ఈ సారైనా జగన్...వ్యక్తిగతంగా హాజరవుతారా?
posted on Nov 12, 2025 @ 2:51PM
చట్టాల ఉల్లంఘన జగన్‌కి కొట్టిన పిండి. వెన్నతో పెట్టిన విద్య. వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తుల్లో ఇదొకటా? అంటే అవుననే చెప్పాలంటారు చాలా మంది. ఆయన పుష్కర కాలంగా అంటే, పన్నెండేళ్ల నాటి నుంచి బెయిలుపై బయట తిరుగుతన్న సంగతి అటుంచితే కనీసం కోర్టుకు వ్యక్తిగత హాజరు కావడం లేదు. అదేమని అడిగితే తాను వస్తే శాంతి భద్రతల సమస్య భారీ ఎత్తున ఏర్పడుతుందని.. అందుకే తాను అలా హాజరు కావడం లేదని నెట్టుకొస్తున్నారు జగన్.
ఇప్పటి వరకూ ఆయనలా వేసిన వాయిదాల మీద వాయిదాలను లెక్కిస్తే అవే కొన్ని వేల సార్ల వరకూ ఉంటాయి. ఇక ఆయా వాయిదాలకుగానూ ఆయన పెట్టిన లాయర్ ఖర్చులే కోట్లాది రూపాయల్లో ఉంటాయని అంచనా వేస్తారు న్యాయనిపుణులు. ఇటీవల జగన్ లండన్ వెళ్తూ వెళ్తూ ఒక ఫాల్తు నెంబర్ కోర్టుకు సబ్మిట్ చేశారన్న అభియోగం ఒకటి కొత్తగా వెలుగులోకి వచ్చింది. జగన్ ఏదైనా అంతే. నేరుగా చేయరు. ఇటీవల హోం మంత్రి అనిత అన్నట్టు.. ఏపీ కార్యర్తలు తమ సమస్యలు చెప్పుకోడానికి డిజిటల్ బుక్ కోసం ఒక నెంబర్ ఇస్తే.. అది కాస్తా తెలంగాణది. ఆయనుండేదేమో కర్ణాటకలోని బెంగళూరు.
ఇక లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే, జగన్ ఈ డొంక తిరుగుడు వ్యవహారశైలికి విసిగి వేసారిన కోర్టు ఆయన్ను వ్యక్తిగత హాజరు నుంచి ఇక మినహాయించలేమని.. ఈ నెల 21 తప్పనిసరిగా జగన్ హాజరు కావల్సిందేనని ఆదేశించింది. మరి తన వాయిదాల తెలివితేటలతో జగన్ దీన్నెలా అధిగమిస్తారో తేలాల్సి ఉంది.ఇదిలా ఉంటే జగన్ వ్యక్తిగత హాజరే జరగడం లేదంటే.. ఇక ఆయన్ను జైలుకు పంపడం సాధ్యమయ్యే పనేనా? ఎంతైనా జగన్ జగనే. ఇలాంటి విషయాల్లో ఆయనకు ఇంటర్నేషనల్ మాఫియా డాన్లకు లేనంత తెలివితేటలున్నాయని మాట్లాడుకుంటున్నారు ఆంధ్రా పబ్లిక్.
జగన్ యూరప్ టూర్ అనంతరం కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని గట్టిగా కోరింది. తీవ్ర ఆర్థిక నేరారోపణలను ఎదుర్కొంటున్న జగన్.. ఆరేళ్లుగా ట్రయల్ కోర్టుకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని తెలిపింది. ఈ కేసులకు సంబంధించి డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున జగన్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరవడంలో తప్పేమీ లేదని పేర్కొంది. దీంతో గత్యంతరం లేక వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్ తరఫు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. మరికొద్ది రోజులు సమయం ఇస్తే మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతారని తెలిపారు