెద్ద ఎత్తున హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు వెంటనే  అతడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 4 కోట్ల రూపాయల విలువైన 4.3 కిలోల   హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఇంకా ఇక అదే రోజు  మరో  ప్రయాణికుడి బ్యాగు నిండా ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. అతని వద్ద నుండి పది ఐఫోన్ 17 ప్రో మాక్స్, 55  ఐఫోన్ 17 ప్రో, పది ఆపిల్ వాచ్ ఎస్ఇ,  పది ఐ వాచ్ ఎస్ఇ,  ఎనిమిది డీజేఐ ఎయిర్ 3ఎస్ డ్రోన్లు, నాలుగు  నింటెండో స్విచ్ 2, ఒక  శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 7, ఒక  హెచ్ఎండీ ఫోన్  ఒక నంబర్ గూగుల్ పిక్సెల్ వాచ్ 3 లను  స్వాధీనం  చేసుకున్నారు. అలాగే అదే రోజు అబుదాబి నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల చెక్-ఇన్ బ్యాగేజీ నుండి రూ.71,71,407ల నగదును కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.  

అంబటి రాంబాబుపై కేసు నమోదు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ బుధవారం (నవంబర్ 12) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలోనూ నిరసన ర్యాలీలు నిర్వహించిన సంగతి విదితమే. అందులో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గుంటూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు విధులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.  అంబటి పోలీసుల విధులను అడ్డుకోవడమే కాకుండా, వారిని బెదరించారనీ, అలాగే అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని పేర్కొంటూ  బీఎన్ఎస్స సెక్షన్లు 132, 126(2), 351(3), 189(2), రెడ్‌ విత్‌ 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలు

  రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటాన్ని నిరసిస్తూ  వైసీపీ 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో కీలక నేతల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరిట నిరసనలు చేపట్టారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. కోవూరులో ఈ ఉద్యమ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరులో  నిర్వహించిన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోవూరు బజార్ సెంటర్ నుంచి తాలూకా ఆఫీస్ వరకు జన సందోహంతో ఈ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కళాశాలల ప్రయివేటికరణ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా ప్రైవేటికరణ అడ్డుకుంటామని వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.  

ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాపం...వారికి బహిరంగ క్షమాపణ

  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను వ్యవహరించిన తీరుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌కు ఆయన బహిరంగ క్షమాపణలు కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు. గత ప్రభుత్వంలో సర్వీసులో ఉండగా వారి పట్ల తాను అనుచితంగా ప్రవర్తించానని, అందుకు ఇప్పుడు చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాను బాధపెట్టిన అధికారులకు క్షమాపణ చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన చర్యల వల్ల ఇబ్బందిపడిన ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిశోర్‌ను మన్నించామని కోరారు.  

మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు

  మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు తిరిగింది. కిడ్నీ రాకెట్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన యమున భర్తగా సూరిబాబుకి భార్య కానే కాదని ఆమె బంధువులు తెలిపారు. యమున ను పిక్నిక్ పేరుతో మాయమాటలు చెప్పి తీసుకొచ్చి కిడ్నీలు కోసి అమ్మేసి, ఆమె ప్రాణాలను హరించారని ఆవేదన వ్యక్తం చేశారు.  యమున తల్లిదండ్రులు సూరమ్మ, నరసింగ రాజు బుధవారం మదనపల్లి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాకు చెప్పి బోరున విలపించారు. ఈనెల ఆరవ తేదీన అరకు కు పిక్నిక్ వెళ్లాలని మాయమాటలు చెప్పి  మదనపల్లెకు తీసుకువచ్చారని కిడ్నీ రాకెట్‌లోని మధ్యవర్తులపై మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు మండిపడ్డారు.  కిడ్నీ రాకెట్ బ్రోకర్లైన కాకర్ల సత్య, పెళ్లి పద్మ, వెంకటేశ్వర్లు ఇంకొందరు పథకం ప్రకారం బాధితురాలీ ని అర్ధరాత్రిలో మదనపల్లి ఎస్బీఐ కాలనీలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రికి తీసుకువచ్చి ఆదివారం ఆపరేషన్ చేసి కిడ్నీలు తొలగించడంతో చనిపోయినట్లు తమకు ఫోన్ చేసి చెప్పినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. యమున కు భర్త బాలకృష్ణ చనిపోవడంతో విశాఖలోని ఓ పత్రికలో  పని చేస్తోందని కన్నీటి పర్వంతమయ్యారు. తమకు కిడ్నీలు అమ్ముకోవాల్సిన అవసరంలేదని మాకు డబ్బు కొరత లేదని ఆ తల్లిదండ్రులు విలపించారు. వైద్యశాఖ నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ శస్త్ర చికిత్సలు చేసిన గ్లోబల్ ఆసుపత్రిని అధికారులు మూసివేశారు.   

ఈ సారైనా జ‌గ‌న్...వ్య‌క్తిగ‌తంగా హాజ‌ర‌వుతారా?

  చ‌ట్టాల ఉల్లంఘ‌న జ‌గ‌న్‌కి కొట్టిన పిండి. వెన్న‌తో పెట్టిన విద్య‌. వార‌స‌త్వంగా  వ‌చ్చిన ఆస్తిపాస్తుల్లో ఇదొక‌టా? అంటే అవున‌నే చెప్పాలంటారు చాలా మంది. ఆయ‌న పుష్క‌ర  కాలంగా అంటే, ప‌న్నెండేళ్ల నాటి నుంచి బెయిలుపై బ‌య‌ట తిరుగుత‌న్న సంగ‌తి అటుంచితే క‌నీసం కోర్టుకు వ్య‌క్తిగ‌త హాజ‌రు కావ‌డం లేదు. అదేమ‌ని అడిగితే తాను వ‌స్తే శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య భారీ ఎత్తున  ఏర్ప‌డుతుంద‌ని.. అందుకే తాను అలా హాజ‌రు కావ‌డం లేద‌ని నెట్టుకొస్తున్నారు జ‌గ‌న్. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న‌లా  వేసిన  వాయిదాల మీద వాయిదాల‌ను లెక్కిస్తే అవే కొన్ని వేల సార్ల‌ వ‌ర‌కూ ఉంటాయి. ఇక ఆయా వాయిదాలకుగానూ ఆయ‌న పెట్టిన  లాయ‌ర్ ఖ‌ర్చులే కోట్లాది రూపాయ‌ల్లో ఉంటాయని అంచ‌నా వేస్తారు న్యాయ‌నిపుణులు. ఇటీవ‌ల జ‌గ‌న్ లండ‌న్ వెళ్తూ వెళ్తూ ఒక ఫాల్తు నెంబ‌ర్ కోర్టుకు స‌బ్మిట్ చేశార‌న్న అభియోగం ఒక‌టి కొత్త‌గా వెలుగులోకి వ‌చ్చింది. జ‌గ‌న్ ఏదైనా అంతే. నేరుగా చేయ‌రు. ఇటీవ‌ల  హోం మంత్రి అనిత అన్న‌ట్టు.. ఏపీ కార్య‌ర్త‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకోడానికి డిజిట‌ల్ బుక్ కోసం ఒక నెంబ‌ర్ ఇస్తే.. అది కాస్తా తెలంగాణ‌ది. ఆయ‌నుండేదేమో క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరు. ఇక లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే, జ‌గ‌న్ ఈ డొంక తిరుగుడు వ్య‌వ‌హార‌శైలికి విసిగి వేసారిన కోర్టు ఆయ‌న్ను వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి ఇక మిన‌హాయించ‌లేమ‌ని.. ఈ నెల  21 త‌ప్ప‌నిస‌రిగా  జ‌గ‌న్ హాజ‌రు కావ‌ల్సిందేన‌ని ఆదేశించింది. మ‌రి  త‌న వాయిదాల తెలివితేట‌ల‌తో జ‌గ‌న్ దీన్నెలా అధిగ‌మిస్తారో తేలాల్సి ఉంది.ఇదిలా  ఉంటే జ‌గన్ వ్య‌క్తిగ‌త హాజ‌రే జ‌ర‌గ‌డం లేదంటే.. ఇక ఆయ‌న్ను జైలుకు పంప‌డం సాధ్య‌మ‌య్యే ప‌నేనా? ఎంతైనా జ‌గ‌న్ జ‌గ‌నే. ఇలాంటి విష‌యాల్లో ఆయ‌న‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ మాఫియా డాన్ల‌కు లేనంత తెలివితేట‌లున్నాయ‌ని మాట్లాడుకుంటున్నారు ఆంధ్రా ప‌బ్లిక్. జగన్ యూరప్‌ టూర్ అనంతరం కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని గట్టిగా కోరింది. తీవ్ర ఆర్థిక నేరారోపణలను ఎదుర్కొంటున్న జగన్‌.. ఆరేళ్లుగా ట్రయల్‌ కోర్టుకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని తెలిపింది. ఈ కేసులకు సంబంధించి డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున జగన్‌ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరవడంలో తప్పేమీ లేదని పేర్కొంది. దీంతో గత్యంతరం లేక వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్‌ తరఫు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. మరికొద్ది రోజులు సమయం ఇస్తే మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతారని తెలిపారు  

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఆయన హస్తినకు బయల్థేరుతారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలను ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది. రేపు ఇండో యుఎస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.   డిసెంబర్ 8,9 తేదీల్లో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ లో ఇండో, యూఎస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ కు వచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయి వారిని తెలంగాణకు ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలు, డీసీసీల నియామకం  ఏఐసీసీ నేతలోతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్  కాంగ్రెస్‌కు అనుకులంగా ఉండటంతో  సీఎం  హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.   

విదేశీ ఉద్యోగులు అవసరమే అంటున్న ట్రంప్

  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. విదేశీ ఉద్యోగులు అవసరమే అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అమెరికన్లలో సరైన టాలెంట్‌ లేదని అంగీకరించారు. అసలు ఇప్పుడు ట్రంప్‌కు ఈ విషయం ఎందుకు గుర్తొచ్చిందనే చర్చ నడుస్తోంది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీరు గురించి ప్రపంచం మొత్తానికి ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అవసరం ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా.. ఇలా ఎప్పటికప్పుడు మాటలను మార్చుతూ.. నోటికొచ్చింది మాట్లాడేస్తారని ఇప్పటికే అందరికి ఓ క్లారిటీ వచ్చింది.  ఇప్పుడీ విషయాలన్నీ ఎందుకంటే.. వలసదారులు, విదేశీ ఉద్యోగుల విషయంలో మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న ట్రంప్‌.. ఇప్పుడు విదేశీ ఉద్యోగులు అవసరమే అంటూ మాట మర్చేశారు. అమెరికాలోని కొన్ని కీలక రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలంటే.. విదేశీ ఉద్యోగులు అవసరం అనేది ఆయన మాట. అమెరికాలో అనుకున్నంత టాలెంట్ లేదని ఆయన ఓపెన్‌గానే అంగీకరించారు.  బట్.. అమెరికన్లు విదేశీ ఉద్యోగుల నుంచి నేర్చుకోవాలని.. అప్పుడే వారికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు.  నిజానికి ఇది రియలైజేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్‌గా జార్జీయాలోని ఓ డిఫెన్స్‌ ఫ్యాక్టరీలోని విదేశీ ఉద్యోగులను తొలగించారు. దీంతో అందులో ఉత్పత్తి అయ్యే కొన్ని ఉత్పత్తులపై ఎఫెక్ట్ పడింది. ఈ విషయాన్ని కూడా ట్రంప్ అంగీకరించారు.  మరీ ఇన్ని విషయాలు చెబుతున్న ట్రంప్.. హెచ్‌1బీ వీసాల విషయంలో తీసుకున్న కఠిన నిర్ణయాలపై మాత్రం స్పందించలేదు. ఇప్పటికే H1B వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచారు.. వలసదారులను వేటాడాలని ఇమ్మిగ్రేషన్ అధికారులకు అనుమతి ఇచ్చారు. అమెరికాకు వచ్చి చదువుకునే స్టూడెంట్స్ విషయంలో కూడా కఠిన నిబంధనలను అమలు చేశారు.  మరి వీటన్నింటిపై మాత్రం నోరు మెదపడం లేదు. అంతేకాదు అక్రమ వలసదారులను గుర్తించేందుకే రెయిడ్స్‌ చేసినట్టు సమర్థించుకున్నారు. కానీ ట్రంప్ మాటలు, చేతలు మాత్రం డాలర్ డ్రీమ్స్‌ను దెబ్బకొట్టాయనే చెప్పాలి. ఓవరాల్‌గా చూస్తే ట్రంప్‌ స్వరం మారడానికి కారణం ప్రస్తుతం ఏర్పడిన అవసరం అని మాత్రమే తెలుస్తోంది.  ఎందుకంటే ఇప్పుడే నిపుణులైన వారందరిని ఇబ్బందులు పెట్టి తరిమేస్తే.. అసలుకే మోసం వస్తుందని ట్రంప్‌ అధికార వర్గానికి అర్థమై ఉంటుంది. అందుకే వాయిస్‌లో బేస్‌ కాస్త తగ్గింది. కానీ అంతిమ లక్ష్యంలో మాత్రం ఏ మార్పు లేదనే చెప్పాలి.  

పేదలకు తొలిసారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్‌ : సీఎం చంద్రబాబు

  ఏపీలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లిలో లబ్ధిదారులు హేమలత, షేక్ ముంతాజ్ బేగంలకు ఇంటి తాళలను ముఖ్యమంత్రి అప్పగించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని తెలిపారు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్ఫష్టం చేశారు. అధునాతన హంగులు, సకల సౌకర్యాలలో ఇళ్లను నిర్మించిన ఘటన కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రభుత్వం రాత్రింబళ్లు కష్టపడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు.. భవిష్యత్తుకు భద్రత ముఖ్యమంత్రి తెలిపారు.. పేదలకు మొదటి సారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని సీఎం చెప్పారు.పేదోడికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పుట్టిన తెలుగు దేశం పార్టీ అని వెల్లడించారు.

పెళ్లి కుదరలేదని...యువకుడు ఆత్మహత్య

  నేటి సమాజంలో యువకులకు పెళ్లి ఒక పెద్ద సమస్యగా మారింది... యువతుల కోరికలు ఆకాశంలో విహరిస్తున్నాయి. లక్షలు సంపాదించే ఉద్యోగంతో పాటు ఖరీదైన ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని షరతులు పెడుతున్నారు. ఇవి అన్ని ఉన్న యువకులను మాత్రమే ఎంచుకుంటున్నారు... దీంతో  చాలీచాలని జీతంతో సాదాసీదా జీవితం గడిపే యువకులకు పెళ్లి కుదరడం గగనమైంది.  ఇక తనకు పెళ్లి కాదేమో అన్న భయంతో గతంలో కొందరు యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి. ఇప్పుడు తాజాగా మేడ్చల్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది.పెళ్లి కుదరలేదనే మనస్థాపం తో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలో బూర సురేష్‌ (30) అనే యువకుడు రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అది గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసుల దర్యాప్తులో వరంగల్ జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన బూర సురేష్ (30) గుర్తించారు.  అతడు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి అమీర్‌పేట్‌లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ బట్టల షాపులో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు గత నాలుగు సంవత్సరాల నుండి సురేష్ కు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు... అయినా కూడా ఏ ఒక్క సంబంధం కుదరలేదు...ఇన్ని సంవత్సరాలుగా యువతులను చూస్తున్నా కూడా ఏ ఒక్కరు తనను ఇష్టపడడం లేదని... ఇక తనకు పెళ్లి కాదేమోనని సురేష్  తీవ్ర స్థాయిలో మదనపడ్డాడు.  దీంతో సురేష్ సుసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడాడు. అనంతరం అమీర్పేట్ నుండి ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోకి వచ్చి రేపల్లె ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకు న్నాడు. గత నాలుగేళ్లుగా వివాహ సంబంధాలు కుదరలేదని, దీనివల్ల మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వే పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొడుకు మరణించాడన్న విషయం తెలియగానే తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు..

వ్యభిచార ముఠా గుట్టురట్టు.. చదువు పేరుతో గలీజ్ దందా

  మియాపూర్‌లో గుట్టుగా సాగిస్తున్న వ్యభిచార రాకెట్ ను పోలీసులు బట్టబయలు చేసి.....నిర్వాహకుడితో సహా ఐదుగురు విదేశీయులను అరెస్ట్ చేసి... జైలుకు పంపించారు. ఒక విదేశీ జాతీయుడు  స్టూడెంట్ వీసా పై ఇండియా కి వచ్చి... హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పరిధిలో నివాసము ఉంటూ, ఉపాధి  కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన మహిళ లకు ఉపాధి పేరుతో మాయ మాటలు చెప్పి వారి చేత బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తు న్నాడు.  అధికారులు నలుగురు మహిళలను అదుపులోకి తీసుకొని వారిని రెస్క్యూ హోంకు తరలించారు. న్యూ హఫీజ్‌పేట్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్‌ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో  పోలీసులు వెంటనే ఆ ఇంటిపై దాడి చేసి తనిఖీలు చేపట్టగా, అక్కడ విదేశీ మహిళలతో వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యభిచార రాకెట్‌ను లైబేరియా దేశానికి చెందిన డేరియస్ (28) అనే యువకుడు నిర్వహిస్తు న్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇతడు 2021లో స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చి, మియాపూర్ పరిధిలో స్థానికంగా ఉన్న ఓ కళాశా లలో ఆన్‌లైన్‌లో చదువు కుంటున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే... మరో వైపు ఈ వ్యభిచార దందాకు తెరలేపాడు.  కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన మహిళ లను ఉపాధి పేరుతో నమ్మించి... మోసం చేసి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపి.. ఈ దందాను నడిపిస్తున్నట్లుగా విచారణలో తేలింది.పోలీసులు నిందితుడు డేరియస్‌తో పాటు నలు గురు విదేశీ మహిళలను  అదుపులోకి తీసుకున్నారు.  వారి వద్ద నుంచి రూ.4 వేల నగదు, కొన్ని సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించగా, ప్రధాన నిందితుడైన డేరియస్‌ను రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగించారు.