మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు
posted on Nov 12, 2025 @ 3:48PM
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు తిరిగింది. కిడ్నీ రాకెట్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన యమున భర్తగా సూరిబాబుకి భార్య కానే కాదని ఆమె బంధువులు తెలిపారు. యమున ను పిక్నిక్ పేరుతో మాయమాటలు చెప్పి తీసుకొచ్చి కిడ్నీలు కోసి అమ్మేసి, ఆమె ప్రాణాలను హరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
యమున తల్లిదండ్రులు సూరమ్మ, నరసింగ రాజు బుధవారం మదనపల్లి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాకు చెప్పి బోరున విలపించారు. ఈనెల ఆరవ తేదీన అరకు కు పిక్నిక్ వెళ్లాలని మాయమాటలు చెప్పి మదనపల్లెకు తీసుకువచ్చారని కిడ్నీ రాకెట్‌లోని మధ్యవర్తులపై మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు మండిపడ్డారు.
కిడ్నీ రాకెట్ బ్రోకర్లైన కాకర్ల సత్య, పెళ్లి పద్మ, వెంకటేశ్వర్లు ఇంకొందరు పథకం ప్రకారం బాధితురాలీ ని అర్ధరాత్రిలో మదనపల్లి ఎస్బీఐ కాలనీలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రికి తీసుకువచ్చి ఆదివారం ఆపరేషన్ చేసి కిడ్నీలు తొలగించడంతో చనిపోయినట్లు తమకు ఫోన్ చేసి చెప్పినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.
యమున కు భర్త బాలకృష్ణ చనిపోవడంతో విశాఖలోని ఓ పత్రికలో పని చేస్తోందని కన్నీటి పర్వంతమయ్యారు. తమకు కిడ్నీలు అమ్ముకోవాల్సిన అవసరంలేదని మాకు డబ్బు కొరత లేదని ఆ తల్లిదండ్రులు విలపించారు. వైద్యశాఖ నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ శస్త్ర చికిత్సలు చేసిన గ్లోబల్ ఆసుపత్రిని అధికారులు మూసివేశారు.