మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ ఎన్ కౌంటర్ లో హతం?

ఛత్తీస్ గఢ్ వంతు అయిపోయింది.. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతం వంతా అన్నట్లుగా తయారైంది పరిస్థితి. నిన్నమొన్నటి వరకూ ఛత్తీస్ గఢ్ అడవుల్లో ఎన్ కౌంటర్ల మోత వినిపించేది. నక్సల్ విముక్త భారత్ అంటూ చేపట్టినఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టులకు గట్టిపట్టు ఉన్న ఛత్తీస్ గఢ్ లో భద్రతా దళాలు వరుస ఎన్ కౌంటర్లతో మావోల ఏరివేత చర్యలు చేపట్టారు. దీంతో మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ నుంచి ఏపీలోకి ప్రవేశిస్తున్నారన్న సమాచారంతో ఇక్కడ పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో  అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంగళవారం (నవంబర్ 18)న మారేడుమిల్లి అటవీ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. ఆ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు. తాజాగా బుధవారం ఉదయం ఇదే ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సలైట్లు మరణించినట్లు పోలీసులు తెలిపారు.  ఈ ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. ఏపీలో మావోయిస్టుల కదలికలపై రెండు నెలల నుంచి మానిటరింగ్‌ ఉందన్న ఆయన మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారం మేరకు మంగళవారం జరిపిన కూబింగ్ లో  మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పారు.  ఉండటంతో మంగళవారం ఆపరేషన్‌ చేశామని, మంగళవారం ఉదయం అల్లూరి జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో  మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. మావోయిస్టు షెల్టర్‌ జోన్ల మీద కూడా దాడులు కొనసాగుతున్నాయని, 50 మంది మావోయిస్టులను రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేశామని తెలిపారు. ఇక బుధవారం ఉదయం కూడా  ఇదే ప్రాంతంలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారని తెలిపారు.  మరణించిన ఏడుగురు మావోయిస్టులలో మోస్ట్ వాంటెడ్ దేవ్ జీ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. 

చలికి తోడు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను కోల్డ్ వేవ్ వణికించేస్తున్నది. ఇప్పుడు చలికి తోడు భారీ వర్షాలు కూడా తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేయనున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరకు ఈ నెల 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో  రానున్న రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ కారణంగా రానున్న రోజులలో  ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని, దీంతో చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది.  ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఇవి మరింత పతనమయ్యే చాన్స్ ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఆందోళన కలిగిస్తున్నది. వర్షాలు, చలిగాలులు ప్రజారోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఇలా ఉండగా మంగళవారం తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉదయం పది గంటలకు కూడా జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇక అరకులో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

ఏపీలో 50 మంది మావోయిస్టులు అరెస్టు

ఆపరేషన్‌ కగార్‌తో వరుస ఎన్ కౌంటర్లు, అగ్రనేతల లొంగుబాటులో ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్‌ వైపు వచ్చారన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఏపీలో 5 జిల్లాలో మకాం వేసిన మావోయిస్టుల కోసం ఇంటెలిజెన్స్, ఆక్టోపస్‌ బృందాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.  ఈ క్రమంలో ఏపీ నడిబొడ్డున పెద్ద సంఖ్యలో మావోయిస్టులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. విజయవాడలో  28 మంది నక్సల్స్, కాకినాడలో ఇద్దరు, ఏలూరులో 15 మంది, కోనసీమ జిల్లాలో ఒక నక్సలైట్ ను పోలీసులు మంగళవారం (నవంబర్ 18)అరెస్టు చేశారు. మొత్తంగా ఏపీలో  మంగళవారం (నవంబర్ 18) ఒక్క రోజే 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ బుధవారం (నవంబర్ 19) కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.  విజయవాడలో అరెస్టు చేసిన  వారిలో మావోయిస్టు అగ్ర నేత, మంగళవారం (నవంబర్ 18) ఎన్ కౌంటర్ లో హతమైన హిడ్మా గెరిల్లా టీమ్ కు చెందిన19 మంది, అలాగే ఇప్పటికీ అజ్ణాతంలో ఉన్న మరో మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ భద్రతా సిబ్బంది 9 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.   ఇక ఏలూరు గ్రీన్ సిటిలో కూడా  15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే కాకినాడలో ఇద్దరిని, కోనసీమ జిల్లా అమలాపురంలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.  ఇలా అరెస్టైన 50 మందీ కూడా ఛత్తీస్‌గఢ్‌ వాసులేనని పోలీసులు తెలిపారు.  

ఐ బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ

ఐ బొమ్మ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చింది.  ఐ బొమ్మ ఆర్థిక లావాదేవీలు పెద్ద ఎత్తున క్రిప్టో ‌తో పాటు హవాలా పద్ధతిలో కూడా సాగినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు.   మనీ మనీలాండరింగ్  తో పాటు విదేశీ మారకద్రవ్యం రూపంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా పోలీసులు తేల్చారు. దీంతో  కేసు దర్యాప్తులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది.  ఐబొమ్మ రవి కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరింది. ఆ వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఈడీ ప్రకటించింది.. మనీ లాండరింగ్ కోణంలో అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈడి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు అధికారికంగా లేఖ రాసి, కేసుకు సంబంధించిన సంపూర్ణ వివరాలు పంపించాలని కోరింది. పోలీసులు ఇప్పటికే నిందితుడు ఇమ్మడి రవి బ్యాంక్ ఖాతాల్లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలను దృష్టిలో పెట్టుకుని, అతని ఖాతా నుండి 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు. అదే విధంగా విదేశీ బ్యాంక్ ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు రవి ఖాతాలకు చేరినట్టు పోలీసులు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ఛానళ్ల ద్వారా నెలకు  15 లక్షల వరకు రవికి చెందిన ఎన్ఆర్ఈ అకౌంట్‌కి బదిలీ అయినట్టు పోలీసు దర్యాప్తులో చేరింది.  ఈ నిధుల మార్గాలు, మూలాలు తదితర అంశాలపైఈడి దర్యాప్తు చేయనుంది. ఐబొమ్మ పైరసీ కేసు సైబర్ క్రైమ్ పరిమితులను దాటినందున,  మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది.  రానున్న రోజుల్లో ఈ  కేసులో మరిన్ని సంచలన విషయాలువెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

వెబ్ సైట్ యూజర్లను బెట్టింగ్ యాప్ లకు మళ్లించాడు!

ఐబొమ్మ, బప్పం   వెబ్ సైట్లతో సినిమాలను పైరసీ చేసిన  రవి.. ఆ వెబ్ సైట్ ల యూజర్లను బెట్టింగ్ యాప్ లకు   మళ్లించాడు.  బెట్టింగ్ యాప్​లను ప్రమోట్ చేయడం కోసం ప్రత్యేకంగా రెండు డొమైన్లను క్రియేట్ చేశాడు. వాటిలో ఒకటి హైదరాబాద్ అమీర్ పేట్ లో, మరోటి అమెరికాలోనూ రిజిస్టర్ అయి ఉన్నాయి.  రవి Tradersin.com, Makeindiashop.shop  అనే డొమైన్లు వాడి 1win, 1xbet వంటి బెట్టింగ్​యాప్స్​ప్రమోట్​చేశాడు. ఈ సంచలన విషయాలన్నీ ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.  ఈ రెండు డొమైన్ల ద్వారా ఆన్​లైన్​ బెట్టింగ్​ యాప్స్​ ప్రమోట్ చేసినందుకు భారీ మొత్తంలో క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల నుంచి అతడికి డబ్బు వచ్చిందనీ,  ఆ డబ్బు నేరుగా ఇమ్మడి రవి పేరుతో ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్​ఫర్​అయ్యిందని పోలీసులు పేర్కొన్నారు.  ఒక్కోసారి లక్షలు, మరోసారి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్​సైతం జరిగినట్టు  రవి అ  రిమాండ్ రిపోర్ట్​లో పోలీసులు పేర్కొన్నారు.   ఐబొమ్మ నుంచి బెట్టింగ్ సైట్లకు వెళ్లేందుకు మధ్యలో ట్రాఫిక్ డైవర్షన్ డొమైన్లను రవి స్వయంగా ఏర్పాటు చేశాడనీ, యూజర్ ఐబొమ్మలో మూవీ చూస్తూ ఉంటే.. పక్కనే పాప్ -అప్ వచ్చి బెట్టింగ్ యాప్స్ లింకులు కనిపించేవని, ఆ లింక్ ను యూజర్లు క్లిక్ చేసిన ప్రతిసారీ రవికి   కమీషన్ వచ్చేదని తెలిపారు.  అయితే.. ఈ ట్రాఫిక్ డొమైన్లే చివరికి రవిని పట్టించాయని చెప్తున్నారు. పోలీసులు ఈ డొమైన్ల ట్రాఫిక్​ను ట్రాక్ చేసి, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్​తో రవిని పట్టుకున్నారు.  రవిని అరెస్టు చేయకపోతే ఇలాంటి వెబ్​సైట్స్​మళ్లీ మళ్లీ సృష్టిస్తూనే ఉంటాడనీ,  ఇది ఆగాలంటే రవిని రిమాండ్​కు తీసుకోవడం అవసరమనీ  పోలీసులు పేర్కొన్నారు. పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయంతో ఈ డొమైన్లన్నీ ఒకే ఐపీ, ఒకే ఈ–మెయిల్, ఒకే మొబైల్ నంబర్​కు లింక్ అయినట్టుగా గుర్తించారు. సర్వర్లు ఎక్కడ పెట్టాలి, డొమైన్లు ఎలా మార్చాలి, బ్లాక్ అయిన సైట్స్​ను ఎలా మళ్లీ లైవ్ చేయాలి అన్నది రవి స్వయంగా చూసుకునేవాడని పేర్కొన్నారు.   ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలను తో పాటుగా ఓటిటి వచ్చే కంటెంట్ మొత్తాన్ని కూడా పైరసీ చేసి తన వెబ్సైట్లో పెట్టినట్లు రవి అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.  రవిని గుర్తించడంలో పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ కీలక పాత్ర పోషించినట్టు సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు.   విదేశీ పౌరసత్వం పొందడమే అతని క్రిమినల్ ఉద్దేశ్యాన్ని సూచిస్తోందని, దేశ డిజిటల్ భద్రతకు రవి లాంటి వ్యక్తులు తీవ్ర ప్రమాదమని పోలీసులు ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 

ఆత్మాహుతి దాడి కాదు.. బలిదాన ఆపరేషన్.. ఉమర్ నబీ సంచలన వీడియో

దేశాన్ని కుదిపేసిన డిల్లీ ఆత్మహుతి దాడి కేసు దర్యాప్తులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తున్నది. తాజాగా ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ నబీ సెల్ఫీ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టు చేసిన ఒక ఉగ్రవాది మొబైల్ ఫోన్ లో ఈ వీడియోను ఎన్ఐఏ అధికారులు కనుగొన్నారు. ఆ సెల్ఫీ వీడియోలో ఉమర్ నబీ ఆత్మాహుతి దాడులను సమర్ధిస్తూ మాట్లాడారు. ఆత్మాహుతి దాడిని బలిదాన ఆపరేషన్ గా అభివర్ణించాడు.  ప్రస్తుతం ఈ వీడియో సంచలనం రేపుతోంది. ఉమర్ తాను ఆత్మాహుతి దాడికి పాల్పడడానికి కొన్ని నిముషాల ముందు ఈ సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.  ఈ వీడియోలో ఉమర్ నబీ తీవ్రవాద సిద్ధాంతాలను వల్లెవేస్తూ యువతను ఉగ్రవాదంవైపు ప్రేరేపించేలా మాట్లాడారు. ఈ వీడియోతో పాటు ఇతర డేటాను కూడా ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  ఉగ్రదాడి సూత్రధారులు, వారి నెట్ వర్క్ పేలుడు పదార్థాల సరఫరా మార్గాలు వంటి కీలక అంశాలను వెలికితీ యడానికి దర్యాప్తు మరింత వేగవంతం చేశామని  వెల్లడించారు. దేశమంతటా ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఈ ఈ వీడియో కీలకంగా మారుతుందని అంటున్నారు. 

నకిలీ మద్యం కేసు.. నిందితులకు రెండో సారి కస్టడీ

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో  కీలక పరిణామం సంభవించింది. ఈ కేసులో అరెస్టైన నిందితులను రెండో సారి కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.  నకిలీ మద్యం కేసులో కీలక నిందితులు జనార్ధన్ రావు, జగన్మోహన్ రావులను 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు ఈ కేసులో ఏ1 జనార్దన్ ,ఏ2 జగన్మోహన్​లను 4 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బుధవారం (నవంబర్ 19) నుంచి నాలుగు రోజుల పాటు అంటే ఈ నెల 22 వరకూ వీరిని కస్టడీలోకి తీసుకుని ఎక్సైజ్ శాఖ విచారించనుంది.   అయితే ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాలని కోర్టు షరతు విధించింది. వీరిద్దరినీ గతంలో వారం రోజుల పాటు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని ఎక్సైజ్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.  అయితే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలను రాబట్టేందుకు మరోసారి విచారణకు అనుమతి కోరుతూ ఎక్సైజ్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. వారి వినతిని పరిగణనలోనికి తీసుకున్న ఎక్సైజ్ కోర్టు అందుకు అనుమతి మంజూరు చేసింది.  ప్రస్తుతం ఏ1 జనార్ధన్​రావు నెల్లూరు కేంద్రకారాగారం, ఏ2 జగన్మోహన్ రావు విజయవాడ జిల్లా జైల్లో జ్యుడీషియల్ రిమాండ్​లో ఉన్న సంగతి తెలిసిందే.  ఇలా ఉండగా జోగి రమేష్ సోదరుల కస్టడీ పిటిషన్ పై విచారణకు విజయవాడ కోర్టు గురువారం (నవంబర్ 20)కి వాయిదా వేసింది.  ఇదే కేసులో అరెస్టైన జోగి బ్రదర్స్ జోగి రమేష్, జోగి రామును పది రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని కోరుతూ అబ్కారీ శాఖ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు తదుపరి వాచారణకు వాయిదా వేసింది. కకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఏ18నానూ, జోగి రాము ఏ19గాను ఉన్న సంగతి తెలిసిందే. వీరిరువురూ కూడా ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.  

యువ కవుల కోసం కవితా కార్యశాల

యువకవులకు కవితా నిర్మాణాలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ పిలుపునిచ్చారు.హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్,విమలా సాహితీ సమితి ఆధ్వర్యంలో నగరంలోని యువకవులకు "ఆధునిక వచనకవితా నిర్మాణ పద్ధతులపై శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జెల్ది విద్యాధర్ రాసిన కోహినూర్,ముసాఫిర్ తెలుగు కవితా సంపుటాల ఆంగ్లానువాద గ్రంథాలను కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు. విద్యాధర్ గొప్ప ప్రేమతత్వంతో ,మానవీయ కోణంలో రాసిన కవితా సంపుటాలను ఎంతో సృజనాత్మక ప్రతిభతో అనువాదకులు కొండపాక  రవీంద్రాచారి ఆంగ్లంలో అనువదించడం అభినందనీయమన్నారు.ప్రముఖ కవి, కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ  కవిత్వ కార్యశాలలో  ప్రపంచ కవితా నిర్మాణాలపై బిక్కి కృష్ణ,ఆధునిక కవిత్వం వస్తువైవిధ్యం పై డాక్టర్ నాళేశ్వరం శంకరం,వచన కవిత్వం అభివ్యక్తి నవ్యతపై శైలజామిత్రలు శిక్షణనిచ్చారు. డాక్టర్ పి.విజయలక్ష్మి పండిట్ కవిత్వంపై కీలకోపన్యాసం చేశారు.బిక్కి కృష్ణ రాసిన కవిత్వం - డిక్షన్  పుస్తకాన్ని డాక్టర్ రాధా కుసుమ పరిచయం చేశారు. పద్మశ్రీలత వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కవిత్వ కార్యశాలలో అనేకమంది కవులు  తమ కవితలు వినిపించారు.వాటిని శిక్షకులు విశ్లేషించి కవులను అభినందించారు.

హిడ్మా ఎన్ కౌంటర్.. ధృవీకరించిన పోలీసులు

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం (నవంబర్ 18) ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణించినట్లు అధికారికంగా పోలీసులు ధృవీకరించారు. ఈ ఎన్ కౌంటర్లో హిడ్మాతో పాటు, ఆయన భార్య   రాజీ, మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలకు సంబంధించి కచ్చితమైన సమాచారంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఈరోజు ఉదయం కూంబింగ్ చేపట్టాయని ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా తెలిపారు. ఇలా ఉండగా..  ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా రంపచోడవరంలో  మీడియా సమావేశంలో మాట్లాడుతూ మావోయిస్టు కీలక నేత హిడ్మా మృతి చెందినట్లు ప్రకటించారు.  ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో పరిణామాల కారణంగా  కారణంగా మావోయిస్టులు అక్కడి నుంచి ఏపీ వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అందిన సమాచారంపై మావోయిస్టుల కదలికలు, కార్యకలాపాలపై నిఘా ఉంచామన్న ఆయన నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం మేరకు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎన్ కౌంటర్ జరిగిందన్నారు.  ఈ ఎన్ కౌంటర్ లో హిడ్మాతో సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారని తెలిపారు. అంతే కాకుండా విజయవాడ, కాకినాడలలో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని వెల్లడించారు. అలా అరెస్టైన వారిలో తొమ్మిది మంది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలిపారు. ఇలా ఉండగా ఒక వైపు మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ వార్త వెలువడిన వేళ.. మంగళవారం (నవంబర్ 18) విజయవాడలో మావోయిస్టుల అరెస్టు కలకలం రేపింది.  విజయవాడ పెనమలూరులో ఓ భవనంలో అద్దెకు తీసుకుని నివసిస్తున్న మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.  ఈ భవనాన్ని సేఫ్ షెల్టర్ జోన్ గా చేసుకుని  కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అందిన పక్కా సమాచారం మేరకు ఆక్టోపస్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ షెల్టర్ జోన్ నుంచి  ఏకే 47 సహా భారీగా డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంతకీ ఎవరీ హిడ్మా

ఆయన చాలా సౌమ్యంగా, మృదువుగా మాట్లాడుతారు. ఆయన మాట తీరు విని ఈయనేనా ఇంత విధ్వంసం సృష్టించింది అని అంతా అనుకుంటారంటూ హిడ్మా గురించి చెబుతారు ఆయనని తెలిసిన వారు.  అత్యంత సౌమ్యంగా మాట్లాడే ఈ హిడ్మాయే దాదాపు పదికి పైగా మావోయిస్టు దాడులలో కీలక పాత్రపోషించి, పెద్ద సంఖ్యలో  భద్రతా బలగాల మరణానికి కారణమయ్యాడు. మోస్ట్ వాంటెడ్ హిడ్మా సొంత గ్రామం చత్తీస్ గఢ్  రాష్ట్రం లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. ఆ గ్రామం నుంచి దాదాపు 40-50 మంది మావోయిస్టులు ఉంటారని అంచనా. పార్టీ లోకి రాకముందు హిడ్మా వ్యవసాయం చేసుకు నేవాడు. ఎక్కువగా మాట్లాడే అలవాటు లేని హిడ్మా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తాడు. ఆ క్రమంలోనే మావోయిస్టు పార్టీతో కలసి పనిచేసిన ఒక లెక్చరర్ ద్వారా ఇంగ్లీషు నేర్చుకున్నాడు. హిడ్మా కి దక్షిణ బస్తర్ లోని దండకా రణ్యంలో తిరుగులేని పట్టు ఉంది. అసలు మావోయిస్టు పార్టీలో హిడ్మా ఎదుగుదల ఒక ఆశ్చర్యకర ప్రస్థానం. 1996-97 ప్రాంతంలో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరిన హిడ్మాకు హిద్మల్లు, సంతోష్‌ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. 17 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీ బాలల సంఘంలో చేరి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు.ఆ తర్వాత మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తు న్నారు.   మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ దాడుల్లో  హిడ్మా అత్యంత కీలకంగా వ్యవహరించాడు.  హెడ్మాపై కోటి,ఆయన భార్యపై 50 లక్షల రూపాయల రివార్డులు ఉన్నాయి. చత్తీస్గడ్ లో కగార్ ఆపరేషన్ తీవ్రతరం కావడంతో హిడ్మా చత్తీస్గడ్ ప్రాంతం నుండి ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తలదాచు కుంటున్నాడు. హిడ్మాకు హిందీ,  గోండు, కోయ, తెలుగు,బెంగాలీ వంటి భాషలపై పట్టు ఉంది. 2010 ఏప్రిల్ 6న అప్పటి ఉమ్మడి దంతేవాడ జిల్లా తాడిమెట్ల,చింతల్ నార్ అటవీ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ బలగాలపై  జరిగిన అంబుష్ (మెరుపుదాడి)లో హిడ్మాదే కీలక పాత్ర. ఆ మెరుపుదాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ తరువాత  2017లో 25 మంది, 2021లో బీజాపూర్ జిల్లాలో 23 మంది  జవాన్ల మృతి చెందిన దాడుల వెనుక కూడా హిడ్మాయే ఉన్నాడు. 

పరకామణి చోరీ కేసు.. సాక్షుల భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు

తిరుమల తిరపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో సాక్షులు, నిందితుల భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యేందుకు వస్తున్న ఫిర్యాదుదారు, టీటీడీ మాజీ సీవీఎస్వో సతీష్ కుమార్ మృతి నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.  ఈ కేసుకు సంబంధించి  సాక్షులు, నిందితుల భద్రతపై   ఆందోళన వ్యక్తం చేసిన హై కోర్టు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ తో పాటు సాక్షులందరినీ పూర్తిస్థాయి భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ డీజీకి విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది.  కేసు విచారణ ముగిసేంత వరకు వారికి ఎలాంటి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపట్టాలనీ, అలాగే  విచారణ సమయంలో  ఇబ్బందులు తలెత్తకుండా, సాక్షుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది.  అనంతరం కేసును డిసెంబర్ 2కు వాయిదా వేసింది. పరకామణి చోరీ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే  ఇటీవల టీటీడీ మాజీ సీవీఎస్వో మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  సతీష్ మరణాన్ని తొలుత  అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినప్పటికీ,  ఆ తర్వాత హత్య కేసుగా మార్చిన విషయం తెలిసిందే.  

వైసీపీ అధికార ప్రతినిథి కారుమూరి అరెస్టు

వైసీపీ అధికార ప్రతినిథి కారుమూరి వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. అసత్య ఆరోపణలు, అభాండాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ కుకట్ పల్లిలో అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కారుమూరి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై తాడిపత్రి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. తాడిపత్రి తెలుగుదేశం నాయకుడు చేసిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు జరిగిందంటున్నారు.  కర్నూలు బస్సు ప్రమాదంపైనా, తిరుమల పరకామణి కేసు ఫిర్యాదుదారు అనుమానాస్పద మృతి  ఘటనపైనా కారుమూరి చేసిన వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు జరిగిందని అంటున్నారు. కాగా కూకట్ పల్లిలో అరెస్టు చేసిన కారుమూరును ఏపీకి తరలిస్తున్నారు. ఈ కేసులే కాకుండా కారుమూరుపై ఏపీలో పలు కేసులు నమోదైనట్లు చెబుతున్నారు.  

రాజమౌళిపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు సరూర్ నగర్ పోలీసులు దర్శక ధీరుడు రాజమౌళిపై కేసు నమోదు చేశారు. విషయమేంటంటే.. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తీస్తున్న సినిమా వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్లో ప్రసంగించిన రాజమౌళి హనుమంతుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రీయ వానర సేన అనే సంస్థ సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాజమౌళిపై చర్యలు తీసుకోవాలనీ, సమగ్ర విచారణ జరిపించాలనీ  ఆ ఫిర్యాదులో కోరింది. సినీ పరిశ్రమలో  భవిష్యత్తులో  ఎవరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  

అంబులెన్సులో మంటలు.. నలుగురు సజీవ దహనం

అంబులెన్స్ లో హఠాత్తుగా మంటలు వ్యాపించి నలుగురు సజీవదహనమైన దుర్ఘటన గుజరాత్ లో  మంగళవారం (నవంబర్ 18) ఉదయం జరిగింది. ఈ ఘటనలో అంబులెన్స్ లో ఉన్న నవజాత శిశువు, ఆ శిశువు తండ్రి, ఒ వైద్యుడు, నర్సు సజీవదహనమయ్యారు. గుజరాత్ లోని మొదాస పట్టణం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. జన్మించిన అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురైన నవజాత శిశువును మొదాసలోని ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి అంబులెన్సులో తరలిస్తుండగా అంబులెన్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.  ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అంత హఠాత్తుగా అంబులెన్స్ లో మంటలు ఎలా వ్యాపించాయి అన్నదానిపై విచారణ జరుపుతున్నారు.  

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్?!

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. హిడ్మా తలపై కోటి రూపాయలకు పైగా రివార్డు ఉన్న సంగతి తెలిసిందే. ఇంత కాలంగా భద్రతా దళాలు, పోలీసులను ముప్పతిప్పలు పెడుతూ మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న హిడ్మా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమైనట్లు తెలిసింది. ఈ ఎన్ కౌంటర్ లో హిడ్మా తో పాటు మరో ఐదుగురు మావోలు కూడా హతమైనట్లు తెలుస్తోంది.   ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్ లో మంగళవారం (నవంబర్ 18)  ఉదయం మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ మరణించారు. ఈ ప్రాంతంలో నక్సల్ అగ్రనేతలు ఉన్నారన్న పక్కా సమాచారంతో  పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో  ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో  ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఘటనా స్థలంలో  పెద్ద ఎత్తున తుపాకులు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వీధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల కూబింగ్ ఇంకా సాగుతోందని తెలుస్తోంది.  

అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులెప్పుడంటే?

అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిథుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. బుధవారం (నవంబర్ 19)న అర్హులైన రైతులందరి ఖాతాల్లోకీ నేరుగా అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను జమ చేయనుంది.ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడతలో 46 లక్షల 85 వేల 838 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు రాష్ట్రప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద అందించనున్న ఐదే వేల రూపాయలు కలిపి అర్హులైన రైతుల ఖాతాలలో మొత్తం ఏడు వేల రూపాయలు జమకానున్నాయి.  ఈ పథకం కింద ఈ ఏడాది ఆగస్టులో తొలి విడత కింద రైతుల ఖాతాలలోకి సొమ్ము జమచేసిన ప్రభుత్వం.. ఇప్పుడు బుధవారం (నవంబర్ 19) రెండో విడత నిథులను జమ చేయనుంది.   రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 వేలకు పైగా రైతు సేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు స్థానికంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.  

ఢిల్లీ బ్లాస్ట్.. మరో కీలక నిందితుడి అరెస్టు

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ప్రాంతంలో జరిగిన ఘోరమైన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలక ముందడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి మరో కీలక నిందితుడిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఢిల్లీ పేలుడు ఘటనలో 13 మంది మరణించగా, మరో 32 మంంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే ఎన్ఐఏ  కారు బాంబు పేలుడు ఘటనకు పాల్పడిన వారిని అరెస్టు చేయగా, తాజాగా మరో  కీలక నిందితుడిని అరెస్టు చేసింది. శ్రీనగర్‌లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన ఎన్‌ఐఏ బృందం, కశ్మీర్‌కు చెందిన జాసిర్ బిలాల్ వాని అలియాస్ డానిష్ ను   అరెస్టు చేసింది. అతడు కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా, ఖాజిగుండ్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ఎన్‌ఐఏ దర్యాప్తులో జాసిర్ ఉగ్రవాద దాడులకు సాంకేతిక సహాయం అందించిన వ్యక్తిగా గుర్తించింది. డ్రోన్లను సమకూర్చడం, రాకెట్లు తయారు చేయడానికి ప్రయత్నించడం వంటి కీలక కార్యకలాపాలకు అతడు నేరుగా సహక రించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పేలుడు జరిగే ముందు ఉగ్రవాద చర్యలను అమలు చేయడంలో అతడి పాత్ర ఉందనిఎన్ఐఏ తెలిపింది.జాసిర్ బిలాల్ వాని పేలుడు  ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్న ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీతో కలసి ఈ దాడిని ప్లాన్ చేసినట్టు ఎన్‌ఐఏ తెలిపింది.   ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. 

అక్ర‌మ క‌ట్ట‌డాల‌ కూల్చివేత

శేరిలింగంప‌ల్లి మండ‌లం గ‌చ్చిబౌలి ప్ర‌ధాన ర‌హ‌దారికి ఆనుకుని  సంధ్యా శ్రీ‌ధ‌ర‌రావు నిర్మించిన ప‌లు అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను హైడ్రా సోమ‌వారం (నవంబర్ 17) కూల్చివేసింది. ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్  కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్‌లో ర‌హ‌దారులు, పార్కుల‌ను ప‌ట్టించుకోకుండా.. చేప‌ట్టిన నిర్మాణాల‌పై హైకోర్టు ఉత్త‌ర్వుల ప్ర‌కారం హైడ్రా ఈ కూల్చివేతలకు పాల్పడింది.  40 ఫీట్ల ర‌హ‌దారిపై అడ్డంగా ఐర‌న్ ఫ్రేమ్‌తో నిర్మించిన 5 అంత‌స్తుల భ‌వ‌నాన్ని తొల‌గించి ర‌హ‌దారిని క్లీయ‌ర్ చేసింది. అలాగే 40 ఫీట్ల ర‌హ‌దారిని ప‌ట్టించుకోకుండా.. నిర్మించిన మ్యాంగో ఫుడ్ కోర్టును కూడా తొల‌గించింది. మ‌రో చోట 40  ఫీట్ ర‌హ‌దారిపై నిర్మించిన యూనో ఫుడ్ కోర్టును కూడా తొల‌గించి.. మార్గం సుగ‌మం చేసింది. 40 ఫీట్ల ర‌హ‌దారిని క‌లిపేసి నిర్మించిన పెట్రోల్ బంక్‌ను కూడా పాక్షికంగా తొల‌గించింది. రెండు చోట్ల  25 ఫీట్ల ర‌హ‌దారుల‌పై ఏర్పాటు చేసిన 40 వ‌ర‌కూ ఉన్న ఫుడ్ కంటైన‌ర్ల‌తో పాటు చైనా ఫుడ్ కోర్టుల‌ను తొల‌గించి మార్గాల‌ను క్లియ‌ర్ చేసింది.  40 ఫీట్ల ర‌హ‌దారిపైకి జ‌రిగి నిర్మించిన ఆసుప‌త్రి భ‌వ‌నం సెల్లార్ ర్యాంపుల‌ను హైడ్రా   తొల‌గించింది. ఇలా మొత్త‌మ్మీద 7 చోట్ల ర‌హ‌దారుల‌ను ఆక్ర‌మించి నిర్మించిన ప‌లు క‌ట్ట‌డాల‌ను తొల‌గించింది. ర‌హ‌దారుల హ‌ద్దుల‌ను నిర్ధారించింది. హైకోర్టు ఆదేశాల మేర‌కు లే ఔట్‌లోని ర‌హ‌దారులను హైడ్రా పున‌రుద్ధ‌రించ‌డంతో అక్క‌డి ప్లాట్ య‌జ‌మానులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

సౌదీ బస్సు ప్రమాదం..ఒకే కుటుంబంలో ఏకంగా 18 మంది మృతి

ఏడ‌వ‌డానికి కూడా మ‌నుషులు మిగలకుండా ఓ కుటుంబం మొత్తం మృత్యు ఒడికి చేరింది. అత్యంత విషాదకరమైన ఈ ఘటనలో ఆ కుటుంబంలో మిగిలిన ఒకరిద్దరిలో కూడా.. తాము ఇంక ఎవరి కోసం, ఎందుకోసం బతకాలన్న నైరాశ్యం. వైరాగ్యం. చ‌నిపోయాక అంద‌రూ దేవుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లే వాళ్లే. కానీ..  ఒకేసారి అంద‌రూ దేవుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతే ఇక ఆ కుటుంబ‌మే లేకుండా పోతుంది. అదే జ‌రిగింది హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ కి చెందిన న‌సీరుద్దీన్ కుటుంబంలో. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి న‌సీరుద్దీన్ కుటుంబం న‌వంబ‌ర్ 9న సౌదీకి వెళ్లారు. ఆయ‌న భార్య అత్త‌ర్ బేగం, కొడుకు స‌ల్లావుద్దీన్, అత‌డి భార్య ఫ‌లానా.. వీరి ముగ్గురు పిల్ల‌లు జైన్,  ఫ‌రీదా, శ్రీజ ఉన్నారు. అలాగే న‌సీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ అమెరికాలో ఉంటాడు. అత‌డి భార్య స‌న‌, వీరి ముగ్గురు పిల్ల‌లు మొహ‌రీన్, మోజా, అజ‌ర్ సైతం యాత్ర‌కు వెళ్లారు.  నజీరుద్దీన్ కి ఇద్ద‌రు కొడుకులు.. ముగ్గురు ఆడ‌పిల్ల‌లున్నారు. వారు అమీనా బేగం, షమీనా బేగం, రిజ్వానా బేగం. వీరు సైతం హ‌జ్ యాత్ర‌కు వెళ్లారు. అమీనా బేగం కూతురు హనీష్ కూడా వీరితో పాటు వెళ్లారు. ఇక‌ షబానా బేగం కుమారుడు జాఫర్ సైతం యాత్ర‌కు వెళ్లాడు. రిజ్వానా బేగం పిల్లలు మరియాన, సహజ కూడా ఉమ్రాకు వెళ్లారు. ఈ మొత్తం 18 మంది ఒకేసారి సౌదీలో జరగిన ఘోర బస్సు   ప్ర‌మాద ఘ‌ట‌న‌లో మృతి చెందారు.   దీంతో విద్యాన‌గ‌ర్ ప్రాంత‌మంతా ఒక్క‌సారిగా విషాద చ్ఛాయ‌ల్లో కూరుకుపోయింది. ఒక చెట్టు నుంచి ఒక ప‌క్షుల గుంపు గుంపే ఎగిరిపోతే ఆ చెట్టు ఎంత బోసిపోతుందో.. ఒక ప్రాంతం నుంచి ఇంత మంది పెద్దా చిన్నా మొత్తం ప్రాణాలు కోల్పోతే.. ఆ ప్రాంగ‌ణం మాత్ర‌మే కాదు, ఆ  ప్రాంత‌మంతా కూడా  ఒక్క‌సారిగా స్మ‌శాన  వైరాగ్యం అలుముకుంటుంది. ప్ర‌స్తుతం ఇక్క‌డి ప‌రిస్థితి అలాగే ఉంది.  ఇంట్లోని అంద‌రూ ఒక్క‌సారిగా వెళ్లిపోతే.. మిగిలిన ఆ ఒక‌రిద్ద‌రికి ఏం చేయాలో పాలు పోని ప‌రిస్థితి ఎదురు కాక త‌ప్ప‌దు. ఇది జీవితాంతం వెంటాడి వేటాడే విషాదం. ఇది విద్యాన‌గ‌ర్ ప్రాంతానికే కాదు హైద‌రాబాద్ మొత్తం అలుముకున్న విషాదం.  బస్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన 45 మందిలో.. 18 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావ‌డం ఒక విషాదం కాగా.. వారిని క‌డ‌సారి చూసుకోడానికి కూడా వీల్లేని విధంగా మ‌దీనాకు స‌మీపంలోని స్మ‌శానంలో అంత్యక్రియ‌లు నిర్వ‌హించ‌డం మ‌రో దారుణం. ఇది ప‌గ‌వాడికి కూడా రాకూడని  దుస్థితి.. వారి ఆత్మ‌ల‌కు శాంతి చేకూర్చాల‌ని మ‌న‌మంతా క‌ల‌సి ఆ భ‌గ‌వంతుడ్ని ప్రార్ధించ‌డం త‌ప్ప మ‌రేం చేయ‌గ‌లం.