హైదరాబాద్ లో ఐటీ సోదాల కలకలం

హైదరాబాద్‌ నగరంలో ఆదాయపు పన్ను శాఖ   విస్తృత సోదాలు కలకలం రేపుతున్నాయి.  మంగళవారం (నవంబర్ 18)  తెల్లవారు జాము నుంచి ఐటీ అధికారులు  నగరంలోని ప్రముఖ హోటల్ వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నాయి. మొత్తం 15 ప్రాంతాల్లో  ఏకకాలంలో ఈ ఐటీ సోదాలు సాగుతున్నాయి.  పాతబస్తీలోని పిస్తా హౌస్, షా గౌస్ హోటల్స్ పై ఐటీ దృష్టి సారించింది. ఏటా వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఈ హోటల్స్ ఆదాయంపై అసమానతలు ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో  ఈరెండు హోటల్‌లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్లు, ముఖ్య భాగస్వాముల ఇళ్లలో  కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హోటల్ రంగంలో భారీ స్థాయిలో జరుగుతున్న లావాదేవీలపై అనుమానాలు వ్యక్తమవడంతో ఈ దాడులు  నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నగరవ్యాప్తంగా జరుగు తున్న ఈ సోదాల్లో అధికారులు బ్యాంక్ ఖాతాలు, లావాదేవీల రికార్డులు, డిజిటల్ డేటా, అకౌంటింగ్ వివరాలు, డాక్యుమెంట్లు వంటి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం.   

తెలంగాణపై చలిపులి పంజా

తెలంగాణను కోల్డ్ వేవ్ కమ్మేసింది. నిన్నమొన్నటి వరకూ ఎడతెరిపి లేని వర్షాలతో అతలాకుతలమైన జనం ఇప్పుడు చలి పులి పంజాకు చిక్కుకుని గజగజలాడుతున్నారు.  తెలంగాణలో నాలుగైదు రోజులలోనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల వరకూ పడిపోతున్నాయి. రానున్న రెండు రోజులలో చలితీవ్రత మరింత అధికమౌతుందంటున్నది వాతావరణ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి పడిపోవడంతో ఉదయం కూడా దట్టమైన పొగమంచు ఆవరించి ఉంటోంది.   చలి తీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు  జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.    ఈ  నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.   చలి తీవ్రత రానున్న రెండు మూడు రోజుల్లో మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.   రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.  గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారుప్రాంతాల్లో చలి మరీ అధికంగా ఉంది. ఆదివారం రాత్రి శేరిలింగంపల్లిలో అత్యల్పంగా 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు గ్రేటర్‌ పరిధిలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. రానున్న రెండు రోజులూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో చలి తీవ్రత మరీ అధికంగా ఉంది. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ లో ఆదివారం రాత్రి అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.1 డిగ్రీలు రికార్డయ్యింది.

సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సౌదీ అరేబియాలో సోమవారం (నవంబర్ 17) తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన  45 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.   కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, ఎమ్ఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధుల బృందాన్ని తక్షణమే సౌదీకి పంపాలని మంత్రివర్గం నిర్ణయించింది. మృత దేహాలను అక్కడే ఖననం చేయాలని, ఇందుకోసం బాధిత కుటుంబాల్లో ఇద్దరిని చొప్పున సౌదీ తీసుకు వెళ్ళాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొంది. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని పేర్కొంది.  కాగా సౌదీ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించిన దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆయన మృతుల కుటుంబాలను తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.   ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రియాద్‌లోని భారత ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ అవసరమైన సహాయం అందిస్తాయని పేర్కొన్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు. అలాగే సౌదీ ప్రమాదంలో 45 మంది తెలంగాణ వాసులు మరణించడం పట్ల తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదం తన హృదయాన్ని కలచివేసిందని ఆయన సామాజిక మాధ్యమ వేదిక ద్వారా పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. కాగా  ఈ ప్రమాద ఘటనపై  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా స్పందించిన చంద్రబాబు పవిత్ర ఉమ్రా యాత్రలో తెలంగాణకు చెందిన మన సోదర సోదరీమణులు మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందనీ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సౌదీ బస్సు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  మంత్రి నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కూడా సౌదీ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబంలో 18 మంది మృతి

సౌదీ అరేబియాలో  సోమవారం (నవంబర్ 17) తెల్లవారు జామున జరిగిన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మరణించినట్లు తెలంగాణ హజ్ కమిటీ అధికారికంగా ధృవీకరించింది. పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లిన వీరి ప్రయాణం విషాదాంతంగా ముగియడం పట్ల విచారం వ్యక్తం చేసింది  మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఉండటం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. ఈ దుర్ఘటనతో హైదరాబాద్ నగరంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. ఇలా ఉండగా  హైదరాబాద్ లోని రాంనగర్ లో నివసించే నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కుటుంబ యజమాని నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్   ఉద్యోగరీత్యా  అమెరికాలో ఉంటుండటంతో ఆయన ఒక్కరే ఈ యాత్రకు వెళ్లలేదు. ఇప్పుడు ఈ ఘోర ప్రమాదంలో సిరాజుద్దీన్ కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరివాడయ్యారు.  

సజ్జనార్ కు ఏపీ డిప్యూటీ సీఎం అభినందనలు

సినిమాల పైరసీతో తెలుగుచలనచిత్ర పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లేల చేసిన ఐబొమ్మ రవి అరెస్టు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను, పోలీసులను అభినందించారు.  డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించిన సినిమాలను ఇలా విడుదల అవ్వగానే అనే  ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ఐబొమ్మ రవి వంటి వారి వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్నదని పేర్కొన్న పవన్ కల్యాణ్..   సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఒక పోస్టు షేర్ చేసిన పవన్ కల్యాణ్..  పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్ సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి,  వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామంగా అభివర్ణించారు.  పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి ఐబొమ్మ నిర్వాహకుడు వచ్చాడనీ, అటువంటి వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేయడం ముదావహమన్నారు.  బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ లాంటివాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో చైతన్యపరుస్తున్న సజ్జనార్ ను ఆయనీ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.  సజ్జనార్ తో ఓ సందర్భంలో సమావేశమైనప్పుడు పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా మోసానికి గురై నష్టపోతున్నారో వివరించారని గుర్తు చేసుకున్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకు వచ్చిందన్నారు. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

ఇమ్మడి రవి మామూలోడు కాదు.. సజ్జనార్ నోట సంచలన విషయాలు!

ఇమ్మడి రవి.. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు మార్మోగుతోంది. రిలీజ్ అయిన సినిమాను రిలీజైనట్లుగానే నెట్ లో పెట్టేసి కోట్లు దండుకున్న ప్రముఖ పైరసీకారుడు. అతడి నేరం పైరసీ ఒక్కటే అనుకున్నారింత కాలమూ. అయితే ఆయన నేరాల చిట్టా చాల పెద్దదే ఉందంటున్నారు. బెట్టింగ్ యాప్ ల నుంచి మారుపేరుతో డ్రైవంగ్ లైసెన్సు, పాన్ కార్డులు పొందడం నుంచీ వేల సంఖ్యలో సబ్ స్క్రైబర్ల డేటా చోరీ చేయడం వరకూ ఐబొమ్మ రవి నేరాల చిట్టా చాలా పెద్దేదే ఉంది. ఈ వివరాలన్నీ హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరానికి చెందిన రవి.. మహారాష్ట్రలో ప్రహ్లాద్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. అంతే కాదు అతడి పాన్ కార్డు కూడా ప్రహ్లాద్ అనే పేరుమీదే ఉంది. తొలి నుంచీ కూడా క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ఐబొమ్మ రవి, ఎంతో ముందు చూపుతో కరేబియన్ ఐలాండ్ పౌరసత్వం కూడా తీసుకున్నాడు.   ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్.. ఎన్నో దేశాలు తిరిగాడు. తన పైరసీ నెట్ వర్క్ ను విస్తరించుకున్నాడు. అమెరికా, నెదర్లాండ్స్ లో సర్వర్లు పెట్టి.. టెలిగ్రామ్ యాప్ లో కూడా పైరసీ సినీమాలను అప్ లోడ్ చేశారు. ఈ పైరసీ ముసుగులో అన్లైన్ బెట్టింగ్ నూ ప్రమోట్ చేశాడు.   అదెలా అంటే.. ఐ బొమ్మ సైట్ ను క్లిక్ చేయగానే.. బెట్టింగ్ యాప్ సైట్ ఓపెన్ అవుతుంది. సినిమా మధ్యలో కూడా బెట్టింగ్ యాప్ ప్రకటనలు వచ్చాయి. వీటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడు. అంతే కాదు.. ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చి పోలీసులు అతగాడి కోసం గాలింపు చేపడితే..  దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ చాలెంజ్ చేశాడు.  అయితే పోలీసులు వదలలేదు.. నెలల పాటు శ్రమించి, అతడి ఆచూకీ శోధించి ఎట్టకేలకు ఇమ్మడి రవిని అరెస్టు చేశారు.  ఇక ఐబొమ్మను ఎంకరేజ్ చేసి ఫ్రీగా సినిమాలు చూసిన వారి డేటా మొత్తం చోరీ చేశాడు.  ఫ్రీగా వస్తుంది కదా అని ఐ బొమ్మ ను ఎంకరేజ్ చేశారు. కానీ మీ డేటా మొత్తం చోరీ కి గురైంది. ఈ వివరాలన్నీ సజ్జనార్ వెల్లడించిన తరువాత ఇంత కాలం ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూసిన వారిలో ఆందోళన మొదలైంది. సినీ ప్రముఖులు చిరంజీవి సహా అందరూ ఐబొమ్మ రవి అరెస్టు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లేలా చేసిన ఐబొమ్మ రవి అరెస్టు శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. పోలీసు శాఖకు కృతజ్ణతలు చెబుతున్నారు. అంత వరకూ బానే ఉంది. కానీ ఐబొమ్మ సబ్ స్క్రైబర్ల డేటా చోరీ ద్వారా ఇటు జనాలనూ దగా చేశాడు రవి.  సబ్ స్క్రైబర్ల డేటా అమ్ముకోవడం ద్వారా సంపాదించిన సొమ్ముతోనే  పెద్ద పెద్ద సర్వర్లను మెయిన్ టైన్ చేశాడు రవి. ఆ రకంగా చూస్తే సినిమా వాళ్ల కంటే జనమే ఎక్కువ నష్టపోయారని సజ్జనార్ చెబుతున్నారు. 

ఐ బొమ్మ ర‌వికి భార్యే బొమ్మాళి?

పెళ్లాం చెబితే వినాలి అంటారు. ఐ బొమ్మ నిర్వాహ‌కుడు ఇమ్మ‌డి  ర‌వి పెళ్లాం చెప్పింది విన‌క పోవ‌డం వ‌ల్లే  అడ్డంగా బుక్ ఐపోయాడా? అంటే అవుననే అనాల్సి వస్తోంది. ఇమ్మ‌డి ర‌వి ఫ్రాన్స్ లో ఉంటాడు. అత‌డి భార్య తో అత‌డికి విబేధాలున్నాయి. దీంతో అత‌డు న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల్లో ప‌డ్డాడు. ఎలాగైనా స‌రే వాటి నుంచి బ‌య‌ట ప‌డ్డానికి ప్ర‌త‌య‌త్నం చేసిన అత‌డు ఇండియా వ‌చ్చాడు. ఇలాంటి అనైతిక‌ప‌రులు కూడా న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల నుంచి బ‌య‌ట  ప‌డాల‌నుకుంటారా? అన్న మాట అటుంచితే.. ఈ విష‌యం గుర్తించిన ర‌వి భార్య‌, అత‌డి జాడ పోలీసుల‌కు చూపించేసింది. దీంతో అత‌డ్ని అరెస్టు చేసి రిమాండ్ కి త‌ర‌లించారు పోలీసులు. ఇక్క‌డ  అంద‌రూ అంటోన్న మాట ఏంటంటే ఎంత వాళ్ల‌యినా స‌రే పెళ్లాం చెబితే వినాలి. భార్య‌ని కాద‌ని బ‌తికి బాగు ప‌డ్డ వారు చ‌రిత్ర‌లో లేరు అన్న కామెంట్లు చేస్తున్నారు. క‌నీసం భార్య‌తో సెటిల్మెంట్ చేసుకుని ఉన్నా స‌రిపోయేది త‌న ద‌గ్గ‌ర అంత డ‌బ్బు ఉన్నా  సెటిల్ చేసుకోకుండా ఇక్క‌డి పోలీసుల‌తో ఎదురు తిరిగిన‌ట్టు భార్య‌తోనూ ఎదురు తిర‌గాల‌ని ట్రై చేసిన ర‌వి తాను తీసిన గోతిలో తాను ప‌డడం  చ‌ర్చ‌నీయాంశంగా మారింది.అప్ప‌టికీ ర‌వి అకౌంట్లో కోట్లాది రూపాయ‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందులో కొంత భాగ‌మైన భార్య‌కు ఇచ్చి వ్య‌వ‌హారం చ‌క్క పెట్టుకోకుండా ఇలా బుక్ అయిపోయాడేంట‌ని జ‌నం ఒక‌టే గుస గుస‌. ర‌వి ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తే ఇప్ప‌ట్లో ఇత‌డు చిక్క‌డ‌న్న నిర్దార‌ణ‌కొచ్చారు సామాన్య జ‌నం. కానీ ఇక్క‌డే అత‌డి త‌ల‌రాత తిర‌గ‌బ‌డింది. బలవంతమైన సర్పం చ‌లి చీమ‌ల చేత చిక్కి చస్తుందని సమతీశతకంలో చెప్పినట్లుగా ఎంత తెలివిగ‌ల‌వాడైనా స‌రే ఒక్కోసారి త‌మ‌కు అత్యంత ద‌గ్గ‌ర్లో ఉండే భార్య‌ల ముందు బొక్క‌బోర్లా  ప‌డుతుంటాడ‌న‌డానికి ఐబొమ్మ రవి అరెస్టు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంద‌ని అంటున్నారు చాలా మంది.

రజనీ, బాలయ్యలకు ఇఫీ సన్మానం ఎప్పుడు? ఎక్కడో తెలుసా?

ప్రముఖ నటులు రజనీకాంత్, బాలకృష్ణలను ఇఫీ సన్మానించనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. త్వరలో  గోవా వేదికగా జరగనున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ వేడులలలో వీరిని సన్మానించనున్నట్లు కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన  ఈ ఇరువురీ చలనచిత్ర పరిశ్రమలో అర్ధశతాబ్ధ ప్రయాణం పూర్తి చేసుకున్నారన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వీరిని సన్మానించనున్నట్లు తెలిపారు.  రజనీకాంత్, బాలకృష్ణ  50 ఏళ్ల సినీ ప్రస్థానం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైలు రాయిగా పేర్కొన్న ఆయన..  వారి అద్భుతమైన నటన, ప్రజాదరణతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారన్నారు. వారి కృషికి గుర్తింపుగా ఇఫి ముగింపు వేడుకల్లో వారిని సన్మానించనున్నట్లు తెలిపారు.  ప్రతిష్ఠాత్మక ఇఫి వేడుకలు నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్నాయి.

ఐబొమ్మ రవి అరెస్టు.. సజ్జనార్ కు చిరంజీవి సహా సినీ ప్రముఖుల ధ్యాంక్స్

తెలుగు సినీ పరిశ్రమ ఉనికికే ముప్పుగా ఐబొమ్మ వెబ్ సైట్ పరిణమించిన సంగతి తెలిసిందే. అటువంటి ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్టు చేయడంతో టాలీవుడ్ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తున్నది. ఐబొమ్మ రవిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు నేడు అతడిని పోలీసు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ  నేపథ్యంలో ఐబొమ్మ రవిని  అరెస్టు చేసినందుకు సినీ ప్రముఖులు సీపీ సజ్జనార్ ను కలిసి థ్యాంక్స్ చెప్పారు.  మెగా స్టార్ చిరంజీవి,  నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేశ్ బాబు తదితరులు సోమవారం (నవంబర్ 17)న సీపీ సజ్జనార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు పోలీసుల పనితీరును ఈ  ప్రశంసించారు. కాగా ఆ తరువాత సీజీ సజ్జనార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా వీరు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన సజ్జనార్ రవిని అరెస్టు చేసిన సమయంలో ఆయన వద్ద నుంచి మూడు కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. అయితే సినిమాల పైరసీ ద్వారా ఐబొమ్మ రవి 20 కోట్ల రూపాయలకు పైగా సంపాదించినట్లు తమ  వద్ద సమాచారం  ఉందని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి మరింత లోతైన దర్యాప్తు జరుపుతామన్నారు. రవి అరెస్టు సందర్భంగా అతడి నుంచి కొన్ని హార్డ్ డిస్క్ లు, లాప్ టాప్ సీజ్ చేశామన్నారు. రవి వద్ద ఉన్న హార్డ్ డిస్క్ లలో దాదాపు 21 వేల సినిమాలు ఉన్నాయన్నారు. అలాగే దాదాపు 50 వేల మంది సబ్ స్క్రైబర్ల డేటా కూడా ఉందని చెప్పిన సజ్జనార్.. ఇది చాలా ప్రమాదకరమన్నారు.  కాగా సినిమాల పైరసీ మాత్రమే కా కుండా.. రవి భారీ స్థాయిలో బెట్టింగ్ యాప్స్ న కూడా ప్రమోట్ చేసినట్లు సజ్జనార్ తెలిపారు. రవికి సంబంధించి ఎవరివద్దనైనా ఎటువంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలని కోరారు. 

ఆంధ్రా కాశ్మీర్ ఎక్కడుందో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ కూ ఒక కాశ్మీర్ ఉంది తెలుసా? ఏటా పెద్ద సంఖ్యలో పర్యటకులు ఇక్కడకు తరలివస్తుంటారు. ఆంధ్రాకాశ్మీర్ కు పర్యాటకులు వెల్లువెత్తేందుకు ఒక సీజన్ ఉంది. ఔను శీతాకాలంలో ఆంధ్రాకాశ్మీర్ ను వెతుక్కుంటూ పర్యాటకులు తరలివస్తారు.  చల్లటి వాతావరణం లో మరింత చలి ప్రదేశాలను సందర్శించాలని పర్యాటకులు భావిస్తుంటారు. ఇంతకీ ఆ ఆంధ్రాకాశ్మీర్ ఏదంటే.. దక్షిణ భారతదేశంలోనే అత్యంత చలి ప్రాంతంగా ప్రాచుర్యం పొందిన లంబసింగి. ఔను ఉమ్మడి విశాఖ జిల్లాలోని లంబసింగిని ఆంధ్రా కాశ్మీర్ అంటారు. శీతాకాలంలో ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. చలితిరగడంతో ఇప్పుడు ఈ ప్రాంతం పర్యాటకుల సందడితో కళకళలాడుతోంది.    ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న లంబసింగిలో   250 కుటుంబాలు నివసిస్తున్నాయి. అటువంటి చిన్న గ్రామమైన లంబసింగికి ఏటా   పది పదిహేను లక్షల మంది పర్యాటకులు  వస్తుంటారు.  శీతాకాలంలో సగటున రోజుకు పది నుంచి 20వేల మంది ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాక చలి తీవ్రత అధికంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి జనవరి మధ్య శీతాకాలంలో ఇక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని తిలకించడానికే పర్యాటకులు పోటెత్తుతుంటారు.  అసలు ఇక్కడ ఎందుకు ఇంత చలి ఉంటుందీ అంటే.. పలు కారణాలు చెబుతుంటారు.  ఈ గ్రామం రెండు కొండల మధ్య ఉండటం,  సహజంగా ఏటవాలుగా ఈ గ్రామంలోకి చలిగాలి రావడం మేఘాలు లోపలకు చొచ్చుకు వచ్చే  అవకాశం లేకపోవడంతో వాతావరణం చల్లగా ఉంటుంది.  దీంతో సహజంగా శీతాకాలంలో కనిపించే కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు అవుతుంటాయి అయితే ఈ గ్రామానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో సాధారణ వాతావరణ పరిస్థితులు ఉంటాయి.  లంబసింగి గ్రామంలో  శీతాకాలం నాలుగు నెలల పాటు చలి తీవ్రత  అధికంగా ఉంటుంది.  ఇక్కడ  మైనస్  డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం కద్దు. సీతాకాంలో సాధారణంగా  ఉదయం 10 గంటల వరకు సూర్యుడు ఈ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడడు.  దీంతో చలి తీవ్రతతో పాటు చెట్ల మధ్య నుంచి సూర్యకిరణాలు సుతిమెత్తగా తాకే  దృశ్యం ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 3280 అడుగుల ఎత్తులో ఉంటుంది.   ఈ ప్రాంతంలో పర్యాటన శాఖతో పాటు   ప్రైవేట్ రంగంలో కూడా రిసార్ట్లు హోటల్స్ రావడంతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది.   నవదంపతులు లంబసింగిని హనీమూన్ స్పాట్ గా భావిస్తున్నారు.  ఇటీవలీ కాలంలో ఒడిస్సా ఛతిస్గడ్ తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర నుంచి నూతన జంటలు పెద్ద సంఖ్యలో లంబసింగికి వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.  లంబసింగి విశాఖ నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది విశాఖ నుంచి నర్సీపట్నం వరకు 100 కిలోమీటర్లు మైదాన ప్రాంతంలో ప్రయాణం చేస్తే మిగిలిన 30 కిలోమీటర్లు ఘాట్ రోడ్లో ప్రయాణించి ఇక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది.    వెండి మబ్బుల పాల సంద్రం..  చెరువుల వెనం ఇక లంబసింగి పరిసరాల్లో కూడా బోలెడన్ని సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో  ఇండియా స్విట్జర్లాండ్ గా చెప్పుకునే చెరువుల వెనం గ్రామం ఒకటి.  లంబసింగికి  కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో కొండ ఎగువనున్న ఈ గ్రామంలో ఉదయం 10 గంటల వరకు మంచు మేఘాలు, పాలసముద్రంలా కనిపిస్తాయి.  దీంతో చాలామంది పర్యాటకులు తెల్లవారుజామున లంబసింగి నుంచి నడుచుకుంటూ వెళ్లి ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి ఆనందపరవశులౌైతారు.  ఇటీవలే ఏపీ టూరిజం అక్కడకు స్థానిక గిరిజనుల ద్వారా నేరుగా వాహనాలను నడుపుతోంది దీంతో వయసు పైబడిన వారు కూడా ఈ ప్రకృతి అందాలను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు.   అలాగే లంబసింగికి సమీపంలో  ఉన్న తాసంగి రిజర్వాయర్ కూడా తప్పనిసరిగా వీక్షించాల్సిన దర్శనీయ స్థలం. ఇక్కడ రిజర్వాయర్ దాటుతూ జిప్ లైన్ ఏర్పాటు చేశారు.  రిజర్వాయర్ పైనుంచి జిప్ లైన్ లో  వెళ్లడం ఒక ప్రత్యేక అనుభూతిగా పర్యాటకులు చెబుతారు.  ఇక ఈ ప్రాంతంలోని చారిత్రాత్మక అవశేషాలు కూడా పర్యాటకులకు ఆసక్తికలిగిస్తాయి.  స్వతంత్ర పోరాట సమయంలో అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతంలో నివాసం ఉన్నట్టు ఆనవాళ్లు ఉన్నాయి ఇక్కడకు సమీపంలో రూథర్ఫర్డ్ అనే బ్రిటిష్ మేజర్ నివాసం ఉందనీ, అక్కడే  అల్లూరి సీతారామరాజును మట్టుపెట్టినట్టు చరిత్ర చెబుతోంది దీనికి తగ్గట్టు ఇప్పటికీ రూథర్ఫర్డ్ నివాసం ఉన్న గెస్ట్ హౌస్, శిబిరాలు కనిపిస్తాయి. ఇక మహాభారత కాలంలో పాండవులు కూడా ఇక్కడ సంచరించినట్టు స్థానికులు చెప్తుంటారు ఇక్కడ గిరిజన ప్రజల సంప్రదాయాలు నివాస వ్యవహారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి స్థానికుల థింసా  డాన్స్ మరొక ప్రత్యేక ఆకర్షణ.  స్థానిక గిరిజనులతో పాటు పర్యాటకులు థిసా డాన్స్ చేస్తూ ఆనందపరవశులు కావడం కద్దు. పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో ఏపీ టూరిజం ఇక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేసింది.  ఇతర హోటల్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి.  ఒకప్పుడు పరిమితంగా వచ్చే పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతో స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి.  చల్లని వాతావరణంలో వేడి వేడి టీ... టిఫిన్ లాంటి వంటకాలతో పాటు బెంబు చికెన్ ఇక్కడ పర్యాటకులు అత్యంత ఇష్టపడే వంటకం.  గిరిజనుల ఇళ్లల్లో కూడా నివాసం ఉండే రీతిన హోం స్టే లను   పర్యాటకశాఖ ఏర్పాటు చేసింది. ఇవి అదనపు ఆకర్షణగా మారాయి. 

భవిష్యత్ లో జ్ణానపీఠ్, పులిట్జర్ స్థాయికి రామోజీ ఎక్సలెన్స్ పురస్కారాలు.. చంద్రబాబు

రామోజీరావును ఎక్స్ లెన్స్ కు ప్రతిరూపంగా అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. రామోజీ జయంతి సందర్భంగా ఆదివారం (నవంబర్ 16) రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు ప్రసంగిస్తూ.. రామోజీరావు స్ఫూర్తితో తెలుగుభాష పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. రామోజీ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయన్నారు.  రామోజీ జయంతి సందర్భంగా ఆ అక్షరయోధుడికి ఘన నివాళులర్పిస్తున్నానన్న చంద్రబాబు  రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను మనస్పూర్తిగా అభినందిస్తున్నానన్నారు.   రామోజీతో తనది నాలుగు దశాబ్దాల అనుబంధం అన్న చంద్రబాబు  ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్నారు.  ఆయన జీవితంలో ఏ వ్యక్తిని చిన్న ఫేవర్ అడగిన సందర్భం లేదన్నారు. జనహితం కోసం ఏ పార్టీ నాయకులతోనైనా నిర్మొహమాటంగా మాట్లాడేవారనీ, నిఖార్సయిన జర్నలిజంతో తెలుగుభాషకు ఆయన చేసిన చేవలు చిరస్మరణీయమనీ చంద్రబాబు చెప్పారు.  ప్రతిపక్షం బలహీనంగా ఉంటే తానే అపోజిషన్ గా ప్రజల తరఫున పనిచేస్తానని రామోజీరావు చెబుతుండేవారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.   ఐదు దశాబ్దాలుగా విశేష ప్రజాదరణతో ఈనాడు నడుస్తోందంటే అందుకు రామోజీరావు సంకల్పమే కారణమన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా విలువల విషయంలో రామోజీ ఎన్నడూ రాజీ పడలేదనీ, ప్రజాహితం కోసం ప్రభుత్వాలతో పోరాడారనీ చంద్రబాబు అన్నారు.  50 ఏళ్ల తర్వాత ఏం చేయాలో ఆయన ఇవాళే ఆలోచించే దార్శనికత రామోజీ సొంతమన్న చంద్రబాబు.. ఆయన దూరదృష్టికి  రామోజీ ఫిల్మ్ సిటీ నిదర్శనమన్నారు.  జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, సేవారంగం, కళలు, సంస్కృతి, యువ ఐకాన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళా సాధికారతలో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డులు ఇవ్వడం స్పూర్తిదాయకమన్న చంద్రబాబు . ఈ రామోజీ  ఎక్సలెన్స్ అవార్డు భవిష్యత్తులో జ్ఞానపీఠ్, పులిట్జర్ స్థాయికి చేరుకోవాలని  చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తెలం గాణ గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌ నాయుడు, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

భక్త జనసంద్రంగా మారిన శ్రీశైలం

అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైలం కార్తీక మాసం నాల్గవ సోమవారం (నవంబర్ 17) మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు.  శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి  4 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.  కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో  ఆలయ అధికారులు భక్తులకు   పాలు, ప్రసాదాలు అందచేస్తున్నారు. ఆలయ పురవీధులన్నీ భక్తులతో సందడిగా మారిపోయాయి. ఆలయ క్యూలైన్లన్నీ నిండిపోవడంతో భక్తులు మల్లన్న దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉంటున్నారు. దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి  అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఏర్పాట్లు చేసింది.   రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.  ఇలా ఉండగా సోమవారం (నవంబర్ 17) సాయంత్రం జరగాల్సిన తెప్పోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం ఎక్కువగా ఉండడంతో  తెప్పోత్సవాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. . కార్తీక నాల్గవ సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.

సీవీ ఆనంద్ వివరణ.. ఎమోజీ వివాదానికి తెర!

సోషల్‌ మీడియా వేదికగా నెలకొన్న అపోహలపై హోం శాఖ స్పెషల్‌ సీఎస్‌ సీవీ ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. గత రెండు నెలలుగా హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు సీవీ ఆనంద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో సీవీ ఆనంద్ పోస్టు చేసిన ఒక ఎమోజీయే. దీనిపై వివరణ ఇచ్చిన సీవీ ఆనంద్.. దాదాపు రెండు నెలల క్రితం తన పోస్టు కారణం గా బాలకృష్ణ అభిమా నులు–విమర్శకుల మధ్య చర్చలు, వాగ్వాదాలు జరిగాయనీ, తనపై కూడా విమర్శలు వచ్చాయనీ పేర్కొన్న ఆయన నగర పోలీసు వ్యవహారాలు, కేసులు, వివిధ ఘటనలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో పెట్టేందుకు తన కార్యాలయంలో పని చేస్తున్న ఒక సోషల్ మీడియా హ్యాండ్లర్  చేసిన పొరపాటు అది అని వివరణ ఇచ్చారు.  సెప్టెంబర్‌ 29న జరిగిన ప్రెస్ మీట్ అనంతరం బాలకృష్ణపై వచ్చిన ఒక పోస్టుకు అతడు ఇచ్చిన ఎమోజీ రిప్లై పూర్తిగా అనవసరమైనదనీ, అది తనకు తెలియకుండానే జరిగిందని సీవీ ఆనంద్ విచారం వ్యక్తం చేశారు. ఈ వివాదం గురించి తనకు తెలిసిన వెంటనే ఆ పోస్టును తొలగించడమే కాకుండా.. వ్యక్తిగతంగా బాలకృష్ణకు ఒక సందేశం ద్వారా క్షమాపణ తెలిపానని ఆనంద్ పేర్కొన్నారు.  బాలయ్య, చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జున  సినిమాలు చూసి పెరిగానన్న ఆయన  వారందరిపట్ల తనకు గౌరవం, అనుబంధం ఉందన్నారు. ఆ ఎమోజీ పోస్టు చేసిన తన సోషల్ మీడియా హ్యాండ్లర్ ను తొలగించినట్లు తెలిపారు.  దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని ఆయన బాలయ్య అభిమానులు, నెటిజన్లను కోరారు.  

మదీనాలో ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది సజీవదహనం

మృతులంతా ఇండియన్సే అత్యధికులు హైదరాబాదీయులే  సౌదీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 42 మంది సజీవదహనమయ్యారు. మృతులంతా భారతీయులే. మరణించిన వారిలో అత్యధికులు హైదరాబాద్ వాసులని తెలుస్తోంది. మక్కా నుంచి మదీనాకు భారతీయ యాత్రికులతో వెడుతున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.   మక్కాలో ఉమ్రా యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో వారు గాఢ నిద్రలో ఉన్నారు. మక్కా నుండి మదీనాకు భారతీయ యాత్రికులను తీసుకెళ్తుండగా బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. సోమవారం (నవంబర్ 17) తెల్లవారు జామున ఈ ఘోర దుర్ఘటన సంభవించింది. మృతులలో 11 మహిళలు, 10 మంది పిల్లలూ ఉన్నారని తెలుస్తోంది.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ కార్యక్రమాలను చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొనడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మృతదేహాలను గుర్తించడం కూడా కష్టంగా మారింది.   సీఎం రేవంత్ దిగ్భ్రాంతి సౌదీ అరేబియాలో  భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదానికి గురై పలువురు మరణించడం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతులలో అత్యధికులు హైదరాబాద్ వాసులు ఉండటంతో వెంటనే పూర్తి వివరాలు తెలుసుకోవాలని డీజీపీని ఆదేశించారు.  కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ  అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.   సీఎం అదేశాలతో  సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీ లో ఉన్న కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ ను అప్రమత్తం చేశారు. ప్రమాదం లో  తెలంగాణకు  చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు.  కాగా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 

తిరుమల దర్శనాలు.. ఫిబ్రవరి కోటా విడుదల వివరాలు!

తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ విడుదల చేసింది. వివిధ దర్శనాలు, గదుల కోటాకు సంబంధించి టీటీడీ విడుదల చేసిన ప్రకటన వివరాలిలా ఉన్నాయి.   శ్రీ‌వారి ఆర్జిత సేవలు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను మంగళవారం (నవంబర్ 18)  ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇక ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20 దయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చుని పేర్కొంది.  ఈ సేవా టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే.. వారికి టికెట్లు మంజూరవుతాయని తెలిపింది. ఇక  ఆర్జిత సేవా టికెట్లు నవంబర్ 21న విడుదల చేయనున్నట్లుతెలిపింది.  కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను నవంబర్  21 ఉదయం 10 గంటలకు  ఆన్ లైన్ లో విడుదల చేయ‌నున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇక వర్చువల్ సేవ టికెట్ల కోటా కూడా 21నే విడుదల చేయనున్నట్లు  పేర్కొన్న టీటీడీ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు తెలిపింది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను నవంబర్ 24న  శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను అదే నెల24న  విడుదల చేయనున్నట్లు పేర్కొంది.వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను కూడా నవంబర్ 24నే విడుదల చేయనుంది.  ఇక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అదే నెల 25న  తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను నవంబర్ 25న  ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఆ ప్రకటనలో తెలిపింది.  టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీ‌వారి మాత్రమే ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ భక్తులకు సూచించింది. 

విశాఖలో సన్ ఇంటర్నేషనల్ రూ.150 కోట్ల ఇన్వెస్ట్ మెంట్

విశాఖ వేదికగా జరిగిన భాగస్వామ్య సదస్సు సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సదస్సులో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుంది. అందులో భాగంగానే సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం మేరకు సన్ ఇన్ టర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ 150 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖలో తమ మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ మేరకు సన్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ చైర్మన్ జాస్తి శ్రీకాంత్ ఏపీ ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి బోర్డుతో మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ పై సంతకం చేశారు. ఈ ఒప్పందం మేరకు 150 కోట్ల రూపాయల ఇన్ వెస్ట్ మెంట్ తో తమ సంస్థ ఏర్పాటు చేయనున్న మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్ ద్వారా దాదాపు రెండు వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది.  ఈ ఒప్పందం మేరకు సన్ ఇన్ టర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ విశాఖలో హోటల్ ప్రాజెక్టుల అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు శాఖల నుంచి హోటల్స్ రంగంలో అవసరమైన అనుమతులు, ఆమోదాలు, క్లయరెన్స్ ల విషయంలో సహకారం అందిస్తుంది. అలాగే హోటల్ రంగం అభివృద్ధి నిర్దిష్ట కాలవ్యవధిలో ఎలాంటి ఆటంకాలూ సజావుగా సాదేందుకు దోహదం చేస్తుంది. 

వంగవీటి రంగా కుమర్తె పొలిటికల్ ఎంట్రీ

వంగవీటి రంగా కుమార్తె వ ఆశాకిరణ్ తాను రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం(నవంబర్ 16) ఉదయం ఆమె వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తన పొలిటికల్ ఎంట్రీని ప్రకటించారు.  రాధా రంగా మిత్రా మండలి ఆధ్వర్యంలో తన తండ్రి రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్నారు.  ఇక నుంచీ తాను పూర్తిగా ప్రజలతో మమేకమౌతాననీ, .ప్రజలకు ఏ కష్టం వచ్చినా  అండగా ఉంటాననీ ఆశాకిరణ్ ఈ సందర్భంగా చెప్పారు.  కులం,మతం బేధం లేకుండా ప్రజలకు సహాయం చేసిన ఏకైక వ్యక్తివంగవీటి మోహన రంగా అన్న ఆమె, ఆయన  రాజకీయ వారసురాలిగా రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు పేర్కొన్నారు.    కాగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె వంగవీటి ఆశా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.  ఇప్పటి వరకు వంగవీటి మోహన రంగా రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు వంగవీటి రాధా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో వంగవీటి రాధా కూడా శాసన సభ్యుడిగా విజయం సాధించారు. ఆ తరువాత   ఆయన వరుసగా రెండు సార్లు ఓడిపోయారు.   ప్రస్తుతం వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే.  దీంతో ఇప్పుడు వంగవీటి ఆశాకిరణ్ తన రాజకీయ ప్రవేశంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. 

రోడ్డు ప్రమాదంలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మృతి

విజయనగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ క్రీడాకారిణి దుర్మరణం పాలైంది. రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని పతకం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న సత్యజ్యోతి విజయనగరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లిమర మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన శివజ్యోతి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారణి. కొండవెలగాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు కోసం తన సోదరి గాయత్రితో కలిసి స్కూటీపై బయలుదేరారు . విజయనగరం సమీపంలోని వైఎస్‌ఆర్ నగర్ దాటిన తర్వాత, ఎదురుగా వేగంగా వస్తున్న ఓ లారీ వీరి స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యజ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె సోదరి గాయత్రి గాయపడ్డారు. ప్రతిభామంతురాలైన క్రీడాకారిణి సత్యజ్యోతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కావడంతో  ఆమె స్వగ్రామం కొండవెలగాడలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. సత్యజ్యోతి మృతి పట్ల శాప్ ఛైర్మన్ రవినాయుడు, జిల్లా కలెక్టర్ రామసుందర్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

టెక్స్ టైల్స్ రంగంలో భారీ పెట్టుబడులు

విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఈ రంగంలో నాలుగువేల 380 కోట్ల రూపాయలకు ఏడు ఎంవోయులు కుదిరాయి. ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 6,100 ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రి సవిత సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. టెక్నికల్ టెక్స్‌టైల్స్,   రీసైక్లింగ్,  గార్మెంట్స్,   సిల్క్, అప్పారెల్స్ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడి దారులు ముందుకు వచ్చారు.  విశాఖపట్నం,  చిత్తూరు,  గుంటూరు,  శ్రీ సత్యసాయి,  అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. కామధేను సటికా సంస్థ రూ.90 కోట్లతో   మచిలీపట్నంలో పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమతో 650 మందికి ఉద్యోగాలు రానున్నాయి.అలాగే చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లిలో జీనియస్ ఫిల్టర్స్ సంస్థ రూ.120 కోట్ల మేర పెట్టుబడులకు ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సంస్థ ఏర్పాటుతో  ప్రత్యక్షంగా 250 మందికి ఉపాధి లభించనుంది.  ఇక శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అరవింద్ అపెరల్ పార్క్ రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా   రెండు వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.  అదే విధంగా గుంటూరులో వామిని ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.35 కోట్లు మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా రెండు వేల ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి.  విశాఖపట్నంలో ఎంవీఆర్ టెక్స్ టైల్స్ రూ.105.38 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సంస్థ ఏర్పాటుతో 900  మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనకాపల్లిలో బీసీయూబీఈ టెక్స్ టైల్స్ యాజమాన్యం రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టంది. ఈ సంస్థ వందమందికి ఉపాధి కల్పించనుంది.  ఇక సీఎం చంద్రబాబు సమక్షంలో విశాఖలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులకు  ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.  టెక్స్‌టైల్ రీసైక్లింగ్ టెక్నాలజీని ఈ సంస్థ భారత్‌ కు తొలిసారి తీసుకు రానుంది.విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాలతో ఏపీ టెక్స్ టైల్స్ రంగానికి ఊతం లభించనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి  .సవిత తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టెక్స్ టైల్స్ విధానంతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారన్నారు. వారేకాక మరింత మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ పరిశ్రమలను ఆరు నెలల్లో నెలకొల్పనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.