మరింత పెరగనున్న బంగారం ధరలు!
posted on Nov 13, 2025 @ 1:33PM
జేపీ మోర్గాన్ ప్రైవేట్ బ్యాంక్ ఓ సంచలన విషయాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని అంచనా వేసింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఔన్స్ బంగారం ధర 5 వేల 200 నుంచి 5 వేల 300 డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది. ఇదే నిజమైతే ప్రస్తుతమున్న ధరలతో పోల్చితే ఏకంగా 20 నుంచి 25 శాతం బంగారం ధరలు పెరగడం తథ్యం. ఈ ఏడాది ఇప్పటికే బంగారం ధర ఓసారి రికార్డ్‌ను క్రియేట్ చేసింది. అక్టోబర్‌లో ఔన్స్ బంగారం ధర 4 వేల 380 డాలర్లను తాకింది. ఆ తర్వాత 4 వేల డాలర్లకు పడిపోయింది. కానీ ప్రస్తుతం మళ్లీ 4 వేల 130 డాలర్ల వరకు చేరింది. ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని ఆ బ్యాంకు అంచనా వేసింది. రానున్న రోజుల్లో కాస్త తగ్గినా.. ఆ తర్వాత మాత్రం క్రమక్రమంగా పెరిగే అవకాశమే ఉందన్నది ఆ అంచనా. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ పుణ్యమా అని గోల్డ్‌కు డిమాండ్ పెరిగింది. అన్ని దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటున్నాయి. ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్‌లోనే 634 టన్నుల బంగారాన్ని సెంట్రల్ బ్యాంక్‌లు కొనుగోలు చేశాయి. ఈ ఏడాది చివరి నాటికి ఆ మొత్తం 750 నుంచి 900 టన్నులకే చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.
చైనా, భారత్‌తో పాటు పోలాండ్, టర్కీ, కజక్‌స్థాన్ కూడా తమ గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటున్నాయి. డాలర్ రిజర్వ్‌లను కొనసాగిస్తూనే బంగారంపై దేశాలు ఆధారపడుతున్నాయి. అయితే అమెరికా-చైనా మధ్య ట్రేడ్ డీల్‌పై పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బంగారం ధర కాస్త తగ్గినా కానీ.. మళ్లీ ఇప్పుడు పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేసేందుకే ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపుతారని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో డిమాండ్ పెరగడానికి ఇదే కారణం కాబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే కొండెక్కి కూర్చున్న బంగారం ధర.. రానున్న రోజుల్లో మరింత పెరిగి ఆకాశానికి చేరడం ఖాయమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.