ఏపీలో రెండు రోజుల్లోనే రూ.7.15 లక్షల కోట్ల పెట్టుబడులు

  విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో తొలి రోజు  మొత్తంగా 40 కంపెనీలతో రూ. 3,49,476 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్నాయి. సీఐఐ భాగస్వామ్య సదస్సులో హజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వ దార్శనికతను ప్రపంచ పారిశ్రామికవేత్తల ముందు ఆవిష్కరించామని తెలిపారు.  త్వరలోనే ఏపీ నుంచి డ్రోన్ ట్యాక్సీలను ప్రారంభిస్తామని, విశాఖలో 'ఆంధ్రా మండపం' నిర్మిస్తామని ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు. ఈ సదస్సుకు 72 దేశాల నుంచి 522 మంది విదేశీ ప్రతినిధులతో పాటు మొత్తం 2,500 మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ అత్యంత సుందరమైన, సురక్షితమైన నగరమని, ఇక్కడి ప్రకృతి వనరులు, బీచ్‌లు, కొండలు ఎంతో ప్రత్యేకమైనవని సీఎం కొనియాడారు. ఈ ఒప్పందాల ద్వారా 4,15,890 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. నిన్న 35 ఒప్పందాల ద్వారా రూ. 3,65,304 కోట్ల పెట్టుబడులు, 1,26,471 ఉద్యోగాలు వచ్చాయని స్ఫష్టం చేశారు.  నిన్న, ఇవాళ కలిపి 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు, 5,42,361 ఉద్యోగాలు కల్పించనున్నారు. రిలయెన్స్ ఇండస్ట్రీ సంస్థ ఈడీ ఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌతిండియా మెంటార్ మాధవరావుతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ సంస్థ అంగీకారం తెలిపింది. ఏఐ డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఏపీపై నమ్మకం ఉంచి... భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ముఖేష్ అంబానీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

లులూ గ్రూప్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ

  ఏపీలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లులూ ఇంటర్నేషనల్ గ్రూప్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు సంబంధించి విశాఖలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో శుక్రవారం సీఎం చంద్రబాబు, లులూ గ్రూప్ చైర్మన్, ఎండీ యుసుఫ్ అలీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆ సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు.  అనంతరం  చంద్రబాబు మాట్లాడుతూ గత పాలకులు నిలిపోసిన ఈ ప్రాజెక్టును ఎట్టకేలకు రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చామని అన్నారు. గూగుల్, ఆర్సెల్లార్ వంటి సంస్థలు విశాఖ రావడం లులూ సంస్థకు సానుకూల అంశమని సీఎం చెప్పారు. మూడేళ్లలోగా మాల్ నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లులూ మాల్ కేవలం షాపింగ్ మాల్ మాత్రమే కాదని, విశాఖ పర్యాటకానికి దోహదపడుతుందని చెప్పారు.  అలాగే ప్రపంచవ్యాప్తంగా 300కి పైగా మాల్స్ నిర్వహిస్తున్న లులూ సంస్థ ఇందుకు అవసరమ్యే వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రంలోని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా లులూ చైర్మన్‌ను కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్‌ రంగంలోనూ   లులూ సంస్థ ఒప్పందాలు చేసింది.  మామిడి, జామ పల్ప్‌తో పాటు మసాలా దినుసులు రాష్ట్రం నుంచి సేకరించి ఎగుమతి చేస్తామని లులూ సంస్థ వెల్లడించింది వచ్చే జనవరి నుంచి ఏపీ నుంచి ఎగుమతులు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.  త్వరలోనే లాజిస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్‌పోర్ట్ కేంద్రాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయనున్నట్టు లులూ గ్రూప్ చైర్మన్, ఎండీ యుసుఫ్ అలీ ప్రకటించారు. విశాఖ నగరంలో లులూ సంస్థ 13.83 ఎకరాలు, 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1,066 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ వరల్డ్ క్లాస్ మాల్‌తో 5 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ప్రస్తుతం విశాఖ లో నిర్మించనున్న మాల్ దేశంలో భారత్ లో 9వ దని రాష్ట్రంలో  మొట్టమొదటిదని లులూ సంస్థ వెల్లడించింది.  

జూబ్లీహిల్స్ గెలుపు మరింత బాధ్యతను పెంచింది : సీఎం రేవంత్‌

  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురించి తను మాట్లాడనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లో లేరని హెల్త్ అంతంత మాత్రంగా ఉన్న నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని రేవంత్‌రెడ్డి  అన్నారు.  అయితే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అహంకారం పోలేదని, మాజీ మంత్రి హరీశ్ రావు అసహనం తగ్గించుకోవాలని హితవు పలికారు.  స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 17న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు సందర్బంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తమ బాధ్యతను మరింతగా పెంచిందని రేవంత్‌రెడ్డి అన్నారు.  రెండేళ్లు పూర్తి చేసుకున్న తమ పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారని పేర్కొన్నరు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పోలైన ఓట్లలో దాదాపు 51 శాతం కాంగ్రెస్‌కి, 38 శాతం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు, 8 శాతం బీజేపీకి వచ్చాయన్నారు. దీని ద్వారా గత రెండేళ్ల తమ పాలనను ప్రజలు పరిశీలిస్తున్నట్లు స్పష్టమైందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  

బీఆర్‌ఎస్ ఓటమి ....కవిత షాకింగ్ ట్వీట్

  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రిజల్డ్స్  వెలువడిన తర్వాత తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత సంచలన ట్వీట్  చేసింది. కర్మ హిట్స్‌ బ్యాక్‌’’ అంటూ ఎక్స్‌ వేదికగా ఆమె పేర్కొన్నది. దండం పేట్టే ఎమోజీలతో ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఇవాళ వెలువడిన జూబ్లీ ఫలితాల్లో బీఆర్‌ఎస్  ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే.  ఇటీవల కవిత బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన ఆమె అధినేత కేసీఆర్ మినహా మిగతా నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు 98,988 ఓట్లు, బీఆర్‌ఎస్  అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061 ఓట్లు పోలయ్యాయి.

ఏపీలో రిలయెన్స్ భారీ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. విశాఖ నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో రిలయెన్స్ ప్రతినిధులు భేటీ అయ్యారు.  రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఈ భేటీ అనంతరం ఆ సంస్థ ప్రకటించింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌతిండియా మెంటార్ మాధవరావు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా సీఎంతే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు.  ఈ సందర్భంగా  ఒక గిగావాట్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన జీపీయులు, టీపీయులు, ఏఐ ప్రాసెసర్‌లతో కూడిన ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయెన్స్ ఏఐ డేటా సెంటర్‌కు అనుబంధంగా ఏపీలో ఈ సెంటర్ పనిచేస్తుదన్నారు. ఈ రెండు కేంద్రాలతో ఆసియాలోనే అత్యంత బలమైన ఏఐ నెట్‌వర్క్‌లలో ఒకటిగా రిలయెన్స్ అవతరించనుంది. ఈ ఏఐ డేటా సెంటర్ విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా 6 గిగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును కూడా రిలయెన్స్ నిర్మించనుంది. దీంతో పాటు కర్నూలులో 170 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సౌకర్యాలతో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంపై నమ్మకంతో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.  

యావద్దేశ ప్రగతి గురించి ఆలోచించే విజనరీ చంద్రబాబు.. పియూష్ గోయెల్

విశాఖ వేదిక‌గా జ‌రుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందస్సులో ప్రసంగించిన ఆయన చంద్రబాబును కేవలం రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రమే కాకుండా యావత్ భారతదేశ ప్రగతి గురించి ఆలోచించే  విజనరీగా అభివర్ణించారు.   చంద్రబాబు వంటి నాయకుడు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డా అదృష్టవంతుడన్న పియూష్ గోయెల్, స్వర్ణాంధ్ర విజన్ 2047తో ఆంధ్రప్రదేశ్ సాంకేతికంగా, ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం  గ్లోబల్ ట్రేడ్ గేట్‌వే గా నిలుస్తోందని, స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. వాణిజ్య ప్రదర్శనలు, సదస్సుల కోసం ఢిల్లీలో నిర్మించిన  భారత్ మండపం' తరహాలో  ఏపీలో ఆంధ్రా మండపం నిర్మించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని   2047 నాటికి భారతదేశాన్ని  సుసంపన్న దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నే ఈ ప్రగతిని సాధించగలమన్న పియూష్ గోయెల్.. టెక్నాలజీ డెమొక్రటైజేషన్ విధానంతో  సాంకేతికతను  అందరికీ చేరువ చేస్తున్నామన్నారు.  

జూబ్లీ బైపోల్.. కౌంటింగ్ వేళ ఇండిపెండెంట్ ఆభ్యర్థి మృతి

జూబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మహ్మద్ అన్వర్.. కౌంటింగ్ సందర్భంగా తీవ్ర టెన్షన్ కు లోనై గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 40 ఏళ్లు.   ఎర్రగడ్డలో నివాసముండే మహ్మాద్ అన్వర్ ఉదయం నుంచి  కౌంటింగ్ ప్రక్రియను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.  ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ, ఓటమి భయం, ఆందోళనే ఆయన మరణానికి కారణమని అంటున్నారు.  

ఢిల్లీ పేలుడు.. ప్రధాన నిందితుడి ఇల్లు పేల్చివేత

ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నడి ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశాయి.    జమ్మూ కశ్మీర్  పుల్వామాలోని  అతడి ఇంటిని గురువారం(నవంబర్ 13)  అర్ధరాత్రి దాటిన  తర్వాత  భద్రతా దళాలు పేల్చివేశాయి. పేలుడు పదార్థాలు ఉపయోగించి అతడి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశాయి.  ఉమర్ నబీ  తన నివాసాన్ని ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా చేసుకోవడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు.  కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్‌లో భాగంగానే డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని కూల్చివేశామని అధికారులు చెబుతున్నారు.   అలాగే ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు సాగుతోంది. సోమవారం (నవంబర్ 10)న జరిగిన ఢిల్లీ పేలుడులో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ కారు నడిపి ఆత్మాహుతి దాడికి పాల్పడింది డాక్టర్ ఉమర్ నబీయే అని దర్యాప్తు సంస్థలు నిర్థారించాయి. ఆ పేలుడులో ఉమర్ నబీ కూడా మరణించాడు.  

అటవీ భూముల కబ్జా నిజమే.. కబ్జాదారుడు పెద్దిరెడ్డే!

ఎంత బుకాయించినా.. చేసిన పాపం దాగదు. నిజం బయటకు వస్తుంది. ఇప్పుడు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి విషయంలోనూ అదే జరిగింది. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములను కబ్జా చేశారన్న విషయం వీడియో ఆధారాల ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయటపెట్టారు.  మంగళంపేట అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి క్రమ ఆక్రమణలు బహిర్గతంచేశారు. హెలికాప్టర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీటిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు,  అటవీశాఖ మాజీ  మంత్రి, వైసీపీ నేత పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అటవీ ప్రాంతంలోని 32.63 ఎకరాల అటవీ భూమి ఆక్రమించారంటూ    డిప్యూటీ సీఎం ఓ కార్యాలయం పవన్ కల్యాణ్ ఆటవీ ప్రాంతంలో ఏరియల్ సర్వే జరిపిన వీడియోను విడుదల చేసింది.   పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగానే డిప్యూటీ సీఎంవో కార్యాలయం ఈ వీడియోను విడుదల చేసింది. అటవీ శాఖ  మాజీ  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నారు. అసలు అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చింది? ఈ భూమి ఎలా ఎప్పుడు చేతులు మారింది? తదితర విషయాలను తనకు నివేదించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.  ఈ కబ్జా వ్యవహారంలో  ఎవరి పాత్ర ఎంత అనే దానిపై నివేదికలు తయారు చేయాలని అధికారులను నిర్దేశించారు.  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి వారి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారనే అంశం తన దృష్టికి వచ్చిందన్నఅధికారులు, వెంటనే అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్, ఛార్జ్ షీట్ దాఖలు చేశామని పవన్ కల్యాణ్ కు తెలిపారు. అలాగే ఆక్రమణలు తొలగించి ఆ భూమిని  స్వాధీనం చేసుకున్నామని, కోర్టులో కేసుల వివరాలు ప్రొడ్యూస్ చేశామనీ వివరించారు.    ఇలా ఉండగా పవన్ కల్యాణ్ ఆరోపణలను వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డి ఖండించారు.  తాము అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించ‌లేద‌నీ, వాటిని   కొనుగోలు చేశామ‌ని పేర్కొన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్ప‌టి చంద్రబాబు ప్ర‌భుత్వ హ‌యాంలోనే తాము భూములు కొనుగోలు చేశామ‌న్నారు. వీటికి సంబంధించి త‌మ‌కు అన్ని ర‌కాల హ‌క్కులు ఉన్నాయ‌న్న మిథున్ రెడ్డి, ఆన్‌లైన్‌లో స‌ర్వే నెంబ‌ర్ల వారీగా విచార‌ణ చేసుకోవ‌చ్చ‌న్నారు. అటవీ భూములను తాము ఆక్రమించుకున్నట్లు రుజువు చేయాలని సవాల్ విసిరారు.  అలా నిరూపించలేకుంటే.. తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  త‌మ కుటుంబాన్నిఅప్రతిష్ఠ పాలు చేసేందుకే పవన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.   అయితే మొత్తంగా పవన్ కల్యాణ్ బయటపెట్టిన విషయాలు ఒక్కసారిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలను ఉలిక్కిపడేలా చేశాయి. అటవీ ప్రాంతంలో భూములు వారసత్వంగా ఎలా వస్తాయనీ, ఒక వేళ వాటిని కొనుగోలు చేశామని వారు చెబుతున్నా, అందుకు అటవీ చట్టాలు అనుమతించవనీ తెలిసిందే. వాస్తవానికి  ఈ విషయంలో గతంలోనే విచారణ చేసిన అధికారులు కబ్జాను గుర్తించి ఆ భూములను వెనక్కు తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే తీసి మరీ పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జాను వీడియోలు తీసి మరీ బయటపెట్టారు.  అయితే పవన్ ఆరోపణలను ఖండించిన మిథున్ రెడ్డి కబ్జా చేయలేదని చెప్పకుండా రుజువు చేయాలంటూ సవాల్ విసురుతున్నారు.  అయితే మిథున్ రెడ్డి ఖండనను, సవాల్ ను తోసిపుచ్చుతూ అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల కబ్జా వాస్తవమేనని కుండబద్దలు కొట్టారు. అలా కబ్జా చేసిన భూములను వెనక్కు తీసుకున్నామనీ, విచారణ కొనసాగుతోందనీ ప్రకటించారు.  

భాగస్వామ్య సదస్సును ప్రారంభించిన ఉప రాష్ట్రపతి

విశాఖలో భాగస్వామ్య సదస్సు ఆరంభమైంది.  విశాఖ వేదికగా శుక్రవారం (నవంబర్ 14) నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించారు.  ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.  ఈ సదస్సులో రాష్ట్రానికి దాదాపు  10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలు, సంస్థలతో ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.   రెండు రోజులపాటు  32 సెషన్లుగా ఈ భాగస్వామ్య సదస్సు జరుగుతుంది.    గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్, రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి లోకేశ్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.   ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్, గ్రీన్ హైడ్రోజన్, పర్యాటకం, ఎంఎస్ఎంఈ, ఫైనాన్స్ రంగాలపై చర్చలు జరుగుతాయి.  ఇలా ఉండగా తొలి రోజు సదస్సులో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్​గా ప్రారంభిస్తారు. ఉదయం 11-30 నుంచి 7:30 వరకూ ఏకకాలంలో పాతిక సెషన్లు జరుగుతాయి. రాత్రి 8-30 నుంచి హోటల్ రాడిసన్ బ్లూ రిసార్ట్​లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

భాగస్వామ్య సదస్సుకు ముందే ఏపీకి పెట్టుబడుల వరద

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. శుక్రవారం (నవంబర్ 14) నుంచి రెండు రోజుల పాటు విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుండగా, అందుకు ఒక రోజు ముందే అంటే గురువారం (నవంబర్ 13) దాదాపు 35 సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఓప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి దాదాపు మూడులక్షల  66 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.  అలాగే ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో నెలకొల్పనున్న పరిశ్రమలలో దాదాపు లక్షా 26 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాల మేరకు   ఏబీసీ క్లీన్‌టెక్ & ఆక్సిస్ ఎనర్జీ వెంచర్స్ సంస్థ రాష్ట్రంలో   1,10,250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయనుంది.  అలాగే 13,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే రీన్యూ పవర్ కంపెనీ పాతిక వేల రూపాయల పెట్టుబడితో ముందుకు వచ్చేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా పది వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి.   రీన్యూ ఇ-ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ  17 వేల కోట్ల రూపాయల పెట్టుబడి తో సంస్థను ఏర్పాటు చేయానికి అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీని ద్వారా 11 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.  ఇక రీన్యూ ప్రైవేట్ లిమిటెడ్-రూ 12500 కోట్ల రూపాయలు,  3250 మందికి ఉద్యోగ అవకాశాలు, నవయుగ ఇంజనీరింగ్ 2, 427 కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్, 6300 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీ సర్కార్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.  ఇంకా చింతా గ్రీన్ ఎనర్జీ,  ఫోర్ స్క్వేర్ గ్రీన్ ఎనర్జీ, ఇండోసోల్, షిర్డీ సాయి సంస్థలు కూడా ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.   అలాగే,   వైజాగ్ ప్రొఫైల్స్ లాజిస్టిక్స్,  స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా, విరూపాక్ష ఆర్గానిక్స్, అనంత్ టెక్నాలజీస్, ఏటీఆర్ వేర్ హౌసింగ్, లారస్ ల్యాబ్స్, మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్,  మల్లాది ఫార్మా సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.  ఇంకా ఈజౌల్, కోరమండల్, తైవాన్ ప్రైవేట్ ఇండస్ట్రీయల్ పార్క్స్ జూల్,  మణిపాల్ గ్రూప్, బెర్జాయ గ్రూప్, అమరావతి లైఫ్ సైన్సెస్, మైసిటీ, వివెన్స్ గ్రూప్,  ఫ్యాషన్ ఎంటర్ ప్రెన్యూయర్ ఫండ్, ఏస్ అర్బన్ డెవలర్స్, క్రౌన్ ఎల్ఎన్జీ, ఆర్సీఆర్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.అదే విధంగా ఉమెన్ ఓవా అగ్రో ఫుడ్ పార్క్, ఐటీసీ ఫుడ్స్, గాడ్రేజ్ అగ్రో వెట్, బిస్లరీ సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

పుణె నేషనల్ హైవైపై ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

పూణే, బెంగళూరు జాతీయ రహదారిపై   గురువారం (నవంబర్ 13) జరిగిన   ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  అతివేగంగా వెడుతున్న కంటైనర్ అదుపు తప్పి ఆరు వాహనాలను, మరో  కంటైనర్ ను ఢీ కొంది.   ఈ ఘటనతో   ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది.  సతారా నుండి ముంబై వైపు వెళుతున్న   కంటైనర్ బ్రేక్ ఫెయిలవ్వడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు.  

కొండా సురేఖపై కేసును ఉపసంహరించుకున్న నాగార్జున

మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పినందున ఆమెపై తాను పెట్టిన క్రిమినల్ కేసును ఉపసం హరించు కుంటున్నట్లు  ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. కాగా గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సురేఖ్, నాగార్జునను, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని కానీ, వారి పరువునకు నష్టం కలిగించాలన్న ఉద్దేశం కానీ తనకు ఎందమాత్రం లేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల్లో పొరపాటు జరిగి ఉంటే అందుకు చింతిస్తన్నట్లు పేర్కొన్న మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు సామాజిక మాధ్యమ వేిదక ఎక్స్ ద్వారా వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్‌లోమంత్రి సురేఖ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిపై విమర్శలు చేస్తూ.. నటుడు నాగార్జున కుటుంబంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.   ఆ వ్యాఖ్యలపై నాగార్జున కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు.   ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ బుధవారం (నవంబర్ 12) సోషల్ మీడియా వేదికగా గతంలో తాను నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. దీంతో నాగార్జున కొండా సురేఖపై దాఖలు చేసిన పరువునష్టం దావాను ఉపసంహరించుకున్నారు. 

విశాఖ అభివృద్ధికి నేవీ సహకారం.. సీఎం చంద్రబాబుతో నౌకాదళ వైస్ అడ్మిరల్ భేటీ

విశాఖ అభివృద్ధికి నేవీ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కోరారు.  శుక్రవారం (నవంబర్ 14) నుంచి రెండు రోజుల పాటు జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన చంద్రబాబుతో నౌకాదళ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు.   ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా విశాఖ భవిష్యత్ ప్రణాళికల్లో నేవీ భాగస్వామ్యంపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది.  ఈ సందర్భంగా తూర్పు నౌకాదళ కార్యకలాపాలను సంజయ్ భల్లా ముఖ్యమంత్రికి వివరించారు.  ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రక్షణ రంగంలో సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్‌లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపైనా ఇరువురి మధ్యా చర్చ జరిగింది. స్వదేశీ నౌకా నిర్మాణం, సాంకేతిక అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.   అలాగే విశాఖ నగరం భవిష్యత్తులో అనేక అవకాశాలకు, ప్రతిష్ఠాత్మక సంస్థలకు కేంద్రంగా మారబోతోందనీ,  ఫ్యూచర్ సిటీగా రూపుదిద్దుకుంటోందనీ చెప్పిన చంద్రబాబు..  ఈ ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం, నౌకాదళం కలిసి పనిచేయాలన్నారు. విశాఖను నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగానూ,  అత్యుత్తమ పర్యాటక కేంద్రంగానూ తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పిన చంద్రబాబు.. ఇందుకు నౌకాదళం సహకారాన్ని కోరారు.  నేవీ మ్యూజియం వంటివి ఏర్పాటు చేయడం ద్వారా యువతకు రక్షణ రంగంపై అవగాహన పెరిగుతుందన్నారు.   నౌకాదళం చేపట్టే వివిధ ప్రాజెక్టులు, ఇతర కార్యకలాపాలకు అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాకు సీఎం హామీ ఇచ్చారు.

విశాఖ సదస్సుకు పటిష్ఠ భద్రతా వలయం.. వంగలపూడి అనిత

విశాఖలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ప్రభుత్వం అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సు కోసం 3 వేల 500 మంది పోలీసులతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. గురువారం (నంబర్ 13) ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె  భద్రత విషయంలో ఇసుమంతైనా రాజీపడే పశక్తే లేదన్నారు. భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యే వీఐపీలు, ఇన్వెస్టర్లు, ఇతర ప్రముఖులు విశాఖ విమానాశ్రయంలో అడుగుపెట్టిన క్షణం నుంచి తిరిగి వారి వారి గమ్యస్థానాలకు చేరే వరకూ పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని చెప్పారు. ఇటీవల ఢిల్లోలో పేలుడు నేపథ్యంలో  రాష్ట్రవ్యాప్తంగా పూర్తి అప్రమత్తత ప్రకటించామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తీవ్రదాదంతో పాటు రాజకీయ ఉగ్రవాదం పట్ల కూడా తమ ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెప్పారు.  ఇక వైసీపీ సోషల్ మీడియాలో విశాఖ భాగస్వామ్య సదస్సుపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఉపేక్షించబోమని అనిత హెచ్చరించారు.   

భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్ లో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. మొహదీపట్నం పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్త ఆపరేషన్ లో భారీగా నకిలీ కరెన్సీ నోట్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా నాలుగు ద్విచక్రవాహనాలతో పాటు ఓ కారును, తొమ్మది మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.  కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు తన సోదరితో కలిసి తాండూరులో స్కానర్, ల్యాప్ టాప్, ఫొటోషాప్ సాఫ్ట్ వేర్ సాయంతో నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నకిలీ నోట్లను అసలు నోట్లతో ఒకటి ఈజ్ టు నాలుగు నిష్పత్తిలో చెలామణి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.  రమేష్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కస్టమర్లను సంప్రదించి నకిలీ నోట్లను విక్రయించేవాడు. అతని ద్వారా వహీద్‌, తహా, సోహైల్‌, ఫహాద్‌, ఇమ్రాన్‌, ఒమర్‌, అల్తమాష్‌ తదితరులు చైన్‌ సిస్టమ్‌లో నకిలీ నోట్లను విస్తరించారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు  వారిపై నిఘా పెట్టి...ఈద్గా గ్రౌండ్స్‌, ఫస్ట్‌ లాన్సర్‌ వద్ద దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. అనంతరం  కోర్టులో హాజరుపరిచి , రిమాండ్ కి తరలించారు.  

అది ఉగ్ర చర్యే.. ఢిల్లీ పేలుడుపై కేంద్రం అధికారిక ప్రకటన

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం  ఉగ్రచర్యగా   ప్రకటించింది. ఈ నెల 10న జరిగిన ఈ దుర్ఘటనలో 13 మంది మరణించగా 20 మంది గాయపడిన సంగతి తెలిసిందే.  ఈ కేసు దర్యాప్తులో  వెలుగులోకి వచ్చిన విషయాల ఆధారంగా ఈ పేలుడు ఘటన ఉగ్ర చర్యేనని కేంద్రం ధృవీకరించింది.    ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (నవంబర్ 12) కేబినెట్ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేంద్రం ఢిల్లీ పేలుడును ఉగ్ర చర్యగా ప్రకటించింది.  ఈ ఘటనపై ఇప్పటికే యూఏపీఏ, ఉగ్రవాద నిరోధక చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో  అరెస్టయిన డాక్టర్ల ఫోన్లలోని టెలిగ్రామ్ చాట్ల ద్వారా ఈ ఘటన వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం బయటపడిందని దర్యాప్తు సంస్థలు చెప్పాయి.    

హైదరాబాద్ బిర్యానీకి గుర్తింపు చంద్రబాబు చలవే!

అరకు కాఫీ గురించిన ప్రస్తావన ఎక్కడ ఎప్పుడు వచ్చినా ఎవరైనా సరే చంద్రబాబును ప్రస్తుతించకుండా ఉండరు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారనడంలో సందేహం లేదు. అయితే అంతకు చాలా కాలం ముందే హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి చంద్రబాబు కృషి చేశారు. ీ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.  . అవును  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ బిర్యానీని ప్రమోట్ చేసింది తానేనని చెప్పారు. అంతే కాదు.. దేశ విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చే పర్యాటకులు పాత బస్తీలో షాపింగ్ చేసేలా అక్కడి ముత్యాల గురించి ప్రమోట్ చేసింది కూడా తానేనని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ వేల్యూను పెంచేందుకు తీసుకున్న అనేక చర్యలలో భాగంగా హైదరాబాద్ బిర్యానీ, పాతబస్తీ ముత్యాలను ప్రమోట్ చేశానన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను హైదరాబాద్ ను ఐటీ హబ్ గా ప్రపంచ దేశాల ప్రముఖ ఐటీ సంస్థలన్నీ హైదరాబాద్ కు క్యూకట్టేలా చేసేందుకు కృషి చేశాననీ, అలాగే హైదరాబాద్ బ్రాండ్ ను ఇనుమడింపచేసేలాంటి హైదరాబాద్ బిర్యానీనీ, ఓల్డ్ సిటీలో ముత్యాల షాపింగ్ ను కూడా ప్రమోట్ చేశానని చెప్పారు.  విజయవాడలో జరిగిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో మాట్లాడిన చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధిలో తన ముద్ర చెరిపివేయలేనిదన్నారు. 

తిరుమలశ్రీవారి భక్తుల కోసం ఏఐ ఆదారిత చాట్ బాట్!

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మరింత మెరుగైన సేవలందించే దిశగా కీలక ముందడుగు వేసింది.  అత్యాధునిక  సంకేతికతను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా..  మరింత మెరుగైన, సులభమైన సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ప్రముఖ టెక్నాలజీ సంస్థ అమెజాన్ వెబ్ సర్విసెస్‌ భాగస్వామ్యంతో  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.  ఈ ఏఐ చాట్‌బాట్‌ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం, వసతి గదుల లభ్యత, విరాళాలు తదితర సేవలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో అందించనుంది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌలభ్యం కోసం ఈ సేవలను ఏకంగా 13 భాషల్లో అందించనున్నారు. అంతేకాకుండా భక్తులు తమ ఫిర్యాదులు, సలహాలు, సూచనలను కూడా ఈ చాట్‌బాట్‌ ద్వారా సులభంగా టీటీడీ దృష్టికి తీసుకెళ్లే వెసులుబాటు కలగనుంది.  ఈ చాట్‌బాట్‌లో స్పీచ్ టు టెక్ట్స్, టెక్ట్స్ టు స్పీచ్ వంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయి. దీని వల్ల భక్తులు వాయిస్ కమాండ్ల ద్వారా కూడా సమాచారాన్ని పొందగలరు. ఈ అత్యాధునిక చాట్‌బాట్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ అభివృద్ధి చేస్తున్నది.  అలాగే, పారదర్శకత పెంచడంతో పాటు, ఎస్వీబీసీ ఛానల్ ప్రసారాలను మరింత మెరుగుపరిచేందుకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపడుతోంది.