పెళ్లి కుదరలేదని...యువకుడు ఆత్మహత్య
posted on Nov 12, 2025 @ 11:50AM
నేటి సమాజంలో యువకులకు పెళ్లి ఒక పెద్ద సమస్యగా మారింది... యువతుల కోరికలు ఆకాశంలో విహరిస్తున్నాయి. లక్షలు సంపాదించే ఉద్యోగంతో పాటు ఖరీదైన ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని షరతులు పెడుతున్నారు. ఇవి అన్ని ఉన్న యువకులను మాత్రమే ఎంచుకుంటున్నారు... దీంతో చాలీచాలని జీతంతో సాదాసీదా జీవితం గడిపే యువకులకు పెళ్లి కుదరడం గగనమైంది.
ఇక తనకు పెళ్లి కాదేమో అన్న భయంతో గతంలో కొందరు యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి. ఇప్పుడు తాజాగా మేడ్చల్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది.పెళ్లి కుదరలేదనే మనస్థాపం తో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలో బూర సురేష్ (30) అనే యువకుడు రేపల్లె ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అది గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసుల దర్యాప్తులో వరంగల్ జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన బూర సురేష్ (30) గుర్తించారు.
అతడు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి అమీర్‌పేట్‌లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ బట్టల షాపులో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు గత నాలుగు సంవత్సరాల నుండి సురేష్ కు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు... అయినా కూడా ఏ ఒక్క సంబంధం కుదరలేదు...ఇన్ని సంవత్సరాలుగా యువతులను చూస్తున్నా కూడా ఏ ఒక్కరు తనను ఇష్టపడడం లేదని... ఇక తనకు పెళ్లి కాదేమోనని సురేష్ తీవ్ర స్థాయిలో మదనపడ్డాడు.
దీంతో సురేష్ సుసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడాడు. అనంతరం అమీర్పేట్ నుండి ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోకి వచ్చి రేపల్లె ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకు న్నాడు. గత నాలుగేళ్లుగా వివాహ సంబంధాలు కుదరలేదని, దీనివల్ల మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వే పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొడుకు మరణించాడన్న విషయం తెలియగానే తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు..