విదేశీ ఉద్యోగులు అవసరమే అంటున్న ట్రంప్
posted on Nov 12, 2025 @ 1:52PM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. విదేశీ ఉద్యోగులు అవసరమే అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అమెరికన్లలో సరైన టాలెంట్ లేదని అంగీకరించారు. అసలు ఇప్పుడు ట్రంప్‌కు ఈ విషయం ఎందుకు గుర్తొచ్చిందనే చర్చ నడుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు గురించి ప్రపంచం మొత్తానికి ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అవసరం ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా.. ఇలా ఎప్పటికప్పుడు మాటలను మార్చుతూ.. నోటికొచ్చింది మాట్లాడేస్తారని ఇప్పటికే అందరికి ఓ క్లారిటీ వచ్చింది.
ఇప్పుడీ విషయాలన్నీ ఎందుకంటే.. వలసదారులు, విదేశీ ఉద్యోగుల విషయంలో మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న ట్రంప్.. ఇప్పుడు విదేశీ ఉద్యోగులు అవసరమే అంటూ మాట మర్చేశారు. అమెరికాలోని కొన్ని కీలక రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలంటే.. విదేశీ ఉద్యోగులు అవసరం అనేది ఆయన మాట. అమెరికాలో అనుకున్నంత టాలెంట్ లేదని ఆయన ఓపెన్‌గానే అంగీకరించారు.
బట్.. అమెరికన్లు విదేశీ ఉద్యోగుల నుంచి నేర్చుకోవాలని.. అప్పుడే వారికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు. నిజానికి ఇది రియలైజేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్‌గా జార్జీయాలోని ఓ డిఫెన్స్ ఫ్యాక్టరీలోని విదేశీ ఉద్యోగులను తొలగించారు. దీంతో అందులో ఉత్పత్తి అయ్యే కొన్ని ఉత్పత్తులపై ఎఫెక్ట్ పడింది. ఈ విషయాన్ని కూడా ట్రంప్ అంగీకరించారు.
మరీ ఇన్ని విషయాలు చెబుతున్న ట్రంప్.. హెచ్1బీ వీసాల విషయంలో తీసుకున్న కఠిన నిర్ణయాలపై మాత్రం స్పందించలేదు. ఇప్పటికే H1B వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచారు.. వలసదారులను వేటాడాలని ఇమ్మిగ్రేషన్ అధికారులకు అనుమతి ఇచ్చారు. అమెరికాకు వచ్చి చదువుకునే స్టూడెంట్స్ విషయంలో కూడా కఠిన నిబంధనలను అమలు చేశారు.
మరి వీటన్నింటిపై మాత్రం నోరు మెదపడం లేదు. అంతేకాదు అక్రమ వలసదారులను గుర్తించేందుకే రెయిడ్స్ చేసినట్టు సమర్థించుకున్నారు. కానీ ట్రంప్ మాటలు, చేతలు మాత్రం డాలర్ డ్రీమ్స్‌ను దెబ్బకొట్టాయనే చెప్పాలి. ఓవరాల్‌గా చూస్తే ట్రంప్ స్వరం మారడానికి కారణం ప్రస్తుతం ఏర్పడిన అవసరం అని మాత్రమే తెలుస్తోంది.
ఎందుకంటే ఇప్పుడే నిపుణులైన వారందరిని ఇబ్బందులు పెట్టి తరిమేస్తే.. అసలుకే మోసం వస్తుందని ట్రంప్ అధికార వర్గానికి అర్థమై ఉంటుంది. అందుకే వాయిస్‌లో బేస్ కాస్త తగ్గింది. కానీ అంతిమ లక్ష్యంలో మాత్రం ఏ మార్పు లేదనే చెప్పాలి.